నాల్గవ సూత్రం: ఉపద్రవాల సమయంలో సిద్ధహస్తులయిన పండితులను ఆశ్రయించాలి.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ”శాంతికి సంబంధించిన వార్తగానీ, భయాందోళనల్ని కలిగించే సమాచారం గానీ ఏదయినా వారికి అందినప్పుడు దాన్ని వారు ప్రచారం కల్ప్లిస్తారు. దానికి బదులు వారు ఆ విషయాన్ని ప్రవక్తకు, విషయం లోతుల్లోకి వెళ్ళే తమలోని విజ్ఞులకు చేరవేసి ఉంటే వారు అందలి నిజానిజాలను, ఉచితానుచితాలను పరికించి ఒక నిర్ణయానికి రావడానికి ఆస్కారం ఉండేది. అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే గనక మీపై లేకుండినట్లయితే మీలో బహు కొద్ది మంది తప్ప-అందరూ షైతాను అనుయాయులుగా మారి పోయేవారు”. (అన్నిసా: 83)
ఈ ఆయతులో ఎంత చక్కటి ఉపదేశం ఉందో గమనించండి! విపత్కర పరిస్థితులు, ఆపద సమసయం, ఉపద్రవాలు విరుచుకు పడినప్పుడు ఎవరి నోటికొచ్చింది వారు వాగకూడదు. నెమ్మదిని, ప్రశాంతతను అవలంబించి ఆయా రంగ నిపుణలను సంప్రతించాలి. విజ్ఞుల సలహా తీసుకోవాలి. అలా కాకుండా, విషయావగాహనం లేని వ్యక్తుల్ని సంప్రదించి, వివేక శూన్యుల తీర్మానాలకనుగుణంగా మసలుకుంటే అసలుకే మోసం జరుగుతుంది, ఉన్న స్థితికన్నా మరింత దిగజారే అవకాశం ఉంది. సంస్కరణకై చేయాల్సిన ప్రయత్నం చేజారే అవకాశం ఉంది. ”మనిషి అబద్ధీకుడు, అసత్యవాది అనడానికి విన్న ప్రతి దాన్ని ప్రచారం కల్పిండం ఒక్కటి చాలు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
హజ్రత్ అలీ (ర) గారు ఇలా అన్నారు: ”మీరు బుద్బుద స్వభావులుగా, తొందరపాటు స్వభావులుగా మారకండి. విన్న ప్రతి దాన్నీ నిజం అని నమ్మేసి ప్రచారం చెయ్యకండి. చెడు బీజాలు నాటే వారిగా ఉండకండి. మీ ఈ నిర్వాకం వల్ల మీ తర్వాత భయంకరమయిన ఉపద్రవాలు చోటు చేసుకునే, అంతం కాని అంతర్యుద్ధాలు రాజుకునే, ప్రజల్ని భయం గుప్పెట్లో నెట్టేసే పరిస్థితులు ఏర్పడి వారు శాంతి భద్రతల కోసం అల్లాడి పోయే దుర్భిక్ష స్థితి దాపురించే ప్రమాదం ఉంది”. (అల్ అదబుల్ ముఫ్రద్)కాబట్టి – ”మనిషి చెడుకి అధినాయకునిగా ఉండటం కన్నా మంచికి అనుయాయునిగా ఉండటం ఎంతో మేలు” అన్నారు మన పెద్దలు.
అయిదవ సూత్రం: ముస్లిం సంఘాన్ని అంటి పెట్టుకొని ఉండాలి. పరిపాలకుల మాట వినాలి, విధేయత చూపాలి.
”సంఘాన్ని అంటి పెట్టుకొని ఉండండి. విడి పోకండి. నిశ్చయంగా షైతాన్ ఒంటరి వ్యక్తికి దగ్గరగా ఉంటాడు. ఇద్దరి నుండి దూరంగా ఉంటాడు. మీలో ఎవరయితే స్వర్గం నడి బొడ్డున, అత్యుత్తమ స్థానంలో నివసించాలనుకుంటాడో అతను సంఘాన్ని అంటి పెట్టుకొని ఉండాలి” అన్నారు ప్రవక్త (స). (ఇబ్ను ముబారక్)
మనుషులు లేని ప్రాంతాన్ని నిర్మానుష్య ప్రాంతం అంటారే తప్ప దేశం అనరు. దేశం లేనిది భద్రత, శాంతి లేదు. ఒక రాజ్యం ఏర్పడాలి అంటే రాజు, నాయకుడు, ప్రతినిధి, పెద్ద తప్పనిసరి. వినడం, విధేయత లేనిదే ఒకరు పెద్దగా కొనసాగడం సాధ్య పడదు. నాయకుడు పాటించాల్సిన నీతి నాయకుడు పాటించాలి, అదే సమయంలో రాజు, పరిపాలకుల యెడల ప్రజలు పాటించాల్సిన మర్యాదను వారు మరువ కూడదు. ఖుర్‌ఆన్ మరియు హథీసుల్లో పాలకునికి, నాయకునికి, జాతి పెద్దకు విధేయత చూపాలని నొక్కి వక్కాణించడం జరిగింది. ఒకవేళ పాలకుల తరఫు నుండి ఏదైనా అనుచిత సంఘటన చోటు చేసుకుంటే, సంయమనాన్ని పాటించాలి,. శాంతి ద్వారానే సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యాలి. వారికి సద్బుద్ధిని ప్రసాదించమని దుఆ చేయాలి. జనం మధ్య నిలబడి విమర్శాస్త్రాలు సంధించడం, పరిహసించడం, ప్రజల్ని ఉసిగొల్పడం మానుకోవాలి. ఇదే సరయిన పద్ధతి.
ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అద్దీను అన్నసీహా” – శ్రేయాన్ని కోరడమే ధర్మం. ఎవరి శ్రేయాన్ని? అని ప్రశ్నించినప్పుడు – ”అల్లాహ్ కోసం, అల్లాహ్ గ్రంథం కోసం, అల్లాహ్ ప్రవక్త కోసం. ముస్లిం నాయకుల కోసం, ముస్లిం జన సామాన్యుల కోసం” అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). (ముస్లిం)
”మూడు విషయాల విషయమయి విశ్వాసి హృదయంలో ఎలాంటి కల్మషం ఉండదు. సత్కర్మను అల్లాహ్.
కోసం ప్రత్యేకించడం. అధికారులు, పరిపాలకులకు హితబోధ చెయ్యడం. సంఘాన్ని అంటి పెట్టుకొని ఉండటం. నిశ్చయంగా వారి ఈ హితబోధ వారిని అన్ని వైపుల శత్రువు దాడి నుండి కాపాడుతుంది” అన్నారు ప్రవక్త (స) (ముస్నద్ అహ్మద్)ఆరవ సూత్రం: ప్రజల్లో ధార్మిక చైతన్యాన్ని నింపాలి. ప్రవక్త (స) సంప్ర దాయాన్ని పరిచయం చెయ్యాలి. మంచిని గురించి ఆదేశించమని, చెడు నుండి వారించమని బోధించాలి.
ఇది పండితుల, వక్తల, నాయకుల బాధ్యత. ధార్మిక జ్ఞానం మనిషి సన్మార్గాన నడిపించి, ఇహపరాల అతనికి అనంత మేళ్ళను అందు బాటులోకి తెస్తుంది. ప్రజల్లో దైవభీతి, ధర్మ అవగాన తగ్గిన కొద్ధీ శాంతి భద్రతలనేవి సన్నగిల్లుతాయి. ఎవని చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను: ”మీరు మంచిని గురించి ఆదేశించాలి, చెడు నుండి వారించి తీరాలి. లేదా అల్లాహ్ తన తరఫు నుండి మీపై శిక్షను అవతరింపజేసే ప్రమాదం ఉంది. అప్పుడు మీరు ఎంత మొర పెట్టుకున్నా మీ మొర ఆలకించ బడదు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)
సరైన జ్ఞానం లేని సమాజంలో శాంతి భద్రతలనేవి సాధ్యం కావు. సరైన జ్ఞానం జన సామాన్యం అయితే, వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిస్థితులు చక్క బడతాయి. వారికి శాంతి భద్రతలు లభిస్తాయి. సౌభాగ్యం వారి సొంతమవుతుంది.
ఏడవ సూత్రం: విశ్వాస భరిత సోదర భావం.
”నిశ్చయంగా విశ్వాసులు (పరస్పరం) సోదరులు. కనుక మీ సోదరుల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. అల్లాహ్‌కు భయ పడుతూ ఉండండి. తద్వారా మీరు కరుణించ బడవచ్చు”. (హుజురాత్: 10)
విశ్వాస బంధం చాలా బ్రహ్మాండమయినది. ఖుర్‌ఆన్ మరియు హదీసు లో తెలుప బడిన సోదర భావాన్ని మనంపాటించ గలిగితే ఎవరికీ ఎవరితో ఎలాంటి షికాయతు ఉండదు. ప్రవక్త (స) అన్నారు: ”తన కోసం ఇష్ట పడే వస్తువును తన సోదరుని కోసం సయితం ఇష్ట పడాలి”. (బుఖారీ)
”మీలో నరకం నుండి కాపాడ బడి స్వర్గంలో ప్రవేశించాలని కోరుకునే వారు, తాను అల్లాహ్‌ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే ఉత్తమ స్థితిలో మరణం రావాలని ఆకాంక్షిస్తారో వారు – ప్రజలు వారితో ఎలా వ్యవరించాలి అని భావిస్తారో వారు ప్రజల పట్ల అలానే (ఉత్తమంగా) వ్యవహరించాలి”. (ముస్లిం)
వేరొక సందర్భంలో ఆయన (స) ఇలా అన్నారు: ”మీరు పర్సపరం అసూయ పడకండి. కయ్యానికి కాలు దువ్వకండి. పర్సపరం ధ్వేషించు కోకండి, ఒండొకరి రంధ్రాన్వేషణ చెయ్యకండి, ఒకరు వ్యాపారం కుదు ర్చుకున్న తర్వాత మీరు అందులో కాలు దూర్చకండి. మీరందరూ అల్లాహ్ దాసులుగా, పరస్పరం సోదరులుగా మసలుకోండి. ఒక ముస్లిం మరొక ముస్లిం పరస్పరం సోదరులు, అతనిపై దౌర్జన్యం చెయ్యడు, అతన్ని అవమాన పర్చడు, అతన్ని కించ పర్చడు. తఖ్యా ఇక్కడ ఉందని తన హృదయం వైపునకు ఆయన (స) సైగ చేశాడు. ఒక వ్యక్తి చెడు స్థాయి అనేది అతను తన ముస్లిం సోదరుని యెడల కలిగి ఉండే ఏహ్య భావానికనుగుణంగా ఉంటుంది. ముస్లింలదరి ప్రాణం, ధనం, మానం అన్య ముస్లింలపై నిషిద్ధం”. (ముస్లిం)
”పరస్పరం ప్రేమించుకోవడంలో, అభిమానించుకోవడంలో. కరుణించుకోవడంలో ముస్లింలు ఒక దేహాన్ని పోలి ఉంటారు. ఆ దేహంలో ఒక భాగానికి ఏదయినా సమస్య వస్తే మొత్తం శరీరం జ్వరం, నొప్పితో మూలుగుతుంది” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)