తన చూపుడు వేలు నీడలో ధరాగోళం ఒదగాలని, తన ముంగిట్లో ధన రాసులన్నీ తలలు వాల్చి నిలవాలని, అహంకార దాహం ధ్వజమెత్తిరాగా, ఆక్రమణ మోహం కరళ్ళెత్తిపోగా కదను తొక్కే ఉక్కు కాళ్ళ కింద కమిలి పోతున్న అసువుల మొక్కలు. పొగరు ఆయుధాల పాశవిక క్రీడలో ఎగిరిపడుతున్న శిరస్సులు. కురిసిన నర రక్తం స్పర్శతో ఎరుపెక్కిన సరస్సులు. ఏ పశుత్వం కొమ్ము విరిసిందని ఈ విలయవిహారం? ఏ అధర్మం కాలు దువ్విందని ఈ భయద భయంకర సంహారం? ఇళ్ళనూ, పండి ఒరిగిన పైరుమళ్ళనూ నిప్పు కుంపిలో ఎందుకు నిలువునా నెట్టినట్టు? ప్రాణాలనూ, ప్రాణాధికంగా కాపాడుకునే మానాలను రక్కసి గోళ్ళతో ఎందుకు రక్కుకు పోతున్నట్టు? విజేతగా నిలవాలంటే విశ్వాన్నే భస్మం చేయాలా? ధరాలోభం తీరాలంటే నర రుధిరమే సాగించాలా?
కనిపిస్తున్నాయి అడుగుకంటికి మనుషుల తోళ్ళు కప్పుకున్న తోడేళ్ళు. వినిపిస్తున్నాయి అడుగుచెవికి తునిగిపో తున్న అరవలేని లేళ్ళ నోళ్ళు. అయ్యో మనిషీ! అహంకార రంగద్దాలను అంతరంగానికి తొడుక్కున్న మసీ! తెలుపునలుపుల కోలమానాలతో, వర్గ, వర్ణ, కుల దురభిమానాలతో మనిషి విలువ కడుతున్నావా? మానవత్వంతో ముడి పెడుతున్నావా? దానవత్వానికి పట్టం కడుతున్నావా? మల్లెపువ్వుకూ నల్లకలువకూ ఎల్లలు పెడుతున్నావా? సాటి మనిషిపై స్వారీ చేస్తూనే శాంతి శాసనం వల్లిస్తున్నావా? తోడేలులా ప్రజా-తన, మాన, ధనాలను పీక్కు తింటూ ఏమి ఎరుని మేకలా నటిస్తున్నావా? తెలుపు రంగు తలకెక్కిన పైత్యం ఎండుగరికలా తేలిపోతుందని తెలియదా నీకు? …ఎక్కడా …ఎక్కడా అని తెల్లబోతున్నారా!? ఇక్కడే అక్షరాల అవని మీదే జరుగుతోంది ఈ దారుణం, మానవ హరణం. అందులో భాగమే నేటి సోమాలియా దుర్భిక్ష స్థితి.
2011 సంవత్సరపు గణంకాలు
దేశం పేరు: సోమాలియా
రాజధాని: మగ్దీషియో
స్వాతంత్య్ర దినం: 1-7-1960
విస్తీరణ స్థలం: 637657 కిమీ
నీరు గల స్థలం: 10320 కిమీ
ఎండు భూమి: 627337 కిమీ
భాష: సోమాలియా, అరబీ, ఇటాలీ, ఆంగ్లం.
మతం: ఇస్లాం
1991 తర్వాత 27-08-2000 సంవత్సరంలో ఎన్నోకోబడిన అధ్యక్షుడు: అబ్ది ఖాసిమ్ సలాద్ హసన్
జన సంఖ్య 2003 నివేదిక ప్రకారం –
0 -14 మధ్య వయసుగల వారు
పురుషులు: 1802154
స్త్రీలు: 1792749
15-65 మధ్య వయసు గలవారు
పురుషులు: 2120934
స్త్రీలు: 2093699
65కి పై వయసు గలవారు
పురుషులు: 93682
స్త్రీలు: 121972
గత మూడు నెలల్లో మరణించిన 5 ఏండ్ల లోపు వయసు గల పిల్లల
సంఖ్య – 29.000
ప్రాణం నిలుపుకునేందుకు కనీసఆహార సదుపాయం లేక అల్లాడి పోతున్న చిన్నారుల సంఖ్య – 2,300,000
ఎథియోఫియా, కెనియా, జిబోజి ప్రక్క దేశాలలో ఆహార లేమికి గురై ఉన్నవారి సంఖ్య – 12,000,000
తక్షణ కనీస ఆహార, వైద్య సహాయం కావాల్సినవారి సంఖ్య – 3,200,000
ప్రతి రోజు క్యాంపులకు తరలి వస్తున్న వారి సంఖ్య – 2,000
మగ్ద్దీషియో రాజధానికి ఇతరత్రా ప్రాంతాల నుండి జూలై వరకు చేరుకున్న వారి సంఖ్య – 400,000
తక్షణం కావాల్సిన సహాయం – యుఎస్ డాలర్స్- 2,000,000,000
ఇప్పటి వరకు అందిన సహాయం యుఎస్ డాలర్స్- 570,000
ఈ దుర్భిక్ష స్థితి ఇలానే కొనసాగితే వచ్చే కొద్ది నెలల్లో మరణించే పిల్లల సంఖ్య – 7,00,000 నుండి 8,00,000
వివరాల్లోకెళితే – ఒకనాటి సోమాలియా ప్రాభవం ఇలా ఉంది.
పురాతన ఈజిప్టు, గ్రీకు, ఫర్షియా, రోమన్ సామాజ్యాలతో వర్తక, వాణిజ్యాలు నేర్పి సిరులు కురిపించిన దేశం సోమాలియా. సుగంధ ద్రవ్యాలు, పాడిపత్తుల ఉత్పత్తితోపాటు బంగారం, ఏనుగు దంతాలు, జంతు చర్మాలు వంటి విలువైన వస్తువుల విక్రయంతో అలరారింది అలనాటి సోమాలియా స్వర్ణయుగం. పాశ్చాత్య దేశాలు, అలనాటి భారత్‌తోనూ అప్పట్లో సంబంధాలు జరిపిన సోమాలియా ద్వారా మన నాటి వర్తకులు ఎన్నో లాభాలు అందుకున్నారు. మధ్య దర, ఎర్ర సముద్ర మార్గాలలో వారి ఈ భాగస్వామ్య వాణిజ్యం వందల ఏళ్ళు కొనసాగింది. అలా కాలక్రమంలో మగ్దీషియో రాజధానిగా ఏర్పాటు చేెసుకున్న సోమాలియా తర్వాత మొనౌ, మోపాన్ గనులలో వెలుగు చూసిన పసిడితో ప్రగతికి బాటలు వేెసుకుంది. ఆఫ్రికా ఖండం మొత్తం మీద మరే దేశానికి లేనంతగా అత్యంత పొడవైన తీర రేఖ ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని అభ్యుదయ దిశన పయనించింది. ప్రపంచ కళ్ళను ఆకర్షించింది. అయితే తమకు ప్రాప్తమయి ఉన్న ప్రకృతి వరాలే తర్వాత తమ పాలిట శాపంగా పరిణమిస్తాయని ఊహించలేకపోయారు సోమాలియా వాసులు. చీకటి ఖండం నుంచి సమృద్ధ సంపదలతో తులతూగుతున్న సోమాలియాపై ఐరోపా సామ్రాజ్య వాద శక్తులు, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల డేగ కళ్ళు పడింది మొదలు ఒక్కసారి పరిస్థితి మొత్తం తలక్రిందులై పోయింది.
అక్కడ ‘విభజించి పాలించు’ సూత్రాన్ని అమలు పర్చిన పాశ్చాత్య పెద్దలు సోమాలియా సుల్తానుల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని చిరిగిన విస్తరిగా మార్చారు. సోమాలియాను ఆనుకుని ఉన్న చారిత్రాత్మక సూయస్ కెనాల్‌పై ఆధిపత్యం, సువిశాల నౌకాగ్రియ నగరాల ఆక్రమణలకు సాగిన కుయుక్తులు రాజకీయ అస్థిరతను సృష్టించి చిమ్మచీకట్లు క్రమ్ముకునేలా చేశాయి. ముక్కలు చెక్కలుగా మారిన సోమాలియా ఇటలియన్ సోమాలియా ల్యాండ్, బ్రిటన్ సోమాలియా ల్యాండ్ వలస వాద కాలనీగా మారి దారుణ దోపిడికి గురయింది. తాతలు తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులూ పోయాయి. రాచరిక సంపద తరలించేశారు. ఆలానాపాలనా లేని సువిశాల సముద్ర తీరం అన్యక్రాంతమై పట్టుకోవడానికి చేప పిల్ల కూడా దొరక్క ఆకలికేకలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. అప్పట్నుంచి పూర్వీకులు వదలివెళ్ళిన అంతులేని సంపదతోపాటు వలసవాదుల దోపిడితో సర్వం కోల్పోయి ఒమికలు తేలిన అల్పజీవులుగా మిగిలిన సోమాలియాకు ఎట్టకేలకూ 1960లో స్వేచ్ఛా వాయువులు లభించాయి. ఐక్య రాజ్య సమితి చొరవతో బ్రిటన్ సోమాలియా ల్యాండ్, ఇటలీ సోమాలియా ల్యాండ్‌లు రెండింటిని ఒక్కటి చేెసిన పెద్దల జోక్యంతో రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం అని ఏర్పాటయ్యాయి. కానీ అదీ మూన్నాళ్ళ ముచ్చటే అయింది.
1969లో దేశ అధ్యక్షుణ్ణి కాల్చి చంపి అధికారాన్ని చెప్పుచేతల్లో తీసుకుంది సైన్యం. పార్లమెంటు లేదు, న్యాయస్థానం లేదు, రాజ్యాంగం మాటే లేదు. సర్వం నియంతృత్వం. సోమాలియా సోషలిస్టు రివల్యుష్నరీ పార్టీదే ఇష్టారాజ్యం. క్రమంగా ప్రజల్లో పెరిగిన అసంతృప్తి, నిరంకుశ సైనిక పాలనంటేనే చెప్పలేనంత ఏవగింపు. ఫలితం – 1991లో బ్రద్ధలయిన సోమాలియా అంతర్యుద్ధం. పట్టుకోల్పోయిన అధ్యక్షుడు బరే పదవి కోల్పోయాడు. దేశాన్ని నిప్పు కుంపిలో నెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సోమాలియా మొత్తాన్ని పాలించే ఒక కేంద్ర ప్రభుత్వమే లేకపోయింది. ప్రభుత్వంలేని ప్రజలకు సౌకర్యాలు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా అంతర్యుద్ధ మాటున బలవంతుడిదే రాజ్యం. మిగిలి కొద్దిపాటిలోనూ అందినకాడికి దోచుకోవడం, అడ్డం తిరిగిన వారిని తుపాకి తూటాలకు బలి పెట్టడం. ఇది చాలదన్నట్లు ఇదే సమయంలో తీవ్ర రూపు దాల్చిన కరువు పరిస్థితులు సోమాలియాను ఎక్కడా కోలుకోనివ్వలేదు. నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. అధికారిక గణాంకాల ప్రకారం తుపాకీ తూట్లకు ప్రాణాలు కోల్పోయినవారు 3 లక్షల మందికి పైచిలుకే. ముద్ద ఆహారం దొరక్క ఆకలితో ఆలమించి ఆఖరి శ్వాస వదలినవారు కూడా దాదాపు అంతే మొత్తంలో ఉన్నారు. ప్రస్తుతం అయితే కనీస ఆహారం, వైద్య సదుపాయం లేక ప్రతి 6 నిమిషాలకు ఒక పిల్లాడు మరణిస్తున్నాడు. ఇంకొన్ని నెలల్లో మరణించేవారి సఖ్యం 7 లక్షలకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు.
ఏది ఎలా ఉన్నా ఒక దేశం ఇటువంటి దుర్భిక్ష స్థితికి గురవడం వెనకాల కేవలం బాహ్య కారణాలే పని చేసి ఉంటాయని చెప్పలేము. ఖచ్చితంగా అంతర్గత, ఆధ్యాత్మిక కారణాలు ఉండి తీరాలి. అదేమంటే, ‘కరడు గట్టిన ఇస్లాం ఛాందస వాదం’ అనంటారు కొందరు. కాదు, ఎంత మాత్రం కాదు. ఇస్లాం ఛాందస ధర్మం కాదు, అది శాంతిశ్రేయాల ధర్మం. మానవజాతి మనుగడకు బాటలు వేసే ధర్మం. మానవజాతిని సవ్యమైన దిశలో నడిపించి, అటు దైవానికి, ఇటు స్వర్గానికి దగ్గర చేసే జీవన విధానం. అసలు కారణం మనిషి, అతని ప్రవర్తనే అనాలి. దైవ శాసనాలను కాల రాసి, దైవానుగ్రహాల పట్ల కృతఘ్నత చూపే ప్రతి జాతి. ప్రతి దేశం, ప్రతి పట్టణానికి పట్టే గతి ఎలా ఉంటుందో ఖుర్‌ఆన్ పేర్కొంటున్నది:
”అల్లాహ్ ఒక పట్టణ ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. అయితే ఆ పట్టణ వాసులు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నత చూపగా, అల్లాహ్ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు”. (అన్నహ్ల్: 112)
ఒక దేశం ప్రగతి బాటలో పయనించాలంటే శాంతి భద్రతలతోపాటు పుష్కలమైన జీవనోఫాధి ఎంతో అవసరం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి కొరవడినా అక్కడ అభ్యుదయం, అభివృద్ధి, వికాశం ఉండదు. ఈ కారణంగానే శాంతిభద్రతలను, పుష్కల జీవనోపాధిని దేవుడు తన ప్రత్యేక అనుగ్రహంగా పేర్కొన్నాడు:
”ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు ఆహారం ప్రసాదించాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు”. (ఖురైష్: 4)
మరి దీనికి పరిష్కార మార్గం అంటూ ఒకటి లేదా? అంటే, ఉంది. అదేమిటో సర్వలోక పరిపాలకుడు, పోషకుడు, సంరక్షకుడు అయినా అల్లాహ్‌యే స్వయంగా తెలియజేస్తున్నాడు: ”మీలో ఎవరు విశ్వసించి, మంచి పనులు చేశారో వారికి అల్లాహ్, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వొసగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారి (ప్రస్తుత) భయాందోళనల స్థానే శాంతిభద్రతలు కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు”. (అన్నూర్: 55)
దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఎవరైతే ఆరోగ్యవంతమైన దేహంతో, ప్రశాంత వాతావరణంలో, ఆ రోజుకు సరిపడ ఆహారంతో ఉదయం చేస్తారో వారి వద్ద ప్రాపంచిక సకల సంపదలు ఉన్నట్లే లెఖ్ఖ” అని. అల్‌హమ్దులిల్లాహ్ ఆ విధంగా చూస్తే మనం ఆర్థికంగా, శాంతిభద్రతల పరంగా ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాము. మరి దుర్భిక్ష స్థితికి లోనై ఉన్న ప్రజల్ని మనవంతు ఆదుకోవడం మన బాధ్యత కాదా? వారి ఆ దుర్భిక్ష స్థితి దూరమై శాంతిభద్రతలు లభించాలని వేడుకోవడం మనందరి కనీస ధర్మం కాదా? అందరూ సహజంగా స్పందిస్తారని ఆశిస్తూ…!!