ఏడు పదుల అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం మనది. హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ మతం, జైన మతం, సిఖ్ఖు మతం, ఫార్సీ మతం, నాస్తిక మతం మొదలయిన మతాలు, సంప్రదాయాలు, ఆచారాలతో భారత సమాజం భాసిల్లుతున్నది. అలాిం విశిష్ఠ దేశాన్ని ‘థియోక్రాస్టిక్ స్టేట్’గా మార్చే కుట్ర జరుగతుందా అన్న అనుమానం కొందరిది. అది నిజం కాకూడదు అన్నది సౌమ్యత, స్నేహశీలత, సహిష్ణుత, సమరస భావం గల ప్రతి భారత పౌరుని అభిలాష!
ఈ సందర్భంగా రాజ్యాంగ కర్తల్లోని ఒకరయిన బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాట మనంధరికీ శీరోధార్యం అవ్వాలి. ‘రాజ్యాంగం ఎంత గొప్పదయినప్పటికీ ప్రజలు ఉత్తములు కాకపోతే దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ రాజ్యాంగం లోపం గలది అయినప్పటికీ, ప్రజలు ఉత్తములైతే దాని వలన ప్రయోజనం ఉంటుంది’. ”రాజ్యాంగం ప్రాణం లేని ఒక యంత్రం. దాన్ని ప్రజలు అమలు పరచినప్పుడే అది ప్రాణం పోసుకొని సజీవం కాగలదు” అన్నారు బాబు రాజేంద్ర ప్రసాద్. కాబట్టి మన సకల చర్యలకూ జాతి ప్రయోజనాల పరిరక్షణే గీటురాయి కావాలి. మన సకల అస్తిత్వాలు జాతీయ అస్తిత్వానికి ఉపయుక్తం అవ్వాలి.
భారత దేశ ప్రజలమైన మనం 68 యేండ్ల క్రింతం మన పౌరులందరికీ న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలను సమ పాళ్ళల్లో సమకూర్చేందుకు మనకు మనమే ఒక రాజ్యాంగాన్ని సమర్పించుకున్నాము. కాబట్టి మన మధ్య ఉన్న అనేక విభజనల మధ్య వారధులు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకు మన రాజ్యాంగ ఆశయాల గురించి తెలుసుకోవడం ఎంతయినా అవసరం.
మొదటి ఆశయం: న్యాయం.
పౌరులందరూ ఎలాంటి వివక్ష లేకుండా రాజ్య కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, ఓటు హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరునికి ఉండాలన్నది రాజకీయ న్యాయం. సంపదను వికేంద్రీకరించి పేదరికాన్ని నిర్మూలించడం, వృత్తి ఉద్యో గాల్లో సమాన అవకాశాలను కల్పించడం. ఆర్థిక అంతరాలను తగ్గించి సంపద, ఉత్పత్తి, పంపిణి విషయంలో అందరికీ సమాన స్థాయి అవకాశాన్ని కలుగజేయడం అన్నది ఆర్థిక న్యాయం.
పౌరులందరూ సమానులే. కుల, మత, వర్గ, లింగ, జాతి భేదాలు లేకుండా అందరికీ సమాన హోదాను కల్పించడం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం అన్నది సాంఘీక న్యాయం. పై పేర్కొనబడిన న్యాయాల్లో ఏ స్థాయిలో న్యాయం జరుగుతోంది అన్న విషయాన్ని దేశ ప్రజల విజ్ఞతకు వదలి పెడుతే – ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించ బడాలంటే దేశీయ న్యాయస్థానాలకు మరో 350 యేండ్లు పడుతుంది అన్నది ఒక విశ్లేషణ.
రెండవ ఆశయం: స్వేచ్ఛ.
ప్రజా స్వామ్య స్థాపనకు, స్వేచ్ఛాయుత నాగరికత జీవితం గడపడానికి అందరికీ ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసం, ఆర ధన స్వేచ్ఛ హామీ ఇవ్వ బడింది.
భావ ప్రకటనా స్వేచ్ఛ్చ: మేధావులు ఆలోచనల అన్వేషణను కోరుకుంటారు. ఆ దిశగా నిర్భయంగా పని చేస్తారు కూడా. అలాంటి మేధావులే భయంతో జీవించాల్సి వస్తే, అప్పుడు భయం వారితోపాటు జీవిస్తున్న ప్రజా జీవితాల్లోకి సయితం పాకి పోతుంది. ‘భయ ముక్త మయిన దేశం అభివృద్ధి సాధిస్తుంది’ అన్న మాట ఎంత నిజమో, ‘భయోత్పత వాతావరణం నెలకొని ఉన్న సమాజం తన సహజ సృజనాత్మకతను కోల్పోతుంది’ అన్నది అంతే నిజం. ఆ సమాజ జీవనం నిస్తేజం, నిర్వీర్యం, ఫలహీనం, సారహీనం అయి పోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రజలకు సన్నిహితం కాలేని ప్రజాస్వామ్యం ప్రేరణగా కాదు, ఒక పేరడీగా మిగిలి పోతుంది. కాబట్టి రక్త పిపాసులయిన కొందరు పుష్ప గుచ్చాలతో తిరుగుతుంటారు జాగ్రత్త!
మత స్వేచ్ఛ:
ఆహార నిద్ర భయ మైథునంచ
సమానమే తత్ పశుభిన్నరాణాం
ధర్మో హితేషాం అధికో విశేషో
ధర్మేణ హీనో పశుభిర్సమాన
అన్నట్టు – మతం మంచిదే కానీ, మత చాందసం మంచిది కాదు. ‘మై నేషన్ రైట్ ఆర్ రాంగ్’ అన్న దుషృతి నుండి వచ్చిన విష సంస్కృతే ‘మై కమ్యూనిటీ రైట్ ఆర్ రాంగ్’ అన్న వికృత భావన. ప్రవక్త ముహమ్మద్(స)వారి కాలంలో ఇలాంటి భావనే ప్రబలి ఉండేది. తప్పయినా, ఒప్పయినా తన జాతి జనుడి పక్షమే వహించేవారు అలనాటి ప్రజలు. ప్రజల నాలుకల మీద నానుతూ ఉండే ‘ఉన్సుర్ అఖాక జాలిమన్ ఔ మజ్‌లూమన్’ – నీ సోదరుడు దుర్మార్గుడయినా, బాధి తుడయినా నువ్వు అతనికే వత్తాసు పలుకు’ అన్న నానుడిని ఆయన పూర్తిగా మార్చి వేశారు. ఇదే మాట ఆయన సహచరులతో చెప్పినప్పుడు ఆయన సహచరులు ఇలా విన్నవించుకున్నారు: ‘బాధితుని పక్షం వహించు అన్న మాటయితే అర్థమయ్యింది కానీ, దుర్మార్గుడికి సహాయ పడు అన్న మాట మింగుడు పడటం లేదు’ అని. దాని కాయన సమాధానమిస్తూ – ”దౌర్జన్యం చేెసే మీ సోదరుని చెయ్యి పట్టుకొని అతన్ని దౌర్జన్యం నుండి ఆపడమే మీరు అతనికి చేసే సహాయం” అన్నారు. (బుఖారీ)
కాబట్టి ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, ఆస్తికులు, నాస్తికులు అన్న తర తమ భేదాలు ఉండకూడదు. ‘మంచి విషయాలలో, దైవభీతికి సంబంధించిన విషయాలలో అందరితో సహకరించండి’ (మాయి దహ్: 02) అన్న అల్లాహ్ మాననుసరించి – మన కళ్ళ ఎదుట ఒకరు మంచి చేస్తుంటే మనస్పూర్తిగా వారిని అభినందించాలి, చేతనయితే తోడ్పాటునందించాలి. చెడు విషయంలో, పాప విషయాలలో ఏ ఒక్కరికి సహాయం చెయ్యకండి’ (మాయిదహ్: 02) అన్న అల్లాహ్ హెచ్చరికననుసరించి – మన కళ్ళ ముందర చెడు జరుగుతుంటే, ”కుదిరితే దాన్ని చేత్తో (బల ప్రయోగంతో) ఆపాలి. లేదంటే నోటి (కల బలం)తో దాన్ని ఖండించాలి. అదీ సాధ్య పడకపోతే మనుసులోనయినా అటువంటి కార్యాన్ని అసహ్యించుకోవాలి” (ముస్లిం) అన్న మహనీయ ముహమ్మద్ (స) వారి మాటను ఆచరణలో పెట్టాలి. అది కూడా మనం చెయ్యడం లేదంటే మనలో మానత్వం చచ్చిపోయిందని అర్థం. ఈ సందర్భంగా గురజాడ వారి మాట మనందరికీ ఆచరణీయం.
మతం వేరైతే ఏమోయ్!
మనసు లొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్
మత సామరస్యం:
ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య నెలకొని ఉన్న అపనమ్మకానికి, ఉద్రిక్తతకు కారకులు, కారణాలు ఎన్నో ఉండొచ్చు. వాటిలో – ఒకరి నమ్మకాల గురించి మరొకరికి తెలియక పోవడం, ఒకరు మరొకరితో మాట్లాడుకోక పోవడం కూడా ఒక బలమైన కారణం అనే చెప్పాలి. కాబట్టి మాటను మంత్రంగా చేసి మానవత్వాన్ని కాపాడుకోవాలి.
నీ ఈ పెదవులు నీవే మాట్లాడు! ఈ నీ నాలుక నీదే, మాట్లాడు! నిటారయిన నీ ఈ శరీరం నీదే, మాట్లాడు! నీ ఆత్మ ఇప్పటికీ నీదే, మాట్లాడు! నీకున్న వ్యవధి బహు స్వల్పం, మాట్లాడు! సత్యం, మానవత్వం, ధర్మం, న్యాయం ఇంకా బతికే ఉంది, మాట్లాడు! ఆలస్యం అమృతం విషం – భారతీయ సోదరులందరి యెడల నీ మది నిండా ఉన్న ప్రేమానురాగాలను కక్కేయ్యి! జీవితం మరణానికన్నా బలహీనమైనదయితే, మరణం సత్యానికన్నా బలహీనం కదా! మరి సత్యం పలకడానికి ఎవరి భయం దేనికి? అంతా మరచి పో, అందరితో కలసి పో! కలిసుంటే పోయేదేమీ లేదు; అంతరాలు, అపార్థాలు తప్ప. కుటుంబం నుండి సంఘం వరకు, రాష్ట్రం నుండి దేశం వరకూ, దేశం నుండి ప్రపంచం వరకూ మానవ సమాజంలో మానవత్వపు మందారాలు పూయాలంటే మనం మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకునే ఆ మాట మరో ప్రపంచనానికి పునాది అవ్వాలి. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి.
మూడవ ఆశయం: సమానత్వం.
అన్ని రకాల అసమానతలను, వివక్షతలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి తనకు తాను అభివద్ధి చేసుకోవడానికి సమాన అవకాశాలను, హోదాను కల్పించడం.
నాల్గవ ఆశయం: సౌభ్రాతృత్వం.
సోదర భావం, పౌరుల మధ్య సంఘీ భావం. వ్యక్తి గౌరవం, దేశ సమగ్రతకు, ప్రజల ఐక్యతకు సోదర భావం చాలా అవసరం. ‘మనమంతా భారతీయులం, భారతీయులందరూ నా సహోదరులు’ అన్నది మన ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. సోదరులు మధ్య భేదాభిప్రాయాలుండొచ్చు, విభేదాలూ ఉండొచ్చు. కానీ పరస్పర అవగాహన, సఖ్యత, సహిష్ణుత అవసరం. అలాంటి సఖ్యతను మనకు చాటి చెప్పే ఓ చారిత్రక మేలిమి ఘట్టమే అయోధ్యకు చెందిన పూజారీ బాబా రామ్ చరణ్ దాస్ మరియు అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ ధార్మిక పండితుడు మౌల్వీ అమీర్ గారిది. ఆ ఇద్దరిని అయోధ్యలోని ‘కుబేర్‌టీలా’ అనే చోట చింత చెట్టుకు ఉరికంబంగా ఉపయోగించి ఒకేసారి వ్రేలాడదీయడం జరిగింది.
చివరి మాట:
మనం మన రాజ్యాంగ ఆశయాల్ని కాపాడుకొని, మన దేశాన్ని అభివృద్ధి బాటన పయనింపజేయాలంటే, ఎన్ని సవాళ్లు ఎదురయినా, ఎన్ని సమస్యలు భయ పెట్టినా ముందడుగు వెయ్యాలి.
కుదిరితే పరిగెత్తాలి…. లేకపోతే నడవాలి…. అదీ చేత కాకపోతే… పాకుతూ పోవాలి…. అంతే కానీ ఒకే చోట అలా కదలకుండా ఉండి పోకూడదు.
గో వధ పేరుతో అరవయ్యేండ్ల అఖ్లాఖ్‌ను వధించారని,
ఎం.ఎం కుల్బుర్గీనీ అతని నివాసంలోనే కాల్చి చంపారని,
పెరుమాల్ మురుగన్ ను చితకొట్టారనీ,
గౌరి లంకేశ్వర్‌ను ఆమె గృహంలోనే హతమార్చారని,
రాజ్యాంగాన్ని మార్చడమే తమ లక్ష్యం అని ఓ కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి ప్రకించాడని…
అలాగే ఉండి పోతే ఎలా?
దేహానికి తప్ప, దాహానికి పనికి రాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే…
తలుచుకుంటే… మన తల రాత ఇంతే అన్న వాళ్ళు కూడా… మన ముందు తల దించుకునేలా చేయగల సత్తా మనది.
అలాంటిది ఇప్పుడొచ్చి ఈ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగి పోకూడదు…..
పారే నది….వీచే గాలి…ఊగే చెట్టు…ఉదయించే సూర్యుడు…వెన్నెల్ని వెదజల్లే చంద్రుడు…
అనుకున్నది సాధించాలని మనలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా…
ఏదీ ఏదీ ఆగిపోవడానికి వీల్లేదు…
మనం లేవాలి…బయలు దేరాలి…
మనల్ని కదలనీయకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్ళను తెంచేసుకోవాలి…
పడ్డ చోటు నుండే పరుగు మొదలు పెట్టాలి!
మనం పడుకునే పరుపు… మనల్ని చీదరించుకోక ముందే బద్ధకాన్ని వదిలెయ్యాలి…
మన అద్దం… మనల్ని ప్రశ్నించక ముందే సమాధా నం వెతుక్కోవాలి…
మన నీడ మనల్ని వదిలేయక ముందే వెలుగులోకి వచ్చేయ్యాలి…
మళ్ళీ చెబుతున్నా…కన్నీళ్ళు కారిస్తే కాదు… చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలం!
ఇది నిజం!! కఠోర సత్యం!!!