విశ్వాసం విధేయతను కోరుతుంది

ramadan_
 షేఖ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఉమ్రీ
రమాజను మాసం గన్న ప్రతి ముస్లిం – స్త్రీపురుషుడు అన్న భేద భావన లేకుండా, ధనవంతులు-పేదవారు అన్న వ్యత్యాసం లేకుండా. అరబ్బులు-అరబ్బేతరులు అన్న తేడా లేకుండా ప్రాజ్ఞ  వయస్సుకు వచ్చిన వారందరూ, మతిస్థిమితం ఉన్న వారందరూ, ఆరోగ్యవంతు లయిన వారందరూ విధిగా పూర్తి రమజాను మాసపు ఉపవాసాలు పాటించాలన్నది సర్వోన్నత ప్రభువయిన అల్లాహ్‌ ఆదేశం: ”ఓ విశ్వసించిన జనులరా! ఉపవాసాలు మీపై విధిగావించ బడ్డాయి. మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా విధించబడ్డాయి. తద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది”.  (దివ్య ఖుర్‌ఆన్-2: 185)
 ”అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణికులుగానో ఉన్నవారు మటుకు ఇతర దినాల్లో ఉపవాసాల సంఖ్యను పూర్తి చేెసుకోవాలి. అల్లాహ్‌ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్ట పెట్టడం ఆయన అభీష్టం ఎంత మాత్రం కాదు”.  (దివ్య ఖుర్‌ఆన్-2: 185)
 ఉపవాసం అంటే, అల్లాహ్‌ మీద విశ్వాసంతో, అల్లాహ్‌ ప్రసన్నత కోసం, పుణ్యఫలాపేక్షతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు, అసభ్య ప్రవర్తనలకు, అసత్య, అశ్లీల సంభాషణల కు, భార్యాభర్తలయితే లైంగిక వాంఛలకు దూరంగా ఉండటం.
దైవాజ్ఞను ఉల్లంఘించడం మహాపరాధం:
కొందరు తాము ముస్లింలమని ప్రగల్బాలయితే బాగానే పలుకుతారు. కానీ, రమజాన్‌ మాసంలో విధిగా నిర్ణయించబడిన ఉపవాసాలను పాటించరు. పైపెచ్చు ‘దైవభీతి’ (అల్లాహ్‌ కా డర్‌) మనసులో ఉండా లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటారు. ఇలాంటి వారు దైవాజ్ఞ  ను ఉల్లంఘించిన కారణంగా దైవాగ్రహానికి గురవుతారని గుర్తుంచు కోవాలి. మరికొందరయితే ధర్మం విషయంలో అతి తెలివిని ప్రదర్శి స్తూ తెలిసి త్రోవ తప్పుతుంటారు. వీరు రమజాను మాసం ప్రారంభం కాగానే మొదటి రెండు మూడు రోజులు ఉపవాసాలు  పాటించి, చివ ర్లో రెండు మూడు ఉపవాసాలు ఉడతాభక్తి ఉండి పూర్తి మాసపు ఉప వాసాల పుణ్యం తమఖాతాలో నమోదవుతున్న మితిమీరిన నమ్మకంతో ఉంటారు.  ఇంకొందరయితే, తాము ఆస్తిపరులమన్న అహంతో కొన్ని నిరుపేద కుటుంబాలకు సహరీ-ఇఫ్తార్ల ఏర్పాటు చేసి తమకి బదులు గా ఉపవాసం పాటించాల్సిందిగా పురమాయిస్తారు. ఇటువంటి వెసు లుబాటు అసలు ధర్మంలోనే లేదన్న విషయం తెలియని అమాయక నిరుపేదలు తాము పాటించాల్సిన ఉపవాసం మానేసి, కరుణామయు డయిన అల్లాహ్‌ాను ప్రసన్నుణ్ణి చేసుకోవడం మానేసి, కుబేరుల్ని ప్రస న్నుల్ని చేసే పనిలో పడతారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు, వక్ర బుద్ధి గల వారినుద్దేశించి అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”వారు అల్లాహ్‌నూ, విశ్వాసులనూ మోస పుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా-తమను తామే మోస పుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయం వారు గ్రహించడం లేదు”. (దివ్యఖుర్‌ఆన్-2: 10)
  రమజాను మాసంలో బలమైన ఏ కారణమూ లేకుండా ఉపవాసాలు పాటించని వారు అల్లాహ్‌కు భయపడాలి. ఇస్లాం ములాధారాల్లోని ఓ మూలాధారాన్ని తెలిసి కుప్పకూలుస్తున్నారన్న విషయాన్ని గ్రహించాలి. ఇటువంటి వారి కోసం భయంకరమయిన శిక్ష ఉందని మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు వారించారు:
”నన్ను దైవదూత జిబ్రయీల్‌ (అ) మేరాజ్‌కు తీసుకెళ్ళిన రాత్రి నేను యమ యాతనల్ని అనుభవిస్తున్న అనేక మందిని చూశాను. వారిలో కొందరిని తలక్రిందులుగా వ్రేలాడ దీసి ఉన్నారు. వారి దవడలు చీల్చబడి ఉన్నాయి. నోటి నుండి రక్తం ప్రవహిస్తోంది. వీరు ఎవరు? అని నేను ఆరా తీయగా – ”వీరు రమజాను మాసాన్ని పొంది కూడా అల్లాహ్‌ ఆజ్ఞను ఉల్లంఘిస్తూ పగలు తింటూ త్రాగుతూ ఉండేవారు” అని సమాధానం లభించింది.
 ”ఏమిటీి, విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా? వీరికి మునుపు గ్రంథం వొసగబడినవారి మాదిరి గా వీరు కాకూడదు. మరి ఆ గ్రంథవహులపై ఒక సుదీర్ఘ కాలం గడిచిన తర్వాత వారి హృదయాలు కఠినమయి పోయాయి. వారిలో చాలా మంది అవిధేయులు”. (దివ్యఖుర్‌ఆన్-57:16)
  అల్లాహ్‌ పట్ల ఈమాన్‌ గల వ్యక్తులకే రమజాను ఉపవాసాలు విధి గా చేయ బడ్డాయి. ఇతర మత ధర్మావలంబీకులకు మరియు ముస్లిం లకు గల వ్యత్యాసం ఒక్కటే; అదే అల్లాహ్‌ పట్ల విశ్వాసం. లేదంటే వ్రతాలు, పూజలు, రాత్రి జాగారాలు వారిలో సయితం పుష్కలంగానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా వారిలో లేనిదల్లా అల్లాహ్‌ా పట్ల విశ్వాసం. కాబట్టి విశ్వాసులమైన మనం ”మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం” అన్న  అల్లాహ్‌ా మాటననుస రించి ఎట్టి స్థితిలోనూ ఉపవాసాన్ని వదలకూడదు. రమాజను ఉపవాసాలు ఉండి, దాని పూర్తి మర్యాదల్ని పాటించడమంటే, అల్లాహ్‌ా పట్ల మన విశ్వాసాన్ని రుజువు చేసుకోవడమే. విధేయత లేని విశ్వాసం ఎందుకూ కొరగానిది. ఎందుకంటే, విశ్వాసం అంటేనే నోటితో ప్రకటించడం, మనసుతో అంగీకరించడం, అవయవాలతో ఆచరణ ఛాయను ఇవ్వడం.

Related Post