నైతిక విలువల్ని నిలుపండి…!

Originally posted 2013-05-17 22:32:10.

 save-earth-hands-heart-flower-water-desert-19359511
రాకెట్టు వేగంతో దూసుకుపోతున్న ప్రగతి, త్వర త్వరగా మారుతున్న పరిస్థితులలో మానవ సమాజం రకరకాల సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. ఒనరులు పెరుగుతున్నా, ఓనమాలు నేర్చుకునేవారు అధికమవుతున్నా సామాజిక రుగ్మతలు, సంఘంలోని అసాంఘీక కార్యకలాపాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఇంటిలోనూ ఈనాడు పెద్దలకు, పిల్లలకూ మధ్య అవగాహనా లోపం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. నైతిక విలువలలో మనం ఇముడ్చుకోలేనన్ని మార్పులు పొడ సూపు తున్నాయి. వెనుకటి తరాల వారికి ఎదురవని అనేక సమస్యలు ఈనాడు మనకు ఎదురవుతున్నాయి. పరస్పరం నిందా రోపణలు, కక్షలు, కార్పణ్యాలు పెచ్చు పెరిగి పోతున్నాయి. కలతలు రేగి కుటుంబాలలో మానసిక ఒత్తిడులు, శారీరక రుగ్మతలను కలుగజేస్తున్నాయి. పర్యవ సానంగా ప్రతి ఒక్కటీ అశ్రద్ధ చేయబడుతున్నది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ అశ్రద్ధ పిశాచానికి బలవు తున్నారు.
  ఈ లోకంలో ఎవరూ సర్వజ్ఞులు కారు. అందరికీ అన్ని విషయాలూ తెలియవు. మన చుట్టూ పరచుకొన్నవన్నీ మనకు తెలిసినవి కావు; మరీ తెలియనివీ కావు. కొన్నింటి గురించి బాగా తెలుసు. కొన్నింటిని గురించి చూచాయగా తెలుసు. కొన్నింటిని గురించి అసలేమీ తెలీదు. ఇక తెలిసినవారిలో కొందరు సరళమైన విషయాన్ని కూడా, సంక్షిప్తంగా మార్చి చెబుతారు. కొందరు ఎంత క్లిష్టమయిన విషయాన్నయినా సున్నితంగా, సరళంగా, సౌమ్యంగా, స్నేహంగా, అందంగా, అందరికి నచ్చేలాగా చెబుతారు. కాబట్టి బాగా తెలిసివారు, బాగా చెప్పగలిగినవారు, తెలియని వారికి  తమకు తెలిసిన  విషయాలను తేనె పలుకుల ద్వారా తెలియపర్చాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ గురించి-
   ”కుల్లు మన్‌ అలైహా ఫాన్‌. వ యబ్ఖా వజ్హు రబ్బిక జుల్‌జలాలి వల్‌ ఇక్రామ్‌” (భూమండలంపై ఉన్నవారంతా నశించి పోవలసినవారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే) అన్న ఖుర్‌ఆన్‌ మాట ప్రకారం పుట్టిన ప్రతి ప్రాణీ కొంత కాలానికి చనిపోతుంది. అంతకు ముందున్న వయసు మళ్ళిన థను వృద్ధాప్యం అంటార. వయస్సు అన్నది మూడు విధాలు – 1) భౌతికమైనది 2) మానసికమైనది 3) కాలాన్ని బట్టి నిర్ణయించేది. ప్రతి వ్యక్తి యొక్క శరీరావయవాల పనితీరును బట్టి ఖరారయ్యేది భౌతికపరమైన వయస్సు. ఆలోచనా సరళిని బట్టి నిర్ణయించేది మానసికమైన వయస్సు. సంవత్సరాలు, నెలల్ని బట్టి అంచనా వేసేది కాలానికి సంబంధించిన వయస్సు.
 ముదిమి ముదిరినకొద్దీ కణాల శక్తి సామర్ధ్యం క్షీణిస్తుంది. క్రమక్రమంగా అపరిష్కృతంగా ఉన్న లోపాల నిష్పత్తి పెరిగి కణాలు పని చేసే పద్ధతిలో తేడా ఏర్పడుతుంది. పర్యవసానంగా వృద్ధాప్య సమస్యలు ఉత్పన్న మవుతాయి. హృదయం, ఊపిరి తిత్తులు, కాలేయం పని భారాన్ని మోయలేక ఇబ్బందిని కలుగజేస్తాయి. వ్యాధి నిరోధక వ్యవస్థ అదుపు తప్పుతుంది. కంటి చూపు తగ్గుతుంది. జీర్ణ శక్తి లోపిస్తుంది. జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుంది. కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. స్పర్శ, స్పందనల్లో కూడా మార్పు వస్తుంది. కోపం, చిరాకు అధికమవుతుంది. ఓర్పు సహనాలు తగ్గు ముఖం పడతాయి. ముఖ్యంగా ఇతరుల సహాయం కావలసి వస్తుంది.
  అట్టి తరుణంలో వృద్ధులకు కావలసింది డబ్బు కాదు, ఆప్యాయత. ఆప్యాయత కావాలి వారికి. ఆదరంగా మాట్లాడేవారు కావాలి వారికి. అనురాగంతో చూసుకునే సంతానం కావాలి వారికి. విశాల  హృదయంతో,   ప్రేమ దయార్ద్రతతో వ్యవహరించేవారు కావాలి వారికి. ‘వ బనీన షుహదా’ ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకులు కావాలి వారికి. కాబట్టి ఆ సమయంలో వృద్ధుల పట్ల ఎలా ప్రవర్తించాలో, సానుభూతిని వ్యక్తపరచి వారికి ఉపశమనం ఎలా కలుగజేయాలో, వారి బాధను తగ్గించి, వారి సంతోషాన్ని ఎలా రెట్టింపు చేయాలో ఎంతో అందంగా ప్రవక్త (స ) వారు విశదపర్చారు:
  ”తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవ హరించండి. మీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు విసుగ్గా ‘ఉఫ్‌’ (ఊహ్‌) అని కూడా అనకండి. వారితో మర్యాదగా, మృదువుగా మాట్లాడండి. అణకువ, దయాభావం ఉట్టిపడే విధంగా మీ భుజాలను వారి ముందు అణచి పెట్టండి. ‘ఓ ప్రభూ! బాల్యంలో వీరు మమ్మల్ని (ప్రేమానురాగలతో) పోషించి నట్లుగానే నీవు వీరిపై దయ జూపు (రబ్బిర్‌ హమ్‌హుమా కమా రబ్బయానీ సగీరా) అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండండి.
  మీ ఉపాధిలో సమృద్ధిని, మీ ఆయుష్షులో పెరుగుదలను మీరు కోరుకున్నట్లయితే మీ బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండండి. తల్లిదండ్రుల సేవ చేయండి. తల్లి పాదాల క్రింద ఉంది, తండ్రి స్వర్గ ద్వారా లన్నింటిలో మధ్య ద్వారం లాంటివాడు. మీ స్వర్గాన్ని మీ సొంతం చేసుకుంటారో, వినాశనాన్ని కొనితెచ్చుకుంటారో మీ ఇష్టం. మీరు ఒకరి తల్లిదండ్రుల్ని తూల నాడటం మానుకోండి. వారిని తిట్టడం అంటే స్వయంగా మీ తల్లిదండ్రులని దూషించడమే అవుతుంది. తల్లిదండ్రుల స్నేహితులతో సత్సంబంధాలు పెట్టుకోవటం మరణా నంతరం వారికి మీరు చేసుకునే అత్యుత్తమ సేవ అని మరువకండి. పడక మీద చేరుకున్నాక వారిరువురికి మధ్య పడుకుని వారిని నవ్వించే కొడుకు స్వర్గ వనాలలో విహరిస్తుంటాడని నేను మీతో అంటున్నాను. ముసలివారై పోయిన తల్లిదండ్రులు – వారిరువురిలో ఒకరుగాని లేక ఇద్దరు గాని బ్రతికుండగా (వారి సేవ చేసుకొని) స్వర్గంలోకి ప్రవేశించలేకపోయిన వాడికన్నా పరమ దౌర్భాగ్యుడు మరొకడుండడు. అతని కీర్తి ప్రతిష్ఠ మట్టిపాలుగాను! ఇది నేను చేస్తున్న హెచ్చరిక!! తల్లిదండ్రుల అవిధేయతా చేదు ఫలాలు మీరు ఇహపరాల్లో చూస్తారు!!!

Related Post