షిర్క్‌ పుట్టు పూర్వోత్తరాలు -5

ఇప్పుడు దైవ ప్రవక్త (స) గారి మహితోక్తుల వెలుగులో మన భారత దేశ ముస్లిం జీవనాన్ని పరిశీలిద్దాం. పూర్వం భరత ఖండంలో ఉన్న నేటి పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లునైతేనేమీ, అఫ్గానిస్తాన్‌, కజకిస్తాన్‌, వజీరిస్తాన్‌, ఈరాన్‌, బర్మా, థాయిలాండ్‌ లాంటి పొరుగు దేశాలైతేనేమీ అన్నింటా మనకు కానవచ్చే దృశ్యం ఒక్కటే – అది బహుదైవారాధన.

దివ్య ఖుర్‌ఆన్‌లో 25 మార్లు పేర్కొనబడిన హజ్రత్‌ ఈసా (అ)ను పూజించేవారు, ఆయనకు లేని స్థానాన్ని కల్పించేవారు శిక్షార్హులు, నరకవాసులు అంటే… ముందు వెనకా అసలు ఒక చరిత్రంటూ లేని అనామకులైన బాబాలు, దర్గాలను పూజించే వారు, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేెసేవారు స్వర్గవాసులు ఎలా కాగలరు?

నేడు ప్రతి గల్లీలోనూ ఓ జెండా చెట్టు పుట్టుకొచ్చింది. ప్రతి ఊరిలోనూ ఓ సమాధి (దర్గా) కనిపిస్తుంది. దాదాపు ప్రతి ఇంటిలోనూ కొన్ని చిత్రపటాలు దర్శనమిస్తాయి. మరి ఈ దురాచారాల్ని సయితం ఇస్లామీయ సదాచారాలుగానే అభివర్ణి ద్దామా? రాతి శిల్పాలను, శవాలుగా మార్చుకొని, జాతరలని, ఉరుసులని పేరు పెట్టి, వినాయకుని నిమజ్జనం, దసరా, మధురైలోని నిప్పులు తొక్కే ఆచారం – వీటన్నింటినీ కలగూర గంపచేసి ‘పీర్ల పండగ’ అని నామకరణం చేసి, నైవేద్యాన్ని చక్కెర, బెల్లం, మలీదాగా మార్చి, అర్చనను ఫాతెహా రంగులు అద్ది, రావి చెట్టును జెండా చెట్టుగా రూపం ఇచ్చి చిందులు తొక్కడం ఇస్లాం ధర్మాన్ని చీల్చి చెండాడటం కాదా? అటు సప్త ఋషుల భార్యలుంటే, ఇటు పది మంది స్త్రీలు (దస్‌ బీబియోఁకి కహానీలు). అటు లక్ష్మి, కాళికాదేవీలుంటే, ఇటు ఉజ్లీ పరీ, కాలీ పరీలు. అటు అమ్మవారు అయ్యవార్లుంటే, ఇటు అమ్మా జాన్‌ బావాజాన్‌లు,. అక్కడ లక్ష్మి కుండలుంటే, ఇక్కట జాఫర్‌ కుండలు. అక్కడా పాయసమే, ఇక్కడా పాయసమే.

లక్ష్మి దుర్గాలని చెప్పేవారు, అమ్మవారు అయ్యవారు అనేవారు, మందిరానికి జాతరలకి వెళ్ళేవారు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు విగ్రహారాధకులు. మన భాషలో కాఫిర్లు (దైవ వ్యతిరేకులు) నరకవాసులు అయితే, పేర్లు మార్చి ఈ దురాచారాలన్నీ చేసే మనం స్వర్గానికి వెళతామా? ప్రవక్తగానీ, అల్లాహ్‌గానీ మనకేమన్నా ప్రమాణం చేసి ఉన్నారా? ఏమైనా రాయితీ కల్పించి ఉన్నారా? నేడు ఇన్ని చేస్తూ మనం చెప్పే మాటనే నాడు యూదులు సయితం చెప్పారు. అయితే వారు చెప్పిందల్లా నిజమైపోయిందా? చూడండి!
”యూదులు, క్రైస్తవులు తాము అల్లాహ్‌ (దేవుని) బిడ్డలమని, ఆయనకు ప్రియమైనవారమని అంటారు”. (దివ్యఖుర్‌ఆన్‌- 5: 18)

”పైగా వారు, ఈ నరకాగ్ని మమ్మల్ని తాకనైనా తాకదు. కాకపోతే కొన్నాళ్ళు కాస్తంత బాధ కలిగిస్తుందంతే’ అంటారు. అలాగైతే, మీరు దేవునితో ఏదైనా ఒడంబడిక చేసుకున్నారా, దాన్ని ఆయన ఉల్లంఘించకపోవడానికి? లేక అల్లాహ్‌ విషయంలో మీరు మీకు ఏ మాత్రం తెలియని మాటలు అంటున్నారా?’ అని అడగండి వారిని. (దివ్యఖుర్‌ఆన్‌-2:80)

దివ్య ఖుర్‌ఆన్‌లో 25 మార్లు పేర్కొనబడిన హజ్రత్‌ ఈసా (అ)ను పూజించేవారు, ఆయనకు లేని స్థానాన్ని కల్పించేవారు శిక్షార్హులు, నరకవాసులు అంటే… ముందు వెనకా అసలు ఒక చరిత్రంటూ లేని అనామకులైన బాబాలు, దర్గాలను పూజించే వారు, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేెసేవారు స్వర్గవాసులు ఎలా కాగలరు? ‘మేము ఎన్ని చేెసినా చెల్లుతుంది. చివరికి మేము స్వర్గానికే వెళతాము, ఎందుకంటే- మేము జన్మతః ముస్లింలము, మా తాతముత్తాతలు ముస్లింలు’ అంటారా! అయితే ఇస్లాం ఏమన్నా మన తాతముత్తాల వారసత్వపు సొత్తా? పంచుకోవ డానికి!! లేక ముస్లిం కడుపున పుట్టినవాడల్లా ఇస్లాం ధర్మాన్ని పాటించకుండా ముస్లిం అయి పోతాడా? చూడండి, ఖుర్‌ఆన్‌ ఈ విషయంలో ఏమంటుందో!

(తన కొడుకు కోసం సిఫారసు చేెస్తూ) ”నూహ్‌ దైవాన్ని వేడుకుంటూ ‘ప్రభూ! నా కొడుకు నా కుటుంబానికి చెందినవాడు కదా ! అన్నాడు”. (దివ్య ఖుర్‌ఆన్‌-11: 45)
అందుకు అల్లాహ్‌ ఏం సమాధానమిచ్చాడో కూడా కాస్త గమనించండి! ”నూహ్‌! అతను నీ కుటుంబానికి చెందినవాడు కాదు. అతను (నీ కడుపున చెడ పుట్టిన) పరప అప్రయోజ కుడు”. (దివ్యఖుర్‌ఆన్‌- 11: 46)

ముస్లిం ఇంట పెళ్ళి చేసుకుంటే ముస్లిం అయిపోతాం అనుకుంటున్నారా! బాగా తెలుసుకోండి –
”అవిశ్వాసుల విషయంలో అల్లాహ్‌ నూహ్‌ మరియు లూత్‌ (ప్రవక్తల) భార్యల్ని ఉదాహరణగా పేర్కొంటున్నాడు. ఆ స్త్రీలిద్దరు పుణ్యాత్ములైన మా భక్తులిద్దరి దాంపత్యంలో ఉండేవారు. అయితే వారు తమ భర్తల పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. అందువల్ల వారా స్త్రీలను (ప్రవక్తలై ఉండి కూడా) అల్లాహ్‌ (శిక్ష) నుండి ఏమాత్రం కాపాడలేకపోయారు. వారిద్దరితో (ఆ స్త్రీలిద్దరితో) ”వెళ్ళండి, నరకాగ్నిలో పడేవారితో పాటు మీరూ అగ్నిలోకి పోయి పడండి” అని చెప్పడం జరిగింది. (దివ్య ఖుర్‌ఆన్‌- 66: 10)

Related Post