త్యాగం సామాజిక జీవనానికి జీవనాడి. సమాజం సజావుగా సాగాలంటే సభ్యుల్లో త్యాగశీలం అనివార్యం.
త్యాగం – తనువులో చూపాలి. మనసులో చూపాలి. ధనంలో చూపాలి. సమయంలో చూపాలి. శక్తిలో చూపాలి. త్యాగం తన కోసం చెయ్యాలి. తనవారి కోసం చేయాలి. పరాయి వారి కోసమూ చెయ్యాలి. త్యాగం – ఆశయాల కోసం చెయ్యాలి. ఆదర్శాల కోసం చెయ్యాలి. తత్సమయ లక్ష్యాల కోసం చెయ్యాలి. చిరకాల సాఫల్యాల కోసం చెయ్యాలి. తాత్కాలిక గమ్యాల కోసం, శాశ్వత మార్గాల కోసం – జీవితమంతా త్యాగాల తోరణాలు నిండితే అందులో పండు వెన్నెల పండుతుంది. గుండెనిండా నెమ్మది నిండుతుంది. అందుకే సమాజం త్యాగాలను కోరుతుంది.
త్యాగం లేనిదే సమాజంలో అనురాగమూ లేదు, అనురక్తీ లేదు. మనుగడలో మమతలు పెరగాలంటే ప్రతి వ్యక్తీ ఎదుటివారి కోసం ఏదో ఒకటి త్యాగం చెయ్యవలసి వస్తుంది – కోరికల్ని త్యాగం చెయ్యవలసి వస్తుంది. కాంక్షల్నీ త్యజించవలసి వస్తుంది. మనసయిన మార్గాలనూ వదులు కోవలసి వస్తుంది. త్యాగం లేనిదే ఏ ఆశయమూ సిద్ధించదు. ఆశయం ఎంత ఉన్నతమైనదో త్యాగాలూ అంతే విస్తృతమయి ఉంటాయి. ఆశయం ఎంత పవిత్రమయిందో త్యాగాలు అంతే నిష్ఠను, చిత్తశుద్ధిని కోరుతాయి.
ముస్లింల జీవితాశయం – ఒక్క మాటలో చెప్పాలంటే – భూమిలో విభుని మాటే చెల్లాలి అన్నది. దాని వివరణః మనిషి తన వ్యక్తిగత జీవితంలోనూ అడుగడుగునా, క్షణక్షణాన సృష్టికర్త ఆదేశాలనే పాటించాలి. అతని సామూహిక జీవితంలోనూ అన్ని రంగాల్లోనూ ఎల్లెడలా ఆ పరమ ప్రభువు ఇచ్ఛే నెరవేరాలి. ఈ ఆశయానికి ప్రతి ముస్లిం వ్యక్త్తిగతంగానూ, ముస్లింల సమాజం సామూహి కంగానూ బాధ్యత వహించవలసి ఉంటుంది. అయితే విశ్వ ప్రభువు అభీష్టం ఏమిటి? చెడు సమసిపోవాలి. మంచి పరిఢవిల్లాలి! వ్యక్తిలోనూ, సమాజంలోనూ!!
ఈ ఆశయసిద్ధి కోసమే ముస్లిం జీవితమంతా కృషి చేస్తుంటాడు. పోరాడుతుంటాడు. అతని పోరాటం దుష్ట శక్తులతో, మిథ్యావాదాలతో, వినాశకర దృక్పథాలతో నిరంతరం సాగుతూ ఉంటుంది.
ఈ సంఘర్షణకు, చెడుతో జరిగే ఈ పోరాటానికి సమాయత్త పరచడానికి ఉద్దేశించబడినవే – ఇస్లాం ప్రతి పాదించే సకల ఆరాధనలు సకల ఉపాసనా రీతులు, నైతిక వ్యవస్థ, సామాజిక విధానం, రాజకీయ సిద్ధాంతం – ఇస్లామీయ జీవన వ్యవస్థ అంతా ఈ తర్ఫీదుకు దోహదపడేదే.
ఆ తర్ఫీదు, సుశిక్షణల అంతర్భాగమే ”హజ్జ్” యాత్ర కూడా. అందులో మనిషి ఆంతర్యంలో ఉద్భవించే కాంక్షల్ని, వాంఛల్ని మాత్రమే కాక సకల దౌర్బల్యాలను జయించాలని హజ్ శిక్షణ ఇస్తుంది. శిక్షణలో అంతర్భాగంగానే మనిషి మోహావేశాలన్నింటికీ, రుచులన్నింటికీ దూరం కావాలని నిర్దేశిస్తుంది దైవాదేశం:
”హజ్ నెలలు అందరికీ తెలిసినవే. ఈ నిర్ణీత మాసాల్లో హజ్ సంకల్పం చేెసుకున్న వ్యక్తి అప్రమత్తుడయి మెలగాలి. హజ్ కాలంలో అతను ఏ విధమయిన కామ చేష్టకు, పాపపు పనికి, పోట్లాటకు పాల్పడకుండా జాగ్రత్త పడాలి. మీరు చేసే సత్కార్యం ఏదయినా అది అల్లాహ్కు తెలుస్తుంది. హజ్ యాత్రకు ప్రయాణ సామగ్రిని తీసుకు మరీ బయలుదేరండి. అన్నింటికంటే ఉత్తమమయిన ప్రయాణ సామగ్రి నిష్ఠాగరిష్ఠత. కాబట్టి వివేచనాపరులారా, నా పట్ల అవిధేయత నుండి తప్పుకు మెలగండి”. (2: 197)
(టిఐపి వారి ‘వెన్నెల తెరలు’ పుస్తకం నుండి)