ఎంత మధురం ఈ స్నేహం 

 – సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ / ఎంత మధురం ఈ స్నేహం  స్నేహితుడు – ఈ పదంలో ఉన్న అక్షరాలు ఇతర అక్షరాల్లాంటివి కావు. ఇందులోని ప్రతి అక్షరానికి ఒక అర్ధం ఉంది.

స –  సచ్చీలత, సత్య సంధత

న –  నీతి, నిజాయితి, హితోపదేశం

త – త్యాగ నిరతి డాబు దర్పం లేకపోవడం

స్నేహం – అదో నీడ లాంటిది… ఎండ తీవ్రత పెరిగినకొద్దీ అవసరం అధికమవుతూనే ఉంటుంది. స్నేహ అది అస్తమించని రవి తేజం… అది కరిగిపోని మంచు పర్వతం… కరిగి పోదు… తరిగి పోదు. భూఫలాలు, పూలు రుతువును బట్టి కాస్తుంటాయి. స్నేహం అది అనుక్షణం ఫలాలిచ్చే మహా వృక్షం… అన్ని వేళలా సుగంధ పరిమళాల్ని వెదజల్లే పూవనం.

friendship

అలా నీవు చేసిన రోజు… కురిసిన ప్రతి చినుకు స్వాతి ముత్యం అవుతుంది… నీ బ్రతుకు సంతోషాల హరివిల్లవుతుంది… మనో భూమి పచ్చని సుగుణాల పూతోట అవుతుంది… అది నీకు బంగారు పంటను అందిస్తుంది…

ఇది స్నేహమైతే, నిజమైన స్నేహితుడెవడు??? అతడే అనునిత్యం నిన్ను కనురెప్ప వలే కాపాడువాడు. నీ లోపాలను – ఎంచనివాడు. నీ తప్పిదాలను క్షమించువాడు. నీవు చెప్పిన ప్రతీది వినువాడు. నీ గుట్టును రట్టు చేయనివాడు. నీ పొరపాట్లను దిద్దుకునే ఉంటాడు. అవకాశం ఇచ్చువాడు. నువ్వు లేనప్పుడు నీదైన ప్రతి వస్తువును కాపాడువాడు. నీ మనో వేదనను ముఖ కవళికలతో పసి గట్టువాడు. నీపై ఉన్న బరువును తొలగించువాడు. ఆపద సమయంలో నిన్ను ఆదుకొనువాడు. కష్ట సమయంలో అండగా నిలుచువాడు. నీ విజయంతో ఆనందించువాడు. పరాజయం పాలైతే ధైర్యం చెప్పేవాడు.

బహుశా అటువంటి స్నేహం కోసం నీవు పరితపిస్తున్నట్లున్నావు…. కానీ చేరుకోలేకపోతున్నానన్న బాధ నిన్ను దహించి వేస్తున్నట్లుంది…. నిరాశ చెందకు…. అధైర్య పడకు….. సహనం వహించు…. ప్రయత్నించు…. నీ కోరిక నెరవేరుతుంది…. నీ మొర ఆలకించ బడుతుంది… నీ గమ్యం నీకందుతుంది…. అది సమీపంలోనే ఉంది… నీకై నిరీక్షిస్తుంది… ఖచ్చితంగా నీవు శిఖరానికి చేరుకుంటా వంటుంది… ఆత్మానందంతో ఉత్సాహభరితం అవుతుంది నీ జీవితం… నీవు ఊహించిన దానికంటే ఎంతో గొప్పవాడు నీ స్నేహితుడు.

‘అతన్నెలా పొందగలను’ అని ఆలోచిస్తున్నావా??? ఆలోచించడం మానుకో…. అన్వేషణ ప్రారంభించు…. ఈ మార్గంలో అలుపెరగని కృషి సడలని పట్టుదల ఉండాలి మరి!… అతన్ని చేరుకునేందుకు ఓ వారథి నిర్మించాలి నీవు… అది చాలా బలమైనదై ఉండాలి… అతి భయంకరమైన తుఫానులకు ఎదురొడ్డి నిలబడ గలగాలి… సమస్యల సుడిగుండాలకు చెదరకుండా ఉండాలి… కోరికల సుడిగాలులకు బెదరకుండా ఉండాలి….!

అలా నీవు చేసిన రోజు… కురిసిన ప్రతి చినుకు స్వాతి ముత్యం అవుతుంది… నీ బ్రతుకు సంతోషాల హరివిల్లవుతుంది… మనో భూమి పచ్చని సుగుణాల పూతోట అవుతుంది… అది నీకు బంగారు పంటను అందిస్తుంది… అప్పుడు నీలోని ప్రతి అవయవం తనదవుతుంది. నీ కళ్ళు తను కనమన్నవే కంటాయి… ఈ చెవులు తను  దాని వినమన్నదే వింటాయి… నీ మెదడు తను చెప్పిందే ఆలోచిస్తుంది… నీ చేతులు తను ధర్మం అన్నదే చేస్తాయి… నీ కాళ్ళు తను చూపిన బాటనే  నడుస్తాయి… నీ మదిలో కదిలే ప్రతి కదలిక తన ఆదేశ ప్రకారమే ఉంటుంది….. అదే అసలు స్నేహానికి పరాకాష్ట!

ఇక ఆ స్నేహితుడెవడు? ఆ వారథి ఏది? అంటున్నావా? ఆ పరమ మిత్రుడే… అల్లాహ్… ‘నిఅమల్ మౌలా వ నిఅమన్నసీర్’ ”ఆయన అందరికంటే మంచి మిత్రుడు, మంచి సహాయకుడు కూడా. ఆ వారధియే…. నమాజు, ప్రార్ధన…. ‘ఇస్తయీనూ బిస్సబ్రి వస్సలాహ్ ‘ – సహనం వహించి, ప్రార్ధన చేస్తూ (ఆ మిత్రుని) సహాయం అర్ధిస్తూ ఉండు. నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించేవారికి తోడుగా

ఇక నేనేం చేయాలంటావా? అదీ అతని నోటనే విను…! “ఎవరు తమ ప్రభువు అల్లాహ్ యేనని పలికి, ఆ మాట మీదనే స్థిరంగా
ఉంటారో వారి (సహాయం) కోసం దైవ దూతలు తప్పకుండా అవతరిస్తారు. అప్పుడు వారికి ఇలా ధైర్యం చెబుతారు: ‘భయ పడకండి, విచార పడకండి. స్వర్గ ప్రవేశం, ప్రభువు దర్శనం గురించి మీకు చేయబడిన వాగ్దానం స్మరించి ఆనందించండి. మేము ఇహ లోకంలోనూ మీకు తోడుగా ఉన్నాము. పరలోకంలోనూ మీకు తోడుగా ఉంటాము. స్వర్గంలో మీరు కోరుకున్న వస్తువు లభిస్తుంది. మీరు కోరిందల్లా మీదే అవుతుంది. గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడయిన దేవుని వైపున లభించనున్న ఆతిథ్యమిది”. (హామీమ్ సజ్జా 30-32)

మానవ శ్రేయోభిలాషి అయిన మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారు తమ ఆఖరి ఘడియల్లో చెప్పిన రెండు మాటల్ని బాగా గుర్తుంచుకో!

“అల్లాహుమ్మ రఫీఖల్ అలా”
(ఓ అల్లాహ్! మహోన్నతమైన నీ నేస్తాన్నే ఆశిస్తున్నాను).

“ఖుర్రతు ఐనీ ఫిస్సలాత్
(నా కంటి చలువ నమాజులోనే ఉంది!!)

Related Post