మనిషి సాధించిన మొత్తం ప్రగతి, వికాసం, విజ్ఞానం – సర్వ జ్ఞాని అయిన అల్లాహ్ జ్ఞాన నిధి నిక్షేపంలోని ఒక్క చుక్కకి కూడా సమానం కాదు.
గత జాతులవారి దగ్గరకు వారి ప్రవక్తలు సూక్తు-లు, సూచనలు తీసుకు వచ్చినప్పుడు వారు తమ దగ్గరున్న (స్వయంకృత) జ్ఞానంలో తలమునకలయి ఉన్నారు. చివరికి వారు తాము అపహాస్యం చేసిన విషయాల ఉచ్చులోనే పడిపోయారు. (గాఫిర్,మోమిన్: 83)
జ్ఞాన సముపార్జన మరియు దాని మార్గాల విస్తరణ, విశ్వం లోతుల పరిశీలన నేటి మన కర్తవ్యం. ఆవశ్యం కూడా. కానీ మానవ ప్రపంచం సాధించిన విజయాలను చూసుకొని మురిసి పోవడం, మోసపోవడం సరి కాదు. మనిషి సాధించిన మొత్తం ప్రగతి, వికాసం, విజ్ఞానం – సర్వ జ్ఞాని అయిన అల్లాహ్ జ్ఞాన నిధి నిక్షేపంలోని ఒక్క చుక్కకి కూడా సమానం కాదు.
అల్లాహ్ వైపునకు మళ్ళాలి, తౌబా చేసుకోవాలి, ఇస్తిగ్ఫార్ తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి.
ఆ సమయం లో అల్లాహ్ వారిపై శిక్ష(విపత్తు) తెచ్చి పడేసేవాడే. కాని నీవు వారి మధ్య ఉన్నావు. అదీగాక కొందరు ప్రజలు తమ పాపాల పట్ల పశ్చాత్తాపం చెంది దేవుడ్ని క్షమాపణ వేడు కుంటున్నారు. అలాంటివారిని శిక్షించడం దేవుని అభిమతం కాదు. (అన్ఫాల్ -33)
అన్ని విపత్తులు అల్లాహ్ చిత్తానికి లోనయి ఉంటాయి.
హజ్రత్ అబూ సయీద్ అల్ ఖుద్రీ మరియు అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ఒక ముస్లిం గురి కాబడే బాధ, ఆందోళన, దుఃఖం, ఇబ్బంది, విచారం – చివరికి అతనికి గుచ్చుకునే ముల్లు అయినా సరే వాటికి బదులుగా అతని పాపాలను అల్లాహ్ ప్రక్షాళిస్తాడు” (ముత్తఫఖున్ అలైహ్)
హజ్రత్ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: అల్లాహ్ ఒక ముస్లింను అల్లాహ్ అతని స్వయం విషయంలో, అతని సంతానం, అతని ధన విషయంలో పరీక్షిస్తూనే ఉంటాడు. ఎంతలా అంటే, అతను అల్లాహ్ తో వెళ్లి కలుసుకున్న నాటికి అతనిపై ఒక్క పాపం కూడా లేని పునీత స్థితిలో తనుంటాడు”. (తిర్మిజీ)
అన్ని విపత్తులు అల్లాహ్ చిత్తానికి లోనయి ఉంటాయి. వాటిలో మనిషి మేలు ఉంటుంది. పరలోకానికన్నా ముందు ఇహలోకంలోనే అతని పాప ప్రక్షాళనగా అవి ఉంటాయి.
హజ్రత్ అబాన్ బిన్ ఉస్మాన్ (ర) గారి కథనం ` ప్రవక్త (స) చెబుతుండగా నేను విన్నాను ` ఎవరయితే సాయంత్రం మూడు సార్లు ` ‘‘బిస్మిల్లాహ్లిజీ లా యజుర్రు మఅ ఇస్మిహి షైవుల్ ఫిల్ అర్‌జి వలా ఫిస్సమాయి, వహువస్ సమీవుల్ అలీమ్’’ ఈ దుఆ చదువుతాడో అతను ఉదయం వరకు అకస్మాత్తుగా వచ్చి పడే సకల విపత్తుల నుండి కాపాడ బడతాడు. మరెవరయితే ఉదయం మూడు సార్లు ఈ దుఆ చదువుతాడో అతను సాయంత్రం వరకు అకస్మాత్తుగా వచ్చి పడే సకల ఆపదల నుండి కాపాడ బడతాడు’’. (ముస్నద్ అహ్మద్: 932, సునన్ అబీ దావూద్: 5088, సునన్ తిర్మిజీ: 3388)
ప్రాపంచిక నివారణోపాయాలను చేపట్టడం మరచి పోకూడదు.
అల్లాహ్ ను నమ్ముకునేవాడికి ఆయనే చాలు. (తలాక్:3)
ఇమామ్ ఖుర్తుబీ (రహ్మ) ఇలా అన్నారు: ఎవరైతే తన మొత్తం వ్యవహారాల్ని అల్లాహ్ కు అప్పగిస్తాడో అతని సకల వ్యవహారాలను ఆయనే చక్క బెడతాడు.
అల్లాహ్ ను నమ్ముకున్నాం కదా అన్న ఏమరుపాటులో ప్రాపంచిక నివారణోపాయాలను చేపట్టడం మరచి పోకూడదు.
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) గారినుద్దేశించి దైవ ప్రవక్త (స) ఇలా హితవు పలికారు: ”ప్రపంచం మొత్తం కలిసి నీకు మేలు చేయాలనుకున్నా, అల్లాహ్ నీ విధి రాతలో రాసిన మేలు మించినది చేయలేరు. ప్రపంచం మొత్తం కలిసి నీకు కీడు చేయాలనుకున్నా, అల్లాహ్ నీ విధి రాతలో రాసిన కీడుకి మించినది చేయలేరు. (తిర్మిజీ)
సకల అవస్థల్లోనూ అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడు అన్న ఆలోచనతోపాటు, మనిషికి సోకే ఏ వ్యాధి అయినా అయన నిర్ధారించిన విధిరాతలో భాగమే అని నమ్మాలి .
ఇస్లామీయ మర్యాదలు వ్యక్తిని మరియు సమాజాన్ని అంటువ్యాధులు మరియు ఇతర రోగాలను నుండి రక్షిస్తాయి.
హజ్రత్ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మీలో ఒకరు నిద్ర నుండి మేల్కొగానే మూడు సార్లు తన చేతులను కడుక్కోకుండానే ఏ పాత్రలోనూ పెట్టకూడదు, ఎందుకంటే, అతని చేయి రాత్రి ఎక్కడెక్కడ వెళ్లిందో అతనికి తెలీదు”. ( ముస్లిం)
అంటువ్యాధులు మరియు ఇతర రోగాల నుండి వ్యక్తిని మరియు సమాజాన్ని రక్షించడం అనేది అసలు ఇస్లాం అభిమతం. రాత్రి నిద్ర నుండి మేల్కొనేటప్పుడు చేతులు కడుక్కోవడం అనేది అది సూచించే జీవన విధానంలో ముఖ్యమైన అంశం.
ఆహారం తినేటప్పుడు చేతులు కడుక్కోవడం – కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత శుద్ధి పొందడం, గోర్లు కత్తిరించడం, మీసం కత్తిరించడం, చంకలోని వెంట్రుకలను తొలగించడం, నాభి క్రింది వెంట్రుకలను తొలగించడం – మగవారి కోసం సున్తీ చేయడం ఇస్లాం సూచించే మర్యాదలు.
మీ పాపాలను మన్నింపు కోసం ఇస్తిగఫార్ పదాలను తెలుసుకొని తౌబా చేసుకొండి.
తరువాత ఆదం తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పుకున్నాడు. దాన్ని అతని ప్రభువు స్వీకరించాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (అల్ బఖర:37)
మీ పాపాలను మన్నింపు కోసం ఇస్తిగఫార్ పదాలను తెలుసుకొని తౌబా చేసుకొండి, అలాగే అల్లాహ్ తస్బీహ్, అయన సంస్మరణ ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి.
గర్వ అహంకారాలు మనల్ని అల్లాహ్ అనుగ్రహాల ను చూడకుండా, సత్యాన్ని గ్రహించకుండా చేస్తాయి.
సమీపకాలంలోనే నేను మీకు దుష్టజనుల గృహాల (అవశేషాల)ను చూపిస్తాను. ఎలాంటి నీతి, నియమం లేకుండా ధరణిలో పెద్దలుగా చలామణయ్యే గర్విష్ఠులు నా మహిమలు చూడకుండా వారి దృష్టిని మార్చేస్తాను. వారిక ఏ మహిమ చూసినా (సత్యాన్ని) విశ్వసించలేరు. వారి కళ్ళెదుటకు సన్మార్గం వచ్చినా వారు దాన్ని అవలంబించలేరు. వక్రమార్గం కనిపిస్తే మాత్రం దానివైపు పరుగెత్తేవారు. దీనిక్కారణం వారు మా సూక్తుల్ని నిరాకరించి నిర్లక్ష్యం చేస్తుండేవారు. (ఆరాఫ్: 146)
మనందరి కోసం కాలం చాలా విలువైనది. ఆ కాలాన్ని మనం మన ప్రభువు విధేయతలోనే గడపాలి.
చంద్రుని పట్టుకునే శక్తి సూర్యునిలో లేదు. అలాగే రాత్రి పగటిని దాటిపోలేదు. సమస్తం ఒక్కొక్క కక్ష్యలో (అంటే తమ తమ నిర్ణీత కక్ష్యల్లో) సంచరిస్తున్నాయి. (యాసీన్: 40)
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) గారి కథనం- దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు; ”రెండు అనుగ్రాలున్నాయి, వాటా విషయంలో ప్రజలు ఏమరుపాటుకి లోనయి ఉన్నారు. ఆరోగ్యం మరియు తీరిక సమయం” ( బుఖారీ)
ఇంట్లో మీ ఉనికిని, మీ తీరిక సమయాన్ని పూర్తిగా సద్వినియోగ పర్చుకొండి, అల్లాహ్ విధేయతలో, ఆయన ఆరాధనలో మునుపెన్నడూ లేని విధంగా నిమగ్నం అవ్వండి.
ఉపవాసం ఉండి మీ ప్రభువు ఉద్దేశం అయిన తఖ్వా, దైవభీతిని సాధించుకోండి.
”విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. అదే విధంగా ఇది మీకు పూర్వం ప్రవక్తల్ని అనుసరించేవారికి కూడా విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” (2:183)
ఆందోళన, భయ సమయంలో ధైర్యం ఇవ్వండి
ఆయనే ముస్లింల విశ్వాసం ద్విగుణీకృతం కావడానికి వారి హృదయాలలో శాంతీ స్థిమితాలను అవతరింపజేశాడు. భూమ్యాకాశాల సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఆయన సర్వం ఎరిగినవాడు, ఎంతో వివేకవంతుడు. (ఫతహ్: 4)
మీరు మీ కుటుంబ సభ్యులను, మీ సోదరులను వారి ఆందోళన, భయ సమయంలో ధైర్యం ఇవ్వండి, నెమ్మదిని కలిగి ఉండమని చెప్పండి.
దృఢ నమ్మకం అంటే,
కష్టాలలో ఉన్నవాడు మొరపెట్టుకుంటున్నప్పుడు అతని మొర ఆలకించేదెవరు? చివరికి అతని కష్టాలు కడతేర్చుతున్నదెవరు? భూలోకంలో మిమ్మల్ని ప్రతినిధిగా చేసిం దెవరు? అల్లాహ్‌తోపాటు మరో దేవుడున్నాడా (ఈ పనులు చేయడానికి)? మీరసలు (ఈ విషయాల్ని గురించి) చాలా తక్కువగా యోచిస్తారు. (అన్నమల్ -62)
దృఢ నమ్మకం అంటే, మనం అల్లాహ్ తో ఒక విషయం గురించి వేడుకుంటాము, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అది జరగదు అని చెబుతూ ఉంటాయి. అయినా అల్లాహ్ మన మొరను ఆలకిస్తాడు అని, తన అవసరాన్ని అల్లాహ్ తీరుస్తాడని గట్టి నమ్మకంతో ఉంటాము.
మితంలోనే మనందరి హితం
ఆ తరువాత తాలూత్ సైన్యం తీసుకొని యుద్ధానికి బయలుదేరుతూ వారితో ఇలా అన్నాడు: “దేవుడు (దారిలో) ఒక నది ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. ఆ నదిలో నీరు త్రాగేవాడు నావాడు కాదు; త్రాగనివాడే నావాడు. అయితే (ప్రాణం కాపాడుకోవడానికి) దోసిలితో కొంచెం నీళ్ళు త్రాగితే పర్వాలేదు.” కాని (తీరా నది దగ్గరకు చేరుకోగానే) కొందరు తప్ప అందరూ (కడుపారా) త్రాగారు. (అల్ బఖరః – 149)
అనుమతి ఉన్న వేళల్లో కూడా తక్కువగా బయటకు వెళ్లడం (దోసిలితో కొంచెం నీళ్ళు త్రాగితే పర్వాలేదు)
కర్ఫ్యూ వేళల్ని కచ్చితంగా పాటించాలి. (దోసిలితో కొంచెం నీళ్ళు త్రాగితే పర్వాలేదు)
భౌతిక దూరాన్ని పాటించడం, ఫ్యామిలీ విజిట్స్ ను తగ్గించుకోవడం (దోసిలితో కొంచెం నీళ్ళు త్రాగితే పర్వాలేదు)
ఎక్కువగా ఉండి ప్రమాదంగా మారే దానికన్నా తక్కువగా ఉండి మనల్ని కాపాడేది మిన్న.
మనం ద్వేషించేవన్నీ చెడ్డవి కావు, మనం ప్రేమించేవన్నీ మంచివి కావు.
ఒక విషయం మీకు నచ్చక పోవచ్చు. కాని అందులోనే మీ శ్రేయస్సు ఉండవచ్చు. అలాగే ఒక విషయం మీకు నచ్చవచ్చు. కాని అందులోనే మీకు హాని ఉండవచ్చు. (మంచీచెడులు) అల్లాహ్ కే బాగా తెలుసు, మీకు తెలియదు. (అల్ బఖరః – 216)
నేడు మనం ఎదుర్కొంటున్న ఈ గడ్డు దినాలు మనకు నేర్పే పాఠం – మనం ఇష్ట పడే వాటిని బేరీజు వేసుకోవాలి, మనం ఇష్ట పాడనీ వాటిని భరించాలి.
మనం ద్వేషించేవన్నీ చెడ్డవి కావు, మనం ప్రేమించేవన్నీ మంచివి కావు.
అన్నింటీలోనూ, అందరిలోనూ మేలుంది.
అబూ యాహ్యా సుహైబ్ బిన్ సినాన్ (ర) కథనం – దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”విశ్వాసి విషయం బహు విచిత్రమైనది. అతని మొత్తం వ్యవహారం మేలైనదే. ఈ ప్రత్యేకత ఒక్క విశ్వాసికి మాత్రమే సొంతం. అతనికి కలిమి కలిగితే కృతజ్ఞతలు చెల్లించుకుంటాడు – అది అతనికి మేలు చేస్తోంది. అతనికి లేమి, కష్టం కలిగితే ఓర్పు వహిస్తాడు – అది కూడా అతనికి మేలుగానే పరిణమిస్తుంది”. (ముస్లిం)
మీ స్వీయ అవగాహన మీద దృష్టి సారించండి…
ప్రవక్త (స) వారి ప్రార్ధనల్లోని ఒక ప్రార్థన – ”ఓ అల్లాహ్! నువ్వు నా నుండి నాకు ఇష్టమైనది తీసుకున్నపుడు, ఆ వెలితిని నీకు ఇష్టమైన దానితో నింపేయి” (తిర్మిజీ – ఈ హదీసు బలహీనమైనది)
ఒక విరామం తర్వాత విరహం ఉంటుంది… అల్లాహ్ కు ఇష్టమైన వాటిని సాధించుకోవడానికి మనకు ఇష్టమైన వాటిని వదులుకోవాలి.
మీ స్వీయ అవగాహన మీద దృష్టి సారించండి… మీ ప్రాధాన్యతలు క్రమానుసారం ఉండేలా చూసుకొండి. ముందున్న మంచి రోజుల కోసం ఈ విరామ సమయంలో సమాయత్తమవ్వండి.
అల్లాహ్ ఒక బలహీన స్థితిని చూస్తే మరింత అధికంగా వాత్సల్యాన్ని కురిపిస్తాడు.
అల్లాహ్ తన దాసుల విషయంలో అమిత దయామయుడు, అపార వాత్సల్యుడు. (షూరా: 19)
ఇబ్న్ అతావుల్లాహ్ సికందరీ (రహ్మ) ఇలా అన్నారు: ” బహుశా అల్లాహ్ నీకు ఒక వరాన్ని ఇచ్చి నిన్ను నిరోధించాడేమో, బహుశా నిన్ను నిరోధింది మరో వస్తువును నీకిచ్చాడేమో” ఆయన ఒక వస్తువును ఇవ్వకపోవడం వెనకాల గల మర్మాన్ని తెలుసుకునే విజ్ఞతా తలుపులు ఎప్పుడైతే తెరుచుకుంటాయో అప్పుడు ఆయన నిరోధం కూడా అనుగ్రహంలా పరిణమిస్తోంది.
బహుశా ఈ దినాలు మన చుట్టూ ప్రక్కల ఉన్న వస్తువుల, అనుగ్రాహాల స్పృహను మనలో పునః ప్రారంభించడానికి వచ్చాయేమో, మనం మం చుట్టూ ఉన్న వస్తువులను వేరే కోణంతో చూడాలన్న ప్రేరణను మనలో నింపుతున్నాయేమో. అలా మనం మనకు అల్లాహ్ చేసిన మేళ్లను గుర్తించి, వాటి విలువను తెలుసుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అన్నది పరమార్థమెమో.
మనం వస్తువు పరమార్థాన్ని గ్రహించాలి..
దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: “మీలో ఎవరు తన కుటుంబం మధ్య సురక్షితంగా, దేహ ఆరోగ్యం కలిగి, ఆ రోజుకి సరి పడ జీవనోపాధి ఉన్న స్థితిలో ఉదయం చేస్తాడో – అతని కోసం ప్రపంచం తన సకల సంపదలతో అతని ముంగిట వాలినట్లే” (తిర్మిజీ)
మనం వస్తువు పరమార్థాన్ని గ్రహించాలి.. వాటిని వాటి నిజ రూపంలో చూడగలగాలి… మనం దేన్నయితే పూర్ణమైనదిగా భావించే వాళ్ళమో అది నేడు తన నిజ స్థితికి చేరుకుంది. ఒక్క నిమిషం కోసం ఆలోచించండి! నేడు మన మౌలిక అవసరాలు ఏవి – మనం, మన పరివారం, మన ఆరోగ్యం, ప్రసాంత వాతావరణం, సురక్షిత సమాజం కాదా?