Main Menu
قناة الجامع لعلوم القرآن - Al-Jami' Channel for Quranic Sciences

ఓర్పు ..నేర్పు ..ఓదార్పు

విశ్వాసులారా! సహనం పాటించండి. మిధ్యావాదుల ముందు ధైర్యసాహసాలు ప్రదర్శించండి. ధర్మసేవ కోసం నడుం బిగించండి. అల్లాహ్  పట్ల భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడే మీరు (ఇహపరాల్లో) కృతార్థులవుతారని ఆశించగలరు. (ఆల్-ఇమ్రాన్: 200)

ఓర్పు – కష్టాలను, బాధలను సహనంతో భరించడం. ఇది సహనం, ఔదార్యం వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది. నేర్పు: ఒక పనిని చేయడానికి అవసరమైన నైపుణ్యం, చాకచక్యం మరియు తెలివి. ఇది ఒక పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ‘ఓర్పు’ అంటే కష్టాలను సహనంతో ఎదుర్కోవడం, ‘నేర్పు’ అంటే ఏదైనా పనిని సమర్థవంతంగా, తెలివిగా చేయగల సామర్థ్యం. ఈ రెండూ విజయం సాధించడానికి ముఖ్యమైన లక్షణాలు, ఇవి కష్ట సమయాల్లో ధైర్యం మరియు సమయస్ఫూర్తిని అందిస్తాయి. ఈ రెండు గుణాలు కలిసి ఉంటే, వ్యక్తి కష్టాల నుండి బయటపడి, లక్ష్యాలను సాధించగలుగుతాడు. ఓర్పు, నేర్పు, సహనం, సౌశీల్యం, కష్టాల్లో ఉన్నవారిని ఓదార్చడం, ఆదుకొనే ఔదార్యం, ఏదైనా సాధించే మనోధైర్యం… నరోత్తముల లక్షణం. నేర్పు, ఓర్పు, కూర్పు’ ఈ మూడూ జీవితానికి అన్వయించుకోవాలి. పరిస్థితి ఎదురు తిరిగినప్పుడు, ఆపదలు చుట్టుముట్టినప్పుడు, దారితెన్నూ కానరానప్పుడు, కనువిప్పు కలిగించే గుణపాఠాలు, సూత్రాలు జ్ఞప్తి చేసుకుంటే, ధైర్యం, సాహసం తోడై కార్యాచరణకు ప్రోత్సాహకాలు అవుతాయి.

ఓర్పు: విశ్వాసులారా! సహనం పాటించండి.

ఇక్కడ సహన స్థయిర్యాలను ప్రదర్శించటమంటే అర్థం మనోవాంఛలను అదుపులో ఉంచుకోవటం, విషయ లోలత్వానికి దూరంగా ఉండటం, దైవాజ్ఞాపాలనకై మనసును సమాయత్తం చేయటం అన్నమాట.

ఓర్పు అంటే  సహనం … జీవికి మంచి మార్పు. సహనం బలహీనత కాదు. గొప్ప బలం. వీరుడి లక్షణమే తప్ప భీరుడి అవలక్షణం కాదు. అది మానవత్వం మూర్తీభవించిన శక్తి ఏదో కొద్దికాలం పాటు సహనం చూపిస్తే సరిపోదు. కాల పరీక్షకు తట్టుకోగలగాలి.. ఏవో తక్షణ ప్రయోజనాలు ఆశించిగానీ, వ్యూహాత్మకంగా కానీ సహనం వహించకూడదు. ఓపిక పట్టడం వెనక ధర్మదృష్టి ఉండాలి కానీ మర్మదృష్టి ఉండకూడదు. సహనం వినయం నేర్పుతుంది. విషయం నేర్పుతుంది. ‘అణగి మణగి ఉండే వాడే అందరిలోకి ఘనుడు… అన్నారు.

సహనం దాసుడు  చేసే ఉపాసన లాంటిది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది.  ధర్మపరమైన సాధన చేస్తే గానీ దక్కని సుఫలం సహనం. అపకారికి సైతం ఉపకారం చేసే బుద్ధినిస్తుంది. ప్రతీకార బుద్ధిని మటుమాయం చేస్తుంది. ఆసహనం చేయరాని పనులను చేయించవచ్చు. కాని సహనం ఆచితూచి అడుగులు వేయిస్తుంది.సహనం సజ్జన లక్షణం. ఇది సాత్వికులకు మాత్రమే ఉంటుంది. సహనం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. ధర్మాచరణకు బాటలు పడతాయి.

నిదానమే  ప్రధానమంటారు పెద్దలు. నిదానం అంటే సహనంగా ఉండటమే. సహనం ఈ భూమి మీద నడయాడే జీవులకు ఎప్పుడు అబ్బుతుందో అప్పుడే లోకకల్యాణం సాధ్యపడుతుంది.  సహనం వల్ల కాపురాలు సజావుగా సాగుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. సహనాన్ని దేశాలు అలవరచుకుంటే అదే ప్రపంచ శాంతికి రాజమార్గం వేస్తుంది.

మనం ఎన్నో సందర్భాల్లో, ప్రతిదాన్నీ మన దృష్టికోణం నుంచే చూసి పొరపాటు పడుతూ ఉంటాం. ఒక్క క్షణం కూడా ఎదుటివారి వైపు నుంచి ఆలోచించకుండా, వెంటనే అసహనానికి గురవుతూ ఉంటాం. అందుకే ప్రతి చిన్న దానికీ వెంటనే ప్రతిస్పందించటం మానుకోవాలి. ఈ రోజుల్లో మనలో చాలామంది చిన్నచిన్న మాటపట్టింపులతోనే మానవ సంబంధాలను క్షణాల్లోనే తెగతెంపులు చేసుకుంటున్నాం.

వయసుకు తగ్గట్లు మనలో మానసికపరిణతి, ఆత్మ పరిశీలన కొరవడటమే దీనికి కారణం! ఇతరుల మనస్సు గాయపడకుండా మన మనస్సులో మాటను చెప్పగలిగేంత సహనం, ఓర్పు మనలో నానాటికీ తగ్గిపోతున్నాయి. ఇలా ఇంట్లో కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, అహంకారాన్ని కాస్త దూరం పెట్టి, సౌమ్యంగా ప్రవర్తించగలిగే పరిణతి కోసం ప్రయత్నించాలి. రోజూవారీ పయనంలో మనం కుటుంబసభ్యులుగా, బంధువులుగా, సహప్రయాణి కులుగా, ఉద్యోగులుగా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాం. అన్నింటిలో కూడా మన ఏకైక శత్రువు ‘అహం’! దీనిని ఒక్కదానిని మనం నియంత్రించి సహనంతో మైత్రి కుదుర్చు కుంటే ఎక్కడా మన పాత్రకు భంగం వాటిల్లదు.

ప్రతి ఒక్కరు తాము సమాజంలో ఒక భాగంగానే భావించుకోవాలి. వ్యక్తికి అనుకూలంగా వ్యవస్థ ఉండదు; వ్యవస్థకు అనుకూలంగానే వ్యక్తి మసలుకుంటూ, రాణించే ప్రయత్నం చేయాలి. ప్రతి సందర్భం నుంచి పాఠాలు నేర్చుకుంటూ వ్యక్తిని ‘విజ్ఞాని’గా ఎదగమంటోంది మన ఇస్లాం  ధర్మం. సహనంతో ఒక సంఘటనను పరిశీలించ గలిగినప్పుడే, దాని నుంచి మంచిని నేర్చుకోగలం. ఏకాంతంగా మనతో మనం గడుపుతున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ నలుగురితో కలసి నడవాల్సి వచ్చినప్పుడే, అది సహనానికి పరీక్ష! ఆ సమయంలోనే మనను మనం నియంత్రణలో పెట్టుకోవాలి. నలుగురితో సానుకూలంగా మసలుకోగలగాలి. నిరంతరం పరిస్థితులు, పరిసరాలు మనకు అనుకూలంగా ఉండవు. చాలా సందర్భాల్లో మన ఇష్టాయి ష్టాలకు అతీతంగా పరిస్థితులు చుట్టుముడతాయి. కానీ అప్పుడే మనం సహనంగా, సంయమనంతో నడచుకోవాలి. అప్పుడే జీవనపోరాటంలో సఫలీకృతులం కాగలం.

ప్రవక్త (స) ఇలా అన్నారు: “జనులతో కలసి జీవిస్తూ, వారి నుండి కలిగే ఇబ్బందులను ఓర్చుకునే మోమిన్‌-విశ్వాసి, జనులతో కలవకుండా వారి నుండి ఎదురయ్యే  ఇబ్బందులను భరించని మోమిన్‌-విశ్వాసి కంటే ఉత్తముడు.” (సహీహ్ అల్ జామె)

అసలు మనం ‘ఓర్పు’గా ఎందుకుండాలి? మన మంచి కోసమే! దోషం చేసినవారందరి పైన ప్రతీకారం తీర్చుకుంటూ పోతే, అసలీ ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అందుకనే సహనంగా ఉండడం నేర్చుకోవాలి. జీవితంలో మనం చేసిన అన్ని తప్పులకూ తగిన శిక్ష పడివుంటే, ఈ రోజున మనం జీవించి ఉండేవాళ్ళమే కాదేమో! ఎన్నోసార్లు మనం తప్పులు చేసినప్పటికీ, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు, ఇతరులెంతో మంది మనల్ని క్షమించి వదిలేశారు. వారి సహనగుణమే మనల్ని జీవించేలా చేసింది. పగ తీర్చుకోవడం కాదు, అనుకూలంగా సర్దుకుపోవడమే అన్నివిధాలా మన అభ్యున్నతికీ, ఆరోగ్యానికీ సరైన మార్గం.

అన్ని సుగుణాలూ ఉండి, సహనం ఒక్కటే లేకుంటే లాభం లేదు. ప్రతిభా పాటవాలు తక్కువైనా ఓర్పుతో నేర్పుతో ప్రవర్తించే వ్యక్తికి తిరుగుండదు. సరైన సాంగత్యంలో నిజమైన ఓర్పు బయటపడుతుంది. ఎదుగుతున్నకొద్దీ ఒదిగే గుణం ఓర్పుగా ఉంటే వస్తుంది. ఒక చిన్న మొక్క వందల ఏళ్లు ఎదిగి చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వృక్షంగా మారుతుంది. ఓర్పు చరిత్రను తిరగరాస్తుంది. ప్రవక్త అయ్యూబ్ (అ) వంటి సహనం పొందిన మనిషి అంటారు. గెలవాలంటే ఓర్పు కావాలి. సహనంలేని ఏ వీరుడూ చరిత్రలో గెలిచిన దాఖలాలు లేవు. ఓర్పులేని ఏ సాధకుడూ సత్యానుభూతి పొందిన సన్నివేశాలు, సదృశ్యాలూ  లేవు!

అవధుల్లేని ఓర్పుతో ఎన్నో పనులూ సాధ్యమవుతాయి. ఓర్పులేని మనిషి మనిషే కాడు అజ్ఞానం వల్ల సహనం కోల్పోయి, తన స్థితిని మరింతగా దిగజార్చుకుంటాడు మనిషి అందరూ పారిపోయేచోట ధీరుడు నిలబడతాడు. అతడి జెండా. ఎజెండా  ఓర్పు, సహనంతో ఉండగలిగితే అన్ని పనులూ ఒకటొకటిగా సానుకూలమవుతాయి. రాత్రి చీకటిలో గడిపితేనే సూర్యోదయం చూడగలం. సహనం మనిషిని చరిత్రలో నిలబెడుతుంది. సహనమే సత్యాన్ని చూపిస్తుంది. సహనంలేని వ్యక్తి నాయకత్వం వహించలేడు. సహనంలేని వ్యక్తి నాయకుణ్ని అనుసరించలేడు. సహనంలేని వ్యక్తి కలిసి జీవించలేడు. సహనంలేని వ్యక్తి ప్రకృతికి అనుకూలంగా బతకలేడు.

మేఘజలం తప్ప మరే నీటినీ తాగని చాతకపక్షి కారుమబ్బు కోసం ఎదురుచూస్తుంది. కోకిల రాక కోసం వసంతం వేచి ఉంటుంది. ఓర్పు మనకు హృదయానందాన్ని కలిగిస్తుంది.ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తల జీవితాలు గడిచిపోతాయి. వారి సహనం, అంకితభావమే మానవాళికి ఎన్నో శుభాలను చేకూరుస్తుంది.

ఓర్పు ఆవహించినవారి కృషిని అల్లాహ్  వృధా చెయ్యడు: సహనం వహించేవారికి అపార పుణ్యఫలం లభిస్తుంది.” (అజ్-జుమర్: 10)

ఎవరూ పరిపూర్ణులు కారని మన మనస్సుకు బోధించాలి. అంటే వారు తమ తప్పు తెలుసుకొని, సరిదిద్దు కోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాం. ఇది చాలా ముఖ్యం. దృఢమైన వారు మాత్రమే సహనంతో క్షమించగలరు. బలమైన మనిషి భుజం పైనే మనం వాలగలుగుతాం. బలమున్న వ్యక్తి మాత్రమే బలహీనుడైన వాడి బరువును మోయగలుగుతాడు. ఓర్పు, సహనాన్ని అలవరచుకోవడమంటే ఇతరులు ఎదగడానికి సహాయం చేయడమే! ధనం విలువ, దాన్ని సరిగ్గా వినియోగించడం ఒక వ్యక్తి  పిసినారిగానో, అతిగా ఖర్చుపెట్టేవానిగానో తయారు కావచ్చు. కాబట్టి జీవితంలోని అనేక అంశాలలో సహనం అలవరచుకోవడమంటే ‘ఆత్మోన్నతి’కి ఒక బాట ఏర్పాటు చేయడమే అవుతుంది.

ప్రతి విషయానికీ ‘ప్రతీకారం’, ‘పగ’ అనేవి పరిష్కారం చూపలేవు. మన జీవిత ప్రణాళికలో ‘శిక్ష’ కూడా ఒక భాగమే అయినా, తప్పు చేసిన వ్యక్తికి దాన్ని సరిదిద్దుకోవడానికి తగిన అవకాశమివ్వాలి. ఎవరైనా తప్పు చేసిన వెంటనే దానికి పరిష్కారం చూపిద్దామని అనుకుంటే, మనకు సహనమనేది లేదని అర్ధం. పరిపాలనలోనూ, న్యాయం, చట్టం, క్రమశిక్షణల పరిరక్షణలోనూ సహనం కలిగి ఉండడం అనే దాన్ని విభిన్న దృక్పథాలతో చూడాలని మనం గుర్తుంచుకోవాలి.

సహనం, పట్టుదల ఉంటే పట్టిందల్లా బంగారమే!

మనలో చాలా మంది ఏ పనినైనా ముందు ఉత్సాహంగానే ప్రారంభిస్తారు. కానీ అదే ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగించరు. పుట్టినరోజు, నూతన సంవత్సరాది… ఇలా ప్రతి పర్వదినంలో గొప్ప గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కానీ తరువాత ఏదో ఒక సాకు చూపి, కాలక్రమంలో వాటికి స్వస్తి పలుకుతుంటారు. ఇలా మనలో చాలామంది ‘ఆరంభశూరులు’గానే మిగిలిపోతారు. ఇలాంటి తాత్కాలిక, ఉద్రేకపూరిత నిర్ణయాల వల్ల మనం జీవితంలో ఏ ఘనకార్యాలనూ సాధించలేం. కారణం కావాల్సినంత సహనం పట్టుదల లేకపోవడమే.

తగిన సామర్థ్యం ఉన్నా, లేక పోయినా అడిగిన వెంటనే అన్నింటికీ సిద్ధమయ్యే వారిని మనం నిత్యం చూస్తూ ఉంటాం. కానీ నిజమైన శక్తి సామర్థ్యాలు ఉన్నవారు ఏ విషయం లోనూ తొందరపడరు. అలా నిదానంగా ఉంటూ వివేకంతో వ్యవహరించిన వారే ఏ కార్యాన్నైనా విజయ వంతం చేయగలుగుతారు. మన శక్తి సామర్థ్యాల్ని ఇంకొకరితో పోల్చుకొని ‘నాకు అతడి కన్నా ఎక్కువ సామర్థ్యం, నైపుణ్యం ఉన్నా అవకాశం రాలేదు’ అని నిరుత్సాహపడతాం. కానీ సహనం వహిస్తే సామర్థ్యం ఉన్న వారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత పాండిత్యం ఉన్నా వినయంతో మృదువుగా మాట్లాడ గలగడం, ఎంతటి సన్నిహితుడైనాసరే కర్తవ్యాన్ని విస్మరిస్తే నిర్భయంగా తెలియజేయగలగడం, ఎంత సామర్థ్యం ఉన్నా అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా నిర్వికారంగా ఉండగలగడం ఇవన్నీ ఉత్తమ గుణాలు.

అనవసరమైన ‘అలకలకు’ పోతే చివరకు నష్టపోయేది మనమే! ఏటిలో తోటిజీవులతో పడటం లేదని. చేప అలిగి ఒడ్డుపైకెళితే ఒరిగేదేముంటుంది? పైగా ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. ఓపికతో మన వంతు వచ్చే వరకు వేచిచూసి, మన ఉనికిని చాటుకోవటం వేరు; ఒకింత అసహనంతో ఏటికి ఎదురీది మొదటికే మోసం కొనితెచ్చుకోవటం వేరు. జీవితం రంగులరాట్నం లాంటిది; ఒకసారి ఒక కుర్చీపైనుంటే, మరోసారి మరోకుర్చీ పైనుంటుంది. స్థానమేదైనా సర్దుకుపోతేనే జీవనచక్రం సాఫీగా సాగిపోతుంది.

పుట్టుకతో బంధాలు, బంధుత్వాలు ఏర్పడుతాయి – జీవన గమనంలో అనుభవాలు, అనుబంధాలు ఏర్పడుతాయి – మరణంతో అవన్నీ జ్ఞాపకాలు గా మిగిలి ఉంటాయి. బాధ్యతలను భాగ్యంగా, ఒత్తిడిని సహనంగా, విమర్శలను వినమ్రంగా, సంక్షోభాలను అవకాశాలుగా, సంక్లిష్టతను సామరస్యంగా మలుచుకుని సాగడమే విజ్ఞుల లక్షణం. వచ్చిన అవకాశాన్ని చులకన చేసి రాని అవకాశం కోసం ఎదురుచూడడం, ఇంట్లో ఉన్న ఆనందాన్ని అలక్ష్యం చేసి ఎదుటి ఇంట్లోకి తొంగి చూడడం, మన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసి తోటి వారికి సలహాలు ఇవ్వడం, ఈ బలహీనతలు అధిగమిస్తే అంతర్లీనంగా ఉన్న ఆత్మవిశ్వాసం నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఆశయాలను ఆదర్శం గా తీసుకోవచ్చు కానీ, అణగదొక్కాలని చూడకూడదు. మత సామరస్యాన్ని పాటించవచ్చు కానీ, మత ద్వేషాలను రెచ్చగొట్ట కూడదు. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలి కానీ పరిహశించ కూడదు. కోపం ఒక బలహీనత, ఆవేశం ఒక అవరోధం, ఈ రెండు బలహీనతల వలన వివేకం నశిస్తుంది. వివేకం లేని మానవులు గౌరవాన్ని కోల్పోతారు. బలహీనతలను అధిగమించి ఆదర్శంగా నిలవాలి. జీవితం అనే యుద్ధం లో గెలవాలంటే, ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలలి.  తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందు కెళ్లాలి.  కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలి.  కాల్చె నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలి.

ఓర్పు, సహనం”కోల్పోయినట్లయితే ఎంతో “కాలం” శ్రమించి కష్టించి సంపాదించిన మంచి పేరుప్రతిష్టలు ఒక్క “క్షణంలో” మాయమైపోతాయి.  కష్టాల్ని ఎదిరించే దమ్ము.. బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే మనలో ఉంటాయో – అప్పుడు జీవితంలో – మనం  గెలవబోతున్నామని అర్థం…!

నేర్పు:

జీవితం అనే కడలిలో ఆటుపోట్లు సహజం. కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా.. కాస్త ఆలోచించి అడుగేయాలి. ఆ కాస్త ఓర్పు లేక అనేక జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఒక పనిని ‘సాధారణంగా’ పూర్తి చేసేవాడు కొందరైతే, మధ్యమ స్థాయిలో చేసేవారు కొందరు. ఉన్నతస్థాయిలో చేసేవారు ఇంకొందరు! ఈ స్థాయులన్నీ వారివారి వృత్తి నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. జీవిత ప్రమాణాలు సైతం వారి నేర్పరితనాన్ని అనుసరించి అలరారుతాయి. ఒక కార్యాన్ని నాసిగా పూర్తిచేసేవారికి పారితోషికం అదమస్థాయిలో ఉంటుంది. మహోన్నత స్థాయి నైపుణ్యాన్ని కనబరచే వృత్తి నిపుణుడికి అందే పారితోషికం ఉన్నతస్థాయిలోనే ఉంటుంది.

నేర్పరితనానికి విద్య అవసరమా అన్నప్పుడు. తరగతి గదిలో నేర్చుకునేదే విద్య కాదని గ్రహించాలి. జీవిత పాఠశాలలో విద్య గడించి ఆపార నైపుణ్య సంపత్తిని సొంతం చేసుకొనే ప్రతిభావంతులు కొందరుంటారు.విద్యలో స్థాయీభేదాలుంటాయి. బతుకు సమరాన్ని ఎదుర్కోవడంలో, ధనార్జనకు లౌకిక విద్య సాయపడుతుంది. దైవాన్ని పొందడం కోసం సాదనచేసే ఆధ్యాత్మిక విద్యలో సైతం నేర్పరితనానికి సంబంధించి స్థాయీభేదాలుంటాయా అన్న ప్రశ్న ఉదయించక మానదు. దైవాన్ని పొందడం కోసం సాధకుడు పడే తపనలో సైతం స్థాయులుంటాయి. అలా అత్యున్నత స్థాయి భక్తి వైభవాన్ని సొంతం చేసుకొనే మహనీయులు ఆధ్యాత్మిక పరీక్షలో కృతకృత్యులవుతారు.  దైవ దూతల నాయకులు జిబ్రయీల్ (అ) పరవక్తల నాయకులయిన ముహమ్మద్ (స) వారిని  ‘ఇహ్ సాన్‘ గురించి తెల్పండి? అని ప్రశ్నించారు. దానికి దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “నీవు అల్లాహ్ ను కూసుతున్నాను అన్నంత తన్మయానికి, తదాత్మయానికి లోనై ఆరాధించు.. ఒకవేళ నీవు ఆయనను చూడక పోయినా ఆయన నిన్ను గమనిస్తూన్నాడని గ్రహించు”.  (సహీహ్ ముస్లిం)

పుట్టిన ప్రతి మనిషి ఏదోనాటికి ఆధ్యాత్మిక భావనను అందిపుచ్చుకోక తప్పడు. కొందరు యుక్తవయసులో దైవం. సంప్రదాయం, మతం వంటి భావాలను అందుకుంటారు. కొందరు మధ్య వయసులో, ఇంకొందరు వృద్ధాప్యంలో పారమార్ధిక జీవితం పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక విద్య బాల్యంలోనే అబ్బిన కొద్దిమంది బాలలు మహనీయులుగా,అల్లాహ్  ప్రియసఖులుగా అలరారిన వైనం గత చరిత్రలో, ప్రస్తుత జీవితంలో కనిపిస్తుంది. జురైజ్, ఆయిజ్ అల్ కర్ణీ, హజ్రత్ అలీ (ర) ఆ కోవకు చెందినవారే!

నేర్పు-ఓర్పు జంటపదాలు ఓర్పు ఉన్నవారే కాలక్రమంలో నేర్పరులు కాగలరు. లౌకిక జీవితంలో నేర్పు సంపాదించ డానికి ఓర్పు ఎంత అవసరమో ఆధ్యాత్మిక కర్మాచరణలో విజేతలుగా ఎదగడానికి ఓర్పు అంతే అవసరం. నఫిల్ ఉపవాసాలు, తహజ్జుద్ ఆరాధనలు, ఏకాంతంలో అల్లాహ్ నామ స్మరణలు, నిత్య ఖుర్ఆన్ సత్గ్రంధ పారాయణాలు…ఇవన్నీ ఆచరించడానికి నేర్పుతోపాటు ఓర్పూ చాలా అవసరం.

సృష్టిలో ప్రతి ప్రాణి ఎల్లప్పుడూ ఎలాంటి చీకూచింతా లేకుండా ఉండాలని కోరుకుంటుంది. వివేకవంతుడైన మనిషి చరమ, పరమ లక్ష్యమూ ఆనందమే. జీవించినంత కాలం సంతోషంగా జీవించాలని, దుఃఖం లేశమాత్రమైనా ఉండకూడదనుకుంటాడు. కానీ జీవితంలో ఆనంద క్షణాల కన్నా వ్యథాభరిత అనుభవాలే ఎక్కువగా చవి చూస్తున్నాడు. బంధాల విషయంలోనే కాదు …. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడూ, కొత్త బాధ్యతలు చేపట్టినప్పుడూ, కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడూ… ఇలా జీవితంలోని ప్రతి మజిలీలోనూ ఎన్నోకొన్ని సర్దుబాటు సమస్యలు ఉంటాయి. భవిష్యత్తుతో ముడిపడిన అపోహలూ, అనుమానాలూ, భయాలూ స్థిమితంగా ఉండనీయవు. అవన్నీ సమస్యలుగా  రూపం మార్చుకుని ప్రాణం తోడేస్తాయి. వాటిని ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి.

నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడు, పట్టపగలు కూడా చీకటి అలుముకున్నట్టే ఉంటుంది. అలానే మూలప్రశ్నకు జవాబు దాటవేసినంత కాలం, నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటననూ దానితోనే ముడిపెట్టి చూస్తాం. ‘నన్ను ఫలానా వ్యక్తి ద్వేషిస్తున్నాడేమో? అన్నదే మన మూలప్రశ్న అయినప్పుడు… అతను ప్రేమగా మాట్లాడినా, అసూయతో రగిలిపోతున్నట్టే కనిపిస్తుంది. మనస్ఫూర్తిగా మెచ్చుకున్నా. ఎగతాళి చేస్తున్నట్టే అనిపిస్తుంది.

సంయమనంతో సానుకూలత

కొన్నిసార్లు మనం తాత్కాలికంగా ఎదురయ్యే అననుకూల పరిస్థితులకు తీవ్రంగా స్పందించి, కఠిన నిర్ణయాలను తీసుకొని తరువాత తీరిగ్గా బాధపడుతూ ఉంటాం. ‘అయ్యో! ఆ క్షణంలో ఓర్పు నేర్పుతో కొంత సంయమనాన్ని పాటించి, ఓపికగా ఉండి ఉంటే, పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా’ అని పశ్చాత్తాపపడుతూ ఉంటాం. స్వర్గం లాంటి జీవితాన్ని చేతులారా నరకాన్ని చేసుకున్నామని కుమిలిపోతూ ఉంటాం. అలా చేతులు కాలాక ఆకులు పట్టుకునే దుస్తతి దాపురించకుండా ఆపేదే నేర్పు. మృదువుగా, మర్యాదగా మాట్లాడడం వల్ల తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతామనే భావం నేటి తరంలో అధికమవుతోంది. అలాంటి అపోహ వదిలి గౌరవమర్యాదల్ని ఇచ్చిపుచ్చు కోవడం అనే మన సంప్రదాయాన్ని పునరుద్ధరించే సమయం ఆసన్నమైంది.

ఓదార్పు:

“ఓదార్పు” అంటే శారీరక లేదా మానసిక బాధ నుండి ఉపశమనం కలిగించే అనుభూతి, ఒక వ్యక్తి యొక్క దుఃఖంలో వారికి సహాయం చేయడం, ఓదార్చడం వంటి సందర్భాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

ప్రజలు  దీర్ఘకాల ఆందోళన, భయం, వేదన, లేక అలాంటి ఇతర ప్రతికూల భావోద్రేకాలను అనుభవించినప్పుడు, సామాన్యంగా వారు కృంగిపోతారు. ప్రియమైనవారి మరణం, విడాకులు, ఉద్యోగం ఊడిపోవడం, లేక కోలుకోలేని అనారోగ్యం కృంగుదలకు లేక విపరీతమైన దుఃఖానికి కారణం కావచ్చు. తాము చేసింది విఫలమై, అందరినీ నిరుత్సాహపరిచామన్న భావనతో, మేమెందుకూ పనికిరామన్న భావనను పెంచుకోవడం వల్లకూడా ప్రజలు కృంగిపోతుంటారు. ఒత్తిళ్లను బట్టి ఎవరైనా పూర్తిగా నీరుగారి పోవచ్చు. అలాంటి సమయలో వారు మన నుండి కోరుకునేది కాసింత ఓదార్పు. మేమున్నాము, మీకేం కాదు అన్న కూసింత ధైర్యం.

“వృద్ధులంటే ముసలివారు కారు:వృద్ధి పొందినవారు” – ఎన్నో అభివృద్హి కార్యాలను తానే పునాది అయిన నిలిచినవారు. కొంచెం వయసుకు వచ్చాక ముఖ్యంగా వయోభారం మీద పడుతున్నప్పుడు, వాళ్ళ అవసరం తమకు లేదనుకున్నప్పుడు వాళ్ళ మాటలు వినేవారు ఉండరు. “వృద్ధులకు ఎంతసేపూ జ్ఞాపకాలే, వినడానికి శ్రోతలుండరు. వారి మాటలకు రావాల్సిన జవాబులు రావు, వారి మాటల్లో కొన్ని చెల్లని నాణాలవుతాయి” అనడంలో ఎంత దుఃఖముందో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. వేదన గడ్డకట్టిన దుఃఖంగా మారడం ఆ దశకు మనం సయితం చేరుకుంటేగానీ సమజ్ అవ్వదు. వారికి ఈ వయసులో కాసింది కాసింత ఓదార్పు, కూసింత ప్రేమ.

ఏదో చేద్దామనుకుని వెళ్లి… ఇంకేదో చేస్తూ… ఎలా బయటపడాలో తెలియని దైన్యంలో కొట్టుమిట్టాడే జీవితాలు మన గల్ఫ్ బతుకులు! సక్రమమైన విధానంలో, సరైన ఉద్యోగంలో చేరితే అంతా మేలే! ఏజెంట్ల మోసాల వలలో పడితే మాత్రం కష్టాలు చుట్టు ముడతాయి. గల్ఫ్‌ వెళ్లాలనుకునే వారి అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్నారు. కంపెనీల్లో ఉద్యోగాల పేరిట వీసాలు సృష్టించి గల్ఫ్‌ పంపిన తర్వాత అక్కడ పనులు లేక చాలామంది ఎడారుల్లో గొర్రెలు, ఒంటెలు కాపరులుగా ఒంటరిగా మగ్గిపోతున్నారు. ఉండటానికి నీడలేక ఎడారుల్లో వేసే గుడారాల్లో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చీకటి బతుకులు వెళ్లదీస్తున్నారు. తినడానికి తిండిలేక గొర్రెలకు పెట్టే ఆహారాన్ని తింటూ పొట్ట గడుపుకునే వారందరో ఉన్నారు. ఎడారి నుంచి పారిపోయే అవకాశం లేక అలాగే మగ్గిపోతున్నారు.

చుట్టూ పచ్చటి చేలు, నదులూ, నీళ్లు, చక్కటి ఇల్లు, చల్లని కాపురం! ఇవన్నీ వదిలేసి.. ‘మంచి బతుకు’ కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తారు! కొందరు బిడారుల్లో ఉంటె, కొందరు ఎడారుల పాలయ్యారు! పచ్చటి పల్లె  సీమ నుంచి విదేశాలకు వెళ్లి బాగా సంపాదించి స్థిరపడిన వారున్నారు! నానా ఇక్కట్లు పడుతూ.. ‘కాపాడు ప్రభో’ అని అరణ్యరోదన చేసేవారూ ఉన్నారు. బాగు పడిన వారికేం వారు బంగారంగానే ఉంటారు. పాడైపోయినవారే పాపం అల్లల్లాడిపోతుంటారు. వారు మన నుండి కోరేది కాసింత సహాయం, కూసింత ఓదార్పునే.

మనలో ఎవరు అల్లాహ్ తన మనసును సాంత్వన పరచాలని కోరుకోరు?  మనలో ఎవరు ఈ లోకంలోనూ పరలోకంలోనూ అల్లాహ్ తమను సంతోషపరచాలని ఆశించరు? చెప్పండి! ఎవడు ఈ కోరికను నిజాయితీతో కోరుకుంటారో -వారు  బాధాతప్త హృదయులను  సాంత్వన పరచాలి, వారి భావాలను అర్థం చేసుకోవాలి, వారి కన్నీళ్లను తుడవాలి, వారి గాయాలను నయం చేయాలి, వారి హృదయాలలో సంతోషాన్ని నింపాలి. మనసులను సాంత్వన పరచడం  అనేది మనం  అల్లాహ్ సామీప్యాన్ని పొందగల అత్యంత ఆశాజనకమైన ఆరాధనలలో ఒకటి. సుఫ్యాన్ అల్-సౌరీ  (రహ్మ) ఇలా అన్నారు: “నేను మనసును సాంత్వన పరచడం కంటే గొప్ప మరియు శ్రేష్ఠమైన ఇబాదత్‌ మరొకటి  చూడలేదు.” ఓ ప్రజలారా! తెలుసుకోండి- ఎవడు ఇతరుల మనసును సాంత్వన పరుస్తాడో, అల్లాహ్ అతని మనసును సాంత్వన పరుస్తాడు. ఎవడు ప్రజల మనసులను కలుపడానికి ప్రయత్నిస్తాడో, అల్లాహ్ తన కరుణతో అతడిని రక్షిస్తాడు.   అతడు ఎంతటి ప్రమాదంలో ఉన్నా సరే.

అల్లాహ్  నిధినిక్షేపాలు ఎప్పటికీ తరగవు. ఆయన ప్రసాదం ఎప్పటికీ ఆగదు. ఆయన సాంత్వన ఈ లోకంలోనూ పరలోకంలోనూ హద్దులు లేనిది. మన ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు; “ఎవడు ఒక ముమిన్‌ యొక్క ప్రాపంచిక  కష్టాలలో ఒక కష్టాన్ని తొలగిస్తాడో, అల్లాహ్ అతని నుండి ప్రళయదినం యొక్క కష్టాలలో ఒక కష్టాన్ని తొలగిస్తాడు.  ఎవడు ఇబ్బందిపడుతున్నవారికి సౌలభ్యం కలిగిస్తాడో, అల్లాహ్ అతనికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌలభ్యం కలిగిస్తాడు. ఎవడు ఒక ముస్లిమ్‌ (సోదరుని) లోపాలను కప్పిపెడతాడో, అల్లాహ్ అతని లోపాలను ఈ లోకంలోనూ పరలోకంలోనూ కప్పిపెడతాడు.” (సహీహ్ తిర్మిజీ)

ఓదార్పు పలుకులు ఎలా ఉఁడాలి?

 “విచారపడకు, నిశ్చయంగా అల్లాహ్  మనకు తోడున్నాడ”ని అన్నాడు. అప్పుడు దేవుడు అతనికి మనోనిబ్బరం ప్రసాదించాడు.  (అత్-తౌబహ్: 40)

“దుఃఖపడకండి, ఖేద చెందకండి పరిస్థితులు త్వరలోనే మెరుగవుతాయి.” “నేను మీతోనే ఉన్నాను, ఆందోళన చెందకండి.” “మీకు ఏదైనా సహాయం అవసరమైతే, నాకు చెప్పండి.” “అన్నీ సర్దుకుంటాయి, కాస్త ఓర్పుతో ఉండండి.” “మీరు చాలా బలమైన వ్యక్తి, ఈ కష్టాలనూ తప్పకుండా దాటిపోతారు.” “ఈ సమయమూ గడిచి పోతుంది.” “మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి, మీ ఆరోగ్యం చాలా  ముఖ్యమైనది.” “మీరు అనుభవిస్తున్న మనోవేదన  సహజమే, మీకు అవసరమైనంత సమయం తీసుకోండి.” వెతలు  నిండిన బతుకు చీకటితో బాధ పడుతున్నవారికి  ఆశా దీపాలయి మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. ఓటమి ఓర్మిని కోల్పోయినవారికి గెలుపే మనమయి  కూర్మితో  మేము ఉన్నామని, మీకేం కాదని.  పుట్టుక నీది కావచ్చు. చావు కూడా నీది కావచ్చు. బతుకు మొత్తం దేశానిది.. ఇలా రాయాలంటే గుండె ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే ఆ మనిషికి జనం బాధ తెలిసి ఉండాలి. కన్నీటి కష్టాల నుంచి వచ్చిన వాడై ఉండాలి. మనసు ఒప్పించండి… మనసును నొప్పించకండి!

ఓ అల్లాహ్ సాంత్వన కోరుకునే వారలారా! పసి పిల్లల మనసులను సాంత్వన పరచండి, వారితో మృదువుగా మెలగండి.  వారిని ప్రేమించండి. ప్రవక్త (స) ఒకసారి మదీనా వీధిలో నడుస్తూ ఉండగా, ఒక చిన్న పిల్లవాడు తన చనిపోయిన పక్షి కోసం బాధతో ఏడుస్తున్నాడు.  ఆయన ఆ పిల్లవాడి పట్ల కరుణతో వ్యవహరించి, అతనిని ఆనందపరిచారు. అతడిని మమకారంతో పిలుస్తూ అడిగారు: ఓ అబూ ఉమైర్‌, నీ చిన్న పక్షి నుఘైర్‌కి ఏమైంది? (బుఖారీ) ఓ అల్లాహ్ సాంత్వన కోరుకునే వారలారా! బలహీనులను, అనాథలను సాంత్వన పరచండి.

ఓదార్పు  ప్రయోజనాలు:

ఓదార్పు ద్వారా సంబంధాలు బలపడతాయి. ఓదార్పు ద్వారా మనస్పర్థలు, కోపాలు తొలగిపోతాయి. ఓదార్పు ద్వారా పరస్పర ప్రేమ పెరుగుతుంది. ఓదార్పువల్ల సమాజంలో సౌహార్ద వాతావరణం ఏర్పడుతుంది. ఓదార్పు చేయడం స్వర్గానికి తీసుకెళ్ళే పని. ఓదార్పు ద్వారా ఈ ప్రపంచం మరింత మంచిదవుతుంది. ఓదార్పు వల్ల సమాధి  కూడా ప్రకాశిస్తుంది. ఓదార్పు  పరలోకంలోను విజయాలు తెస్తుంది. ఓదార్పు చేసే సోదరీమణులను  అందరూ ప్రేమిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా – ఓదార్పు చేసే వ్యక్తి పట్ల అల్లాహ్  మరియు ఆయన ప్రవక్త మహ్మద్ (స) సంతుష్టులవు తారు. అందువల్ల, మనం ఓదార్చడాన్ని మన నిత్యచర్యగా  చేసుకోవాలి.

అవును, మనందరి ప్రభువు అయిన అల్లాహ్  మన పాపాలు, తప్పులకన్నా మేలైన వాటినే చూస్తాడు. మన బలాలు -బలహీనతలు ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు.  మన పూర్తి జీవన విధానం, మన ఉద్దేశాలు, దృక్పథాలు గూర్చి అంతా  ఆయనకు తెలుసు. మనం  పాప ఊబిలో కూరుకుపోయిన విషయమూ ఆయనకు తెలుసు.  మనం రోగ బారిన పడ్డామన్న విషయమూ ఆయనకు తెలుసు. మన ఆప్తులకు  మరణం సంప్రాప్తమైందని, అందువల్ల మనమెంతో మనోవేదనకు గురయి ఉన్నామని  ఆయనకు తెలుసు. మనలో మనం మదన పడుతూ – దుఃఖపడుతూ క్షోభిస్తున్నామంటేనే, మనకు పాపం చేయడం ఇష్టం లేదని, మనమింకా హద్దులు మీరలేదని రుజువయింది. అందుకని మన నికృష్ట  దుర్దశపై అల్లాహ్  కనికరం  చూపించి, కరుణతో మన బలహీనతలను పరిగణలోకి తీసుకుంటాడు. మనల్ని మన్నిస్తాడు.

నీ ఆదేశాలకు శిరసా వహించడానికి కావాల్సిన సహనాన్ని, నీ నిషేధితాలకు దూరంగా ఉండటానికి అవసరమైన ధైర్యాన్ని నాకు ప్రసాదించు! నా ధర్మ  సేవలో ఫలవంతం చేసుకొనే శక్తిని నాకు ప్రసాదించు! నిరుపేదలను నిర్లక్షించిన, అహంభావపూరితమైన బలవంతులకు మోకరిల్లకుండే బలాన్ని నాకివ్వు! దైనందిన ఒడుదొడుకుల నుండి నా మనస్సును ఉద్దరించుకునే శక్తిని నాకివ్వు! ఆ శక్తితో నేను సాధించింది. లాభించింది నీకు అర్పించేలా మరలా… నా కిచ్చిన శక్తినంతా నీ ఇచ్చకు అర్పించుకోగల ధీరత్వాన్ని నాకు ప్రసాదించు!! అని మనం దీనాతిదీనంగా ఆ దయామయుడిని వేడుకోవాలి. వేసుకుంటారని.. అలానే నడుచుకుంటారని ఆశిస్తూ ..!

Related Post