న్యాయంతోనే మనం – మానవాళి మౌలిక విలువల్లో ఎప్పుడూ న్యాయానికే అగ్ర తాంబూలం ఉంటుంది. నీతి, న్యాయం మరచిన నర జాతిని నీతిని, న్యాయాన్ని ఉపదేశించడానికి ఆవిర్భవించిన ధర్మమే ఇస్లాం. మనిషి మతి పరిధిలో జనించిన మతాల దౌర్జన్యం నుండి తీసి న్యాయం వైపు మానవాళిని నడిపిన ఘనత ఇస్లాం ధర్మానిది.
ధర్మం గొప్పదా? న్యాయం గొప్పదా? అంటే న్యాయం చెయ్యండి అని చెప్పేదే ధర్మం అన్నది సరయిన సమాధానం. అల్లాహ్‌ాకు గల నామాల్లో ఒక నామం ‘అల్ అద్లు’. ఇదొక్కటి చాలు న్యాయం ఎంత మహిమాన్వితమయినదో చెప్పడానికి. అల్లాహ్ న్యాయ కారణంగానే భూమ్యాకాశాల వ్యవస్థ సజావుగా కొనసాగుతున్నది. ఈ న్యాయ కారణంగానే హక్కుదారుల హక్కులు గుర్తించబడి వారికి న్యాయం జరుగుతున్నది. దైవ ప్రవక్తల ప్రభవనానికి, దైవగ్రంథాల అవతరణకు గల ముఖ్కోద్ధేశాన్ని తెలియజేస్తూ ఖుర్ఆన్ ఇలా అంటుంది: ”నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమయిన నిదర్శనాలు ఇచ్చి పంపాము. వారితోపాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము. ప్రజలు న్యాయంపై నిలిచి ఉండానికి”. (ఆల్ హదీద్: 25)
న్యాయం చెయ్యండి! అన్నది అల్లాహ్ ఆదేశం:
”నిశ్చయంగా అల్లాహ్ న్యాయం చేయమనీ, ఉపకారం (ఇహ్సాన్) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు”. (అన్నహ్ల్; 90)
న్యాయం ద్వారా సమాజంలో శాంతి, సుస్థిరతలు నెలకొంటే, ఉపకారం, త్యాగ భావన ద్వారా అంతరాల అగాధాలు అంతమవుతాయి. హృదయాలు కలుస్తాయి. సత్సంబంధాలు పెంపొందుతాయి. ఆత్మీయత, ఆప్యాయతలు వెల్లి విరుస్తాయి. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (ర) మాట – ”మనిషిలో సత్యధర్మ అవగాహనతోపాటు న్యాయశీలత కూడా ఉంటే సకల సలక్షణాలు అతనిలో ఉన్నట్లే”.
అరబీలో ‘అల్ అద్ల్’ అంటే న్యాయం. న్యాయం అన్న భావంలోనే సమభావం, సమత్వం కూడా వస్తుంది. ఆ విధంగా సమభావం, సమత్వం కన్నా ఘనమయినది న్యాయం. న్యాయం ద్వారా ఎవరిలో ఎంత అర్హత ఉంటుందో అంతే బాధ్యత, ఫలితం అతనికివ్వ బడుతుంది. ఖుర్ఆన్లోని ఒక ఆయతు ద్వారా ఈ వ్యత్యాసం సులభంగా అర్థమయి పోతుంది: ”ఓ ప్రజలారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము.మరియు మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము”. (అల్ హుజురాత్: 13)
ఇదీ సమ భావం, సమత్వం. అంటే ఒక ప్రత్యేక వర్గం, ఒక ప్రత్యేక తెగలో పుట్టడం వల్ల ఎవ్వరికీ ఉచ్ఛనీచాలు సోకవు. జననం రీత్యా అందరూ సమానమే. ఇదే విషయాన్ని ప్రవక్త (స) అంతిమ హజ్జ్ సందర్భంగా తెలియజేశారు: ”అరబ్బుకి అరబ్బేతరునిపైగానీ, తెల్ల వానికి నల్లవానిపైగాని ఎలాంటి ఆధిక్యత లేదు”. (ముస్నద్ అహ్మద్)
ఇక న్యాయం దేన్నంటారు అంటే దానికి పై ఆయతు చివర్లో సమాధానం చెప్ప బడింది: ”యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువ భయ భక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు”. (అల్ హుజురాత్: 13)
ప్రవక్త (స) వారి పై మాట చివరి భాగాన్ని చూస్తే ఇదే అర్థమవుతుంది: ”దైవ భితితో తప్ప”. (ముస్నద్ ఆహ్మద్)
అంటే పుట్టుక రీత్యా అందరూ సమానమే అయినా, జ్ఞాన పరంగా, విశ్వాస పరంగా, ప్రవర్తన పరంగా అందరూ సమానం కాలేరు.
”చెప్పండి! జ్ఞానం ఉన్న వారు, జ్ఞానం లేని వారు ఒక్కటేనా?”. (అజ్జుమర్; 9)
స్త్రీ-పురుషులు బహుమానంలో సమానం:
”సత్కార్యాలు చేసేవారు-వారు పురుషులయినా, స్త్త్రీిలయినా-విశ్వసించి ఉంటే, ఇలాంటి వారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు”. (అన్నిసా: 124) ”సత్కార్యాలు చేసేవారు-పురుషులయినా, స్త్రీలయినా-విశ్వాసులయి ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమయిన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము”. (అన్నహ్ల్ా: 97)
శిక్షలో సమానం:
”వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేెసే పురుషుడు-వారిద్దరిలో ఒక్కొక్కరి కి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి”. (అన్నూర్: 2)
స్త్రీకి ఇస్లాం చేసిన న్యాయం:
స్త్రీకి ఇస్లాం చేసిన నాయ్యం గురించి ప్రస్తావించాలంటే ఒక మహా గ్రంథం అవసరం ఉంటుంది. ఇక్కడ కేవలం ఒక ఉదాహరణ ఇస్తున్నాము. బహిష్టు, పురి రక్తస్రావ సందర్భంలో శాశ్వతంగా నమాజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే వారు తర్వాత పాటించాల్సిన అవసరం లేదు. అలాగే అప్పటి వరకూ లేని వారసత్వ హక్కును ఆమెకివ్వడం జరిగింది.
న్యాయ విశిష్ఠత:
”(ఇహ లోకంలో) న్యాయానికి కట్టుబడి ఉండేవారు అల్లాహ్ సన్నిధిలో వెలుగు వేదికల మీద ఆసీనులయి ఉంటారు. ఎవరయితే తమ తీర్పుల విషయంలో, తమ ఇంటి వారి విషయంలో, తమ స్వీయ విషయంలో, వారికి అప్పగించ బడిన అన్య విషయాలలో న్యాయానికి కట్టుబడి ఉంటారో వారు”. అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (ముస్లిం)
”పరమ దుర్మార్గుడయిన రాజు ముందర న్యాయ సహిత మాట చెప్పడం అత్యున్నత స్థాయికి చెందిన జిహాద్‌గా పరిగణించ బడుతుంది”. (తిర్మిజీ)
ప్రవక్త (స) వారి జీవితంలో న్యాయం:
హజ్రత్ జాబిర్ (ర) గారి కథనం- ప్రవక్త (స) జియిర్రానా ప్రాంతంలో యుద్ధ ప్రాప్తిని ప్రజలకు పంచుతుండగా ఓ వ్యక్తి వచ్చి-‘న్యాయం చెయ్యి’ అని (కాస్త కటువుగానే) అన్నాడు. అది విన్న దైవ ప్రవక్త (స) ”ఒకవేళ నేనే గనక న్యాయం చెయ్యకపోతే దౌర్భాగ్యుడనవుతాను” అన్నారు. (బుఖారీ)
న్యాయం గురించి ప్రవక్త (స) చెప్పిన భవిష్యవాణి:
”అల్లాహ్ సాక్షిగా! మర్యం కుమారుడయిన ఈసా (అ) న్యాయశీలిగా, తీర్పరిగా మళ్ళీ రావడం నిశ్చయం. ఆయన వచ్చినప్పుడు ఆయన శిలువను తుంచి వేస్తారు.పందిని చంపి వేస్తారు (నిషిద్ధం అని ఖరారు చేస్తారు, దాన్ని వధించడాన్ని ఆమోదిస్తారు). జిజ్యాను ఎత్తి వేస్తారు. బాగా వయసు మీదున్న మేలిమి జాతి ఒంటేను పట్టించుకోవడం జరగదు. ప్రజల మధ్య ఉన్న కుళ్ళు, అసూయ ధ్వేషం, పగ ప్రతీకారం ఉండదు. ప్రజల్ని ధనం వైపు పిలవడం జరుగుతుందిగానీ, దాన్ని తీసుకోవడానికి ఎవ్వరు ముందుకు రారు”. (బుఖారీ)
న్యాయం రకాలు
అల్లాహ్ విషయంలో న్యాయం:
ఎక్కడ ఉండాల్సిన వస్తువును అక్కడ మర్యాదతో ఉంచడం, ఎవరి చెందాల్సిన హక్కును వారికి సగౌరవంగా చేర్చడం – ఇదే న్యాయం. ఇక ”అల్లాహ్‌కు మనపై గల హక్కు ఏమిటంటే – మనం ఆయన్ను మాత్రమే ఆరాధించాలి, ఆయనతోపాటు అన్యులను సమానులుగా, సహవర్తులుగా చేసి కొలవకూడదు” అన్నారు ప్రవక్త (స). (ముత్తఫఖున్ అలైహి) అల్లాహ్ విషయంలో న్యాయం అంటే, ఆయన తనను ఎలా విశ్వసించమన్నాడో అలానే విశ్వసించాలి. ఆయన నామ గుణాలను యథావిథిగా విశ్వసించాలి. ఆయన నామ గుణాల్లోని ఒక్కదాన్ని నిరాకరించడం గానీ, పోలికలు కల్పించడం గానీ, వేరే అర్థాలు తొడిగే ప్రయత్నం చెయ్యడం గాని కూడదు. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. ఆయన్ను మన ప్రాణ, మాన, ధనాలకన్నా అధికంగా ప్రేమించాలి. అంతిమ శ్వాస ఆగేంత వరకూ ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞల పరిధుల్లో జీవిస్తూనే ఉండాలి.
నాయకుడు చేయాల్సిన న్యాయం:
”స్వర్గ వాసులు ముగ్గురు. 1) న్యాయంగా పరిపాలించే, సదాచరణ చేసే భాగ్యానికి నోచుకున్న రాజు. 2) బంధువులు మరియు ముస్లిం విషయంలో దయామయుడు మరియు జాలి గుండె కలిగిన వ్యక్తి. 3) అమిత అవసరంలో ఉండి కూడా శీలాన్ని కాపాడుకుంటూ, ఎవ్వరి ముందర చెయ్యి చాచని ఆత్మాభిమానం గల నిరుపేద”. అన్నారు ముహమ్మద్ (స). (ముస్లిం)
నాయకుడికి సంబంధించిన అన్ని శాఖల్లో న్యాయం చెయ్యాలి. న్యాయ వంతుల్ని నియమించాలి. ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు: ”అల్లాహ్ ఒక దాసునికి కొందరి పోషణ, యోగక్షేమ బాధ్యతను అప్పగించాడు. అతను మరణించిన సమయానికి తన పోషణ క్రింద ఉన్న వారిని మోసగించిన వ్యక్తిగా అతనున్నట్లయితే అల్లాహ్ అతనిపై స్వర్గాన్ని నిషేధిస్తాడు”. (ముస్లిం)
తీర్పు విషయంలో న్యాయం:
”మీరు ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి”. (అన్నిసా: 58)
”తీర్పరులు (జడ్జీలు) ముగ్గురు. ఒకడు స్వర్గంలో ఇద్దరు నరకంలో. స్వర్గానికి వెళ్ళే జడ్జీ-ఏ వ్యక్తి అయితే సత్యాన్ని గుర్తించాడు. సత్యం ప్రకారమే తీర్పు ఇచ్చాడో అతను. ఇక ఏ వ్యక్తి అయితే సత్యాన్ని తెలుసుకొని కూడా తీర్పు విషయంలో దౌర్జన్యానికి పాల్పడ్డాడో అతను నరకానికి పోతాడు. మరొక వ్యక్తి అవగాహనా రాహిత్యంగా, అజ్ఞానంతో ప్రజల మధ్య తప్పుడు తీర్పులు చేశాడో అతను కూడా నరకం పాలవుతాడు”. (అబూ దావూద్)
తీర్పు వెలువడిన తర్వాత కూడా న్యాయం:
ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మీరు పరస్పరం గొడవ పడి తీర్మానం కోసం నన్ను సంప్రదిస్తూ ఉంటారు. మీలో కొందరు సాక్ష్యం ప్రవేశ పెట్టే విషయంలో మంచి వాక్పిటిమ కలిగి ఉండొచ్చు. నేను అతని నుండి విన్న మాటననుసరించి అతని పక్షాన తీర్పు కూడా చేసే ఆస్కారం ఉంది. కాబట్టి నా తీర్పు వెలువడిన తర్వాత కూడా మీలో ఎవరికయినా తను తన సోదరుని హక్కు కాజేశానన్న (ఆత్మ) నింద మొదలయితే అతను దాన్ని తీసుకోకూడదు. అలాంటి సమయంలో నేను అతని పక్షాన చేసిన తీర్పు అతని పాలిట నరకాగ్ని నిప్పుగా పరిణమిస్తుంది జాగ్రత్త!”. (బుఖారీ)
భార్య యెడల న్యాయం:
ఎవరి విషయంలో ఎలా ఉన్నా కొన్ని సందర్భాలలో మనిషి పురుషాహంకారంతో భార్య విషయంలో దౌర్జన్యాయానికి పాల్పడుతూ ఉంటాడు. ముఖ్యంగా రెండు, మూడు పెళ్పిళ్ళు చేసుకున్న వారిలో ఇది కనబడుతూ ఉంటుంది. రెండు, మూడు పెళ్ళిళ్ళ అనుమతి ధర్మం కల్పించినప్పికీ దాన్ని మాత్రమే తీసుకొని న్యాయానికి నీళ్ల్లొదలడం ముమ్మాిటికీ గర్హనీయం! ఖుర్ఆన్ ఇలా అంటోంది: ”అయితే వారి మధ్య న్యాయ బద్దంగా వ్యవహరించ లేరు అన్న భయమే గనక మీకున్నట్లయితే ఒక్కామేతోనే సరి పెట్టుకోండి”. (అన్నిసా: 3)
అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు:”మీరు ఎంత ఆశించినప్పటికీ, శాయ శక్తులా ప్రయత్నించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్ని విధాలా న్యాయం చెయ్యటమన్నది మీ వల్ల కాని పని. కాబట్టి మీరు పూర్తిగా ఒకామె వైపుకు మొగ్గిపోయి, రెండో ఆవిడను అనిశ్చిత స్థితిలో పడవెయ్యకండి. ఒకవేళ మీరు మీ ధోరణిని సరిదిద్దుకుని, భయ భక్తులు (తఖ్వా)తో మసలుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు”. (అన్నిసా: 129)
”ఓ అల్లాహ్ నా శక్తి మేర నేను అందరికీ సమానంగా చూసే ప్రయత్నం చేెస్తున్నాను. నా అధీనంలో లేని (హృదయం) విషయం గురించి నన్ను నిలదీయకు స్వామీ” అని ప్రవక్త (స) ఎక్కడయితే దీనాతి దీనంగా వేడుకునే వారో (అబు దావూద్).అక్కడే ఇలా హెచ్చరించారు కూడా: ”ఎవరికయితే ఇద్దరు భార్యలుండి అతను ఏదోక భార్య వైపునకే మొగ్గుతాడో (మరో భార్యను ఉపేక్షిస్తాడో) అతను ప్రళయ దినాన శరీరంలోని సగం పార్శ్వం పడిపోయిన స్థితిలో వస్తాడు”. (తిర్మిజీ)
మఆజ్ బిన్ జబల్ (ర) దాంపత్యంలో ఇద్దరు భార్యలుండేవారు. ఒక భార్య వంతు ఉన్న దినాన మరో భార్య ఇంట్లో ఆయన పచ్చి నీళ్ళు కూడా ముట్టుకునే వారు కాదు.
సంతానం యెడల న్యాయం:
”మీరు మీ సంతానం విషయంలో అల్లాహ్‌కు భయ పడండి. వారి మధ్యన న్యాయంగా వ్యహరించండి” అన్నారు ప్రవక్త (స) ( బుకారీ)
ఇబ్రాహీమ్ నఖ్యీ (ర) ఇలా అన్నారు: ”సహబా సంతానం విషయమయి ఎంతగా న్యాయాన్ని పాటించేవారంటే ముద్దు పెట్టుకునే విషయంలో సయితం సమ భావాన్ని పాటించేవారు”. (ఇబ్ను అబీ షైబా)
నేటి తల్లిదండ్రులు అన్య విషయాలతోపాటు ఆస్తి పంపకం విషయంలో న్యాయంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఆడ సంతానానికి అన్యాయం చేెసే అమ్మానాన్నలే అధికం. ఏమయినా అడిగితే మేము కట్న కానుకల రూపంలో ఇచ్చేశాం కదా! అనంటారు. అలాగే అన్నా తమ్ముళ్లు కూడా ఈ విషయమయి వారి అక్కా చెల్లెల్లతో గొడవకు దిగడం నిత్యం మనం చూసే విషయం. ఓ సారి ప్రవక్త (స) సన్నిధిలో సహాబా కూర్చొని ఉన్నారు. అంతలో ఒక సహాబీ కుమారుడు అటుగా వచ్చాడు. అబ్బాయి తల నిమిరి తన ఒడిలో కూర్చో బెట్టుకున్నారు ఆ సహాబీ. కాసేపయ్యింది….అతని కూతురు వచ్చింది. ఆమె తల నిమిరి నేలపై కూర్చో బెట్టారు. ఇది గమనించిన ప్రవక్త (స) ‘ఆమెను కూడా నీ మరో తొడపై కూర్చో బెట్టుకో’ అని ఆదేశించగా, ఆయన అలానే చేశారు. అందుకు ”ఇప్పుడు నువ్వు న్యాయం చేశావు” అని కొనియాడారు ప్రవక్త (స).
మాటలో న్యాయం:
”మీరు మాట్లాడితే న్యాయ పక్షం వహించి మాట్లాడండి. వ్యవహారం మీ దగ్గర బంధువుకు సంబంధించినదయినా సరే!”. (అన్ఆమ్: 152)
వ్యాపారంలో న్యాయం:
”కొలతలు, తూనికలలో పూర్తి న్యాయంగా వ్యవహరించండి”. (అన్ఆమ్: 152)
శత్రువు యెడల న్యాయం:
”ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు సత్యంపై నిలకడగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఎదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయ విరుద్ధతకు పాల్పడనీయ కూడదు. న్యాయం చెయ్యండి. అది దైవభీతికి అత్యంత చేరువయిన విషయం”. (మాయిదహ్: 8)
అల్లాహ్ ప్రేమకు మార్గం న్యాయం:
”న్యాయం చేయండి. నిశ్చయంగా అల్లాహ్ న్యాయం చేసేవారిని ఇష్ట పడతాడు”. (అల్ హుజురాత్: 9)
అల్లాహ్ అర్ష్ నీడకు సోపానం న్యాయం:
”అల్లాహ్ (అర్ష్) నీడ తప్ప మరే నీడ ఉండని రోజున ఏడుగరిని అల్లాహ్ తన అర్ష్ నీడన చోటు కల్పిస్తాడు. వారిలో – ”న్యాయంగా పాలించిన నాయకుడు” అంటూ న్యాయానికి అగ్ర పీఠం వేశారు ప్రవక్త (స). (ముత్తఫఖున్ అలైహి)
న్యాయ మధుర ఫలాలు:
1) తౌహీద్ దగ్గరగా షిర్క్‌కు దూరంగా ఉండే సత్భాగ్యం కలుగుతుంది.
2) ఇహపరాల్లో శాంతి, సంతృప్తి, సమృద్ధి ప్రాప్తమవుతుంది.
3) దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుంది.
4) ప్రజలు రాజీ అవ్వక ముందే అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది.
5) న్యాయశీలుడి కీడు నుండి ప్రజలు సురక్షితంగా ఉంటారు.
6) న్యాయవంతులే నాయకత్వానికి నిజమయిన అర్హులు.
7) న్యాయం ద్వారా సత్కర్మలు చేసుకునే సద్భాగ్యం కలుగుతుంది.
8) న్యాయం స్వర్గానికి గొనిపోతుంది.