ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ముస్లింలు జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’లో ఎన్నో పరమార్థాలు, పరిశుద్ధమైన భావాలు ఇమిడి ఉన్నాయి. అసలీ పండుగ పేరే ‘ఫిత్రాల పండుగ’ (ఈదుల్ ఫిత్ర్) కావటం గొప్ప విషయం.
ఫిత్రాల ప్రధాన ఉద్దేశ్యం:
1) నెల రోజులు కేవలం తమ ప్రభువు ప్రసన్నత కోసం ఉపవాసాలు పాటించిన వారంతా ఓ విధమైన ప్రత్యేక అనుభూతిని, ఆనందాన్ని, తృప్తిని పొందటం సహజం. అది నిజంగానే వారి కోసం పర్వదినం. ఆ రోజున వారు కొత్త బట్టలు ధరిస్తారు. సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. రుచికరమైన, ఇష్టకరమైన ఆహార పదార్థాలు భుజిస్తారు. నలువైపులా సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆ వాతావరణమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఆ సంతోష సమయంలోనూ సమాజంలోని లేమికి గరయిన సోదరులను, నిరాధారులను, నిరుపేదలను, అనాథలను, వితంతువులను మరచిపోకండి అని తాకీదు చేస్తోంది ఇస్లాం. ”వారి కష్టాల్లో మీరూ పాలు పంచుకోండి. వారికి ఫిత్రా దానాలిచ్చి వారు కూడా సంతోషంగా పండుగ జరుపుకునేటట్లు చూడండి” అని ఉపదేశిస్తుంది ఇస్లాం.
2) విశ్వాసులు ఈ నెలలో తమ ప్రభువు ప్రసన్నత నిమిత్తం పాటించిన ఉపవాసాలలో – మానవ సహజమైన దౌర్బల్యాల వల్ల జరిగిన చిన్న చిన్న తప్పులను, లోటుపాట్లను ఈ ఫిత్రా దానాలు ప్రక్షాళనం చేస్తాయి.
హజ్రత్ అబ్దుల్లాహ్‌ా బిన్ అబ్బాస్ (రజి) గారిచే ఉల్లేఖించబడిన ఒక హదీసులో ఇలా ఉంది: ”అనవసరమైన, అపసవ్యమైన మాటల నుండి ఉపవాసి పరిశుద్ధత పొందేందుకు, మరో వైపు అగత్యపరులకు ఆహారం ప్రాప్తించేందుకు గాను మహా ప్రవక్త (సఅసం) ఫిత్రా దానాన్ని తప్పనిసరిగా నిర్ధారించారు”. (అబూ దావూద్, సుననె ఇబ్బు మాజా)
ఫిత్రా ఆదేశం:
అసలు ఫిత్రా అనే పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఇది ముస్లింలపై తప్పనిసరి (వాజిబ్) గా ఖరారు చేయబడింది. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రజి) కథనం ప్రకారం, మహా ప్రవక్త (స) ఫిత్రా దానాన్ని ప్రతి ముస్లింపై – అతను బానిస అయినా, స్వతంత్రుడైనా పురుషుడైనా, స్త్రీ అయినా, చిన్నవాడైనా, పెద్దవాడైనాసరే – విధిగా నిర్ణయించారు. (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)
”ఆ రోజు నిరుపేదలు చేయి చాచి అడుక్కునే పరిస్థితి రాకుండా చేయండి” అని కూడా ఆయన (సఅసం) చెప్పినట్లు వేరొక ఉల్లేఖనంలో ఉంది.
ఫిత్రా పరిమాణం:
నిత్య జీవితంలో ఆయా ప్రాంతాల ప్రజలు తినే ఆహార ధాన్యాలలో నుంచి దేన్నో ఒక దానిని ఫిత్రాగా ఇవ్వడం ఉత్తమం. అనివార్యమైతే తప్ప నగదును ఫిత్రాగా ఇవ్వరాదు. దైవ ప్రవక్త (స) గానీ, ప్రవక్త ప్రియ సహచరులు (రజి)గానీ నగదు మొత్తాన్ని ఫిత్రా రూపంలో ఇచ్చినట్లు ఎక్కడా ఆధారాల్లేవు. అయితే మరీ అవశ్యం అనుకున్నప్పుడు నగదు రూపంలో ఇవ్వటంలో తప్పు లేదు.
ఫిత్రా ఎప్పుడు ఇవ్వాలి?
షవ్వాల్ నెలవంకను చూసిన క్షణం నుంచి ఫిత్రా చెల్లింపు తప్పనిసరి (వాజిబ్) అవుతుంది. అయితే పండుగ నమాజుకు ముందే ఈ పంపిణీ అయిపోవాలి. ఇబ్నె ఉమర్ (రజి)చే ఉల్లేఖించబడిన ఒక రివాయతులో రెండు రోజులు ముందుగా కూడా ఇవ్వవచ్చని ఉంది. మొత్తానికి స్పష్టమయ్యే దేమిటంటే ఈ ఫిత్రా దానాలు పండుగ నమాజుకు ముందే అవసరార్థులకు ముట్టాలి.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి) ఇలా అన్నారు: ”ఉపవాసిని వ్యర్థ విషయాల నుండి ప్రక్షాళనం చేయడానికి, అగత్య పరులకు ఆహార వస్తువులను సమకూర్చ టానికి దైవప్రవక్త (సఅసం) ఫిత్రా దానాన్ని విధిగా నిర్ధారించారు. కాబట్టి ఎవడు పండుగ నమాజుకు ముందే దీనిని చెల్లిస్తాడో అది వాని పాలిట జకాత్ అవుతుంది. అల్లాహ్‌ా దానికి ఆమోదముద్ర వేస్తాడు. మరెవడు నమాజు తర్వాత చెల్లిస్తాడో అది సాధారణ దానంగా పరిగణించబడుతుంది”. (అబూ దావూద్, ఇబ్నె మాజా)
ఫిత్రా ఎవరికి ఇవ్వాలి?
సాధారణంగా మనం జకాత్‌ను ఏ ఏ పద్దుల్లో వెచ్చిస్తామో ఆ పద్దుల్లోనే ఫిత్రాలను కూడా ఇవ్వవచ్చు. కాని నిరుపేదలకు, అగత్యపరులకు, పండుగ ఖర్చులకు ఏమీ లేనివారికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఎందుకంటే- ”వారు ఆ రోజున అడుక్కు తినే పరిస్థితి రాకుండా చూడండి” అని ప్రవక్త (స) గారు చెప్పి ఉన్నారు. అయితే తమ ప్రాంతాలలో బీదలు లేనప్పుడు మాత్రం ఇతరులకు ఫిత్రా ఇవ్వవచ్చు.
హెచ్చరిక !
1) ధనికురాలైన భార్య పేదవాడైన తన భర్తకు ఫిత్రా దానం చేయగలదు. కాని భర్త మాత్రం తన భార్యకు జకాత్ ఇవ్వలేడు. ఎందుకంటే భార్యను పోషించే బాధ్యత భర్తపై ఉంది.
2) ఒక రోజుకు సరిపడా ఆహార వస్తువులు కూడా లేని వ్యక్తి ఫిత్రా చెల్లించనవసరం లేదు. ఎందుకంటే కరుణామయుడైన అల్లాహ్‌ా ఏ ప్రాణిపై కూడా శక్తికి మించిన భారం వేయడు.
3) ఒక ఫిత్రాను అనేకమందికీ పంచవచ్చు. అనేక ఫిత్రాలను ఒక వ్యక్తికీ ఇవ్వవచ్చు. ఈ విషయంలో దైవప్రవక్త (స) ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు.
4) మరీ అవసరమైతే తప్ప ఒక ప్రాంతపు ఫిత్రాను మరో ప్రాంతానికి తరలించటం భావ్యం కాదు. జకాత్ మాదిరిగానే ఈ సూత్రం ఫిత్రాలకు కూడా వర్తిస్తుంది.
ప్రవాసాంధ్రులకు మనవి
ప్రవాసాంధ్ర ముస్లిం సోదరులకు ఈ శుభ సందర్భంగా మేము చేసుకునే విజప్తి ఏమిటంటే; వారు వివాహితులైన పక్షంలో
తమ అధీనంలో ఉన్న కుటుంబ సభ్యులందరి ఫిత్రాలు విధిగా చెల్లించాలి. అవివాహిత వ్యక్తులు సయితం కువైట్ ప్రభుత్వం విర్ధారించిన లెక్క ప్రకారం తమ తరఫున ఫిత్రా ఇవ్వాలి – అంతేగాని ఇండియా నిసాబ్ ప్రకారం కాదు. తమ జిల్లాలకు, ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు సామూహికంగా ఫిత్రాలు వసూలు చేసి అక్కడే పంపిణీ చేస్తున్న పక్షంలో, ఫిత్రా మొత్తాలను ఆ సంస్థలకు ఇవ్వటం మంచిది. లేదంటే వారు తమ కుటుంబీకుల ద్వారానయినాసరే – పండుగకు ముందే అవసరార్థులకు ఫిత్రా ముట్టేలా జాగ్రత్త వహించాలి.
ఫిత్రా చెల్లింపు తప్పనిసరి! పండుగకు ముందే ఫిత్రా హక్కుదారులకు ముట్టాలి!! అన్యధా అది ‘ఫిత్రా’ అనిపించుకోదు.