నాస్తికత్వం ఓ విష బీజం

”మా వాక్యాల విషయంలో వక్ర వైఖరిని అవలంబింస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు”. (ఫుస్సిలత్‌: 40)

నాస్తికత్వాన్ని అరబీలో ఇల్హాద్‌ అంటారు. ఇల్హాద్‌ అంటే, విషయాన్ని దాని సందర్భం నుండి తప్పించి వివరించడం. అలా తమ తప్పుడు విశ్వాసాలను, మిథ్యా సిద్ధాంతాలను నిజమయినవిగా రూఢీ చేసుకోవడానికి ఖుర్‌ఆన్‌ వాక్యాలకు వక్ర భాష్యం చెప్పేవారు, అల్లాహ్‌ నామాలు, గుణగణాల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకునే వారు కూడా ఇందులో వస్తారు. అయితే నేడు ఈ పదం మత రాహిత్యం, నిజ దైవం యెడల నమ్మకం లేకపోవడం అన్న అర్థంలోనే ఎక్కువగా వాడబడుతున్నది.

ఈ ఇజాల అధినాయకులు ముస్లింలను నమ్మ బలికే మాట ఏమిటంటే, మీరు మేము చెబుతున్న ఈ ఇజాలను ఈ ఆర్థిక, సామాజిక వ్యవస్థగా స్వీకరించినప్పటి కీ నిక్షేపంగా ముస్లింలుగా ఉండొచ్చు. మీ నమాజు, రోజా, ధ్యాన సాధనాల్లో ఎలాంటి  లోటు రాదు. ఇది కేవలం ఆర్థిక, సామజిక వ్యవస్థ మాత్రమే. ఇది మనిషి యెక్క మతపరమయిన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవదు. కనుక మీరు భయ పడాల్సిన అవసరం లేదు అని. కానీ వారికి బాగా తెలుసు, ఒక సారి ముస్లిం ఈ ఇజాల ఉచ్చులో పడి తమ ఆర్థిక, సామాజిక సమస్యలకు పరిష్కారంగా వాటిని స్వీకరించారా, అంటే వారు ఇకపై స్వచ్ఛమయిన ముస్లింలుగా జీవించడం దాదాపు అసాధ్యం. కొన్నేండ్లల్లోనే వారి మస్తిష్క ప్రకాళన (బ్రయిన్‌ వాష్‌ చేసి) వారిని తమ ఇజాల తత్వానికనుగుణంగా మలచుకోవడం, ఇస్లాం అవశేషాలేమయినా వారిలో మిగిలి ఉంటే వాటిని పూర్తిగా తుడిచి వేయడం అవలీలగా జరిగిపోతుంది.

విశ్వ ప్రభువయిన అల్లాహ్‌ సమస్త మానవాళి కోసం ఆకాశం నుండి అవతరింపజేసిన ధర్మ విశ్వాసాలు మూడు మౌలిక విషయాల మీద ఆధార పడి ఉన్నాయి. 1) తౌహీద్‌ – నిజ దేవుని ఏకత్వం. 2) రిసాలత్‌ – ఆ నిజ దేవుని తరఫున దౌత్యం. 3) ఆఖిరత్‌ – పరలోక జీవితం. ఈ మౌలిక విశ్వాసాల్లోని ఏ ఒక్క విషయాన్ని తిరస్కరించినా దాన్ని ఇల్హాద్‌ – నాస్తికత్వం అంటారు. ఇలాంటి  వితండవాదం చేసే వారిని ఖుర్‌ఆన్‌ దహ్‌రియా అని కూడా నామకరణం చేస్తుంది: ”మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. మేము చస్తుంటాము, బ్రతుకుతుంటాము. కాలం తప్ప మరేదీ మమ్మల్ని చంపటం లేదు అని వారంటారు. నిజానికి వారికి దీని గురించి బొత్తిగా తెలియదు. వారు కేవలం ఊహాస్త్రాలను సంధిస్తూ పోతున్నారు”. (జాసియహ్‌: 24)

ఇస్లాం ఏమంటుంది?

మూడు మౌలిక విషయాలను ఇస్లాం సమస్త మానవాళికి బోధిస్తుంది. 1) తౌహీద్‌: ఈ విశ్వానికి ఒక కర్త ఉన్నాడు, అయనే అల్లాహ్‌. ఆయన మాత్రమే నిజ ఆరాధ్యుడు. ఆయనే భువన గగనాలను, సృష్టి చరాచరాలను శూన్యం నుండి పుట్టించాడు. వాటిలో ఉన్న ప్రతి వస్తువు అవసరాలను సమకూర్చి పెట్టాడు. విశ్వ పరిపాలనా వ్యవస్థను ఆయనే నడుపుతున్నాడు. 2) రిసాలత్‌: సృష్టిలోని ప్రతి ప్రాణికీ దాని మంచీచెడుల విచక్షణను ప్రసాదించాడు. మానవులు మరియు జిన్నాతుల మార్గదర్శనార్థం అదనంగా 1 లక్ష  24 వేల మంది ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు.  ఆఖిరత్‌:  మరణంతో మనిషి జీవితం పరిసమాప్తం అవ్వదు. మరో లోకంలో అతన్ని బ్రతికించడం జరుగుతుంది, ఆదే పరలోకం. పరలోకంలో మనిషి చేసిన ప్రతి కర్మకు లెక్క తీసుకోబడుతుంది. వివిద దశలు దాటుకుంటూ మనిషి కర్మలకు అల్లాహ్‌ ఇచ్చే తీర్పు మేరకు ఒక వర్గం స్వర్గంలో ప్రవేశిస్తుంది, మరో వర్గం నరకం పాలవుతుంది.

పూర్వం ప్రజల్లో కొందరు పరలోకాన్ని, తీర్పు దినాన్ని, స్వర్గ నరకాలను తిరస్కరించిన వారుండేవారు. కానీ, నిజ దైవాన్ని, అల్లాహ్‌ను తిరస్కరించే వారు దాదాపుగా లేరు. ఈ కారణంగా పూర్తి మానవ చరిత్రలో ఏ దశలోనూ నాస్తిక భావన గట్టిగా వ్రేళ్ళూనుకో లేదు అని చెప్పాలి. ప్రపంచంలో ప్రవక్తల విధానం ఉండేది, లేదా అదే మార్గాన్ని భ్రష్టు పట్టించుకున్న బహు దైవారాధన, విగ్రహారాధన విధానం ఉండేది.  ప్రపంచ మతాల్లో బౌద్ధ మతం ఎలాంటి  దైవ భావన లేని (ప్రాంతాల వారీగా కొన్ని వ్యత్యాసాలున్నా) ఆస్తిక మతం అని చెప్పవచ్చు.   అలాగే జైన మతంలో సయితం ఎలాంటి  దైవ భావన లేదు అని చెప్పవచ్చు. ఇవి రెండు భారత విగ్రహారాధన మతం నుండి వేరయిన మార్గాలన్నది గమనార్హం! ఇలాంటి  నాస్తిక భావన కలిగి ఉన్న వర్గాన్ని పూర్వం ‘దహ్రియహ్‌’ మరియు ‘దౌరియహ్‌’  అని కూడా పిలిచేవారు.  వారిని  గురించి ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితమే. కాలం తప్ప మరేదీ మమ్మల్ని చంపటం లేదు అని వారంటారు. నిజానికి వారికి దీని గురించి బొత్తిగా తెలీదు. వారు కేవలం ఊహాస్త్రాలను సంధిస్తూ పోతున్నారు”. (అల్‌ జాసియహ్‌: 24)

గమనిక: దహ్రియా అనబడే ఈ తెగ విశ్వాసం ఏమిటంటే, ఈ ప్రాపంచిక జీవితమే తొలి మరియు తుది జీవితం అనీ, దీని తర్వాత మరో జీవితం లేదని, కాలపు చక్రభ్రమరణం వల్లనే ఇలా జరుగుతూ ఉందని, ”ప్రతి 36 వేల సంవత్సరాల తర్వాత ప్రతి వస్తువు తన సిసలైన స్థితిలోకి తిరిగి వస్తుంది. ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది” అన్నది. అలాగే ఈ ప్రక్రియ వెనకాల ఏ సూత్రాధారిగానీ, వ్యూహ రచయితగానీ లేడు, దీనికి ఆది, అంతాలు కూడా లేవని వారంటారు.

నాస్తికాభివృద్ధి దశ:

తిరస్కార ధోరణి మనిషి నరనరాల్లో వ్రేళ్ళూకొని ఉంటుంది. దానికి కారణాలు రెండు. 1) సందేహం – అవగాహనాలేమి, అజ్ఞానం.  2) కాంక్ష, వాంఛ. అలాగే సమాజంలో నాస్తిక  భావన ప్రబలడానికి కూడా ప్రాంతం, దేశాన్ని బట్టీ  కొన్ని బలమయిన కారణాలే ఉంటాయి. ఉదాహరణకు – ఒక దశలో ఆస్తిక సమాజంలోని రాజులు, అధికారులు, మత పెద్దలు తమల్ని తాము దైవాలుగా ప్రకించుకొని ఇష్టారాజ్యానికి కొనసాగించి నప్పుడు, మూఢ న్మకాలను పెంచి పోషించినప్పుడు వారి కబంద హస్తాల్లో నలిగి పోయిన వారు, అలా నలిగి పోతూ చూసి బాధ పడిన వారు ఉద్వమించినప్పుడు చోటు చేసుకునే పరిణామాల్లో ఒక పరిణామం నాస్తికత్వం. ”వెదురే లేకపోతే వేణువూ ఉండదు కదా!’ అన్నది వీరి దృక్పథం అయి ఉంటుంది.

మానవ చరిత్రలో ఇలాంటి  తిరుగుబాటు చాలా సందర్భాల్లోనే చోటు చేసుకున్నప్ప టికీ 13-17 శతాబ్ది మధ్య కాలంలో ఇది ఉదృత రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఈ ఉద్యమం చర్చీ వ్యవస్థకు వ్యతిరేకంగా చోటు చేసుకుంది. ఆ కాలంలో యూరప్‌లో రివిజన్‌ – పునర్విమర్శ, రీఫార్‌మేషన్‌ – సంస్కరణ ఉద్యమాలు నడిచాయి. ఈ ఉద్యమాల్లో చర్చీకి వ్యతిరేకంగా విమర్శాస్త్రాలు సంధించబడ్డాయి. అదే సమయంలో మార్టన్‌ లూథర్‌ ప్రోటెస్ట్‌టెంట్  ఉద్యమం కూడా జరిగింది. ఈ ఉద్యమ కారణంగా క్రైస్తవం రెండుగా చీలి పోయింది. అఫ్లాతూన్‌, అరస్తు సిద్ధాంతాలను కూడా సవాలు చేయడం జరిగింది. అది –  ‘విశ్వానికి భూమి కేంద్రం అని చూర్యచంద్ర నక్షత్రాలు దాని చుట్టూ తిరుగుతుంటా”యన్నది. వారి సిద్ధాంతాలను తప్పు అని రుజువు చేసిన వారిలో, గెలీలియో, న్యూటన్‌ లియోనార్డ్‌ డావిన్స్‌, జియార్డీనో బ్రోనో, జోయాన్స్‌ కిప్లర్‌ మొదలయిన వారున్నారు.

డీయిజం:  డీ అంటే లాటిన్‌ భాషలో డ్యూస్‌ – దేవుడు అని అర్థం. ఈ సిద్ధాంతం ప్రకారం దేవుడు విశ్వాన్ని సృష్టించి తర్వాత దాని మానాన దాన్ని వదిలేశాడు,  ఇక విశ్వం స్వతహాగా నడవాలి, దైవ ప్రవక్తలు, పరలోకం లేదు అన్నది. ఈ ఉద్యమానికి 200 సంవత్సరాల వరకు బాసటగా నిలచిన ఇతర ఉద్యమాలు – డియోడ్‌ హోమ్‌, మిడ్‌ లిన్‌టన్‌, ఆడమ్‌ స్మిత్‌ ఉద్యమాలు.

సెక్యూలరిజమ్‌ యూరప్‌లో:

యూరప్‌ దేశాల్లో నేడు సెక్యూలరిస్ట్‌ అంటే మత రహితుడు, నాస్తికుడు అనే భావనే ఉంది. ఎందుకంటే సెక్యూలరిజమ్‌ అంటేనే మత పరమయిన చట్టాలు మరియు ప్రబోధనల నుండి స్వేచ్ఛ పొందడం. ముక్తసరిగా చెప్పాలంటే ఒక మత రహిత దేశంలో అనేక మతాల వారు మతపరమైన స్వేచ్ఛతో జీవనం సాగించే సిద్ధాంతం. ఇది భారత దేశానికి సంబంధించినది అని చెప్పవచ్చు. ఇతర సెక్యూలర్‌ దేశాలు మతాన్ని రాజ్యం నుండి వేరు పర్చి పరిపాలన సాగిస్తున్నాయి. సెక్యూలరిజమ్‌ అభివృద్ధి మతాన్ని చావు దెబ్బ తీసిందని చెప్పక మానదు. ఎలా అంటే, మత విశ్వాసాలు వ్యక్తిగతం, మత ఆచారాలు చర్చీకి పరిమితం అనే సిద్ధాంతమే సెక్యూలరిజమ్‌. ఫలితం కొంత మంచి జరిగితే, ఎక్కువ చెడే జరిగింది. ఉదాహరణకు – ఫ్రీ సెక్స్‌, స్వలింగ సంపర్కం, వడ్డీ, వ్యభిచారం వంటి  జుగుప్సాకర సామాజిక నేరాలను, నైతిక ఘోరాలను చట్టబద్ధం చేసింది సెక్యూలరిజమే. యూరప్‌ పౌరులు దైవాన్ని నమ్మడం బొత్తిగా వదిలేసారని కాదు, కానీ అది నామ మాత్రంగా ఉండి పోయింది. క్రియా రంగంలో మతాన్ని వారు తిలోదకాలిచ్చేశారు. దైవం పట్ల, దైవప్రవక్తల పట్ల, పరలోకం పట్ల వారు నమ్మేది అర్థ సత్యాలే అయినా చివరి వాటన్నింనీ వదిలేశారు.

ముస్లిం సమాజంలో నాస్తిక బీజాలు:

15 -16 శతాబ్దాల్లో యూరప్‌ ప్రజలు తమ దేశాల నుండి బయలు దేరి తూర్పు, పడమరలలో గల దేశాల్లో విస్తరించడం ప్రారంభించారు. క్రీ.శ 1900 వరకూ వారు ప్రపంచపు అధిక భూభాగానికి ఆక్రమించుకున్నారు. అందులో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. అలా ఆక్రమించుకున్న దేశాల్లో వారు నాస్తిక బీజాలు నాడటం ప్రణాళిక బద్ధంగా ప్రారంభించారు – ఆ  విధానమే లౌకిక వాదం.  దీని ఫలితంగా – ముస్లిం సమాజంలో నాలుగు విధమయినటువంటి  ప్రతిస్పందనలు చోటు చేసుకున్నాయి. 1) పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) పూర్తిగా (గుడ్డిగా) అనుసరించడం. 2) పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) పూర్తిగా త్రోసి పుచ్చడం. 3) పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) అనుసరించి ఇస్లామీయ విధి విధానాల్లో మార్పులు చేయడం. అంటే ఖుర్‌ఆన్‌ మరియు హదీసుల్లోని అనుకూల వచనాల్ని వక్రీకరించి లౌకి వాదాన్ని, నాస్తికత్వాన్ని బల పర్చడం. లేదా ఇస్లాం మౌలిక విశ్వాసాల్లో కొన్నింటిని నిరాకరించడం. 4) పాశ్చాత్య లౌకికవాదం ప్రవేశ పెట్టిన విధానంలో సకారాత్మక అంశాలను కుణ్ణంగా  అధ్యయనం చేసి ఇస్లామీకరించడం.

ఈ ఇజాలను అంగీకరించారు? ఎవరు తిరస్కరించారు? 

1) అనుకరించిన వారు:  పాలక వర్గం వారి స్వప్రయోజనాల కోసం ఈ విధానాన్నే ఆశ్రయించింది. వ్యక్తిగతంగా వారు ముస్లింలే అయినా, ఆర్థికంగా, సాంఘీకంగా వారు ఒక నాస్తికునిలా మారి పోతున్నారు.  నోటితో వారు  అల్లాహ్‌ ఒక్కడే శాసనాధికారి అంటున్నారు కానీ, క్రీయా జీవితంలో ఆనేక దేవుళ్లను పరోక్షంగా నమ్ముతున్నారు. అందులోనే దేశ భవిష్యత్తు దాగుందని నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ కారణంగా కొంత కాలానికి ‘యథా రాజ తథా ప్రజ’ అన్న చందంగా ప్రజలు కూడా అడుగు తర్వాత కడుక్కోవచ్చులే అని ఆ అడసునే తొక్కుతున్నారు.

2) తిరస్కరించిన వారు: . పండితుల వర్గం – పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) పూర్తిగా త్రోసి పుచ్చారు.  ప్రారంభంలో ఈ కోవకు చెందిన వారు మహ ఉద్దండ పండితులు. వారు అన్ని ఇజాల కాచి వడిబోసిన వారు. కానీ క్రమేణా ఈ వర్గం తన పట్టును కోల్పోతూ వచ్చింది. కారణం వీరిలో కొందరు పై పేర్కొన్న మొదటి  వర్గానికి ప్రభావితులయితే, కొందరు నాల్గవ వర్గానికి ఆకర్షితులయ్యారు. ఇలాంటి  వారికి సాధారంగా సమాజం ఇచ్చే స్థాయి, గౌరవం ఏమిటంటే, నమాజు చదివించడం, ఖుర్‌ఆన్‌ పారాయణం పూర్తి చెయ్యడం, నికాహ్‌, అఖీఖా, జనాజా, పే ట్యూషన్లు చెప్పుకోవడం, సదివింపులు, గ్యారవీఁలు వంటి  ధర్మంలో లేనివి చెయ్యడం – ఇదే వారి పనిగా భావిస్తారు సాధారణ ముస్లింలు. ఇది నిష్టూర సత్యం!

3) అతిక్రమణకు పాల్పడ్డ వారు: పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) అనుసరించి ఇస్లామీయ విధి విధానాల్లో మార్పులు చేయడం. అలా ఇస్లాం బోధించే మౌలిక విషయాలను త్రోసి పుచ్చినవారు చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు – భారత దేశంలో సర్‌ సయ్యిద్‌ అహ్మద్‌  (రహ్మ) (తర్వాత ఆయన మారు మనస్సు పొందారు అని అంటారు). ఈజిప్టులో తాహా హుసైన్‌ మరియు జఅలూల్‌ మొదలయిన వారు. తర్వాతి తరాల్లో – గులామ్‌ అహ్మద్‌ పర్వేజ్‌, డాక్టర్‌ అబ్దుల్‌ వదూద్‌ మొదల యినవారు.

4) సంస్కరించిన వారు: పాశ్చాత్య లౌకికవాదం ప్రవేశ పెట్టిన విధానంలో సకారాత్మక అంశాలను కుణ్ణంగా  అధ్యయనం చేసి ఇస్లామీకరించడం.  వీరి ప్రత్యేకత ఏమిటంటే, ప్రాచీన పండితుల వారసత్వాన్ని కాపాడుకోవడంతోపాటు, నూతన విద్యా విధానాలను సయితం బాగా ఆకళింపు చేసుకున్నారు. అంటే ఏక సమయంలో ధార్మిక పరిపక్వత మరియు వైజ్ఞానిక దృష్టి వీరి సొంతం. ఉదాహరణకు – మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, అల్లామా షిబ్లీ నోమానీ, మౌలానా సులైమాన్‌ నద్వీ, ఉర్దూ మహా కవి ఇక్బాల్‌ (రహ్మ) మొదలయిన వారు.

నిజం లేని ఇజాల నిజ స్వరూపం: 

ఇజం ఏదయినా – అది సోషలిజమయినా, కమ్యూనిజమయినా, క్యాపిటలిజమయినా – అన్నీ కేవలం మధురమయిన అపోహలు మాత్రమే. ఎందుకంటే, స్వయంగా ఈ ఇజాలు ప్రకారం ఒక జాతి ఆర్థిక కార్యక్రమం మరియు దాని విశ్వాసాలూ, దృక్పథాలు రెండు వేర్వేరు అంశాలు కావు. వాటి  మధ్య దృఢమయిన అవినాభావ సంబంధం ఉంటుంది. వాటిని వేరు చేసి అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఈ ఇజాల అధినాయకులు ముస్లింలను నమ్మ బలికే మాట ఏమిటంటే, మీరు మేము చెబుతున్న ఈ ఇజాలను ఈ ఆర్థిక, సామాజిక వ్యవస్థగా స్వీకరించినప్పటి కీ నిక్షేపంగా ముస్లింలుగా ఉండొచ్చు. మీ నమాజు, రోజా, ధ్యాన సాధనాల్లో ఎలాంటి  లోటు రాదు. ఇది కేవలం ఆర్థిక, సామజిక వ్యవస్థ మాత్రమే. ఇది మనిషి యెక్క మతపరమయిన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవదు. కనుక మీరు భయ పడాల్సిన అవసరం లేదు అని. కానీ వారికి బాగా తెలుసు, ఒక సారి ముస్లిం ఈ ఇజాల ఉచ్చులో పడి తమ ఆర్థిక, సామాజిక సమస్యలకు పరిష్కారంగా వాటిని స్వీకరించారా, అంటే వారు ఇకపై స్వచ్ఛమయిన ముస్లింలుగా జీవించడం దాదాపు అసాధ్యం. కొన్నేండ్లల్లోనే వారి మస్తిష్క ప్రకాళన (బ్రయిన్‌ వాష్‌ చేసి) వారిని తమ ఇజాల తత్వానికనుగుణంగా మలచుకోవడం, ఇస్లాం అవశేషాలేమయినా వారిలో మిగిలి ఉంటే వాటిని పూర్తిగా తుడిచి వేయడం అవలీలగా జరిగిపోతుంది. ఇజం ఏ దయినా అది కేవలం ఆర్థిక, సామాజిక ప్రణాళిక కాదు. ఎవరయితే దాన్ని  ఆ విధంగా చిత్రిస్తారో వారు ఆత్మవంచనకయినా గురయి ఉండాలి, లేదా పర వంచనకయినా పాల్పడుతూ ఉండాలి. అయితే ముస్లిం దేశాల్లో అక్షరాల అదే జరిగింది.

సమాజం మీద దాని ప్రభావం:

ఫలితంగా అన్ని మతాలు దాదాపు అవి తమ స్వచ్ఛతను కోల్పోయాయి. దీని ప్రభావం ముస్లిం సమాజం మీద కూడా సహజంగానే పడింది. ఈ ఇజాలకు ప్రభావితులయి తౌహీద్‌ భావనను త్రోసి పుచ్చిన వారు కొందరయితే, రిసాలత్‌ను తిరస్కరించిన వారు కొందరు. పరలోకాన్ని తిరస్కరించిన వారు కొందరయితే, స్వర్గ నరకాలను తిరస్కరించిన వారు మరికొందరు. అయితే ఇస్లాం మౌలిక విశ్వాసాలను వీరు ఏమి చేయ లేకపోయారు. ఖుర్‌ఆన్‌ను సవాలు చేసేంత ధైర్యం అయితే వీరు పెద్దగా చెయ్య లేదు. కానీ ప్రవక్తల జీవితాల మీద బురద జల్లే పని మాత్రం పెద్ద ఎత్తునే చేశారు, చేస్తున్నారు.

రాజకీయాల మీద దాని ప్రభావం;

రాజకీయ రంగంలో దాదాపు అన్నీ దేశాలు సెక్యూలరిజాన్ని అనుసరించడం నాస్తికత్వాన్ని లభించిన బహిరంగ విజయమని చెప్పవచ్చు. అటు పాశ్శాత్త ప్రపంచంగానీ, ఇటు తూర్పు దేశాలుగానీ, ముస్లిం దేశాలు గానీ సెక్యూలరిజాన్ని  రాజకీయ వ్వవస్థగా  తక్కువ ఎక్కువ అంగీకరించాయి. అలా అంగీకరించిన ముస్లిం దేశాలలో తుర్కీ మరియు తూనిష్‌ ముందంజలో ఉన్నాయి అని చెప్పవచ్చు. సెక్యూలరిజం పైకి చూడానికి అంత ప్రమాదకారిగా కనబడదు. కానీ అది సమాజానికిచ్చే చేదు ఫలాలు అన్ని ఇన్ని కావు. ఉదాహరణకు – మీరు మాకు తోడుగా వస్తే, కార్ఖానాలన్నీ మీకే అప్పజెప్పుతాము, రైతులకు భూములపై అధికారం కట్టబెడతాము, నిరుద్యోగ గ్రాడుయేట్లకు ఉద్యోగాలు కల్పిస్తాము, కామ వాంఛకు బానిసయి వారికి ఉదార సమాజాన్ని (పెర్‌మిసివ్‌ సొసైటీ) స్థాపించి ఇస్తాము,  సారాయి, జూదం, మాదకద్రవ్యాల సేవనం సర్వసామాన్యం చేస్తాము. అంటూ అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తారు.   ఫలితంగా సమాజంలో సహజీవనం  (పెళ్ళి లేకుండా లైకింగ సంబంధాలు), స్వలింగ సంపర్కం, అశ్లీలం, అరాచకాలు చోటు చేసుకుంటాయి.  ఇదంతా ఎందుకు జరిగుతుంది అంటే, ఈ ఇజాలన్నీ నమ్మేది ‘భౌతిక పదార్థమే జీవితపు ఏకైక సత్యం’ అని. ‘మానవ మేధ కూడా పదార్థం యెక్క అభివ్యక్తికి ఓ రూపమే’ అని.

ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం:

నాస్తిక వాదం ప్రపంచానికి రెండు వ్యవస్థలను ఇచ్చింది. 1) ఆడమ్‌ స్మిత్‌ ప్రవేశ పెట్టిన క్యాపిటలిజం. 2) కార్ల్‌మార్క్‌ ప్రవేశ పెట్టిన కమ్యూనిజం. ఇవి పైకి పరస్పరం విరుద్ధ భావాలుగా అగుపించినా ఈ రెంటిలోనూ ఏకాంశం మత  రహిత సమాజం. క్యాపిటలిజం – పెట్టుబడిదారి వ్యవస్థ ఫెడరలిజం వేరు కాదు. ఇది దానికన్నా కాస్త నయం అని చెప్పొచ్చు. పెట్టుబడిదారి వ్యవస్థలో ప్రతి ఒక్కరికి సంపాదించే హక్కు ఉంటుంది.  ఫెడరలిజంలో ఇది కుదరదు. ఒకడు నెయ్యితో దీపం వెలిగిస్తూ ఉంటే, మరొకడు పస్తులతో అల్లాడిపోతుంటాడు. వ్యక్తిగత ఆస్తి నిరాకరణ – మొత్తం ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. రష్యా మరియు చైనా కమ్యూనిస్టు దేశాలయినా చివరకు క్యాపిటలిజాన్ని స్వీకరించాయి. దీన్ని బట్టి  తెలుసుకోవచ్చు ఈ రెండింటికీ తల్లి వేరు  నాస్తికత్వం అన్న విష భావనే. తేడా ఏమిటంటే, ఒక విధానంలో ధనికుడి కార్మికుడి పీల్చుకు తింటాడు. మరో విధానంలో ప్రభుత్వం ప్రజల ఆస్తి మీద పెత్తనం చెలాయిస్తుంది.  ఈ ఇజాలు అవలంబించే ఆర్థిక విధానం ఎలాంటిది అంటే, భయంకరంగా దోపిడికి, దొంగతానికి పాల్పడి దోచుకున్న ఆ సొమ్మును ఎంతో నిజాయితీగా పంచుకునే వ్యక్తుల వంటిది. ఉదాహరణకు – సారాయి, జూదం, వ్యభిచారం, మాదక ద్రవ్యాల వ్యాపారం వగైరా. అలాగే ఈ ఇజాలు పరిచయం చేసిన హీరోలను గమనిస్తే – ఒక వైపు వారిని లోక రక్షకులుగా చూపిస్తూనే మరో వైపు పరస్త్రీలతో విచ్చలవిడిగా శృంగారం చేసే రసికుడిగా కూడా చిత్రీకరిస్తారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.

నైతికత మీద దాని ప్రభావం:

ఏ వ్యవస్థలోనయితే తౌహీద్‌, రిసాలత్‌, ఆఖిరత్‌ బావన లేదో అది ఎలా మనిషిని రుజుమార్గం మీద నడిపించగలదు? చెప్పండి! పెద్దలు పిల్లల యెడల అవ్యాజానురాగం ఎందుకు కలిగి ఉండాలి? పిల్లలు పెద్దల్ని ఎందుకు గౌరవించాలి? ప్రభుత్వం కళ్ళు గప్పి ఏమైనా చెయ్యచ్చు. ఇలాంటి  విపరీత ధోరణులు ప్రబలడానికి ముఖ్య కారణం ఈ ఇజాలు. పిల్లలు పోషణ అశ్రద్ధ వహించబడుతున్నా, వృద్ధాశ్రమాలు రోజురోజుకు పెరుతున్నాయన్నా, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఫాదర్స్ డే వంటివి ప్రబలుతున్నాయన్నా  కారణం ఈ భౌతిక వాదాలే.

కుటుంబ వ్యవస్థ మీద దాని ప్రభావం:

కుటుంబ విలువల వలువలు ఊడబెరకడమే ఈ ఇజాల లక్ష్యం.  వావి వరసలకు తిలోదకాలిచ్చే వీరు చివరికి పశువులుకన్నా హీనంగా తయారవుతారు. వావివరుసలు మరచి జంతు స్వేచ్ఛతో బతుకుతారు.  ఎందుకంటే ఈ ఇజాల మనిషి ఆర్థిక సమస్యలు పరిష్కారమయితే మిగతా సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి అన్న సూత్రాన్ని అవి బలంగా నమ్ముతాయి గనక.

మనం ఏం చేయాలి?

1) మనల్ని మనం సంస్కరించుకోవాలి. మన విశ్వాసాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. మన క్రీయా జీవితాన్ని మన విశ్వాసానికి అనుగుణంగా మలచుకోవాలి.

2) సంఘ సంస్కరణ కోసం కృషి చెయ్యాలి.  సహాయాన్ని కోరాలి.

3) రాజకీయ ప్రక్షాళన కోసం కట్టుదిట్టమయిన ప్రణాళికను అమలు పర్చాలి.

4) ఆర్థిక రంగంలో తగిన మార్పులు తీసుకు రావాలి. దాని కోసం ఓ సరికొత్త మార్క్‌ట్ ను మనం ప్రారంభించాలి.

5) మన నైతికతను, ప్రవర్తనా నియమావళిని మనం బాగు చేసుకోవాలి.

6) ప్రతి సమస్య పరిష్కారానికి గాను మనం ఖుర్‌ఆన్‌ మరియు హథీసుల్ని సంప్రదించాలి.

7) ధర్మ పండితులతోపాటు అన్ని రంగాల నిపుణులతో ఫలవంతమైన సంప్రదింపులు జరిపి ఓ నికార్సైన కార్య ప్రణాలికను తయారు  చేసి అమలు పరిచేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి.

గమనిక: పైన పేర్కొన్న ప్రతిపాదనల్లో కొన్ని వ్యక్తిగత స్థాయిలో ప్రయత్నించేవి. కొన్ని కుటుంబ స్థాయిలో, కొన్ని సంఘ స్థాయిలో, కొన్ని రాజకీయ రంగంలో, కొన్ని ఆర్థిక రంగంలో – ఆయా రంగ నిపుణులు ప్రయత్నించాల్సిన విషయాలు.

ఆధునికంలో బానిసత్వ రూపాలు:

ఆటవికం నుండి మనిషి ఆధునికంలో అడుగు పెట్టే క్రమంలో కొన్ని పాత రాతారీతులకయ పాతరేసినా అవే కొంగ్రొత్త రూపంలో కోరలు చాచడం విడ్డూరం! అవన్నీ స్వేచ్ఛ పేరు మీద ప్రవేశ పెట్ట బడ్డాయి అన్నది గమనార్హం!! కమ్యూనిజం అయినా, క్యాపిటలిజమయినా వాస్తవంగా ప్రాచీన బానిసత్వపు సరికొత్త రూపాలే. ఒక చోటు నియంత ప్రభుత్వం, మరో చోట నిరంకుశ ప్రభువులు. మనుషులు గత్యంతరం లేక స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు బదులుగా బానిసత్వాన్ని కోరుకునేలా ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక చింతనాత్మక వాతావరణాన్ని సృజించాయి. ఆధునికం పేరుతో బరి తెగించి తిరగాడే సొసైటీ గర్ల్స్‌ ఏ ‘స్వేచ్ఛ’ పేరుతోనయితే తమ శరీరాలను ఇతరులకు అప్పజెప్పుతారో అది స్వేచ్ఛ కాదు పచ్చి బానిసత్వం.

నేడు యువత నోట తరచూ వినబడే మాట – ‘ఎవరడ్డు చెప్పనంత వరకు తప్పు కాదురో, నువ్వు బాధ పెట్టనంత వరకు తప్పు కాదురో, అంతా చేసినాక సొరీ చెప్పి ముగిస్తే తప్పేం కాదోయ్‌’ అన్నది. ఈ మాట మహా మోసపూరిత మయినది. ఒక వ్యక్తి ఇంటి లోపల కూర్చుని మాదకద్రవ్యాల్ని, మత్తు పదార్థాల్ని సేవిస్తే తప్పు కాదనా? అతను చేస్తున్నది కరెక్ట్‌ అనా దీనర్థం? అల్లాహ్‌ సాక్షిగా! ఇది మాయావి అయిన షైతాన్‌ అందమైన నినాదం. అందమైన పేర్లు, మనోహరమయిన పదాలు, మనోజ్ఞమయిన పదబంధాలు, వినసొంపయిన నినాదాలు మనందరి బహిరంగ శత్రువయిన షైతాన్‌ ఎత్తుగడలోని అంతర్భాగాలు. ఇలాంటి పైపూత ప్రేరకాలకు, మోసపూరిత ఆకర్షణలకు ఆమడ దూరం ఉండేలా ముస్లిం యువతకు తర్ఫీదు ఇవ్వాలి.

చివరి మాట: 

ఈ పూర్వ రంగంలో మనం సరిగ్గా, తొలి నాటి  ముస్లింలు ఉన్న చోటనే నిలబడి ఉన్నాము. వారి కుడి ఎడమల రెండు దిశలా ఆనాటి  గొప్ప సామ్రాజ్యాలు, పరస్పర విరోధి రాజ్యాలయినా రోము, పర్షియాల మధ్య చిక్కుకు ఉండగా నేడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా ఏ త్యాగమయినా వృధా పోదు. భూమీ ఆకాశం రెండూ దానికి ప్రత్యక్య సాక్ష్యాలు!

”ఎవరయితే అల్లాహ్‌కు సహాయ పడతారో, అల్లాహ్‌ కూడా వారికి తప్పక సహాయ పడతాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ శక్తి గలవాడు, ఆధిక్యత గలవాడున్నూ”. (అల్‌ హజ్జ్‌: 40)

 

Related Post