నిన్ను అనుసరిస్తున్న విశ్వాసుల పట్ల దయార్ద్రహృదయంతో, వినయంగా మసలుకో. (అష్-షుఅరా: 215)
వినయం విజయం రెండింటినీ పుట్టుకతోనే ఎవరూ తమ వెంట తీసుకురారు. వయసు పెరిగిన కొద్దీ చదువు సంస్కారాల వల్ల అలవడేది వినయం. కష్టించి పనిచేయడం వల్ల నాయకత్వ బాధ్యతలు వహించి లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించడం ద్వారా అందివచ్చేది విజయం..
మర్యాద, మంచి నడవడిక, వినయం ఎప్పుడూ కలిసే ఉంటాయి. అది ఇంటి వాతావరణం నుంచి సంక్ర మిస్తాయి. అలవడతాయి. మన ఎదుగుదల మన వినయానికి విజయానికి విలాసం కావాలి.. అప్పుడే మన నీడ కింద పదిమంది సేద తీరతారు. విజయం సాధించామని అహం ప్రదర్శించకూడదు. మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు హఠాత్తుగా ఏర్పడవు. మనుషులతో మమేకం కావాలి నువ్వు నేను అనే అడ్డుగోడ ఉన్నంత వరకు మానవ సంబంధాలు ఎటువైపు ఉన్నవి అటువైపే ఉంటాయి.
మనిషి గమ్యాన్ని వినయం, విజయం, ఆహంకారాలు విశేషంగా ప్రభావితం చేస్తాయి. అతడి ఉన్నతికి, పతనానికి అవే హేతువులు. అనుకున్నది సాధిస్తే, మనిషి ఆనందానికి అవధులుండవు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎదుగుదలకు మార్గం వేస్తుంది. జవసత్వాలు అందిస్తుంది. మనిషి చేసే ప్రతీ పని ఈ విజయం కోసమే. విజయాన్ని అణకువతో స్వీకరిస్తే, అది యోగంగా పరిణమిస్తుంది. ఆహంకరిస్తే పతనాన్ని శాసిస్తుంది. వినయం కలిగినవారు ‘విజయం-అహంకారాల’ చక్రబంధంలో చిక్కుకోడు. విజయ గర్వం ప్రమాదం. విజయ వినయం ప్రమోదం. మక్కా విజయం సందర్భంగా మహనీయ ముహమ్మద్ (స) ఒంటె మూపురానికి తన నుదురు ఆనుతున్నంత వినయ స్థితిలో మక్కాలో ప్రవేశించారు
ఆయన (స) ఇలా అన్నారు: పరస్పరం అణకువతో వ్యవహరించమని, ఎవరూ ఎవరిమీదా గొప్పలు చెప్పుకో కూడదని, ఎవరూ ఎవరి మీదా అత్యాచారానికి పాల్పడకూడదని దేవుడు నన్ను వహీద్వారా ఆదేశించాడు.
( సహీహ్ ముస్లిం)
కులగోత్రాలు, సిరిసంపదల ప్రాతిపదికపై ఒకర్ని నీచంగా భావించటం, ఒకరిపై అన్యాయానికి ఒడిగట్టడం సమంజసమైన విషయం కాదు. దేవుడు సమాజంలో ఎవరికయినా ఏదయినా గొప్ప స్థానాన్ని ప్రసాదిస్తే దానికి అతను కృతజ్ఞతలు తెలుపుకోవాలిగాని సాటి మానవులను అల్పులుగా భావించటం, వారిమీద అత్యాచారాలకు పాల్పడటం చేయరాదు.
భూమిపై నిక్కుతూ, నీల్గుతూ నడవకండి. (ఈ అహంకారంతో) మీరు భూమిని చీల్చి వేయలేరు. పర్వతాల ఎత్తుకు ఎదగనూ లేరు. (నీ_ఇస్రాయీల్: 37) గర్వం, అహంకారం ఒక దుర్గంధభరిత దుర్గుణం. మనిషి వద్ద ఏవి ఎన్నున్నా ఈ ఒక్క దుర్లక్షణం మూలగా అతని జీవితం దుర్భరితంగా దరిద్రంగా తయారవుతుంది. వినయం ఉంటె విజయమే, లేకుంటే మాత్రం విలయమే, ప్రళయమే!
ఓ వ్యక్తి గుర్రం ఎక్కి రహదారి వెంట వెళుతున్నాడు. రోడ్డు మధ్యలో విరిగిపడ్డ పెద్ద కొండరాయిని తొలగించ డానికి సైనికులు ప్రయత్నిస్తున్నారు. చాలావరకు కదిలించారు. కానీ మరోవ్యక్తి సాయం ఉంటే బండరాయి తేలిగ్గా కదులుతుంది. సైనికులంతా ప్రయాస పడుతుంటే వాళ్ల నాయకుడు. చూస్తూ నిలబడ్డాడు. గుర్రంమీద ఉన్న వ్యక్తి ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి- మీరు కూడా సాయం చేయవచ్చు కదా అన్నాడు. ‘నేను వీళ్ళందరికీ నాయకుడిని. నేను ఆజ్ఞలు మాత్రమే జారీ చేస్తానన్నాడు. వెంటనే ఆ వ్యక్తి రాయి తొలగిస్తున్న సైనికుల వద్దకు వెళ్ళి వారికి చేయూత. అందించాడు. అతడి సాయం వల్ల రాయి సులువుగా కదిలింది. ఆ వ్యక్తి తిరిగి గుర్రం ఎక్కి వెళ్తూ వాళ్ళ నాయకుడి దగ్గర ఆగి, ఈసారి నీ కింద పని చేసే సైనికులకు సహాయం కావాలంటే ఈ దేశపు రాజుకు కబురు పంపు అని వెళ్ళిపోయాడు. సహాహం చేసి వెళ్లిన వ్యక్తే ఆ దేశానికి రారాజు. జీవితంలో విజయం, వినయం ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. నిరాడంబరత, వినయం ఈ రెండూ విజయాన్ని తెలిపే సరైన గుర్తులు.
అ హంకారం తలకెక్కినా, ఆత్మవిశ్వాసం అడుగంటినా, మనిషి జీవనం అగమ్యగోచరం, అంతం తెలియని పయనం!! అహంకారంతో అందలాలెక్కినా, కలసిరాని కాలం వెక్కిరిస్తే, అందలం అధః పాతాళమై, ప్రశంసలన్నీ, విమర్శలుగా మారి.. జీవితమే ఏహ్యమవుతుంది!! ఎదురుదెబ్బలు కాచుకోలేక, ఆత్మవిశ్వాసం కరువైతే.. చిన్న పామే విషసర్పమవుతుంది, భయమే జీవితమవుతుంది!! విజయం తెప్పించే వినయం, కష్టాలకు ఇచ్చే స్వీయ అభయం, జీవితాంతం అవసరం-అవి కరువైన జీవితం వ్యర్థం!!
లోకంలో భాగ్యవంతుడు ఎవరంటే వినయశీలి అంటారు పెద్దలు వినయం ఉంటేనే విద్య అబ్బుతుంది. విజయం. లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. గురువుల అనుగ్రహం పొందుతాడు. దైవానికి చేరువ అవుతాడు. మంచి మిత్రులతోపాటు మంచి కుటుంబం ఉంటుంది. గర్వం, దర్పం, స్వాతిశయం దరిచేరవు. దానితో అందరి ప్రేమ, మన్ననలు పొందుతాడు. వినయం అనే ఒక్క సద్గుణం ఉంటే అన్ని సంపదలూ అతడి దరిచేరతాయి. వినయ మన్నది జీవితంలో మనిషి కష్టపడి సముపార్జించవలసిన మహాద్భుత గుణ సంపద ఇది అభ్యాసంతోనే అలవడుతుంది.
ఆధునిక విద్యాలయాల్లో విద్యను మాత్రమే బోదిస్తున్నారు. పూర్వం విద్యతోపాటు వినయాన్నీ నేర్పేవారు. మనసు ఎలాంటి రంగు సంతరించుకోని బాల్యం నుంచే వినయాన్నీ అభ్యసింపజేసేవారు. వినయాన్ని అలవరచిన తరువాతనే, గురువులు విద్దును బోధించేవారు. ఉత్తమ విద్యార్థి లక్షణాల్లో వినయాన్ని ప్రధానంగా చెబుతుంది ఇస్లాం. హదీస్ జిబ్రయీయిల్ని కాస్త గమనఇంచండి! విశ్వ ప్రవక్త, ప్రవక్తలందరి అధినాయకులు – ఎంత వినయంగా దైవ దూతల నాయకులయిన హజ్రత్ జిబ్రయీల్ (అ) సమక్షంలో కూర్చోని ఆయన అడిగిన ప్రశ్నలకు ఎంత గౌరవభావముతో సమాధానమిచ్చారో ఒక్కసారి నెమరువేసుకోండి. గురువు నుంచి విద్యను మాత్రమే నేర్పిస్తే అది పూర్ణత్వానికి దోహదపడడు. గురువును పాఠాలు చెప్పే యంత్రంగా భావించే వ్యవస్థ నుంచి వినయశీలురు. ఉద్భవించరు.
“ఖలఫ్ (రహ్మ) తెలిపారు: ‘అహ్మద్ ఇబ్ను హన్బల్ నా వద్దకు అబూ అవానా హదీథ్ వినడానికి వచ్చాడు. నేను ఆయన గౌరవార్థం పైన కూర్చోబెట్టేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ ఆయన అంగీకరించలేదు పైగా ఇలా అన్నారు: నేను మీ ముందు నేల మీది మాత్రమే కూర్చుంటాను. మనం ఎవరి దగ్గర విద్య నేర్చుకుంటామో వారితో వినయంగా వ్యవహరించమని మనకు ఆదేశించబడింది.’
అహంకారం ప్రతీ మనిషిలోను సహజంగాను, స్వాభావికంగాను ఉంటుంది. తాను గొప్పవాడిని కావాలను కుంటాడు.. ముందు వరసలోనే ఉండాలనుకుంటాడు. ఇది సహజం. వినయం. ఉంటే ఆహంకారం పరిపక్వానికి వేరుతుంది. అప్పుడు మనిషి విజయాన్ని దైవప్రసాదంగా స్వీకరిస్తాడు. గెలుపోటముల్ని దైవాధీనంగా భావిస్తాడు. తాను భగవంతుడి చేతిలో ఒక ఉపకరణం మాత్రమే అనుకుంటాడు. తన ప్రతిభ దైవం నుంచే వ్యక్తమవుతోందని గ్రహిస్తాడు. జీవితంలో పొందే సకల అనుభవాల ద్వారా దైవం అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. భగవంతుడి విశ్వప్రణాళికలో భాగంగా జన్మించానని భావిస్తాడు. ‘సకల. శక్తిని దైవం నుంచే పొందాను, ప్రతి నిమిషం ఆయన సహాయం కోసం ఎదురుచూస్తాను, ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష అని ఆత్మబోధన చేసు కుంటాడు. అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది ఇది అన్నీ తెలిసిన వాళ్ళు వినయంగా ఉంటారు. కానీ ఏమీ తెలియని లేదా సగం సగం మాత్రమే తెలిసినవాళ్ల హడావుడే ఎక్కువగా ఉంటుంది.
హజ్రత్ అబూ హురైరా (రజి)గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు దానధర్మాలు సంపదలో లోటు ఏర్పరచవు. దాసుడు మన్నింపుల వైఖరిని అవలంబిస్తే దేవుడు అతని గౌరవాన్ని ఇతోధికం చేస్తాడు. ఎవరయినా దైవం కోసం అణకువను ప్రదర్శిస్తే అల్లాహ్ అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు. (ముస్లిం)
మృదుత్వాన్ని, మన్నింపుల వైఖరిని అవలంబిస్తే జనం తమను తక్కువగా అంచనా వేస్తారనీ, తాము వారికి లోకువ అయిపోతామని భావిస్తారు సాధారణంగా మనుషులు, కాని దైవప్రవక్త (సల్లం) చెబుతున్నారు ఈ వైఖరిని గనక అవలంబిస్తే అంతిమంగా గౌరవమర్యాదలే లభిస్తాయి. జనం తమను మునుపుకంటే ఎక్కువగా గౌరవించటం మొదలు పెడతారు. ఇకపోతే పరలోకంలో ఉన్నత స్థానాలు ఎలాగూ దక్కుతాయి.
హజ్రత్ ఆనస్ (రజి) ఓసారి కొంత మంది పిల్లల సమీపం నుంచి వెళ్తూ వారికి సలాం చేసి, దైవప్రవక్త (సల్లం) కూడా ఇలాగే (చిన్నపిల్లలకు) సలాం చేసేవారని చెప్పారు. (బుఖారీ ముస్లిం)
చిన్న పిల్లలకు సలాం చెయ్యటమనేది మనిషిలోని వినయం, అణకువ, నమ్రతా భావాన్ని సూచిస్తుంది. దైవప్రవక్త (సల్లం) ఎప్పుడయినా చిన్నపిల్లలు ఎదురయితే తానే ముందుగా వారికి సలాం చేసేవారు. ఇస్లాం ధర్మం మనిషి తన ఇంటికి వెళ్ళినప్పుడు తన ఆలుబిడ్డలకు కూడా సలాం చెయ్యాలని ఆదేశిస్తోంది. అంతేకాదు తన అధీనంలో ఉన్నవారికి, నౌకర్లకు, సేవకులకు కూడా సలాం చెయ్యాలి. ఇతరులకు సలాం చెయ్యనివారు గర్వానికి లోనయి ఉన్నారని గ్రహించాలి. ఇంటిపనుల్లో స్త్రీకి సహాయం చేయటం కూడా దైవప్రవక్త గారి ఆదర్శ సంప్రదాయమే. ఇందులో అవమానాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంటి పనుల్లోనే పూర్తిగా మునిగిపోయి నమాజును సైతం మర్చిపోవటం కూడా మంచిపద్ధతి కాదు. నమాజ్ వేళ అవగానే పురుషులు నమాజ్ కోసం మస్జిద్కు వెళ్ళిపోవాలి. స్త్రీలు కూడా తమకు ఎక్కడ వీలయితే అక్కడ తప్పకుండా నమాజ్ చేసుకోవాలి.
ఒక చెంబు తెలివితేటల కన్నా. ఒక ఔన్సు వినయం విలువ అధికం అంటారు. సామర్థ్యం ముఖ్యమే కానీ వినయం, విధేయత లేని సామర్థ్యానికి గుర్తింపు ఉండదు. వినయం ఒక భావన మాత్రమే వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసి మెరుగుపరచి, నడవడికను సరైన మార్గంలో పెడుతుంది. వినయం. ఇతరులకు ‘ధన్యవాదాలు’ తెలియజేయాలనుకునే భావనే కృతజ్ఞత. ఆది అవతలివారి పట్ల మనకున్న గౌరవాన్ని, మన ప్రవర్తనను, మన వినయాన్ని విశదపరుస్తుంది. అతి సర్వత్ర వర్ణయేత్ అంటారు. అతి వినయం ప్రదర్శిస్తూ మన పక్కనే ఉంటూ సమయం వచ్చినప్పుడు దెబ్బతీసేవాళ్లూ ఉంటారు. అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యక్తి సమగ్ర వ్యక్తిత్వాన్ని నడతను తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన గుణాల్లో మొదటి స్థానం వినయానిదే. ఆ గుణం కలిగినవారే విజయానికి చిరునామా అవుతారు. అల్లాంటి కొందరు మహనీయుల ఆదర్శ పరివర్తనను తెలుసుకుందాం!
ప్రవక్త ముహమ్మద్ ﷺ వారి వినయం
ప్రవక్త ముహమ్మద్ ﷺ తన సహాబాల మధ్య వారితో కలిసి, వారిలో ఒకరుగా కూర్చునేవారు. ఒక అపరిచిత వ్యక్తి వచ్చినప్పుడు వారిలో ఎవరు ప్రవక్త అని తెలియక, అడగాల్సి వచ్చేది. అందుచేత మేమే కొత్తవారికి ప్రవక్తను గుర్తించడం సులభం అవుతుందన్న సదుద్దేశంతో. ప్రవక్తగారిని ఒక ప్రత్యేక స్థలం కేటాయించమని విన్నవించుకున్నాము.
హజ్రత్ అబూ రిఫాఅ తమీమ్ బిన్ ఉసైద్ (రజి) కథనం : ఓసారి దైవప్రవక్త (సల్లం) ప్రసంగిస్తుండగా నేనాయన దగ్గరికి వెళ్ళి, “దైవప్రవక్తా! ఓ బాటసారి ధర్మం గురించి తెలుసుకోవాలని వచ్చాడు. అతనికి తన ధర్మమేమిటో తనకే తెలియదు” అని అన్నాను. ఆ మాట విని దైవప్రవక్త (సల్లం) నావైపు దృష్టి మళ్ళించారు. ప్రసంగం ఆపి నా దగ్గరికొచ్చారు. ఆయన కోసం ఓ కుర్చీ హాజరు పరచబడింది. ఆయన దానిపై కూర్చొని దేవుడు తనకు నేర్పిన విషయాలను నాకు బోధించటం మొదలు పెట్టారు. (కాసేపయిన తరువాత) మళ్ళీ ప్రసంగం చెయ్యటానికి వెళ్ళి (తాను చెప్పదలచుకున్న) మాటను పూర్తిచేశారు.(ముస్లిం) (సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)
తన తప్పును తీవ్రంగా తానే విమర్శించుకోవాలి. ఇతరుల తప్పులను వినయంగా తెలియపరచాలి. అని ఉద్బోధించారు. వినయం వెలుగు లాంటిది. నిస్వార్ధమైనది పంచిస్తుందే కానీ ఆశించదు. కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా, ఐశ్వర్యం కలిగినప్పుడు అణుకువగా, అధికారంలో ఉన్నప్పుడు సేవకుడిగా, విజయం సాధించినప్పుడు వినయంగా, ఉన్నవారే అందరికంటే సంస్కారవంతులు.
అబూ బకర్ సిద్దీక్ (ర) గారి వినయం
అబూ బకర్ సిద్దీక్ (ర) ఖలీఫా అయిన తర్వాత, ఒక ఉదయం బజారు వైపు వెళ్తూ కనిపించారు. ఖలీఫా కావడానికి ముందు ఆయన తమ ప్రాంతం ప్రజల గొర్రెలకు పాలు పితికేవారు. ఖలీఫా అయిన తర్వాత ఒక ప్రాంతంలోని బాలిక చెప్పింది: “ఇప్పుడు ఆయన మన గొర్రెలు పాలు పితకరా .” దానికి ఆయన అన్నారు: “అలా ఎందుకు అనుకుంటున్నావు … తప్పక పితుకుతాను. నేను ఈ పదవిలోకి వచ్చినందువల్ల నా స్వభావం మారుతుందని నేను అనుకోవడం లేదు.”
ఎదగాలి అనుకోవడం ఆశయం, ఎదిగినా ఒదిగి ఉండాలి అనుకోవడం వివేకం, సాధించాలి అనుకోవడం సంకల్పం, సాధించినా ఇంకా నేర్చుకోవాలీ అనుకోవడం సంస్కారం. మౌనం మాట రాక కాదు, హుందాతనం, నవ్వు పరిహాసం కాదు, చిరు ధరహాసం, వినయం బలహీనత కాదు, విజ్ఞత, ప్రేమ గుడ్డిది కాదు, విలువైనది.
ఉమర్ ఫారూక్ (ర) గారి వినయం
తారిక్ ఇబ్ను షిహాబ్ చెబుతారు: ఉమర్ ఫారూక్ (ర) షామ్ ప్రయాణంలో ఉండగా, ఒక నీటి ప్రవాహం వద్దకు చేరుకున్నారు. ఆయన ఒంటెపై నుంచి దిగిపోయి, తన పాదరక్షలను తీసి భుజంపై పెట్టుకున్నారు. ఒంటె యొక్క కాడిని పట్టుకొని నీటిని దాటి వెళ్లారు. అప్పుడు అబూ ఉబైదా (ర) అన్నారు: “ఓ అమీరుల్ మోమినీన్! మీరు ఇలా చేయడం?! ప్రజలు చూస్తే చాల ఎబ్బెట్టుగా ఉంటుంది?!”
దానికి ఉమర్ (ర) కోపగించుకుంటూ – “ఓ అబూ ఉబైదా! ఇది నువ్వు కాక మరెవరో చెప్పి ఉంటే… నేను అతనికి పాఠం నేర్పేవాడిని! మనం అత్యంత అవమానితులైన జాతిగా ఉండేవారం. అల్లాహ్ మనకు ఇస్లాం ద్వారా గౌరవం ఇచ్చాడు. కాబట్టి మనం అల్లాహ్ ఇచ్చిన గౌరవం కాక వేరేద్వారా గౌరవాన్ని ఆశిస్తే- అల్లాహ్ మనలను పరాభవం పాల్జేస్తాడు జాగ్రత్త !
మౌనం గా ఉండాలి అంటే సహనం కావాలి, సహనం గా ఉండాలి అంటే సంస్కారం కావాలి, సంస్కారం ఉండాలి అంటే వినయం కావాలి, వినయం ఉండాలి అంటే విజ్ఞత ఉండాలి.
ఉస్మాన్ (ర) గారి వినయం
హసన్ (రహ్మ) చెబుతున్నారు: “నేను ఉస్మాన్ (ర) గారిని సాధారణ చాపపై మస్జిదులో మధ్యాహ్న పూత నిద్రపోతూ చూశాను. అప్పటికి ఆయనే ఖలీఫా. ఆయన పక్కవైపు కంకర్రాళ్ళ ముద్రలు కనిపించేవి. మేము ఈయన అమీరుల ముఇమినీన్!” నిజమేనా అని ఆశ్చర్య పోయేవాళ్ళము.
ఉస్మాన్ (ర) సవారీ పై కూర్చుని, వెనక తన సేవకుడు కూడా అదే సవారీ పై కూర్చోబెట్టుకొని వెళ్లడం చూశాను – ఆయన ఖలీఫా అయినప్పటికీ.
ఆసక్తి ఆలోచనలను ప్రభావితం చేస్తుంది, విజ్ఞత వ్యక్తిత్వ వికాసాన్ని ప్రభావితం చేస్తుంది, సహనం సంస్కార విలువలను ప్రభావితం చేస్తుంది, వినయం వ్యక్తిగత ఔన్నత్యాన్ని ప్రభావితం చేస్తుంది.
అబ్దుల్లాహ్ ఇబ్ను సలామ్ (ర) గారి వినయం
అబ్దుల్లాహ్ ఇబ్ను సలామ్ (ర) ఒకసారి మార్కెట్ లో కట్టెల మోపును తలపై మోసుకుంటూ వెళ్తుండగా ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆయన అన్నారు: ” అహంకారాన్ని తొలగించడానికి నేను ఇలా చేస్తాను. ప్రవక్త ﷺ చెప్పారు: ‘హృదయంలో ఆవగింజంత అహంకారం ఉన్నవాడు స్వర్గంలో ప్రవేశించడు.'”
అసహనం నిర్లక్ష్యానికి గురి చేస్తుంది, కోపం విధ్వంసానికి దారి తీస్తుంది, అహం బంధాలను బలి తీసుకుంటుంది, సహనం, ప్రేమ, ఆత్మాభిమానం వ్యక్తిత్వాన్ని ఇనుమడింప చేస్తాయి. సహనం కోల్పోయిన సంస్కారం, నేర్పరితనం లోపించిన కష్టం, వినయం లేని విజ్ఞానం, మనిషి ఎదుగుదలకు ప్రధాన అడ్డంకులు.
ఉమర్ ఇబ్ను అబ్దిల్ అజీజ్ (రహ్మ) గారి వినయం
ఒక రాత్రి ఆయనతో కొందరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వారు ఉపయోగిస్తున్న దీపం ఆరిపోయింది. ఉమర్ (రహ్మ) లేచి దీపాన్ని సరిచేశారు. అప్పుడు ప్రజలు అన్నారు: “ఓ అమీరుల ముఇమినీన్! మేమే సరి చేస్తాము కదా!” మాటి మాటికీ తమరు ఇబ్బంది పడటమేమిటి? అన్నారు. అయితే ఆయన అన్నారు: “ఇలా చేయడం వాళ్ళ నాకు జరిగిన నష్టమేమిటి? దీపం వెలిగించడానికి వెళ్లినప్పుడు నేనే ఉమర్ ఇబ్ను అబ్దిల్ అజీజ్. తిరిగి వచ్చినప్పుడు కూడా నేనే ఉమర్ ఇబ్ను అబ్దిల్ అజీజ్!”నే.
మరోసారి ఒక మనిషి ఆయనను “ఓ అల్లాహ్ ఖలీఫా!” అని పిలిచాడు. దానికి ఆయన అన్నారు: “అలా అనొద్దు! పుట్టినప్పుడు మా అమ్మానాన్న నాకు ఉమర్ అని పేరు పెట్టారు. ఆ పేరుతొ పిలవండి పలుకుతాను. “నేను పెద్దవాడినప్పుడు, నేనే నా కోసం ఒక పర్యాయపేరు ఎంచుకున్నాను; అబూ హఫస్ అని. నువ్వు నన్ను ‘ఓ అబూ హఫస్!’ అని పిలిచినావంటే- నేను తప్పకుండా స్పందిస్తాను. తర్వాత మీరు నన్ను మీ వ్యవహారాలపై బాధ్యతగల వాడిగా నియమించినప్పుడు, నన్ను ‘అమీరుల్ ముమినీన్’ (ముమినుల నాయకుడు) అని పేరు పెట్టారు. కాబట్టి నువ్వు నన్ను ‘ఓ అమీరుల్ ముమినీన్!’ అని పిలిచినా— నేను స్పందించేవాడిని. కానీ భూమిపై’ ‘అల్లాహ్ యొక్క ఖలీఫా అని పిలవడం – నేను ఆ స్థాయిలో ఉన్నవాడిని కాదు!” అని ఎంతో వినయంగా తెలియజేశారు.
ప్రతిభ వారసత్వంగా రాదు, కష్టపడితే నే వస్తుంది, పరిజ్ఞానం పఠనం ద్వారా రాదు,పరిశీలన ద్వారా మాత్రమే వస్తుంది, సంస్కారం సలహాల మేరకు రాదు, ప్రవర్తన ద్వారా మాత్రమే వస్తుంది.
ఇబ్ను తైమియ్యా (రహ్మ) గారి వినయం
ఇబ్ను బజ్జార్ చెబుతారు: “ఇబ్ను తైమియ్యా లాంటి వినయం కలవారిని నేను చూడలేదు. పెద్దవారైనా చిన్నవారైనా, ధనవంతులైనా పేదవారైనా – అందరికీ సమాన గౌరవం ఇచ్చేవారు. పేద గుణవంతుల్ని గౌరవించి – వారి అవసరాలను తనే మోసు కెళ్ళి తీర్చేవారు.” ప్రశ్నించేవారు, స్త్రీ అయినా పురుషుడు అయినా, పల్లెవాసి అయినా, పట్టణవాసి అయినా – అందరితో చిరునవ్వుతో, ప్రేమతో మాట్లాడేవారు. ఎప్పుడూ ఎవరినీ కఠినంగా తిరస్కరించేవారు కాదు.”
ఇకపోతే, విజయ గర్వంతో బలిసి కొట్టుకున్న అందరూ చివరాఖరుకి మట్టిగొట్టుకుపోయారు. ఒక ఫిరౌను,ఒక ఖరూన్, ఒక హామాన్, ఒక నంరూద్, ఒక అబూ జహల్, ఒక అబూ లహబ్, ఒక షైతాన్.
ఓటమిలో సహనం
భూమ్మీద గెలుపు సాధించిన వారి కన్నా ఓటమిని పొందిన వారు ఎక్కువ. గెలుపు పొందిన వాడు కూడా ముందు ఓటమి రుచి చూసి ఉంటాడు. అందుకే ఆఓటమిలో ఉండే బాధ అందరికి పరిచయమై ఉంటుంది. ఆ బాధని విజయానికి తొలిమెట్టుగా మనం భావించవచ్చు. ఆ బాధకి పట్టుదల జోడైతే గెలుపు సాధ్యమవుతుంది
(విశ్వాసులారా!) బాధపడకండి. అధైర్యంతో క్రుంగిపోకండి. మీరు నిజమైన విశ్వా సులైతే చివరికి మీరే విజయం సాధిస్తారు. (సత్యాసత్యాల సమరంలో) మీరేకాదు, వారు కూడా దెబ్బతిన్నారు. (ఆమాత్రానికే ధైర్యం కోల్పోవడమా!) ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన విశ్వాసులెవరో పరీక్షిం చడానికి, కొందరిని సత్యానికి సాక్షులు (అమరగతులు)గా చేయడానికి ఈవిధంగా చేశాడు. అల్లాహ్ దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు. ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజ మైన విశ్వాసులు ఎవరో ఏరివేసి, అవిశ్వాసుల్ని అణచి వేయదలిచాడు. (ఆల్–ఇమ్రాన్: 139-141)
గెలిచినవాడు ఏమి చెప్పినా లోకం వింటుంది అంటారు. కానీ గెలిచిన వారికి చెప్పే తీరిక, ఓపిక రెండూ ఉండవు. కానీ ఓడిన వాడికి చెప్పే ఓపిక ఉన్నా వినడానికి ఎవరూ ఉండరు ఓడిన ప్రతిసారి గెలవాలనే తాపత్రయం తప్ప. ఆ తాపత్రయమే మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. గెలుపుకి ఆనందానికి తేడా ఒక్క సెకను కానీ ఆనందానికి, బాధకి తేడా ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా. ఓటమి బాధతో ఆగిపోతే ఎప్పటికీ విజయాన్ని రుచి చూడలేము. గెలిచేవాడికి మాత్రం ఆ సెకను కాలంలో ఆవ గింజంతైనా అదృష్టాన్ని కలిగి ఉంటాడు ఏమో!
ఆటలో ఓడిన వాడు మరొక ఆటలోనైనా గెలుస్తాడు. కానీ జీవితంలో ఓడిన వాడు గెలవటానికి ఒక్కోసారి జీవితమంతా కూడా సరిపోదు. కాబట్టి కార్యం ప్రారంభించిన ప్రతి ఒక్కరు గెలవాలనే ప్రారంభిస్తారు. గెలిస్తే సంతోషం కానీ ఓడితే అందులో ఏదో ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటారు.
చాలామంది ధనము, మిత్రులు, తల్లిదండ్రులు ఉన్నా ఓడిపోయామని బాధతోనో, సిగ్గుతోనో చెడు వ్యసనాలకి అలవాటు పడటం, లేదా మధ్యలోనే జీవితాన్ని అంతం చేసుకోవడం చేస్తున్నారు. దీనివల్ల వారిని నమ్మిన కుటుంబం రోడ్డున పడుతుంది. ఒక్క క్షణం నీ ఆలోచన నీ కుటుంబాన్ని గొప్పగా నిలబెడుతుంది.
మనం భూమిలో వేసిన విత్తనం కూడా మొలకెత్తి గాలికి, ఎండకి, వానకి కింద మీద పడి ఎదిగి మనకే కాయలను ఇస్తుంది ఎటువంటి సహాయం లేని ఒక చిన్న విత్తనమే ఎదిగితే ఇంత మంది సహాయం ఉండి మరి మనం ఇంకెంత విజయం సాధించవచ్చు.
నీ ఆశయసాధనలో వెయ్యిసార్లు విఫలమైనా ఫరవాలేదు. మరొకసారి ప్రయత్నించు. అల్లాహ్ మనల్ని ప్రయత్నం చెయ్యమంటున్నాడే కాని, విజయమే ముఖ్యమైని చెప్పలేదు. మంచి జరుగుతుందని నమ్మండి. ప్రతిపనికి ముందు ప్రార్థించండి. వీలు చూసుకొని ఇస్తిఖారా చెయ్యండి. అల్లాహ్ ను తోడుగా ఉండమని అడగండి. అల్లాహ్ తోడుగా ఉన్నాడని నమ్మండి.
విశ్వాసులారా! సహనం వహించి, ప్రార్థనచేస్తూ (మా)సహాయం అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించేవారికి తోడుగా ఉంటాడు. (అల్-బఖరహ్: 153 )
ఒక విషయం పూర్తిగా తెలవడాన్ని ” పాండిత్యం ” అంటారు. సమయానుకూలంగా ప్రవర్తించడాన్ని ” సమయస్పూర్తి అంటారు. పరిష్కారం ఆలోచించడాన్ని ” ప్రజ్ఞత ” అంటారు. ఇవన్నీ కలిస్తే వచ్చేది జ్ఞానం అంటారు. జ్ఞానం లేని చదువు వృధా !
ప్రపంచంలో 70% మంది ” దేవుడు నా తలరాతను ఇలగే వ్రాసాడు. నాకు అదృష్టంలేదు. నాకు బిడియం. నేను అందరిలో కలిసిపోలేను. నాకు సృజనాత్మకత లేదు ” అనుకుంటారు. వారి నెగిటివ్ (ప్రతికూల) ఆలోచనలే వారిని వెనక్కి నెట్టేస్తుంటాయి. అసలు నిచ్చెన ఎక్కాలన్న తాపత్రయమే మీకు లేకుంటే ఇతరులు మిమ్మల్ని ఎలా ఎక్కించగలరు?
ఒక్కోసారి అనుకోకుండా ఓటమి ఎదురుకావచ్చు. అంతమాత్రాన నిరాశతో ప్రయత్నాన్ని ఆపకూడదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ గెలుపు దిశగా ఎలా నడవాలో తెలుసుకుందాం…
- ముందుగా ఓటమిని అంగీకరించాలి. అందుకు దోహదం చేసిన కారణాలను అన్వేషించాలి. దీంతో గెలుపు దిశగా మొదటి అడుగు పడినట్లే.
*గెలుపు కోసం చేసిన ప్రయత్నాలను, పడిన కష్టాన్ని గుర్తు చేసుకోవాలి. మొదటి ప్రయత్నం మీద గౌరవం ఉంచాలి. ఓటమి బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. విజయం సాధించలేని ప్రయత్నం అనుభవాన్ని ఇస్తుంది, లక్ష్యం సాధించలేని గురి ఏకాగ్రతను పెంచుతుంది, గ్రంధాలు ఇవ్వలేని జ్ఞానం జీవితం ఇస్తుంది, ప్రతి ప్రయత్నం వెనుక ఒక చక్కని ప్రయోజనం ఉంటుంది
*ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించుకోవాలి. మళ్లీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
*ప్రతి ఓటమీ ఒక బలమైన పాఠాన్ని నేర్పుతుంది. దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం మొదలు పెట్టాలి. సహాయం కోసం ఎదురు చూడటం బలహీనత, అవకాశం కోసం ఎదురు చూడటం అసమర్ధత, అసలు ఎదురు చూడటం అనేదే ఒక సోమరితనం, అవకాశాలను కల్పించుకుని మనకు అనుకూలంగా మలుచుకోవడమే సమర్ధుల విలక్షణం.
*ఓటమి బాధతో మానసికంగా కుంగిపోకూడదు. రోజూ నమాజు, జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం, మంచి పుస్తక పఠనం, వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
*ఓడిపోయామనుకుంటూ ఒంటరిగా ఉండకుండా ఎదురైన సమస్య గురించి మిత్రులు, సన్నిహితులతో చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అనుభవజ్ఞులను సంప్రదించాలి. ఏ వృత్తిలో నైనా ఎదగాలి అంటే నైపుణ్యం కావాలి, నైపుణ్యం రావాలి అంటే నిరంతరం సాధన చెయ్యాలి, సాధన చెయ్యాలి అంటే శ్రధ్ధ, సహనం కావాలి, సహనంతో కూడిన నైపుణ్యం సత్ఫలితాలను ఇస్తుంది.
*స్వీయ నమ్మకాన్ని కోల్పోకుండా చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
*ఓటమి ఎదురైందని అక్కడికక్కడే ఆగిపోకుండా ధైర్యంతో మళ్లీ ప్రయత్నించాలి. ఆగకుండా చేసే ప్రయత్నాలే గెలుపుకు దగ్గర చేస్తాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడే మార్పులు మొదలవుతాయి, మార్పులు మొదలయినప్పడే నూతన ఆలోచనలు ఆవిష్కరింపబడతాయి, ఆవిష్కరించబడిన ఆలోచనలు అర్ధవంతమైతే చేసిన కృషి ఫలిస్తుంది.
*అదేపనిగా బాధ పడుతూ సమయాన్ని వృథా చేయకూడదు. పూర్తి సమయాన్ని విజయం సాధించడం కోసమే కేటాయించాలి. ఆత్మవిశ్వాసం ఉంటే విజయం దక్కక పోయినా, సవాళ్ళను అధిగమించగలం అనే నమ్మకం పెరుగుతుంది ఆత్మాభిమానం ఉంటే సంపద లేకపోయినా అందరిలో గౌరవం పెరుగుతుంది.
మనం ఈ ప్రపంచాన్ని మొత్తంగా మార్చలేము, దేశాన్నంతా మార్చలేము, రాష్ట్రాన్ని సంపూర్ణంగా మార్చలేము, మీ జిల్లాను కూడా మార్చలేము, మీ గ్రామాన్ని సైతం మార్చలేము, ఆఖరికి మన కుటుంబాన్నీ మార్చలేము – అయినప్పటికీ మనల్ని మనం మార్చుకోవడం మన చేతిలో ఉంది. మనం మారితే మనల్ని చూసిన కొందరైనా మారడానికి అవకాశం ఉంది. అప్పుడీ ప్రపంచం మనకు కొత్తగా కనిపిస్తుంది. మార్పు మన నుండి ఆరంభం కావాలి. విజయంలో వినయమ, ఓటమిలో సహనమే విజయానికి రాచబాట. ఇది ప్రతిభకు ప్రాణం లాంటిది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం నేర్పుతుంది. “తన్ను తాను తగ్గించుకొన్న వాడు హెచ్చింపబడును” గ్రంథాలు చెబుతున్నాయి. “నిడారంబరం కన్నా గొప్పదేమీ లేదు. గొప్పదనమెప్పుడూ నిరాడంబరంగానే ఉంటుందని” జీవితం వడ్డించిన విస్తరికాదు. జీవితం అంతా సుఖంగా ఉండదు. కష్టలు ఉంటేనే సుఖం వద్తుంది.విజయానికి వెల చెల్లించాలి.ఊరకనే విజయం రాదు. ఒకవేళ ఊరకనే విజయం వస్తే అది ఎన్నాళ్ళో ఉండదు. అట్టి విజయాన్ని నిలుపుకునే శక్తి మీలో ఉండదు. అలాంటి విజయాన్ని మీరు కూడా మర్యాదగా చూడరు. అందుకే కష్టపడి విజయం సాధించండి. వినయం, సహనాలే విజయానికి సోపానాలని బలంగా నమ్మి నడుచుకొండి. విజయం మీ పాదాక్రాంతం అవుతుంది.
Arabic
English
Spanish
Russian
Romanian
Hindi
Tagalog
Bengali
Sinhalese
Nepali
