గురువు శిష్యులు అనుబంధం
“ప్రభూ! నాకు మరింతజ్ఞానం ప్రసాదించు” అని వేడుకో (తాహా: 114)
జీవితం అనే రంగస్థలంపై ఒక సారి ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేము. చివరి శ్వాశ ఆగెంత వరకు ఆడుతూనే ఉండాల్సిందే. అందునా ఆడడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని జీవులం. అలాంటి మనకు ఎంత కాలం జీవించామన్నది కాదు గొప్ప, ఎంత గొప్పగా జీవించామన్నదే గొప్ప అని చేయి పట్టి మరి నడిపించిన జగత్గురువులు ప్రవక్తలు. ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు వారే మహర్షులు… ఈ పరంపరలో దైవంచే నియమించబడిన తోలి గురువు ప్రవక్త ఆడం (అ) అయితే, అంతిమ గురువు మహనీయ ముహమ్మద్ (స). అదే పరంపరను కోనసాగిస్తూ….
జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ బృందావనానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. మానవత్వం పరిమళించే విద్యాకుసుమాలుగా శిష్యులను తీర్చిదిద్ది, వారు జాతికి అందిన అమూల్య వరాలుగా, ఆభరణాలుగా పరిఢవిల్లాలని మనస్సు నిండుగా యువతను దీవించే, ప్రజ్వలించే దివ్వె ఉపాధ్యాయుడు!
దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: అల్లాహ్ నన్ను హింసావాదిగా, నియంతగా, నిరంకుశ వాదిగా, పెత్తనం చెలాయించే వానిగా, కర్కశునిగా చేసి పంప లేదు. నిశ్చయంగా అయన నన్ను సౌమ్యునిగా, ఉపాధ్యాయునిగా, నిరాడంబరునిగా, సునిర్మల హృదయునిగా చేసి పంపించాడు. (సహీహ్ ముస్లిం)
కేవలం పుస్తకాలు ఔపోసన పట్టినంత మాత్రాన మనుషులు పండితులు కారు. దైవభీతిపరులే సిసలైన పండితులు. విద్యకొద్దీ వినయమన్నట్టుగా జ్ఞానం పెరిగినకొలది మనిషిలో భక్తివిశ్వాసాలు పెంపొందాలి.
మానవాళికి ఆది గురువులు ప్రవక్తలు
విప్లవ ఉద్యమాలను నడిపి మార్పు సాధించినవారు, సంస్కర్తలు ఇలా ఎందరో మనకు చరిత్ర అధ్యయనంలో కానవస్తారు. విభిన్న మత ధర్మాలను బోధించిన వారు ఉన్నారు. నైతిక ప్రమాణాలకు పెద్దపీట వేసిన వారు ఉన్నారు. కాని వారి బోధనలు, వారు సాధించిన విజయాల, ఫలితాలు పరిశీలిస్తే అందులో సమాజ శ్రేయోశుభాలు బహు కొద్దిగా మాత్రమే కానవస్తాయి. ఏదో ఒక జీవన రంగానికి మాత్రమే ఫలితాలు పరిమితమై ఉంటాయి. ఆ ప్రయోజనాలతో పాటు కొన్ని అవాంఛనీయమైన ధోరణులు కూడా అక్కడ కనబడతాయి. మానవ చరిత్రలో మనిషి జీవితాన్ని సంపూర్ణంగా, అన్ని రంగాల్లో సంస్కరించినవారు కేవలం ప్రవక్తలు తప్ప మరెవ్వరూ లేరు. మనిషి అంతరంగాన్ని, మనిషి బాహ్య ఆచరణను సమస్తాన్ని చక్కదిద్దినవారు ప్రవక్తలు మాత్రమే.
హజ్రత్ అబ్దుల్లాహ్‌బిన్ అమ్రూ (రజి) ఉల్లేఖనం ప్రకారం:- ‘ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) మస్జిదె నబవికి వెళ్లినప్పుడు, అక్కడ రెండు బృందాలు విడివిడిగా సమావేశమయ్యాయి. ఒక బృందం… దైవారాధనలో నిమగ్నమై ఉంది. రెండో బృందం నిరక్షరాస్యులకు చదువు చెప్పే పనిలో ఉంది. అది చూసి ప్రవక్త మహనీయులు, ‘ఇరు బృందాలూ మంచిపని చేస్తున్నాయి. ఒక బృందంలోని సభ్యులు దైవారాధనలో ఉన్నారు. ఇది చాలా మంచిపని. అయితే దైవం తలిస్తే వారి ఆరాధన, వేడుకోళ్లు స్వీకరించవచ్చు, స్వీకరించకపోనూవచ్చు. రెండో బృంద సభ్యులు చేస్తున్న పని మొదటివారి కంటే ఇంకా ఉత్తమమైనది. ఎందుకంటే వీరు తెలియనివారికి జ్ఞానం, వివేకం, విచక్షణ తెలియచేస్తున్నారు. కనుక ఇది ఉత్తమకార్యం. నేనూ ఉపాధ్యాయునిగా, బోధకుడిగానే పంపబడ్డాను’ అని ప్రవచిస్తూ, ప్రవక్త రెండవ బృంద సభ్యులతో కూర్చున్నారు.
ఏ హృయంలోనయితే ధర్మశీలత, దైవభీతి ఉంటుందో అక్కడే ప్రవర్తనలో సౌందర్యం ఉంటుంది. మనుషుల్లో ప్రవర్తన అందంగా ఉన్నప్పుడే కుటుంబ జీవనంలో సామరస్యం ఉంటుంది. సంసారంలో సామరస్యం, సహిష్ణుతలు ఉన్నప్పుడే సమాజంలో క్రమశిక్షణ, గౌరవ భావం ఉంటుంది. సమాజంలో క్రమశిక్షణ, అందరి యెడల గౌరవ భావం ఉన్నప్పుడే దేశం, ప్రదేశంలోనయినా శాంతి పరిఢవిల్లుతుంది. మరే దేశం, ప్రాంతంలోనయితే ఇవన్నీ ప్రోగవుతాయో అది అల్లాహ్ కృపానుగ్రహాలకు ఆలవాలమవుతుంది.
ఆవుని చూస్తే సృష్టిలో చులకనగా చూసే గడ్డిపరకలను తిని, సృష్టికి శ్రేష్ఠుడైన వాడిని జీవించడానికి అవసరమైన ద్రవ్యాలను ఇస్తుంది. మనకు అవసరం లేకపోయినా అది వేరే రూపం నుండి సమాజానికి ఉపయోగపడతాయని అవు, గడ్డిని చూస్తే అవగతమవుతుంది. సృష్టిలో ఏది నిరర్థకం కాదు. ప్రతి దానిని ఒక లక్ష్యంతోనే పుట్టించాడు అల్లాహ్. అవి గగన భువనాలు కావచ్చు, గడ్డి పరకలు – దానికన్నా అల్పమైనవీ కావచ్చు. ప్రతి దానికి ఓ ప్రయోజనం తప్పకుండా ఉంటుంది, ఉంది.
శిష్యులకు సద్గురువులు చేసే బోధలు కొన్ని సందర్భాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం. కొందరు అనుగ్రహభాషణాలతో, మరికొందరు ఆచరణాత్మకమైన పద్ధతుల్లో బోధిస్తారు. కోపాన్ని దిగమింగాలి. దుఃఖాన్ని అధిగమించాలి. మౌనాన్ని అనుభవించాలి. నిశ్చల ధ్యాన ఫలితాన్ని అందుకోవాలి. జీవితంలో ఓ గురువు కష్టాన్ని దూరం చేస్తాడు. ఓ గురువు చిరకాల కోరిక సాధనను సులువుగా మారుస్తాడు. ఓ గురువు నైరాశ్యాన్ని ప్రారద్రోలతాడు. ఓ గురువు అపరిమిత జ్ఙానాన్ని అనుగ్రహించేస్తాడు.
హజ్రత్ అబూ ఉమామా (రజి), కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: మీలో అందరి కన్నా అల్పునిమీద నాకెంత విశిష్ఠత ఉందో- ఒక జ్ఞానికి మరో ఆరాధకుడి మీద అంత విశిష్ఠత ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: ప్రజలకు మంచిని బోధించే వారి మీద దేవుడు కారుణ్యాన్ని కురిపిస్తాడు. ఇంకా దైవదూతలు, భూమ్యాకాశాల్లో ఉన్నవారు, ఆఖరికి చీమలు తాముండే రంధ్రంలో నుండి, చేపలు (నీళ్ళలో నుండి) వారి మీద దైవ కారుణ్యం వర్షించాలని ప్రార్థిస్తూ ఉంటారు. (తిర్మిజీ-హసన్)
సమాజంలో పిల్లలు అధిక మాత్రులు! వీరి ప్రతిభ, సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపాధ్యాయుడు ‘వజ్రాన్ని సాన బెట్టే ఒక సాధనం’ కావాలి! మారుతున్న పరిస్థితుల కనుగుణంగా, తగిన నూతన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో, తాను నిరంతర విద్యార్థిగా ఉంటూ, సృజనాత్మక పద్ధతులతో యువతకు మార్గదర్శనం చేస్తూ, దేశ భవితను తీర్చి దిద్దాల్సిన గురువు బాధ్యత నేడు మరింత బృహత్తరమైనదని చెప్పక తప్పదు. విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి స్వావలంభనకు నెలవు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఉత్తమ గురువులు ఉన్నత భావాలుగల శిష్యులనే కాదు, చుట్టూ ఉండే సమాజాన్ని ఉత్కృష్టంగా నిర్మించగలిగిన నాడే జాతి జీవనం మహోన్నతంగా సాగుతుంది.
భయాలను తొలగించాలి. ఉత్తములుగా మార్చాలి
ఎవరు ఔనన్నా, కాదన్నా ఒక్కటి మాత్రం వాస్తవం. గతంలో గురువులకు సమాజంలో దక్కిన గౌరవ మర్యాదలు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు దక్కడం లేదు. ఇది కొంతమందికి చేదుగా అనిపించవచ్చేమో కానీ, కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం ఇదే. ఈ పరిస్థితి పూర్తిగా మారాలి. విధి నిర్వహణలో ఉపాధ్యాయుల్లో అంకితభావం మరింత పెరగాల్సి ఉంది. కేవలం నైన్ టు ఫైవ్ పనిచేస్తే సరిపోదు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత గురువుదే. సకాలంలో సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధపరచడం, మంచి రిజల్ట్స్ సాధించడం గురువుల బాధ్యతల్లో ఒకటి మాత్రమే. కానీ, ప్రస్తుతం అవే సర్వస్వంగా మారిపోవడం దురదృష్టకరం. ఒక రకంగా ఉపాధ్యాయుడి బాధ్యతలను కుదించడమే ఇది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాల్సిందే. కానీ, విద్యతోపాటు చాలా అంశాలపై ముఖ్యంగా, భావి జీవితంలో విద్యార్థులు ఎదుర్కొబోయే సవాళ్ళను చెప్పి, అందుకు వారిని సన్నద్ధం చేయడం కూడా గురువుల బాధ్యతే. చిన్నచిన్న విషయాలకే కొందరు విద్యార్థులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న బాధాకరమైన ఇన్సిడెంట్లను చూస్తున్నాం. ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడకుండా ఉపాధ్యాయులే పిల్లల్ని మానసికంగా సిద్ధం చేయాలి. సమస్యను, సవాళ్ళను ఎదుర్కొనే దృఢ సంకల్పం విద్యార్థుల్లో అలవడేలా గురువులే చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులను, వారి ఆర్థిక పరిస్థితిని, సమాజాన్ని అర్థం చేసుకునే రీతిలో విద్యార్థులకు తర్ఫీదునివ్వాలి. పెద్దయ్యాక ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వాలి. కేవలం టీచర్లతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది జరిగినప్పుడు ఉపాధ్యాయుల పేరు, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
గురువు నిర్మలుడై, శాంతస్వభావం కలిగి, సాధన సంపత్తి కలిగి, మితభాషిగా ఉండాలి. కామ క్రోధాలను వదిలిన వారై ఉండాలి. సదాచార ప్రవర్తకులై, జితేంద్రియులై ఉండాలి. అంతేకాదు, ధర్మ శాస్త్రం ఎంత తెలుసో, సంప్రదాయమూ అంతే తెలిసిన వారే ఉత్తమ గురువులు అని చెబుతారు పెద్దలు. ఎందరో విద్యార్థులకు మార్గదర్శిగా ఉండే గురువు అంతరంగంలో, బాహ్యంలో శుచిత్వం కలిగి ఉండాలి. అలాంటి ఉపాధ్యాయుడే ఆదర్శవంతుడు అవుతాడు. శిష్యులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దగలుగుతాడు. శిష్యులను ప్రోత్సహించడం మాత్రమే కాదు, వారి లోపాలను గుర్తించి వాటిని అధిగమించే అవకాశాలూ కల్పిస్తాడు. శిక్షణ ఇవ్వడం మాత్రమే అవసరమైతే తానే స్వయంగా పూనుకొని శిష్యుడిని ఉద్ధరిస్తాడు. జిజ్ఞాసులై శిష్యునికి సమర్థుడైన గురువు, అలాగే సమర్థుడైన గురువు కు యోగ్యుడైన శిష్యుడు లభించడం ఒక అదృష్టమ్. వ్యక్తి పట్టుదలకు, సాధించాలనే తపనకు గురువు మార్గదర్శకం తోడైతే, ఆ వ్యక్తి ఉత్తమ స్థాయికి చేరగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత లక్ష్యం కూడా ఇదే. ఆయన సందేశం మనిషి జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. మనిషి అంతరంగంలో మార్పు సాధించింది. ఆరాధనా స్థలమైన మస్జిదు మొదలు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగే మార్కెట్టు వరకు, పాఠశాల నుంచి న్యాయస్థానం వరకు ఇంటి నుంచి యుద్ధరంగం వరకు అన్ని చోట్ల పాపభీతి, దైవభక్తి అలుముకున్నాయి. ప్రజల ఆలోచన విధానం మారింది. భావాలు మారాయి. భావావేశాల్లో మార్పు వచ్చింది. దృక్కోణం మారింది. అలవాట్లు మారాయి. ఆచరణలు మారాయి, ఆచారాలు, సంప్రదాయాలు మారిపోయాయి. హక్కులు, బాధ్యతల తీరుతెన్ను మార్పుకు గురయ్యాయి. మంచి, చెడు ప్రమాణాలు, ధర్మ బద్ధం, ధర్మ నిషిద్దం అన్న కొలమానాలు మారిపోయాయి. నైతిక విలువలు, సంవిధాన సూత్రాలు, శాసనాలు, యుద్ధ నియమాలు, శాంతి విధానాలు అన్నీ మారిపోయాయి. ఉపాధి మార్గాలు, దాంపత్య నియమాలు అన్నీ మారిపోయాయి. నాగరికత, సామాజిక జీవనాలకు సంబంధించిన సమస్త రంగాలు విప్లవాత్మక మార్పుకు గురయ్యాయి. జీవన రంగాన్నింటిని అలుముకున్న మార్పు ఇది.
ఈ మార్పులో ప్రతిచోట మనకు శ్రేయోశుభాలే కనబడతాయి. ఈ మార్పులో ఎక్కడా చెడు మచ్చుకు కూడా కనబడదు. ఎక్కడా హాని అగుపడదు. ఎక్కడా విచ్ఛిన్నం లేదు. అన్ని వైపులా నిర్మాణమే. ఎటు చూసినా ప్రగతి వికాసాలే. నిజం చెప్పాలంటే మానవాళికి మార్గదర్శి అయిన ప్రవక్త ముహమ్మద్ (స) వల్ల మానవాళికి ఒక కొత్త ఉదయం ప్రాప్తమయ్యింది. విశ్వజనీన సోదరభావానికి పునాదులు పడ్డాయి. చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. ఆయన సాధించిన ఈ మహత్కార్యం చరిత్రలో సాటిలేనిది.
అజ్ఞాన, అంధకారంలో కూరుకుపోయిన నాటి సమాజంలో ముహమ్మద్ (స) జ్ఞానజ్యోతులు వెలిగించారు. విద్యా కుసుమాలను వికసింపజేశారు. విద్యార్జన ప్రతి ఒక్కరి విధి అని ఆయన నిర్దేశించారు. ‘జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం’ అని విశదీకరించారు.
విద్యావిజ్ఞానాలు మనిషిని ఇహపరలోకాల్లో ఉన్నతస్థానాలకు, సాఫల్య శిఖరాలకు చేరిస్తే, అజ్ఞానం, అవిద్య అతడిని అధఃపాతాళంలో కూరుకుపోయేలా చేస్తాయి. అందుకే ముహమ్మద్ ప్రవక్త (స) విద్యావిజ్ఞానాలకు పెద్దపీట వేశారు. వయోభేదం కాని, వర్గభేదం కాని, స్త్రీపురుషులన్న లింగభేదం కాని లేకుండా అన్ని వయసులవారు, అన్నివర్గాలవారు, వర్ణాలవారు, స్త్రీలు, పురుషులు అందరూ విధిగా విద్యార్జన చేయాలని నిర్దేశించారు. ‘విద్య’ అంటే కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే కాదు. విద్య విజ్ఞానాన్ని నేర్పాలి.
మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం సంపాదించుకోవడంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది.
చదువు మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్లాడంటే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాడని అర్థం. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు భారమైనా తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ఉత్తమ పాఠశాలల్ని ఎంచుకుంటారు. అయితే ఇక్కడ పిల్లలకు మార్కులు, ర్యాంకులు మాత్రమే ముఖ్యం కాదు.. వారికి కొన్ని కనీస మర్యాదలు నేర్పించడం అత్యవసరమని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల వారికి మంచి విద్యతో పాటు సత్ప్రవర్తన కూడా అలవడుతుంది.
గురువు అంటే కేవలం చదువు నేర్పిన వారే కాదని, మనకు జీవితానికి అవసరమైన అనేక అంశాలను నేర్పిన ప్రతి ఒక్కరినీ గురువుగానే భావించాలి, మాట్లాడ్డం దగ్గర్నుంచి పోట్లాడ్డం వరకూ అంతా సమాజం నుంచే నేర్చుకుంటున్నాము. తల్లిదండ్రుల అనురాగం గారంగా మారితే బిడ్డ భవిష్యత్ పాడవుతుందని, కానీ గురువు పెంచుకునే అనురాగం వారిని వృద్ధిలోకి తీసుకువస్తుంది, గురువు దృష్టిలో రాజు కొడుకైనా, సేవకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, రౌతు కుమార్తె అయినా సమానులే అని, విద్య నేర్పిన గురువుల పట్ల జీవితమంతా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటంతో పాటు, గురువు గొప్పతనాన్ని లోకానికి తెలియజెప్పే రీతిలో ప్రవర్తించాలలి.
శిష్యరిక విశిష్టత
తెలిసినవారూ, తెలియనివారూ ఇరువురూ సమానులు కాగలరా? (జుమర్ : 9)
మీలో విశ్వసించినవారికి, జ్ఞానం ప్రసాదించ బడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు. (ముజాదలహ్: 11)
అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. (ఫాతిర్: 28)
హజ్రత్ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: (ధర్మ) జ్ఞానాన్ని ఆర్జించటం కోసం ఎవరయినా ఒక దారిన పడితే దేవుడు ఆ దారి గుండా అతని కోసం స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. (ముస్లిం)
దైవ ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం చారు: ఆదం పుత్రుడు (మనిషి) చనిపోగానే అతని కర్మల పరంపర అంతటితో ఆగిపోతుంది. అయితే మూడు కర్మల పుణ్యం మాత్రం అతనికి (ఆ తర్వాత కూడా) లభిస్తూనే ఉంటుంది. ఆ మూడు ఇవి: (1) శాశ్వతంగా ఉండిపోయే దానం (సదఖయె జారియా), (2) తన తదనంతరం ప్రజలకు ఉపయోగపడే విద్య (3) తన శ్రేయస్సు కోసం ప్రార్ధించే సదాచార సంపన్నులయిన సంతానం. (ముస్లిం)
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: జ్ఞానార్జనా ధ్యేయంతో బయలుదేరిన వ్యక్తి తిరిగొచ్చేవరకు దైవమార్గంలో ఉన్నట్లుగానే పరిగణించ బడతాడు. (తిర్మిజీ-హసన్) (సుననె తిర్మిజీలోని విద్యా అధ్యాయం)
విద్య ప్రాముఖ్యతను గురించి చెబుతూ ముహమ్మద్ (స), షైతాన్ వెయ్యి మంది భక్తులను బురిడీ కొట్టించగలడేమో కాని, ఒక్క పండితుడి (జ్ఞాని)ని బోల్తా కొట్టించడం వాడి వల్ల కాదు’ అని ప్రవచించారు. ‘రాత్రివేళ ఒక గంట సమయాన్ని విద్యా సంబంధమైన చర్చల కోసం కేటాయించడం, ఆ రాత్రంతా (తెల్లవారేవరకు) దైవారాధన చేసిన దానితో సమానం’ అన్నారాయన.
విద్యార్థి మర్యాదలు
ఉపాధ్యాయుల పట్ల ఒకప్పుడు ఉండే గౌరవ మర్యాదలు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. తోటి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కొందరు యువకులు.. అంతటితో ఆగకుండా ఏకంగా టీచర్లను కూడా టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో శిష్యులు తప్పక పాటించాల్సిన కొన్ని మర్యాదల గురించి తెలుసుకుందాం!
మొదటిది: సహనం
జ్ఞానాన్ని ఆర్జించడం మహోన్నత విషయం. అది అవిరళ కృషి నిరంతర శ్రమ అనే వంతెన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞానాన్ని ఆర్జించే విద్యార్థి చాలా ఓపిక , సహన గుణం , ఓర్మి, కూర్మి కలిగి ఉండాలి.
రెండవది: చిత్తశుద్ధి
విద్యార్జన విషయంలో నిజాయితీగా ఉండాలి. దైవ ప్రసన్నత, పరలోక మోక్షం పరమావధిగా ఉండాలి. మిడిసిపాటు, పదవీ వ్యామోహం, ఐహిక లాలస విద్యార్జన లక్ష్యమయి ఉండకూడదు.
దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు; పండితులతో పోటీ పడటానికి, లేదా మూర్ఖులతో వాదోపవాదాలు జరపడానికి లేదా ప్రజల మన్ననలు పొంది వారిని తన వైపు తిప్పుకోవడానికి ఎవరైనా జ్ఞానాన్ని నేర్చుకుంటే, అల్లాహ్ అతనిని నరకంలో ప్రవేశపెడతాడు. (నసాయీ)
మూడవది: జ్ఞానానికనుగుణంగా ఆచరించడం
జ్ఞానానికనుగుణంగా పని చేయడం అసలు జ్ఞాన ఫలమని తెలుసుకోండి, కాబట్టి తెలిసి కూడా ఆచరించనివాడు యూదులను పోలి ఉంటాడు. జ్ఞానం లేకుండా అమలు చేసే వారు వారు క్రైస్తవులను పోలి ఉంటారు.
తౌరాత్ (ఆజ్ఞలు పాటించే) బాధ్యత మోపబడినవారు ఆ బాధ్యత నిర్వహించలేదు. వారిని పుస్తకాలుమోసే గాడిదతో పోల్చవచ్చు. (తౌరాత్‌జ్ఞానం తెలిసి కూడా అంధులై) అల్లాహ్ సూక్తుల్ని నిరాకరించినవారు అంతకంటే దిగజారిపోయారు. ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. (జుమా: 5)
నాల్గవది: శాశ్వత పర్యవేక్షణ
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనల్ని సదా గమనిస్తూనే ఉన్నాడు. మనం పది మందితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా మనం అయన యెడల భక్తి భావం కలిగి ఉండాలి. అల్లాహ్ యెడల భయం మరియు ఆశల మధ్య మన జీవితమా సాగాలి. ఎందుకంటే పక్షి రెండు రెక్కల ఎలాంటివో ఒక ముస్లింకు అల్లాహ్ యెడల ఆశాభయాలు అలాంటివే.
ఐదవది: సమయపాలన
ఆరవది: అనవసర విషయాల జోలికి వేళ్ళకూడదు.
ఏడవది: స్వీయ నియంత్రణ మరియు నైపుణ్యం, కార్యదీక్ష
ఎనిమిదవది: పుస్తక పఠనం
తొమ్మిదవది : మంచి సహచరుడిని ఎంచుకోవడం
పదవది: గురువుతో తో మర్యాదగా ఉండండి.
ఒక్క మాటలో చెప్పాలంటే – గురువులకు శిశ్యులంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండాలి. శిష్యులకు గురువులంటే గౌరవం, విధేయత, వినయం, మర్యాద ఉండాలి.