స్వచ్ఛతే హృదయ స్వస్థత

''నాలుక మరియు మనస్సుకు మించిన మంచి వస్తువూ లేదు;అవి బాగుంటే. వారికి మించిన చెడ్డ వస్తువు కూడా లేదు; అవి పాడయితే'', అన్నారు లుఖ్మాన్‌ హకీమ్‌ (అ).

”నాలుక మరియు మనస్సుకు మించిన మంచి వస్తువూ లేదు;అవి బాగుంటే. వారికి మించిన చెడ్డ వస్తువు కూడా లేదు; అవి పాడయితే”, అన్నారు లుఖ్మాన్‌ హకీమ్‌ (అ).

వింతయినది హృదయం.  తనకు  లేదు ఏ రూపం. ఎప్పుడు చినుకవుతుందో, ఎప్పుడు పిడుగవుతుందో, ఎప్పుడు అడుగే స్తుందో, ఎప్పుడు- మడుగవుతుందో తెలీదు ఎవ్వరికీ. స్వచ్ఛంగా ఉంచుకుంటే అది తెలుపు. కలుషితం చేస్తే అది నలుపు. తెలుపు పెరిగితే శాంతి, నలుపు పేరుకుంటే  అశాంతి. తెల్లగా నవ్విందా జీవన జ్యోతి, నల్లగా నవ్విందా విషమ రాత్రి. అది పచ్చబడినా ఫర్వా లేదు, ఎర్రబడినా ఫర్వా లేదు. కాని అది నల్ల బడితే మాత్రం నియతి చితికిపోతుంది. నిష్ఠ నీరుగారుతుంది. దయాఝరి ఇంకి పోతుంది. ఆత్మీయత ఆవిరయి పోతుంది.  కనుకనే ఖుర్‌ఆన్‌ అంటుంది: ”ఆ రోజు సిరి సంపదలుగానీ, సంతానంగానీ దేనికీ పనికి రాదు. స్వచ్ఛమయిన హృదయంతో అల్లాహ్‌ సన్నధిలోకి వచ్చినవాడు మాత్రమే (ఆనాడు మోక్షం పొందుతాడు)”. (షుఅరా: 88,89)

మనలోని భావోద్వేగాల, అనుభూతుల, కోరికల, ఆలోచనల కేంద్రం హృదయం. ఏదయినా వస్తువు, ప్రాణి మీద ప్రేమ, ధ్వేషం, అయిష్టం కలిగించే అంతరంగిక ప్రేరణం హృదయం. మనిషి భావాలు, అభిప్రాయాలు, ఆచరణలు అన్నింటికి మూలం హృదయం. అందుకే ”మనిషి నడవడి, ప్రవర్తన అతని మానసిక స్థితికి అద్దం పడుతుంది” అన్నారు పెద్దలు. ఇదే హృదయం గురించి తెలియజేస్తూ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు:

”దేహంలో ఒక ముద్ద ఉంది. అది గనక బాగుంటే దేహమంతా బాగుం టుంది. అది గనక పాడయితే శరీరం మొత్తం పాడవుతుంది. గుర్తుంచు కోండి! అదే హృదయం!” (బుఖారీ)

ఈ కారణంగానే అల్లాహ్‌ హృదయాన్ని స్వచ్ఛగా ఉంచుకోవాలని ఆదేశిం చాడు: ”నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో”. (అల్‌ ముద్దస్సిర్‌: 4) ఈ వచనంలో దుస్తులు అంటే హృదయం అన్నది పండితుల మాట.

హృదయ స్వచ్ఛత అంటే:

‘నరోత్తములు ఎవరు?’ అని ప్రశ్నించగా- ”హృదయ స్వచ్చత, మాట సత్యత గల ప్రతి వ్యక్తి” అని ప్రవక్త (స)సమాధానమిచ్చారు. ‘మాట సత్యత అంటే మాకు తెలుసు. మరి హృదయ స్వచ్ఛత (మఖ్మూముల్‌ ఖల్బ్‌)అంటే ఏమి?’ అని సహాబహ్‌ వివరణ కోరగా, ”తఖ్వా పరుడు, పరిశుద్ధుడు, ఎలాంటి పాప భావం లేనివాడు, ఎలాంటి అతిక్రమణకు పాల్పడని వాడు, మోసం చెయ్యని వాడు, అసూయ చెందనివాడు” అని అన్నారు ప్రవక్త (స) (ఇబ్ను మాజహ్‌)

హృదయాన్ని అరబీలో ‘ఖల్బ్‌’ అంటారు. కారణం అది ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు గనక. ఒక స్థితి నుండి మరో స్థితికి మారుతూ ఉంటుంది గనక. ప్రవక్త (స) హృదయ విషయమయి ఈ దుఆ చేస్తూ ఉండేవారు:’యా ముఖల్లి బల్‌ ఖులూబ్‌ సబ్బిత్‌ ఖల్బీ ఆలా తాఅతిక్‌” – ఓ హృదయాలను మరల్చే వాడా! నీ విధేయతపై నా హృదయానికి స్థిరత్వాన్ని ప్రసాదించు”.

”హృదయం శరీరావయవాలకు సర్దారు, కమాండర్‌ వంటిది. అది గనక బాగుంటే దాని సైన్యం (అవయవాలు)సయితం బాగుంటాయి.అది గన చెడితే దాని సైన్యం కూడా చెడుతుంది” అన్నారు హజ్రత్‌ అబూ హురైరహ్‌ (ర).

ఖుర్‌ఆన్‌లో హృదయం:

ఖుర్‌ఆన్‌ మనసుని మూడు విధాలుగా పేర్కొంటుంది. 1) నఫ్సుల్‌ లవ్వామహ్‌: నిందించే మనస్సు.2) నఫ్సుల్‌ అమ్మారహ్‌: చెడుకై పురిగొలిపే మనసు. 3) నఫ్సుమ్‌ ముత్‌మయిన్నహ్‌: ప్రశాంత హృదయం, నెమ్మదించిన మనస్సు.

ఖుర్‌ఆన్‌ ఉపదేశాలను అర్థం చేసుకోక పోవడానికి కారణం-వారి హృద యాలకు తాళాలు వేసి ఉండటమే. వారి చర్మ చక్షువులకు అంధత్వం లేదు వారి ఆత్మ చక్షువులు మూసుకు పోయాయి. ఆ కారణంగానే వారు సత్యాన్ని సత్యంగా చూడలేక పోతున్నారు.అసత్యం అసత్యంగా వారికి తోచడం లేదు. కారణం వారి హృదయం రోగ గ్రస్తమవ్వడమే. అందుకే తరచూ ప్రవక్త (స) ఈ దుఆ చేస్తూ ఉండేవారు: ”అల్లాహుమ్మ అరినల్‌ హఖ్ఖ హఖ్ఖన్‌ వర్‌జుఖ్నత్తి బాఅ వ అరినల్‌ బాతిల బాతిలన్‌ వర్‌జుఖ్నజ్‌తినాబహ్‌”-ఓ అల్లాహ్‌ మాకు సత్యాన్ని సత్యంగా చూపించు మరియు దాన్ని అనుసరించే సద్బుద్ధిని ఒసగు. అసత్యాన్ని అసత్యంగా చూపించు మరియు దాన్నుండి ఎడంగా ఉండేలా మమ్మల్ని దీవించు”.

హథీసులో హృదయం:

”దాసుని విశ్వాసం అప్పటి వరకు దారికి రాదు ఎప్పటి వరకయితే అతని హృదయం దారికి రాదో” (ముస్నద్‌ అహ్మద్‌)

ఇస్లాం శాస్త్ర ప్రకారం విశ్వాసం అంటే, ”నోటితో పలకడం, మనస్సుతో అంగీకరించడం, దేహావయవాలతో ఆచరణ ఛాయను ఇవ్వడం”.  అంటే విశ్వాస రహిత హృదయం గల వ్యక్తి కర్మలు అవి ఎంత మంచివయినా ప్రయోజనం లేదు. విశ్వాసం హృదయంలో ఉందంటూ కర్మలకు దూరంగా ఉండే వ్యక్తి విశ్వాసం అంగీకృతం కాదు. ప్రవక్త (స) ఇలా అన్నారు:

”నిశ్చయంగా అల్లాహ్‌ మీ ముఖాలను, మీ శరీరాలను చూడడు. ఆయన మీ హృదయాలను, మీ కర్మలను తప్పకుండా చూస్తాడు”.(ముత్తఫఖున్‌ అలైహి)  ఆయన (స) హృదయం వైపు సైగ చేస్తూ. ‘అత్తఖ్వా హాహునా’ తఖ్వా-దైవభీతి ఇక్కడున్నది’ అని సెలవిచ్చారు. (ముస్లిం)”నీ వల్ల సాధ్యమయితే ఇది చెయ్యి. నీ హృదయంలో ఎవరి యెడల ఎలాంటి చెడు భావనకు చోటు ఇవ్వకు” అని తన సహచరుణ్ని ఆయన చేసిన హితవు సయితం గమనార్హం.

ప్రముఖుల దృష్టిలో హృదయం: 

”గొడవలు మోసే గుండెల నిండా అరుపులురా, కేకలురా” అని కవి చెప్పిన హృదయం గురించి ప్రముఖుల అభిప్రాయం.

”వివేకి నాలుక (మాట) అతని హృదయం వెనకాల ఉంటుంది. అదే అవివేకి హృదయం     అతని నాలుక (మాట) వెనకాల ఉంటుంది” అన్నరు హజ్రత్‌ అలీ (ర).

”తన ముఖాన్ని రోజుకు అనేకసార్లు కడుగుతూ తన హృదయాన్ని ఏడాదికో సారి కూడా శుభ్రపరచుకోని వారిని చూస్తే నాకు అశ్చర్యం కలుగుతుంది” అన్నారు మీఖాయిల్‌ నఅమహ్‌.

”హృదయం నిండా అసూయ నిండినవాడు ఎన్నికీ నాయకుడు కాలేడు” ‘అల్‌ హసూదు లా యసూదు’ అన్నది అరబ్బీ సామెత.

”నాలుక మరియు మనస్సుకు మించిన మంచి వస్తువూ లేదు;అవి బాగుంటే. వారికి మించిన చెడ్డ వస్తువు కూడా లేదు; అవి పాడయితే”, అన్నారు లుఖ్మాన్‌ హకీమ్‌ (అ).

”స్వచ్ఛమయిన హృదయం-ఎవరి యెడలా చెడు తలంపు కలగనిది. అందరి మేలును ఆకాంక్షించేది” అన్నారు ఇమామ్‌ ఇబ్ను తైమియా (ర).

”ఏ హృదయంలోనయితే, కుళ్ళు, ఓర్వలేనితనం, అసూయ, ఆత్మస్తుతి, అహం భావం వేళ్ళూనుకొని ఉంటుందో ఆ హృదయం స్వచ్ఛందం కాజాలదు” అన్నారు ఇబ్నుల్‌ అరబీ (రహ్మ).

”ఆలోచించే మేధ మరియు స్పందించే హృదయం మేలు కలయికనే వివేకం అంటారు” అన్నది ఓ ప్రసిద్ధ ప్రతీతి.

”సజ్జన మన పూర్వీకులు గోరంతి సత్యాకార్యానికి కొండంతి పుణ్యాన్ని పొందేవారు. కారణం – వారి హృదయ స్వచ్ఛతే” అన్నారు ఇబ్ను కసీర్‌.

”హృదయాలు కుండను పోలి ఉంటాయి. వాటిలో ఉన్న భావాలను అవి వండుతుంటాయి. నాలుకలు వాటికి ముఖద్వారం వంటివి. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు గమనించండి, అతని మనసులో ఉన్నదే మాట రూపంలో బైటికి వస్తున్నది. తీపి, చేదు, సుగంధం, దుర్గంధం మొదలయినవి. మనిషి నోటి మాట అతని హృదయ భావన రుచిని పరిచయం చేస్తుంది” అన్నారు యహ్యా బిన్‌ మఆజ్‌ (రహ్మ).

”సజ్జనుల హృదయాలు మంచి ఆలోచనలతో నిండు కుండలయి ఉండగా. దుర్జనుల హృదయాలు చెడు తలంపులతో అతలాకుతలమవుతుంటాయి. ప్రజలారా! అల్లాహ్‌ మీ హృదయాలను, మీ ఆలోచనలు గమనిస్తున్నాడు. మీరు ఎలాంటి ఆలోచనలకు హృదయంలో తావివ్వాలో ఆలోచించుకోండి!” అన్నారు మాలిక్‌ బిన్‌ దీనార్‌ (రహ్మ).

”మనోవాంఛను గౌరవించిన వ్యక్తి తన ధార్మన్ని కించ పరుస్తాడు. మనో వాంఛను కించ పరచిన వ్యక్తి తన ధర్మాన్ని గౌరవిస్తాడు” అన్నారు ముజా హిద్‌ (రహ్మ).

ఒకరి మనస్సులో ఏముందన్న విషయాన్ని మానవ హృదయాల్ని మరల్చే అల్లాహ్‌కు వదలి మన  దేహంలాగే మన హృదయం సయితం రోగ బారిన పడుతున్న యదార్థాన్ని గ్రహించి దాని స్వచ్చత, మరియు స్వస్థత కోసం శక్తి వంచన లేకుండా పాటు పడదాం!

హృదయ కాలుష్యానికి కారణాలు:

1) నిజ దైవం పట్ల విశ్వాస లేమి. 2) అజ్ఞానం. 3) ఉపద్రవాలు. 4) తుచ్ఛ వాంఛలు. 5) ఏమరుపాటు 6) అత్యాశ. 7) లోభం. 8) అహం. 9) మదం. 10) మత్సర్యం. 11) అనవసరమయిన ఉదారత్వం. 12) అధర్మ భూషణం, భాషణం. 13) రంధ్రాన్వేషణ. 14) అధర్మ విషయాలపై దృష్టి కేంద్రీకరణ. 15) ప్రపంచాన్నే సర్వస్వంగా భావించడం మొదలయినవి.

పై విషయాలు ఒక వ్యక్తి హృదయంలో చోటు చేసుకుంటే దానికి చుట్టు ముట్టే రోగాల జాబితా కూడా కాస్తా జాస్తిగానే ఉంది.

హృదయ రోగాలు:

1) షిర్క్‌. 2) కాపట్యం.3) అనుమానం.4) సందేహం, అపోహ. 5) అసూయ, ద్వేషం. 6) అనవసర పౌరుషం.7) అహంభావం.8) ఆత్మస్తుతి. 9) ఏవగింపు, అవహేళన.10) కుళ్ళు, ఓర్వలేనతనం.11) నిరాశ. 2) దైవేతరుల ప్రేమ. 13) దైవేతరుల భయం.14) చెడు తలంపుల పరంపర.15) గుండె బండ బారడం.16) అసత్యానికి కొమ్ము కాయడం మొదలయినవి.

హృదయ రోగ నివారణ:

1) మనిషి తన విశ్వాసాన్ని పరీక్షించుకొని, ప్రక్షాళించుకోవాలి. ఇమామ్‌ ఇబ్ను తైమియా (రహ్మ) ఇలా అన్నారు: ”హృదయ రోగాన్ని దూరం చేసే విధానాల్లో అత్యుత్తమ శ్రేణికి చెందిన విధానం – మనిషి తన హృదయాన్ని అల్లాహ్ ప్రేమతో నింపుకోవడమే”.

2) చిత్తశుద్ధి-అంకిత భావం: ప్రవక్త (స) వారు సెలవిచ్చిన మాట గమనా ర్హం! ”ఎవయితే అల్లాహ్‌ కోసం ఇష్ట పడతారో, అల్లాహ్‌ కోసం ధ్వేషిస్తారో, అల్లాహ్‌ కోసం మాత్రమే ఇస్తారో, అల్లాహ్‌ కోసం మాత్రమే ఇవ్వకుండా ఉంటారో వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్న వారవుతారు”. (అబు దావూద్‌)

3) దైవ ప్రవక్త (స) వారి అనుసరణ: ”ఓ ప్రవక్తా! ఇలా ప్రకించు: ”మీరు  నిజంగానే అల్లాహ్‌ను ప్రేమిస్తున్నట్లతే నన్ను అనుసరించండి. అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు”. (ఆల్‌ ఇరమాన్‌:31)

4) ఆత్మ పరిశీలన: ”విశ్వసించిన ప్రజలారా! మీలో ప్రతి ఒక్కరు తాను రేపి కోసం ఏమి పంపించుకున్నాడో చూసుకోవాలి”. (హష్ర్‌:18)

5) ధర్మ సంపాదన: ”నిశ్చయంగా అల్లాహ్‌ పరిశుద్ధుడు. పరిశుద్ధమయిన వాటినే స్వీకరిస్తాడు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

6) హృదయ స్వచ్ఛత: ”స్వర్గంలో ప్రవేశించేవారు-వారి హృదయాలు పక్షుల హృదయాల్ని పోలి ఉంటాయి” అన్నారు ప్రవక్త (స) ముస్లిం)

7) ఖుర్‌ఆన్‌ పారాయణం: ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గర కు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసగేది. నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (ఖుర్‌ఆన్‌-10:57)

”నీళ్ళ తాకిడితో లోహానికి తుప్పు పట్టినట్టే హృదయానికి సయితం తుప్పు పడుతుంది. హృదయ తుప్పును వదలగొట్టే అమల సాధనం ఖుర్‌ఆన్‌ పారాయణం” అన్నారు ప్రవక్త (స).   (బైహఖీ)

హృదయ స్వచ్ఛతకు గుర్తులు:

1) అల్లాహ్‌ యెడల ప్రసన్నత. 2) పరలోకం పట్ల చింతన. 3) నిరంతర అల్లాహ్‌ స్మరణ. 4)  మానవ సేవలో ఆనందం. 5) ప్రార్థన తప్పితే బాధ. 6) ఖుర్‌ఆన్‌ పారాయణం, నమాజు ద్వారా ప్రశాంతత. 7) బాహ్యంగా, రహస్యంగా ఒకే విధమయినటువంటి ప్రవర్తన. ప్రవక్త (స) అన్నారు:  ”కొందరున్నారు. వారు మీలాగే నమాజులు చేస్తారు, ఉపవాసాలూ పాటి స్తారు. రాత్రి జాగారాలూ చేస్తారు.కానీ అల్లాహ్‌ నిషేధించిన వాటితో వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం హద్దులన్నీ చెరిపేసి బరి తెగిస్తారు”.  (ఇబ్బు మాజహ్‌)

7) పాప మన్నిఫుకై ఇస్తిగ్ఫార్‌ అత్యధికంగా చేస్తూ ఉండటం. 8) ఆరాధనా మాధుర్యాన్ని ఆస్వాధించడం. ప్రతి వస్తువుకు ఒక రుచి ఉన్నట్లే ఆరాధనకు సయితం ఒక రుచి ఉంటుంది. ఆ రుచిని స్వచ్చమయిన హృదయం గల వారు మాత్రమే ఆస్వాదించ గలుగుతారు. 9) అధిక కర్మలు చేయాలన్న ఆత్రంకన్నా చేసే కర్మల్ని సంస్కరించుకొని పూర్తి నాణ్యతతో చెయ్యడం. అంటే కర్మల క్వాంటిటిని కాక పూర్తి క్లారిటితో కర్మల క్వాలిటిపై దృష్టి సారించడం. 10) అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అనుకోవడం.

 నిరంతర యుద్ధం అనివార్యం! చుట్టు పొంచి ఉన్న పెను ప్రమాదాలతో పోరాటం తథ్యం!!

సందు దొరికితే కబళించేందుకు మన చుట్టూ షైతాన్‌ మూకలు మోహరించి ఉన్నాయి. అవి మన మనో భూమి వైపునకు ఉపద్రవాల వెల్లువను మళ్లించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాయి. మనం వాటిని చూడలేక పోయినా అవి మాత్రం మనల్ని చూస్తూ మన మనస్సును తమ వశీకరణలతో వశ పర్చుకోవడానికి ఉరకలేస్తున్నాయి. ”మనిషి హృదయంపై ఉపద్రవాలు ఆకాశం నుండి కుండపోతగా కురుస్తాయి” అని ప్రవక్త (స) వారి మాటకు నేపథ్యం ఇదే. ”మనిషి నరనరాల్లో రక్తం కన్నా వేగంగా షైతాన్‌ ప్రవహిస్తూ ఉంటాడు” అని స్వయంగా ప్రవక్త (స) అన్నారంటే …. ప్రమాదం ఎంత ప్రమాదకరంగా ఉందో ఊహించొచ్చు. మనం మన తరఫున రక్షణగా నిలచి, ధర్మం ప్రబోధించిన సకల శస్త్రాలతో రేయింబవళ్లు యుద్దం చేసి, శత్రువుపై విజయం సాధించే కాంతి పెరిగితే ఆత్మ జ్యోతి దేదీప్యమానం అవుతుంది. శత్రువును మట్టి కరిపించే అంతరంగిక శక్తి మనలోని ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ శక్తి మన అసలు మనుగడకు, హృదయ స్వచ్ఛతకు, పరలోక సాఫల్యానికి మూలం. ఈ మానసిక శక్తినే ఖుర్‌ఆన్‌ ‘నఫ్సె లవ్వామహ్‌’ – ఆత్మఘోష అంటుంది. అదే ఈ ఆత్మఘోష గొంతును నొక్కేస్తే మన హృదయం రోగ బారిన పడుతుంది. అది నీరసించిన మరుక్షణం ‘నఫ్సె అమ్మారహ్‌’ – దుష్టాత్మ విజృంభిస్తుంది. అది చెలరేగిందా మనిషి ఆధ్యాత్మికతను చింపిన విస్తరిని చేస్తుంది. కాబట్టి ఆత్మఘోషను కాపాడుకోవాలి.హృదయ స్వచ్ఛతకు ఇది ఎంతో కీలకం.

చివరి మాట:

దేహ రోగాలు ఎన్నున్నా, ఎంత భయంకరమైనవై ఉన్నా మరణంతో అంతమయి పోతాయి. కానీ హృదయ రోగ ఇబ్బందులు అసలు మరణం తర్వాతనే మొదలవుతాయి. కాబట్టి మన హృదయాలను కాలుష్య బారిన పడకుండా కాపాడుకోవాలి. అల్లాహ్‌ నేర్పిన దుఆతోపాటు ప్రవక్త (స) తరచూ చేసిన ప్రార్థన మనం కూడా చెయ్యాలి.

”రబ్బనఘ్ఫిర్‌లనా వలి ఇఖ్వానినల్లజీన సబఖూనా బిల్‌ ఈమాన్‌ వలా తజ్‌అల్‌ ఫీ ఖులూబినా గిల్లల్‌ లిల్లజీన ఆమనూ రబ్బనా ఇన్న రవూఫు ర్రహీమ్‌”-”మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు”. (అల్‌ హష్ర్‌: 10)

”అల్లాహుమ్మజ్‌అలిల్‌ ఖుర్‌ఆన రబీఅ ఖల్బీ వ నూర సద్రీ, వ జహాబ హుమూమహు, వ గుమూమహు”-ఓ అల్లాహ్‌ ఖుర్‌అన్‌ను నా మనో వసంతంగా చెయ్యి. నా ఆత్మజ్యోతిగా మార్చు. నా హృదయ కలతలను, బాధలను దూరం చేసేదిగా చెయ్యి”. ఆమీన్‌!

 

Related Post