ఎనిమిదవ సూత్రం: హానికర వస్తువును దూరం చెయ్యడం.
సంఘంలో ప్రతి పౌరుని బాధ్యత – ప్రజలకు హాని చేసే విషయాలకు స్వయంగా దూరంగా ఉండాలి, అన్యులను దూరంగా ఉంచాలి. అలాంటి వ్యాఖ్యలుగానీ, వస్తువులుగానీ లేకుండా చూసుకోవాలి. స్వయంగా మన లో మంచీచెడులనేవి ఉంటాయి. ప్రవక్త (స) ప్రతి ఖుత్బాలో ఈ దుఆ చేసేవారు: ”వ నవూజు బిల్లాహి మిన్ షురూరి అన్‌ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా” మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము; మా స్వీయ ఆత్మల కీడు నుండి, మా స్వీయ కర్మల చెడు నుండి. అలాగే ప్రవక్త (స) మనసు కీడు నుండి శరణు వేడుకోవాల్సిందిగా ఉపదేశించారు: ”అల్లాహుమ్మ ఫాతిరస్సమావాతి వల్ అర్‌జి, ఆలిమల్ గైబి వష్షహాదతి లా ఇలాహ ఇల్లా అన్‌త. అవూజు బిక మిన్ షర్రి నఫ్సీ, వ మిన్ షర్రిష్ షైతాని వ షిర్‌కిహి, వ అన్ అఖ్‌తరిఫ అలా నఫ్సీ సూఅన్, ఔ అజుర్రుహు ఇలా ముస్లిం” (ముస్నద్ అహ్మద్) పై దుఆలో – అల్లాహ్ స్తుతి స్తోత్రంతోపాటు, స్వీయ ఆత్మ, షైతాన్ కీడు నుండి శరణు కోరడమే కాక, స్వీయ ఆత్మపై దౌర్జన్యం, ఇతరుల పై దౌర్జన్యం చెయ్యడం నుండి కూడా శరణు వేడుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రవక్త (స) వారి ఈ మాట గమనార్హం! ”మీరు మీ స్వయం విషయంలో ఆరు విషయాల గురించి నాకు జమానతు ఇవ్వండి.ప్రతిగా నేను మీకు స్వర్గపు జమానతు ఇస్తాను. మీరు పలికితే సత్యమే పలకాలి. మాట ఇస్తే దానికి కట్టు బడి ఉండాలి. మీకు ఏదయినా అప్పగిస్తే దాన్ని భద్రంగా తిరిగి అప్పగించాలి. మీరు మీ శీలాన్ని (మర్మాంగాలను) కాపాడుకోవాలి. మీ మీ చూపులను దించి ఉంచాలి. మీ చేతి ద్వారా ఎవ్వరికీ ఎలాంటి హాని కలుగకుండా చూసు కోవాలి”. (ముస్నద్ అహ్మద్)
ఓ సారి ప్రవక్త (స), కూర్చుని ఉన్న కొందరు ప్రజల్ని ఉద్దేశించి ఇలా అన్నారు: ”మీలో మంచి వారెవరో, మీలో చెడ్డ వారెవరో నేను మీకు తెలుపనా?” అని. దానికి ప్రజలు ఎలాంటి సమాధానం ఇవ్వ లేదు. అలా ఆయన మూడు సార్లు అడిగాక, ఒకరు – తప్పకుండా మాలో మంచోడు ఎవరో, మాలో చెడ్డోడు ఎవడు తప్పక తెలియజేయండి ఓ దైవ ప్రవక్తా! అని అన్నాడు. అప్పడాయన ఇలా అన్నారు: ”ఎవరి నుండి మంచి జరుగుతుంది ఆశ ఉంటుంందో, ఎవరి నుండి కీడు వాటిల్లదు అన్న భద్రత ఉంటుందో అతనే మీలో మంచోడు. ఎవరి నుండి మేలు జరిగుతుంది అన్న ఆశ ఉండదో, ఎవరి కీడు నుండి భద్రత ఉండదు అన్న బెంగ, భయం ఉంటుందో అతనే మీలో చెడ్డోడు”. (తిర్మిజీ)
వేరొక ఉల్లేఖనంలో ఆయన చెప్పిన మాట: ”నిశ్చయంగా ప్రజల్లో కొందరు మంచికి (పెంచే) బీగాలయి ఉంటారు. చెడుకి తాళాలయి (తుంచే వారయి) ఉంటారు. నిశ్చయంగా ప్రజల్లో మరికొందరు చెడుకి బీగాలుగా ఉంటారు. మంచికి తాళాలుగా ఉంటారు. అల్లాహ్ ఎవరి నయితే మంచికి తాళం చెవిగా చేశాడో వారు భాగ్యజీవులు, వారికి శుభాకాంక్షలు! మరెవరినయితే చెడుకి తాళం చెవిగా చేశాడో వారు నాశనం అవ్వుగాక!” (ఇబ్ను మాజహ్)
ప్రవక్త (స) ఇంటి నుండి బయికి వెళ్ళేటప్పుడు ఈ దుఆ తప్పకుండా చేసేవారు: ”బిస్మిల్లాహి తవక్కల్‌తు అలల్లాహ్. అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్ అన్ అద్వల్ల ఔ ఉద్వల్ల, ఔ అజిల్ల ఔ ఉజల్ల, ఔ అజ్‌లిమ ఔ ఉజ్‌లమ అలయ్య, ఔ అజ్‌హల ఔ యుజ్‌హల అలైయ్య” అల్లాహ్ పేరుతో ఆయన మీద భరోసాతో బయలు దేరుతున్నాను. మోసానికి గురవ్వడం నుండి, నేను ఒకరిని మోసానికి గురి చెయ్యడం నుండి, స్వతహాగా నేను మార్గం తప్పడం నుండి, నా ద్వారా ఒకరు మార్గం తప్పడం నుండి, నేను ఒకరిపై దౌర్జన్యానికి పాల్పడటం నుండి, నాపై ఒకరు దౌర్జన్యం చెయ్యడం నుండి, నేను ఒకరితో మూర్ఖంగా ప్రవర్తించడం నుండి, ఒకరు నా యెడల మూర్ఖంగా వ్యవహరించడం నుండి ఓ అల్లాహ్! నీ శరణు వేడుకుంటున్నాను”. (అబూ దావూద్)
తొమ్మిదవ సూత్రం: ప్రతీకార చట్టం. దౌర్జన్యపరునికి దండన.
ఇది పూర్తి పరిపాలకులు, ప్రభుత్వానికి చెందిన విషయం. ఎవరు పడితే వారు చట్టాన్ని చేతుల్లో తీసుకునే అనుమతి లేదు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ”మీకు ప్రతీకార చట్టంలోనే జీవితం ఉంది”. (బఖరహ్: 179)
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకి బదులు కన్ను, ముక్కుకి బదులు మక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కఫ్ఫారా) అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు”. (అల్ మాయిదహ్: 45)
ఈ కోవకు చెందిన కొన్ని శిక్షలు – దొంగ (దొంగలించిన వస్తువు స్థాయిని బట్టి ) అతని చెయ్యిని ఖండించడం, మద్యం త్రాగే వారిని, వ్యభిచారం చేసే వారిని కొరడాతో కొట్టడం, వివాహితుడు వ్యభిచారానికి పాల్పడితే రజ్మ్ చెయ్యడం (రాళ్ళతో కొట్టి చంపడం) తదితర శిక్షలు మనిషి ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిర్దేశించ బడిన విధానాలు. నేరానికి శిక్ష ఉంటుంది అన్న భయం ఒక నేరస్థున్ని నేరం నుండి పూర్తిగా ఆపక పోవచ్చుకానీ, ఖచ్చితంగా మార్పు మాత్రం తీసుకు వస్తుంది.
పదవ సూత్రం: అల్లాహ్ అనుగ్రహాల యెడల కృతజ్ఞతా భావం.
”మీకు ప్రాప్తమయిన ఏ అనుగ్రహం అయినా అది అల్లాహ్ తరఫు నుండే”. (నహ్ల్: 53). మనపై అల్లాహ్ కురిపించిన అనుగ్రహాలు అనన్యం, అసంఖ్యాంకం. ఆయన వరానుగ్రహాలను మనం లెక్కించ దలచినా పూర్తిగా లెక్కించ లేము. కాబట్టి అనుగ్రహ ప్రదాత అయిన అల్లాహ్‌కు మనం నిత్యం కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ ఉండాలి. ”దాసుడు ఓ గుక్కెడు నీళ్ళు త్రాగి, ఒక ముద్ద అన్నం తిని అల్‌హమ్దు లిల్లాలహ్ అనడం అల్లాహ్‌కు ఎంతో ప్రియం” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి బదులు కృతఘ్నతకు పాల్పడితే మాత్రం అల్లాహ్ భద్రత స్థానంలో భయాన్ని, పుష్కల ఆహార పదార్థాల స్థానంలో ఆహార లేమిని కలుగజేస్తాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు: ”మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాము. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచి పోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమయినది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధాన పరచిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి!” (ఇబ్రాహీమ్: 7)
ఖుర్‌ఆన్ చెప్పిన చారిత్రక ఉదాహరణ మనందరికి కనువిప్పు కావాలి:
”అల్లాహ్ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్టణం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్న వాసులు అల్లాహ్ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాం దోళనల రుచి చూపించారు”. (అన్న్‌హ్ల్: 112)
శాంతి భద్రతల కోసం ప్రతిపాదించ బడిన సూత్రాలు అన్నీ మొధటి సూత్రమయిన ఈమాన్‌తో ముడి పడి ఉన్నాయి. అది మిగతా అన్నింకీ పునాది వంటిది. మిగతా విషయాలు ఆ ఒక్క సూత్రానికి వివరణ వంటివే. అంటే, అల్లాహ్‌పై స్వచ్ఛమయిన విశ్వాసంతోపాటు మిగతా విషయాల్లో సయితం ఆయన నిర్దేశించిన విధి విధానాలను అనుసరించి ఆచరణలో పెట్టినప్పుడే ప్రపంచ శాంతి భద్రత పూర్తి స్థాయిలో లభించే అవకాశం ఉంది. దీనర్థం చెడు పూర్తిగా చుడిచి పెట్టుకు పోతుందని ఎంత మాత్రం కాదు. ఏమీ చెయ్య లేని అశక్తతకు అది గురవుతుంది అని మాత్రం చెప్ప గలం! ఎందుకంటే, వెలుగు చీకటి లాగా మంచీ చెడులనేవి ప్రళయం వరకూ ఉంటాయి గనక, ఇది అల్లాహ్ సంప్రదాయం గనక.
చివరి మాట ప్రవక్త (స) వారి నోట:
ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”బహిర్గతమయిన, బహిర్గతం కాని ఉపద్రవాల నుండి అల్లాహ్ శరణు వేడుకోండి”. (ముస్లిం)