అవని పొత్తిళ్లలో ప్రాణం పోసుకునే అంకురాలు, పృధ్వి ప్రాంగణంలో మొగ్గలు తొడిగే రెమ్మలు, వసుంధర ఒడిలో వికసించే పూలు, క్షోణి శిక్షణలో ఎదిగే సస్యశ్యామల వృక్షాల తోరణాలు, పుడమి లోని అరణ్యాలు, ధరణిలోని ఇరులు-ఝరులు, నేలలోని పర్వతాలు-సముద్రాలు, నింగిలోని తార కలు, సూర్యచంద్రాదులు – ఒకటేమిటి అన్నింటా ప్రతిధ్వనిస్తున్నాయి ఆ పవిత్ర ధుని ధ్వనులు – ‘లబ్బయిక్ అల్లాహుమ్మ లబ్బయిక్, లబ్బయిక లా షరీక లక లబ్బయిక్..’ భూమిలో అణువణువు పులికిస్తోంది పరవశించి. అండ, పిండ, బ్రహ్మాండాల్లో దర్శనమిచ్చే ఆ ఘనాఘనుడి ప్రతిభకు ‘స్తోత్రం, ప్రశంసలు నీకే చెల్లు’ అంటూ కొనయాడుతున్నాయి తన్మయం చెంది. ‘సార్వభౌమత్వం నీదే’ అంటూ ఆ కరుణానిధిని ఘనంగా కీర్తిస్తున్నాయి తాదాత్మ్యానికి లోనయి. నాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ధుని ఒకే మానవ మాత్రుడు, ప్రవక్తల పితామహుని నోట ప్రతిధ్వనిం చింది. మరి నేడు: కొన్ని వేల సంవత్సరాల అనంతరం అనవతరంగా ధరణి దశ దిశల నుండి విన్పిస్తున్నాయి ఆ పవిత్ర ధుని ధ్వనులు.
ఇస్లామీయ జీవన వ్యవస్థకు సంబంధించిన సుందర, సుమనోహరమైన రాజప్రసారపు అయిదు మూల స్థంభాలలోని ఓ మూల స్థంభం హజ్. ఈ మాహారాధన మాధ్యమంతో ఇస్లామీయ జీవన సౌధానికి మనిషి ఆంతర్యంలో పునాదులు పడకపోతే కేవలం హజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయో జనం ఉండదు. స్థానికంగా మనిషి నమాజు ద్వారా అశ్లీల చేష్టలకు, అసభ్య ప్రవర్తనలకు, మితి మీరిన పోకడలకు దూరంగా ఉండి, జకాతు ద్వారా వ్యాపార లావాదేవీలు, ఉద్యోగ వ్యవహారాలు, రాజకీయ, ఆర్థిక వ్వయహారాలలో ఉన్న ధన తృష్ణ, స్వార్థం, మోసం, దురాశ మొదలయిన చీడలకు దూరంగా మసలుకుంటూ, ఉపవాసం ద్వారా ఆలోచనల్లో, అణువణువులో దైవభీతిని, నైతిక రీతిని నింపుకుని ఈ మహారాధన కోసం బయలుదేరుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐహికంగా మనిషి మినీ ప్రస్థానాలను దాటుకుంటూ ఈ మహా ప్రస్థానం దిశగా అడుగులు వేస్తాడన్న మాట. ఇక్కడ దైవం, దైవప్రవక్త విధేయతే పరమావధి. ఓ అనీర్వచనీయమయిన అనుభూతికి, ఓ అద్వితీ యమయిన భక్తిభావానికి, తన్మయానికి, తాదాత్మ్యానికి లోనవుతాడు. ఈ హజ్ మాహారాధన – దైవం జారీ చేసిన ప్రతి ఫర్మానాను ఎటువంటి తడబాటుకు, తత్తరపాటుకు లోనవకుండా తక్షణమే శిరసా వహించేలా శిక్షణ ఇస్తుంది. ఆజ్ఞాపించడమే తరువు ప్రాణాల్నయినా తృణప్రాయంగా త్యాగం చెయ్యడానికి సిద్ధమయ్యేటటువంటి మహా శిక్షణ ఇస్తుంది హజ్.
ఈ మహారాధన కోసం వచ్చిన సుజనుల అణువణువునా భక్తిపారవశ్యాలు తొణికిసలాడుతుం టాయి. స్వేచ్ఛా జీవిగా వారు జన్మించినా, ఆ స్వేచ్చాధికారాలను తమకు ప్రసాదించిన ఆ సర్వాధి కారి సమక్షంలో మాత్రం వారు దాసులుగా, గులాములుగా ఉండేందుకే ఇష్ట పడతారు. ఇక్కడ వారి ఇష్టమంటూ, అభిమతమంటూ, అభిప్రాయమంటూ ఏదీ ఉండదు; ఒక్క దైవాభిమతం, దైవా భీష్టం తప్ప. ప్రాంతీయ దుస్తులు తొలగించి కఫన్ వంటి రెండు తెల్లటి దుప్పట్లు చుట్టుకోమన్నా, ప్రాంతీయ భాషను విడనాడి ‘తల్బియా’ పలుకులు ఉచ్చరించమన్నా, ఇహ్రామ్ స్థితిలో సువాసన పూసుకోకు, వెంట్రుకలు సవరించుకోకు, ఎటువంటి సింగార చర్యల జోలికి పోకు, వేటాడకు అన్నా విన్న ప్రతి మాటను మరోమాట మాట్లాడకుండా బుద్ధిగా, నిండు భక్తితో పాటిస్తారు. ఇదే భక్తి ప్రపత్తులతో కాబా ప్రదక్షిణ, సఫామర్వాల మధ్య సయీ చేస్తారు. అప్పటి వరకు ఎంతో ప్రేమగా పెంచుకున్న తలవెంట్రుకలను క్షవరం చేస్తూ, తల అడిగినా తృణప్రాయంగా ఇచ్చేస్తానంటూ తల వంచి మరి చాటుతారు. ఊరి బైట మినా,ముజ్దలిఫా మైదానాల్లో భూమియే పాన్పుగా, ఆకాశమే కప్పుగా జీవిస్తారు. జమరాత్‌లపై కంకర్రాళ్లు రువ్వడం మొదలు ఖుర్బానీ, తవాప్ ఇఫాజా, హజ్ క్రియలన్నీ పూర్తయ్యే వరకూ ప్రతి ఒక్క ఆదేశాన్ని ఆదాబులతో సహా చక్కగా పాటిస్తారు. ఏ ఆజ్ఞ విషయంలోనయినా పొరపాటున తప్పు దొర్లితే దానికి ఫిద్యా – పరిహారం చెల్లిమచాలని మరో ఆజ్ఞ ఆవుతుంది. దానికీ సహృదయంతో సిద్ధమవుతారు. ఈ మహారాధన క్రియల్ని నిర్వర్తించడంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను, అవాంతర స్థితులను ఎంతో ఓపిగ్గా సంతోషంగా సహిస్తారు. ఆ విధంగా ఈ స్వల్ప కాలిక ఆరాధన ద్వారా వారికి శాశ్వతమయిన శిక్షణ ఇవ్వాలన్నదే అల్లాహ్‌ా అభిమతం. ఈ కారణంగానే ”స్వీకృతి పొందిన హజ్ ప్రతిఫలం ఒక్క స్వర్గం తప్ప మరేమి కాజా లదు” అన్నారు మహనీయ ముహమ్మద్ (స). అంటే ఈ మహాప్రస్థానం మరికొన్ని ప్రస్థానాలకు స్ఫూర్తి అవ్వాలి. అలా జీవించాలని ప్రయత్నిస్తూ మరణించినవారే సఫలీకృతులు! సర్వేజనా సృజనో భవంతు! సర్వే సుజనా సుఖినోభవంతు! అని కోరుతూ పాఠక మహాశయులందరికీ ఖుర్బానీ పండుగ శుభాకాంక్షలు!!