నీపై అవతరించిన ఈ గ్రంథాన్ని, నీకు పూర్వం గతప్రవక్తలపై అవతరించిన గ్రంథాలను విశ్వసిస్తారు. పరలోకాన్ని కూడా బలంగా నమ్ముతారు. (అల్-బఖరహ్: 4,5)
హృదయ కర్మలకు మూలం దృఢ నమ్మకం – యకీన్. మనిషి గుండెల్లోని ఈమాన్ (విశ్వాసం) స్థాయి, అతనికి ఉన్న యకీన్ స్థాయిపైనే ఆధారపడి ఉంటుంది. దృఢ నమ్మకం అనేది నాస్తికత్వానికి ఎదురు నిలిచి సమూలంగా నిలువరించే, నిర్మూలించే బలమైన రక్షక కోట. అలాగే అవిశ్వాస మూక శక్తుల్ని ఎదుర్కొనే శక్తివంతమైన వజ్రా యుధం. అందుకే ఒక మనిషి శ్రమించి, సాహసించి సాధించడానికి అత్యంత శ్రద్ధ పెట్టవలసిన గుణాలన్నింటిలో ఈ సుగుణానికే అగ్ర తాంబూలం. అబ్దుల్లాహ్ ఇబ్న్ మసూద్ (ర.అ) ఇలా అన్నారు: “అత్యంత పెద్ద పాపం – అబద్ధమాడే నాలుక, అత్యుత్తమమైన సంపద – ఆత్మ సంతృప్తి, ఉత్తమమైన సరంజామా (జీవన సామగ్రి) తక్వా , వివేక శిఖరం – అల్లాహ్ భయభక్తులు, మానవ హృదయాలలో వేయబడిన వాటిలో ఉత్తమమైనది – యకీన్ – దృఢ నిశ్చయం” (అల్-జుహ్ద్ – హన్నాద్)
యకీన్ భావార్థం – విశ్వాసంపై దాని ప్రాభవం
“యకీన్” (దృఢ నిశ్చయం/నమ్మకం) అనే పదానికి అరబీ భాషలో అనేక అర్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి:
1 – మరణం: అల్లాహ్ ఇలా అన్నాడు: “నీ ప్రభువును ఆరాధించు, యకీన్ (మరణం) వచ్చేదాకా” (సూరతుల్ హిజ్ర్: 99)
మన ప్రియ సహాబీ ఉథ్మాన్ బిన్ మజ్‘ఊన్ (ర.అ) షహీద్ అయినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు: అతనికి యకీన్ – నిశ్చయమైనది (మరణం) వచ్చేసింది. అల్లాహ్ ప్రమాణంగా! నేను అతనికి మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను.» (సహీహ్ అల్-బుఖారీ).
2 – సందేహానికి, శంకకి వ్యతిరేకం యకీన్: హదీథులో ఇలా ఉంది: «మీ లో ఎవరికైనా నమాజులో సందేహం కలిగితే, అతడు ఆ సందేహాన్ని వి వదలి , యకీన్ (నిశ్చయంపై) ఆధారపడాలి.» (సునన్ అబీ దావూద్).
3 – యకీన్ అంటే జ్ఞానం మరియు ఈ మాన్ (విశ్వాసం): ఒక హదీథులో ఇలా వచ్చింది:
“ఓ అల్లాహ్! నీ భయభక్తులను మాకు అనుగ్రహించు , – ఎంతగానంటే, అవి నీ ఆజ్ఞల విరుద్ధంగా చేసే పాపాల ముందర అడ్డంగా నిలబడిపోవాలి. నీ ఆజ్ఞాపాలనను మాలో నింపు – ఎంతగానంటే, అది మమ్మల్ని నీ స్వర్గం వైపునకు నడిపించాలి. యకీన్ (దృఢ నిశ్చయ విశ్వాసం) మాకు ప్రసాదించు – ఎంతగానంటే, ఈ లోకంలోని కష్టాలన్ని మాకు తేలికగా అనిపిం చాలి. (సునన్ అత్తిర్మిధీ )
దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “దువా చేసేటప్పుడు అల్లాహ్ మీ దువాను తప్పక స్వీకరిస్తాడనే దృఢ నిశ్చయంతో ప్రార్థించండి. ఎందుకంటే అల్లాహ్, అలక్ష్యంగా, శార్ధరహితంగా ఉండే హృదయం నుండి వచ్చే దువాను స్వీకరించడు అని తెలుసుకోండి.” (తిర్మిజీ)
దృఢ నిశ్చయమయిన ఈమాన్, నమ్మకమివ్వమని అల్లాహ్ను వేడుకోవాలి. ఒక్క అల్లాహ్కు తప్ప దేనికి తలవంచని నిర్భయమివ్వమని అల్లాహ్ను వేడుకోవాలి. సన్మార్గమేదో చూపమని, సన్మార్గం మీద నిలకడ కలిగి నడిచేలా దీవించమని, సన్మార్గం మీదే శుభ మరణాన్ని అనుగ్రహించమని అల్లాహ్ను వేడుకోవాలి. ఖుర్ఆన్ సత్గ్రంథ సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించి మా మనోసీమలోని చీకట్లను తొలగించమని అల్లాహ్ను వేడుకోవాలి. చెడుకు ఎదురు పోరాడే, మంచినెప్పుడూ కాపాడే పిడుగు దేహమివ్వమని అల్లాహ్ను వేడుకోవాలి. ప్రేమతోపాటు పౌరుషం పంతం తేజం సత్వగుణమివ్వమని అల్లాహ్ను వేడుకోవాలి.. వినయం విలువలీయమని అల్లాహ్ను వేడుకోవాలి. లోన నిజం గుర్తించే, పైన భ్రమను గమనించే సూక్ష్మ నేత్రమివ్వమని అల్లాహ్ను వేడుకోవాలి. సర్వమందించు నీ ప్రియనామ స్మరణం, ప్రార్థనకై సమయం స్వచ్ఛతనివ్వమని అల్లాహ్ను వేడుకోవాలి!
యకీన్ ఎలా పొందాలి?
హకీమ్ తిర్మిది ఇలా చెప్పారు: “యకీన్ అది ఒక వెలుగు, సుజ్ఞానమనే కాంతి నుండి నీ హృదయంలో పుడుతుంది. నీ ప్రభువు భూమ్యాకాశాలకు వెలుగైనవాడు, సమస్తాన్నీ వెలుగుతో నింపినవాడు. ఆయన వెలుగే అది. కాబట్టి నువ్వు అల్లాహ్ వైపు మళ్లినప్పుడు నీ హృదయం ఆ వెలుగుతో ప్రకాశిస్తుంది. అదే ‘యకీన్’ (దృఢ విశ్వాసం).” (అదబ్ అన్-నఫ్స్)
సరి బిన్ ముఘల్లిస్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “మూడు లక్షణాలతోనే యకీన్ (దృఢ నిశ్చయం) స్పష్టమవుతుంది: 1) ప్రాణానికి ముప్పు పొంచి ఉన్న సందర్భాలలో కూడా సత్యాన్ని నిలబెట్టడం, సత్యానికి కట్టుబడటం. 2) పరీక్షలు, కష్టాలు కుండపోతగా వచ్చినప్పుడు అల్లాహ్ ఆజ్ఞకు పూర్తిగా లొంగిపోవడం, ఆయన తీర్పుకి శిరస్సు వంచడం. 3) అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహం ఏదయినా పోయినపుడు విధి వ్రాతను సంతోషంగా అంగీకరించడం. (కూత్ అల్-కులూబ్)
“యకీన్ ఎలాగు లభిస్తుంది? అని అడిగినప్పుడు హకీమ్ తర్మిధీ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారు: హృదయ పవిత్రతతోనే. ఎందుకంటే యకీన్ స్వచ్ఛమైనది; కాబట్టి అది నిలిచే స్థలమైన హృదయమూ స్వచ్ఛమైనదయి ఉండాలి. ‘ఆ హృదయ పవిత్రత అంటే ఏమిటి?’ మళ్ళి ఆరా తీశారు. దానికాయన:’హృదయంలో సందేహం రేపే, కలత కలిగించే ప్రతి దానినీ — చిన్నదా, పెద్దదా అన్న తేడా లేకుండా — వదిలిపెట్టడం. ఆ తర్వాత కోరికల బంధనాల నుండి, వాటి మత్తు నుండి హృదయాన్ని శుభ్రపరచడం. ఇలా చేస్తే నీ హృదయం ఒక మెరుస్తున్న అద్దంలా మారుతుంది. పాపాల నుండి దూరంగా ఉండే జాగ్రత్త వలన ఆ దర్పణము మరింత పరిశుభ్రమవుతుంది. అప్పుడు నీవు పరలోక విషయాలపై దృష్టి సారించిన ప్రతిసారీ అవి నీ ఆత్మ అద్దంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. అలా ఆఖిరత్ నీకు ప్రత్యక్షమవుతుంది.
మాలిక్ బిన్ దినార్ (రహ్మ) ఇలా అన్నారు: “ఒక గ్రంథంలో నేను చదివాను: నీ జీవితం సార్థకం కావాలంటే, నిజమైన ‘నిశ్చయ జ్ఞానం’ పొందాలని నువ్వు కోరుకుంటే — క్షణక్షణం, అనుక్షణం ఐహిక వాంఛలను జయించేందుకు కృషి చేస్తూనే ఉండు. ఎందుకంటే ఈ ఐహిక వాంఛలను అధిగమించిన వాడి నీడ అంటేనే షైతాన్ వణుకుతాడు.” (అదబు నఫ్స్)
ఫుథైల్ బిన్ ఇయాద్ (రహ్మ)ఇలా అన్నారు: “నేను అల్లాహ్పై ఆధారపడ్డాను’ అని పలకడానికి – నేను అల్లాహ్ ముందు సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే నేను నిజంగా ఆయన్ను నమ్ముకొని ఉంటె , కేవలం ఆయనపై మాత్రమే ఆధారపడి ఉంటే, ఆయన తప్ప మరెవరికి నేను భయపడేవాడిని కాను, ఎవరి నుండి ఏది ఆశించేవాడిని కాను.” (అల్-అఖ్ద్ అల్-ఫరీద్)
యకీన్ స్థాయి
1) ఇల్ముల్ యకీన్ – నిశ్చిత జ్ఞానం: అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు). (తకాసుర్:5)
ఉదాహరణకు: మనం ఖుర్ఆన్లో జన్నత్ (స్వర్గం), జహన్నమ్ (నరకం) గురించి చదివినప్పుడు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త చెప్పిన నిజమైన వార్త ఆధారంగా వాటిపై స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటాం. ఇదే “ఇల్ముల్ యకీన్” — అంటే “నిశ్చిత జ్ఞానం.”
2) ఐనుల్ యకీన్: ప్రత్యక్ష జ్ఞానం: అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా! (తకాసుర్:7)
ఏదేని ఒక వస్తువు యథార్థ రూపాన్ని ప్రత్యక్షంగా దర్శించడం. అంటే, సత్యాలను కన్నులతో చూడడం లేదా అనుభవాల ద్వారా గ్రహించడం. దీనిని “అయినుల్ యకీన్”అంటారు. ఇది “ఇల్ముల్ యకీన్”కంటే ఉన్నతమైన స్థాయి, ఎందుకంటే ఇందులో జ్ఞానంతో పాటు ప్రత్యక్ష అనుభవం కూడా చేరుతుంది.
ఉదాహరణకు: ఒక మనిషి అల్లాహ్ యొక్క అపారమైన శక్తి, సృష్టి వైభవం, ఆకాశాలు, భూమి, పర్వతాలు, సముద్రాలు వంటి అద్భుతాలను తన కళ్లతో చూసినప్పుడు — అతని హృదయంలో విశ్వాసం మరింత బలపడుతుంది. అప్పుడు ఆ జ్ఞానం కేవలం వినడం లేదా తెలుసుకోవడమే కాకుండా, చూసి నమ్మే స్థాయికి చేరుతుంది — అదే “అయినుల్ యకీన్”.
3) హక్కుల్ యకీన్: నిజమైన నిశ్చయ విశ్వాసం: ఇవన్నీఖచ్చితంగా అనుభవంలోకి వచ్చే తిరుగులేని సత్యాలు. కనుక మహోన్నతుడయిన నీప్రభువు పేరు స్మరించు. (వాఖిఅహ్: 96,97)
ఇది యకీన్ (నిశ్చయ విశ్వాసం) యొక్క చివరి మరియు అత్యున్నత స్థాయి. ఈ స్థాయిలో యకీన్ మనిషి అంతరంగంలో భాగంగా కలిసిపోతుంది. అది కేవలం జ్ఞానంగా లేదా దర్శనంగా కాకుండా, అనుభవం మరియు స్వీయానుభూతిగా వ్యక్తమవుతుంది. ఇది యకీన్ యొక్క అత్యున్నత స్థానం, ఇక్కడ జ్ఞానం, దర్శనం, మరియు అనుభవం మూడూ ఏకమవుతాయి.
ఉదాహరణకు: స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశించినప్పుడు, వారు స్వర్గాన్ని స్వయంగా చూస్తారు, దాని సౌందర్యాన్ని అనుభవిస్తారు, దాని ఆనందాన్నిఆస్వాదిస్తారు. ఈ స్థితినే “హక్కుల్ యకీన్” (నిజమైన నిశ్చయ విశ్వాసం) అని అంటారు.
హృదయంలో యకీన్ స్థిరపడినప్పుడల్లా, అది విశ్వాసపు కాంతితో ప్రకాశిస్తుంది. సందేహాల చీకట్లు చీల్చి చెండాడుతుంది. .ఇబ్రాహీం ఇబ్న్ అద్హమ్ ఇలా అన్నారు; “రాజులు, రాజకుమారులు మనం పొందుతున్న ఈ ఆనందాన్ని, ఈ సుఖాన్ని తెలుసుకుంటే, ఖడ్గాలతో మనపై దాడి చేసి దాన్ని తీసుకుపోయేవారని ఖచ్చితంగా చెప్పగలను. . కానీ ఈ మధురానుభూతి ఒక్క నిజమైన అల్లాహ్ను తెలుసుకున్న మోమిన్కి మాత్రమే లభిస్తుంది. బలహీన విశ్వాసం ఉన్నవాడు జీవితపు ఈ అనిర్వచనీయ మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించలేడు. (హిల్యత్ అల్-అవ్లియా)
అల్లాహ్ ను , ఆయన ప్రవక్తను మనస్పూర్తిగా విశ్వసించి, ఇకదానిపై ఎలాంటి అనుమానానికి ఆస్కారమివ్వకుండా దైవమార్గంలో ధన ప్రాణాలొడ్డి పోరాడేవారే నిజమైన విశ్వాసులు. వారే సత్యవంతులు. (అల్-హుజూరాత్: 14-15) అన్న ఈ అల్లాహ్ వాక్యం ఆధారంగా – మనం మన విశ్వాసం, అఖీదా విషయంలో అణు మాత్రం అనుమానానికి, సందేహానికి, శంకకు గురి కాకూడదు.
యకీన్ అఫ్రాద్ కా సర్మాయ-ఏ తమీర్-ఏ మిల్లత్ హై
యహీ ఖువ్వత్ హై జో సూరత్ గర్-యె తక్దీర్-ఏ మిల్లత్ హై
అల్లామా ఇక్బాల్ (రహ్మ) ఇలా అన్నారు;
ఘులామీ మే న కామ్ ఆతీ హై షమ్షీరే న తద్బీరే
జో హో జౌక్-ఏ యకీన్ పైదా తో కట్ జాతీ హై జంజీరే
అవిరళ కృషి:
అల్లాహ్ సెలవిచ్చాడు: “మంచి పనుల వైపుకు పరుగులు తీయండి.” (అల్ బఖర : 148)
కృషితో నాస్తి దుర్భిక్షం – ‘నడవడిక’ అనేది మనుషులు పాదాలతో నడిచే తీరుకు సంబంధించిన విషయం కాదు. ‘చేతలు’ అంటే కేవలం చేతులతో చేసే పనులకు సంబంధించిన విషయమూ కాదు. ఇవి ప్రవర్తనకు సంబంధించిన సంగతులు. జీవన పోరాటంలో విజేతల వెనక ఎంతో కృషి ఉంటుంది. అటువంటివారి విజయానికి మూలం ఏమిటో గ్రహించి, ఆ మార్గాన్ని ఇతరులు అనుసరించాలి. అలాంటి పురుషోత్తముల్లో మహా మహితాత్ములు ప్రవక్తలు. వారి అగుజాడలే మనకు శిరోధార్యాలు. ఒక ముస్లింగా మనం చేయాల్సిన సత్కర్మల్లో ప్రథమయినది నమాజు. నమాజును మనం క్రమం తప్పకుండా వేళకు విధిగా భక్తిశ్రద్ధలతో చేయాలి.
దైవప్రవక్త (సల్లం) తనకు ఈ విధంగా ఉపదేశించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ బిన్ ఆస్ (రజి) తెలియజేశారు: “ఓ అబ్దుల్లాహ్! ఫలానా వాడిలా అయిపోకు! అతను (ప్రతిరోజూ) రాత్రిపూట (శక్తికి మించిన) నఫిల్ నమాజులు చేస్తూ ఉండేవాడు. కాని తరువాత (వెగటు కలిగి) అసలు రాత్రి పూట నమాజులు చేయటమే మానే శాడు. (బుఖారీ- ముస్లిం)
హజ్రత్ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ప్రబో ధించారు : రేజీకటి తునకల్లాగా కమ్ము కునే ఉపద్రవాలు రాకముందే మీరు మంచిపనులు చేయడానికి త్వరపడండి. (అటువంటి ఉపద్రవ కాలంలో) మనిషి ఉదయంపూట విశ్వాసిగా ఉండి సాయంత్రానికల్లా అవిశ్వాసిగా మారి పోతాడు. సాయంత్రం వేళ విశ్వాసిగా ఉన్నవాడు ఉదయాని కల్లా అవిశ్వాసిగా మారిపోతాడు. ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాల కోసం తన ధర్మాన్నే అమ్ముకుంటాడు. (ముస్లిం)
హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గరకు వచ్చి “ఓ దైవప్రవక్తా! ప్రతిఫలం రీత్యా ఎలాంటి దానం గొప్పది?” అనడిగాడు. దానికి ఆయన ఇలా అన్నారు : “నీవు ఆరోగ్యంగా ఉన్నావు, నీకు సంపదపై వ్యామోహం కూడా ఉంది, (ఖర్చుచేస్తే) ఎక్కడ పేదవాణ్ణయిపోతానోనన్న భయంతోపాటు ధనవంతుణ్ణవ్వాలన్న ఆశ కూడా ఉంది, అలాంటి పరిస్థితిలో చేసే దానం (పుణ్యం రీత్యా గొప్పది), కాబట్టి నీవు దానధర్మాలు చేయడంలో ఆలస్యం చేయకు! ఆఖరికి ప్రాణం పీకలమీదకు వచ్చినప్పుడు వాడికి ఇంత ఇవ్వండి, వీడికి ఇంత ఇవ్వండి అని నువ్వు అన్నా లాభముండదు. ఎందు కంటే అప్పటికే అది ఒకడి (వారసుడి) సొంతం అయిపోయి వుంటుంది. (బుఖారీ – ముస్లిం)
హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ప్రబోధిం చారు : ఏడు రకాల అవస్థలు దాపురిం చకముందే మంచి పనులు చేయడానికి త్వరపడండి. మీరు (ధర్మాన్ని) మరచి పోయేటట్లు చేసే పేదరికం కోసం ఎదురుచూస్తున్నారా? హద్దుమీరి ప్రవర్తించేటట్టు చేసే కలిమిని కోరుకుం టున్నారా? మీ ఆరోగ్యాన్ని పాడుచేసే రోగం కోసం ఎదురు చూస్తున్నారా? లేక బుద్ధిని, వివేకాన్ని చెడ గొట్టే వృద్ధాప్యం కోసం ఎదురు చూస్తున్నారా? లేక తృటిలో ఉసురుతీసే చావుకోసం ఎదురుచూస్తున్నారా? లేక కనిపించని కీడుల్లో అత్యంత హానికరమైన దజ్జాల్ (ఉపద్రవాగ్రేసరుని) రాక కోసం ఎదురు చూస్తున్నారా? లేక ప్రళయం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రళయమైతే కడు భయంకరమైనది, చేదైనది.(తిర్మిజీ)
మేము మానవుడ్ని ఎంతో ఉత్కృష్టజీవిగా సృజించాం. (తీన్: 5) అన్న ఖుర్ఆన్ వాక్యం దృష్ట్యా అల్లాహ్ మనిషిని దీనుడిగా, హీనుడిగా సృష్టించలేదు. తన ప్రతినిధిగా మానవుణ్ని భూమ్మీదకు పంపించాడు. సర్వ ప్రాణుల్లో ఆలోచన చేయగల, సంభాషించగల జీవిగా మానవుణ్ని సృష్టించాడు. కాళ్లూ చేతులూ మానవుడికి ఉన్నట్లుగా మరే ప్రాణికీ లేవు. ఒక యువకుడు దైవ ప్రవక్త వద్దకు వచ్చి ‘అయ్యా! మీకు తోచిన ధర్మం చేయండి’ అని దీనంగా ప్రార్థించాడు. ఆయన ఆ యువకుణ్ని తేరిపార చూశారు: “మీలో ఎవరికైనా వీపు పై కట్టెల మోపు మోసుకుని వచ్చి అమ్మి ఆ సొమ్ముతో జీవనం సాగించడం అనేది, ఒకరి ముందర చేయి చాచి వారు ఇస్తారో లేక తిరస్కరిస్తారో అని వేచిచూడటంకన్నా ఎంతో ఉత్తమం.” (బుఖారీ) మనిషి స్వాభిమానాన్ని, స్వావలంబనను నేర్పుతుంది. ఇతరుల దయపై ఆధారపడటం కంటే తన కష్టంతో జీవించడం మరింత గౌరవప్రదం అనిహితవు పలికారు.
నిరంతర పోరాటం జీవితం. మంచి సంకల్పంతో ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరంగా ప్రయత్నిస్తే అల్లాహ్ కూడా తప్పక సహాయం చేస్తాడు.
వీచే గాలి అందరి కోసం అయినప్పుడు మనమెందుకు మన ప్రేమ కొందరికే అంటూ గిరి గీసుకొని బతుకుతున్నాము? మేఘం వానను తన కోసం దాచుకోనప్పుడు .. మనమెందుకు అవసరానికిమించిన ఆస్తిపాస్తులు పెంచుకుంటున్నాము? సూర్య కాంతి అందరి కోసం అయినప్పుడు, ధర్మ కాంతిని మనం ఎందుకు ఏ కొందరొకే పరిమితం చేస్తున్నాము? చంద్ర జ్యోతి ఏ స్వార్ధం ఎరగనప్పుడు మనమే ఎందుకు పచ్చి స్వార్థపరులా వ్యవహరిస్తున్నాము? పాముకి పడగలో మాత్రమే విషం ఉంటుంది. అది తన ఆహారం, ఆత్మ రక్షణ కోసం ఉద్దేశించబడినది. కానీ మనిషి నరనరాల్లో విషయాన్ని నింపుకొని, కనక రాసుల మీద కాళ నాగయి తిష్ట వేసి అసలు సంబంధమే లేని వారిని కూడా ఎందుకు పొట్టన బెట్టుకుంటున్నాడు? మనిషిగా మనం పది మందికో, వంద మందికో, వెయ్యి మందికో, లక్ష మందికో సహాయం చేయాల్సిన అవసరం లేదు. అది అందరికి కుదరదు కూడా. మనం ఒక్కరికైన మేలు చేసినా లోకం అంత మేలు జరుగుతుందని నమ్మాలి. మనం ఒక్కరికి హాని చేసైనా లోకం అంత హాని కలిగుతుందని భయపడాలి. మారాల్సింది లోకం కాదు, మనం.
విశ్వజనీన ప్రేమ:
అల్లాహ్ ప్రస్తావించిన కొన్ని ప్రేమలు: ఒక మోమీన్ కి మరో మోమీన్ పట్ల ఉన్న ప్రేమ. ఒక మోమీన్ కి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ఉన్న ప్రేమ. ముహమ్మద్ (స) వారికి మోమీన్ల పట్ల ఉన్న ప్రేమ. ఒక మోమీన్ కి అల్లాహ్ పట్ల ఉన్న ప్రేమ. అల్లాహ్ కు మోమీన్ల పట్ల ఉన్న ప్రేమ. ముహమ్మద్ (స) వారికి సాధారణ ప్రజలు మరియు అల్లాహ్ సృష్టితాల పట్ల ఉన్న ప్రేమ. మోమీన్లకు సాధారణ ప్రజల పట్ల, సృష్ట చరాచరాల పట్ల ఉన్న ప్రేమ.
ప్రేమ బంధం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించటమే కాదు, ఆయనే దానికి నాంది వేశారు. దాని నిర్మాణాన్ని బల పరిచారు. మదీనాకు హిజ్రత్ చేసి వెళ్లిన తోలినాళ్ళల్లో అపూర్వ సోదరీకరణకు బలమైన, దృఢమైన పునాదులు వేశారు. ఈ ప్రేమ తన అనుచరుల హృదయాల్లో ప్రళయం వరకు ఉండేట్లుగా చేశారు. అబూ హురైరా ఉల్లేఖనాన్ని గమనించండిః
“ఒక ముస్లిం పట్ల మరొక ముస్లింకు ఆరు హక్కు (బాధ్యత) లున్నవి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా, అక్కడున్న వారు అవేమిటి ప్రవక్తా? అని అడగ్గా, ఆయన ఇలా సమాధాన మిచ్చారుః “1. నీవు ముస్లిం సోదరుడ్ని కలిస్తే అతనికి సలాం చేయి. 2. అతను (భోజనానికి) ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు. 3. అతను నీ ద్వారా ఏదయినా మేలును కాంక్షిస్తే దాన్ని అందజేయి. 4. అతను తుమ్మి ‘అల్ హందులిల్లాహ్’ అనంటే నీవు దానికి ‘యర్ హముకల్లాహ్’ అని బదులు పలుకు. 5. అతను వ్యాధిగ్రస్తుడైతే వెళ్ళి పరామర్శించు. 6. అతను మరణిస్తే అతని జనాజాకు తోడుగా వెళ్ళు”
ఇన్ని సంవత్సరాలూ .. ఇన్ని దశాబ్దాలూ .. భూమిపైన ముళ్ళ పొదలు నరికి, దుక్కిదున్ని, నారు పోసి, నీరు పోసి, నాటు వేసి, కలుపు పీకాం! ఇప్పుడు పైరు పెరిగి చేతికి వచ్చింది ..ఇక నెమ్మది నెమ్మదిగా కోత కోసుకుంటూ ధ్యానం సేకరించే సమయం ఆసన్నమైంది! నిండుగా పండిన పైరును కళ్ళారా చూసుకుంటూ కోసుకుందాం! ధాన్యపు రాసులు అందరికీ పంచుదాం! ధ్యాన జ్ఞాన ఫలాలను అందరికీ రువచేద్దాం! ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ..భక్తిశ్రద్ధలతో ధ్యాన జ్ఞాన ప్రచారాలు చేద్దాం!
ప్రేమ అనేది మన ఆధ్యాతిమా భావనలో విశ్వ జనీనమైనది . సంపూర్ణ స్వేచ్ఛకి తార్కాణం ఈ రెండక్షరాల పదం . ప్రేమంటే, ఒక రోజుకి పరిమితమైనది కాదు . విశ్వములో ప్రతి అణువులోనూ నిండి ఉన్న అనంతచైతన్య స్వరూపం ప్రేమ . ఈ రెండక్షరాలనీ సరిగా అర్థం చేసుకుంటే, జగతిలో సగం సమస్యలు ఉండవేమో ! తొలి చూపుతో బలిచేసేది కాదీ ప్రేమ, తాళితో ఎగతాళికే గురి కానిదీ ప్రేమ, రూపమో గుణమో అందమో చందమో, వయసో వరసో సొగసో స్వరమో ఎరిగింది కాదీ ప్రేమ. ఇది పవిత్ర ప్రేమ ఇది ధరిత్రి ప్రేమ ఇది మైత్రీ ప్రేమ ఇదే విశ్వజనీన ప్రేమ. అందుకే ప్రేమ అనేది కోరిక కాదు. అదో త్యాగం. మోహం కాదు. అది మోక్షం. ఇందులో స్వార్థం లేదు. పరహితమే ఉంది .
ఈ ప్రేమనే మనకి మన ఇస్లామీయ సంస్కృతీ బోధించింది . దీనినే మనం అలవర్చుకుని పంచాల్సింది , పెంచాల్సింది. మనం , నిత్యం ఆ అనంతుని దివ్యభావనలో లీనమై , ఆయన ప్రేమ సంద్రంలో మునిగి , ఆ సౌందర్య అనుభవ దీప్తిని, నలుగురికీ పంచుదాం . దానివల్ల మనం మరింతగా ఆ దేవదేవుని కృపకి , ప్రేమకి పాత్రులమవుదాం ! శుభం .
దృఢ నిశ్ఛయం, అవిరళ కృషి, విశ్వ జయ ప్రేమ
బతుకు పోరులో ఇవే వీరోచిత యోధుని విలక్షణ ఆయుధాలు
యకీన్ ముహ్కమ్, అమల్ పైహమ్, మహబ్బత్ ఫాతిహ్-ఎ-ఆలమ్
జిహాద్-ఏ జిందగానీ మేన్ హైం యె మర్దోన్ కీ షమ్షీరే
Arabic
English
Spanish
Russian
Romanian
Hindi
Tagalog
Bengali
Sinhalese
Nepali
