మోసం-కాన్పు నుండి మొదటు కాటి వరకూ. చదువు కోసం మోసం, కొలువు కొసం మోసం. వివాహం కోసం మోసం, విడాకుల కోసం మోసం. ఒకరికి పించన్ దక్కాలంటే మోసం. ఒకరి పంచన చేరాలంటే మోసం. బర్త్ సర్టిఫికెట్ కోసం మోసం. డెత్ సర్టిఫికెట్ కోసం మోసం. దేవుని పేరుతో జరిగే అధ్యాత్మిక మోసం. అధిక లాభం ఆశ చూపించి చేసే ఆర్థిక మోసం. కంటికి కనబడకుండా చేసే సైబర్ మోసం. పోలీసు, అధికారిగా చేసే వేష సంబంధిత మోసం. పోగొట్టుకున్నది తిరిగి రాబట్టుకోవ డానికి చేసే ప్రతీకార మోసం. ఇత్తడిని పుత్తడిగా మార్చే కనికట్టు మోసం. దెయ్యం, భూతం, క్షుద్ర పూజ అంటూ చేసే భయ సంబంధిత మోసం. పక్కలో పాములా ఉంటూ వెన్నుపోటు పొడిచే ద్రోహ సంబంధిత మోసం. దాంపత్య మోసం, డూప్లికెట్ సర్టిఫికెట్ల మోసం, నాసిర రకపు సరకుతో చేసే కట్టడాల మోసం. ఏక్జామినేషన్ హాల్లో కాపీ మోసం. ఓటు మొసం, నోటు మోసం.ఒక్క మాటలో చెప్పాలంటే, కాదేది మోసానికి అనర్హం అన్నట్టుగా వ్యహరిస్తోందీ లోకం!.
మోసం భావార్థం:
ఒక వ్యక్తి తన వాక్చాతుర్యంతోగానీ, మాయా మాటలతో గానీ, తన నేర్పరితనంతోగానీ, ఎదుటి వారిని మెప్పించి, బురిడి కొట్టించి ఇతరుల సంపదను తస్కరించడాన్ని, ఇతరుల నమ్మకాన్ని వమ్ము చేసి పబ్బం గడుపుకోవడాన్ని, వెన్నుపోటు పొడవడాన్ని మోసం అంటారు.
మోసం రకాలు:
దగా, కుట్ర, మాయ, ద్రోహం, కనికట్టు, భ్రమింప జేయడం, బురిడి కొట్టించడం, మసి పూయడం, ముఖస్తుతి వంటి ఎన్నో పేర్లతో పిలువ బడే మోసం అనేక రకాలున్నా ప్రధానంగా రెండుగా చెప్పొచ్చు. 1) మాటలతో మభ్య పెట్టి మోసగించడం. 2) చేతలతో మభ్య పెట్టి మోసగించడం. మోసం అది ఎవరు ఎవరికి చేసినా, అది ఎదుటి వాడి బలహీనతను ఆసరాగా చేసుకుని లాభం పొందాలనుకోవడం.
మోసం ఎందుకు చేస్తారు?
ఐహిక లాలస, అల్లాహ్ యెడల భయం లేకపోవడం, విశ్వాస రాహిత్యం, ఎలాగయినా ధనం సంపాదించాలనుకోవడం, అత్యాశ, మోసం పరిణా మాల పట్ల అవగాహన లేక పోవడం, మోసానికి పడే శిక్షను చట్టం, ప్రభు త్వం సజావుగా అమలు పర్చక పోవడం, దుర్జన సాంగత్యం, అల్లాహ్ తీర్పు యెడల రాజీ పడకపోవడం, పరలోక చింతన లేకపోవడం, చిత్తశుద్ధి లోపించడం విం కారణాల వల్ల మనిషి మోసానికి ఒడిగడతాడు. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మమ్మల్ని మోసం చేసిన వాడు మాలోని వాడు కాదు”. (ముస్లిం)
మోసం పరిణామాలు:
మొసం చేసే వ్యక్తి ప్రజలకు దూరంగా ఉంటాడు, ప్రభువు (అల్లాహ్)కు కూడా దూరంగా ఉంటాడు. మోసం చేసే వ్యక్తితో నాకేలాంటి సంబంధం లేదు అని హెచ్చరించారు ప్రవక్త (స). మోసం చేసే వ్యక్తి ఘోర పాపానికి ఒడిగడుతున్నాడు. మోసం చేసే వ్యక్తి పొందేది పిసరంత, పోగొట్టుకునేది కొండంత.మోసం శుభాన్ని హరింపజేస్తుంది. మోసం నమ్మకాన్ని నాశనం చేస్తుంది. మోసం విశ్వాస బలహీనతకు ఆనవాలు. మోసం చేసే వ్యక్తి అల్లాహ్ దృష్టిలో నీచునిగా ఉంటాడు. మోసం ఓ సామాజిక జాఢ్యం. సమాజాన్ని అధోగతికి గురి చేస్తుంది.మోసం ప్రజా సంబంధాలను నాశనం చేస్తుంది. సమాజాన్ని వర్గాల క్రింద విభజించడమే కాక, వారి మధ్య చిచ్చు పెడుతుంది. మోసం నరకం పాలు చేస్తుంది. మోసం ప్రజల సొమ్మును అన్యాయంగా తినమంటుంది. మోసం చేసే వ్యక్తి దుఆ స్వీకరించ బడదు.
మోసం చేసే వ్యక్తి పిరికివాడయి ఉంటాడు, భావి తరాలను బాధ్యత రహిత పిరికి వారుగా తయారు చేస్తాడు. మోసం చేసే వ్యక్తి సదా అసంతృప్తి లోనయి ఉంటాడు. మోసం చేసే వ్యక్తి ప్రజల వద్ద నమ్మకాన్ని కోల్పోతాడు.’ఆశే’ మోసగాళ్ళకు ఆయుధం. ఏమీ ఆశించక పోతే… ఏమీ పోగొట్టు కోము’ అని గర్తుంచుకోవాలి.
మోసం గురించి ప్రముఖుల మాట:
”సలహా అడిగే వాని శ్రేయం కోరుతున్నంత కాలం మనిషి సలహా నిపుణుడి గా ఎదుగుతుాండు. ఎప్పుడయిత అతను ఎదుటి వ్యక్తిని మోసం చెయ్యడం ప్రారంభిస్తాడో అల్లాహ్ అతన్నుండి సలహా ఇచ్చే ప్రతిభను లాగేసుకుంటాడు” అన్నారు హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర).
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (ర) గారు ఎవరికయినా ఏదయినా వస్తువు అమ్మ దలిస్తే ఆ వస్తువులోని లోపాలను తెలియజేసి, ఇష్టం ఉంటే కొనండి, ఇష్డం లేకుంటే మానుకోండి అనే ఎంపిక స్వేచ్ఛను ఇచ్చేవారు. అది గమనించింన కొందరు – ‘అయ్యా! ఇలా చేస్తే మీ వ్యాపారం నడవడు’ అని సలహా ఇచ్చారు. అందుకాయన – ”మేము ప్రతి ముస్లిం శ్రేయాన్ని, మేలును కోరు తాము” అని ప్రవక్త (స) వారికి మాటిచ్చాము అని సమాధానమిచ్చారు.
నాలుగు గింజలకి బదులు భూమ్యాకాశాలంతి సర్గాన్ని చేజార్చుకునేవాడికి మించిన దౌర్బాగ్యుడు ఎవడు కాగలడు. అతని ఈ చర్యకు శిక్షగా అతన్ని ‘వైల్’ అనే నరకపు లోయలో విసిరేయడం జరుగుతుంది అని అన్నారు మన సజ్జన పూర్వీకుల్లోని ఒకరు.
మోసం గురించి ప్రవక్త (స) చేసిన హెచ్చరిక:
ప్రవక్త (స) ఓ ఆహార పదార్థ రాసి దగ్గర నుండి వెళుతూ, లోపల చెయ్య వేసి చూశారు. అది తడిగా ఉండటం గమనించారు. ఏమిది ఓ ఆహార పదార్థం అమ్మేవాడా? అని ప్రశ్నించారు. అందుకా వ్యాపారి – ‘వాన కురవ డం వల్ల తడిసింది’ అని సమాధానమిచ్చాడు. ”నీ మాట నిజమయితే తడిగా ఉన్న దాన్ని పైన ఎందుకు పెట్ట లేదు? ప్రజలు చూసుకునే వారు కదా!” అని చెప్పడమే – ”మోసం చేసిన వాడు నా వాడు కాడు” అని హెచ్చరిం చారు. (ముస్లిం)
మోసం నుండి దూరంగా ఉంచే సాధనాలు:
ధర్మ సమ్మతమయిన సంపాదనతో సంతృప్తి చెందేలా దీవించాలని అల్లాహ్‌తో దీనాతి దీనంగా దుఆ చెయ్యాలి.
ఏ పని చేసిన పూర్తి చిత్తశుద్ధితో చెయ్యాలి. అల్లాహ్‌ా ప్రసన్నత అందులో అవిభాజ్యం అవ్వాలి.
మంచిని గురించి చెబతూ, చెడు నుండి వారిస్తూ ఉండాలి.
పిల్లలకు సరయిన ఇస్లామీయ శిక్షణ ఇవ్వాలి.
అల్లాహ్ యెడల ప్రగాఢ నమ్మకం కలిగి ఉండాలి. సర్వకాల సర్వావస్థలయందు ఆయన చూస్తున్నాడన్న భావన కలిగి ఉండాలి.
తరచూ ఖనన వాికను సందర్శించుకంటూ, మరణాన్ని స్మరించుకుంటూ ఉండాలి.
హలాల్ సంపాదనా మార్గంలో ఎదురయ్యే కష్టాన్ని, నష్టాన్ని ఓర్పు సహనం తో భరించాలి.
ఉన్నంతలో సర్దుకుపోయే గుణాన్ని అలవర్చుకోవాలి.
సజ్జనుల సాంగత్యాన్ని అలవర్చుకోవాలి.
మోసం యొక్క తీవ్ర పరిణామాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాలి.
మోసం వల్ల ఇహపరాల్లో మనం ఏం కోల్పోతామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి.