Originally posted 2013-03-04 22:35:01.
(‘కొంత మంది యువకులు ముందు యుగం దూతలు – పావన నవ జీవన బృంధావన నిర్మాతలు’ అని మహా కవి శ్రీశ్రీ అన్నట్టు ఏ జాతి పురోభివృద్ధిలోనైనా యువత పాత్ర కీలకమయినది. ఏ జాతికయిన ఆ జాతి యువత వెన్నుముక వంటిది. చైతన్యవంతం, ఆహ్లాదభరితం అయిన ఈ ప్రపంచంలో యువత నవ యుగ నిర్మాతలు, మానవ కోటి బంగారు భవిష్యత్ నిర్ణేతలు. జాతి భవిష్యత్తుకు యువకులే సృష్టికర్తలు. యువశక్తిలో ఉత్సాహాన్ని, ఆలోచన, విజ్ఞానాన్ని చిరకాలం రాజేస్తూ ఉండటమే ఏ సమాజ అభివృద్ధికైనా అత్యంత కీలకాంశం. ఐక్యరాజ్య సమితి వయో నివేదికలో 2040 నాటికి ప్రంచంలో యువ శక్తికి ప్రతీకగా నిలచే దేశాల్లో మన భారత దేశం కూడా ఒకటి. అయితే సామ్రాజ్య వాద కుట్రలో భాగంగా యువతతోపాటు ఇతర ప్రజానికాన్ని వినిమయతత్వం వైపు ఆకర్షించి వారిని ఆర్థిక అర్ధ బానిసలుగా మార్చి దేశ సంపదను నిలువు దోపిడీ చేసే కార్యక్రమం అగ్రరాజ్యాలు ముమ్మరం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్, ప్రింటింగ్ మీడియా మాధ్యమాల ద్వారా యువకుల్ని భ్రమల్లో ముంచెత్తి వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నాటి యువత కీలక పాత్ర పోషించింది. కానీ నేటి యువత తమ చుట్టప్రక్కల జరుగుతున్న అన్యాయాలను సయితం ఎదిరించే స్థితిలో లేకపోవడం మిక్కిలి విచారకరం. మితిమీరిన పారి శ్రామీకరణ యంత్రాల మధ్య బంధీగా మిగిలిన ‘మానవుణ్ణి’ బయటకు తేలేక మాదక ద్రవ్యాలకు, విశృంఖల అరాచకాలకు కట్టు బానిసల్ని చేస్తోంది. తలమావిగా విరాజిల్లిన భారత సంస్కృతి సిగ్గుతో తలదించుకునే తలవంపు చర్యలకు నేటి యువత పాల్పడ టం బాధాకరం. నెత్తురు కండరాల బలం మన యువతకు ఉంది. కానీ దేశంలో యువత ఆకలి, నిరుద్యోగం, దారిద్య్రం, అనారోగ్యం, మాదకద్రవ్యాల వాడకం, మద్య సేవనం, మగువ లోలత్వం, గుట్కాలు నమలడం, రోడ్ల మీద పొగరుబోతు ఆంబో తుల్లా ఆటవికంగా సంచరిస్తూ, సోమరుల్లా నిస్సత్తువ, నిటారుగా నడవలేక అడుగులు తడబడుతున్న తీరు ప్రమాదకరం. అట్టి యువతను తట్టి లేపాలన్నదే ఈ వ్యాస ముఖ్యో ద్దేశ్యం! – ఎడిటర్)
నేడున్నది ఒకప్పటి భారత దేశం కాదు. మన దేశం చాలా అభివృద్ధి చెందింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు థా బ్దాల క్రితం జీవితంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజలు కాస్త మెరుగైన జీవితం గడుపుతున్నారనే చెప్పాలి. అప్పట్లో తాటాకు గుడిసెలో జీవనం కొనసాగేది. నేడు కాంక్రీట్ కప్పు కలిగిన ఇళ్ళు కాకులు దూరని కారడవి ప్రాంతంలో సయితం కొలువుదీరాయి. మారు మూల ప్రాంతాల్లో సయితం నీరు, విద్యుత్, సెల్‌ఫోన్ సదుపాయం ఉంది. పల్లె పిల్లలు కూడా బంగారంగా పాఠశాలకెళ్ళి చదువుకుం టున్నారు. ఇదంతా మన దేశం సాధించిన ప్రగతి ఫలమే. ప్రపంచీకరణ, వినిమయతత్వ ప్రభావమే. కొంత వరకు మేలు జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సంపన్నత స్పష్టంగానే కనబడుతోంది. అదే సమయంలో – అనేక సమస్యలు కూడా పల్లెలు ఎదుర్కొంటున్నాయి. వదిలేసిన పంట పొలాలు, బీడు వారిన వ్యవ సాయ భూములు వెరసి వికాసం నోచుకోని వ్యవసాయం పర్యావరణ సంక్షోభానికి దారి తీస్తున్నది. సరికొత్త ధన భారానికి దేశంలోని ప్రాచీన సంస్కృతి, సామాజిక నిర్మాణం విచ్ఛి న్నమయిపోతున్నది.
కులం, వర్ణ జాఢ్యాలు నేటికీ విలయ తాండ వమాడుతూనే ఉన్నాయి. విధ్వంశాన్ని సృష్టి స్తూనే ఉన్నాయి.మతం మారణహోమాల్ని రగి లిస్తూనే ఉంది. గ్రామాల్లో పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించే పంచాయితీలు కను మరుగవుతు న్నాయి. శాంతిభద్రతలు లేకపోవడం, హింసా త్మక ధోరణి పెచ్చరిల్లి పోవడం, ఉన్మాదం, ఉగ్రవాదం వంటివి, అప్పటికే కొన సాగు తున్న శూన్యతను ఆక్రమించేశాయి. మహిళ ఇంట్లోంచి బయటికి రావాలంటే భయపడు తోంది. ఇదంతా ‘వినిమయతత్వం తెచ్చిన చేటు’ అన్నది సమాలోచనాపరుల మాట. ‘పూట తిండి దొరక్కపోయినా ఫరవా లేదు గాని, మాన, ప్రాణాలకు రక్షణ ఉండాలి’ అన్నది సగటు మనిషి ఆకాంక్ష!
పాశ్చాత్య విశృంఖల విష సంస్కృతి వికటించి సామాజిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఫలితంగా కుటుంబ విలువలు వలువలు వీడు తున్నాయి. మనిషికి తన వంశం ఏదో కూడా తెలియని దుస్థితి. ఒకవేళ పశుపక్ష్యాదులుకు మాట్లాడే శక్తి ఉంటే బహుశా అవి కూడా మానవులుకు పౌరుషం తెప్పిస్తాయోమో! ఈ విష వీచికల వ్యవస్థ అందరికంటే అధికంగా స్త్రీలకే నష్టం చేకూర్చింది.
క్షణాల సుఖం కోసం కొన్ని వేల మంది జీవి తాల్ని విషాదాంతం చేసిన వారెవరయినా వారి బ్రతుకులు సుఖాంతం కాజాలదు. అయితే ప్రగతి పేరుతో నడుస్తున్న సంస్థలు ‘నేతి బీరలో నెయ్యి చందమే’నని ప్రజా బాహు ళ్యం తెలుసుకునే సరికి పుణ్యటకాలం కాస్త ముగిసిపోయి మానవాభ్యుదయం మట్టి పాల వుతుంది. ‘డబ్బుంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది’ అన్నది వినిమయతత్వ నమ్మ కం. వినిమయతత్వ స్వభావులకు విలాసాలు కావాలి! దీని కోసం ఎంతటికైనా తెగిస్తారు. ఈ రోజు కులాసాల కోసం రేపటిని బలి పెడ తారు. భూమి గుండె చీల్చేస్తారు.బొగ్గు గనులు త్రవ్వేస్తారు. చమురు బావులు తోడేస్తారు. సహజ వాయువుల్ని పీల్చేస్తారు. ధరణిని చిది మేస్తారు. ఆకాశానికి చిల్లులు పొడిచేస్తారు. చివరికి ఈ మత్తు మనిషి జీవితాన్ని చిత్తు చేయడం ఖాయం! అది మానవాళిని పొట్టన బెట్టుకునే దినాలు ఎంతో దూరంలో లేవు. అది భూగోళాన్ని సయితం నాశనం చేసేస్తుం ది. ఈ వ్యాపార మనస్తత్వం ప్రజలను ఆకలి తో మాడ్చేస్తుంది. వారికి ఉన్న ఆ కాసింత కూడు, గూడు, గుడ్డని సయితం కాజేయడాని కి సిద్ధమవుతుందిగానీ, వారికి జీవితాన్ని ఇవ్వడం కోసం లాభాలు తగ్గించు కోవడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. కాబట్టి మనం బాగుండాలన్నా, మన అవని బాగుండాలన్నా రాజకీయ విధానాల్లోనూ, ప్రజల అలవాటు పడుతున్న వైఖరుల్లోనూ సమూలంగా మార్పు రావాలి.అందుకోసం యువత కంకణంకట్టాలి.
ప్రపంచీకరణ నేపథ్యంలో మనం ఆలోచించినట్లయితే, మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎంత కాలం మనగలదు అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న. ఈ ప్రపంచీకరణ పుణ్యమా అని వినిమయతత్వం సర్వత్రా వైరస్‌లా వ్యాపిస్తోంది. ఉన్నదాంతో సర్దుకుపోయే సు గుణం గతంలో అలవచ్చుకున్న ప్రజలే, ప్రస్తు తం కన్స్యూమరిజం పెరిగిపోయి విలాసవంత మయిన జీవితాలకు అర్రులు చాస్తున్నారు. దీని దుష్ఫలితమే విలువలు పతనమయి అవి నీతి పెచ్చరిల్లుతోంది. మన దేశంలో హద్దూ పద్దూ లేని అవినీతి, దాన్ని సమ ర్ధించుకుంటు న్న రాక్షస రాజకీయాల వల్ల దేశ గౌరవం మంట గలుస్తోంది. స్వాతంత్య్రం లభించిన ప్పటి నుంచి మన దేశాన్ని అభివృద్ధి చెందుతు న్న దేశంగా చెప్పుకుంటున్నాము. అభివృద్ధితో పాటు అవినీతి రొంపి కూడా విచ్చలవిడిగా పెచ్చరిల్లడం వల్ల కువ్యక్తులు, కుశక్తులు అభి వృద్ధి చెందుతున్నారు గానీ, దేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరడం అనేది అడుగు దూరంలోనే ఉన్నా అందని ద్రాక్షలా తయారయింది. ‘త్వం శుంఠ అంటే త్వం శుంఠ’ అన్నట్టుగా ఉంది మన రాజకీయ పార్టీల పరిస్థితి. అంటే, నీతికి నూకలు చెల్లా యనుకోవాలా? ఇకపై రాజకీయాల్లో నీతిమం తులు కొనసాగలేరనుకోవాలా? ఇదే పరిస్థితి కొనసాగితే దేశం అభ్యుదయ బాటన నడవ గలదా? వంటి ప్రశ్నలు దేశాభిమానుల మెద ళ్లను తొలిచి వేస్తున్నాయి. అయితే వీటికి సమాధానం చెప్పాల్సిన నాయకులు అందుకు సిద్ధంగా లేరు. ‘మనం మనం బరం పురం’ అన్నట్టుగా, ‘మా అవినీతికి మీరు కొమ్ము కాయండి-మీ అవినీతికి మేము కాస్తాం’ అని పరస్పరం ఒప్పందాలకు రావడంతో గుడ్లప్ప గించి చూడటం ప్రజల వంతుగా మిగులు తోంది.
‘భారత తాత్విక చింతన, కట్టుబాట్లతో కూడిన సామాజిక జీవనాన్ని ప్రోత్సహిస్తుంది. అదే ఆమెరికన్లు భౌతిక సుఖాలను, అపరిమితమై న ధనవృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తారు’ అన్న మాట ప్రస్తుతం ఉన్న మాటగా తోచడం లేదు. భారత దేశం క్రమేణా అమెరికీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు గోచరిస్తోంది. నేడు భారత ప్రజల పరిస్థితి ఎంత అయోమ యంగా ఉందంటే, పాలించడానికి అందుబా టులో ఉన్న అవినీతి నేతలలో ఎవరో ఒకరి ని ఎంచుకోవలసిన దుస్థితి ఏర్పడింది. 120 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో అవినీతి మకిలి అంటని, జాతిని ప్రభావం చేయగల స్ఫూర్తివంతమైన నాయకుడు ఒక్కడూ లేకపోవడం ఎంత విచారకరం!
అవినీతికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పోరాడు తున్నవారు అనేక మంది ఉన్నప్పటికీ, ప్రజ లకు వారిపై నమ్మకం కలగకపోవడమనేది దేన్ని సూచిస్తుందో ఒక్కసారి నిశితంగా అందరూ ఆలోచించాల్సి ఉంది. పతనమైన ఈ క్రమ స్థానాన్ని ఏది ఆక్రమిస్తుందనే దాని పై ఆలోచిస్తే నిద్ర లేని రాత్రులే మిగులు తాయి. అగ్ర రాజ్యాలు ఇచ్చే పునర్ నవీకరణ, పునరావిష్కరణ వంటి హామీలు నిజంగా గాఢ మైన వశీకరణ శక్తిని కలిగి ఉంటాయి. వాటి వల్ల ఎల్లవేళలా ప్రమాదం పొంచి ఉందన్న మాట మాత్రం కాదనలేని నిజం!
పోతే, మనిషి పాల్పడుతున్న ఈ పాప ఫలి తమే పెరుగుతున్న భూతాపం, గ్లోబల్ వార్మిన్గ్. భూతాపాన్ని తగ్గిస్తాం అని ప్రపంచ దేశాలు అనేక సదస్సుల్లో భీషణ, ఘోషణ ప్రతి జ్ఞలు చేసినా, ఒకవేళ వారు మాటకు కట్టుబడి ఉన్నా 2100 నాటికి భూతాపం 4 డిగ్రీలు పెరగడం ఖాయమని ప్రపంచ బ్యాంకు నివే దిక స్పష్టం చేసింది.
2060 లేదా 2070 నాటికి ‘4డిగ్రీల ప్రపం చం’లో మనిషి బ్రతకక తప్పదు. అప్పుడు అంతా ‘అతి’గా మారుతుంది. తడి భూములు మరింత చిత్తడిగా, ఎండు నేలలు ఇంకా ఎండి మడి పోతాయి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్రతి ఏటా ఒక వైపు వరదలు, మరో వైపు కరువులు తాండవిస్తాయి. ఈ జాబితాలో మన దేశంలోని గంగా నది, మన రాష్ట్రంలోని గోదా వరి కూడా ఉంది. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉన్న కృష్ణా నది భవిష్యత్తు కూడా ప్రమాదపుటంచుల మీద ఉందని వివిధ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అసలు ఇంత దుస్థితి ఎందుకు వస్తుంది? అంటే,
పర్యావరణ పరమైన అనేక విధ్వంసాలకు ప్రధాన కారణం…సముద్ర మట్టాలు పెరగడ మే! పెరిగే భూతాపానికి, కరిగే మంచు కొండ లతో సముద్ర మట్టం ఇప్పటికే పెరుగుతోంది. వెరసి, ఒక సీజన్‌లో అతి ప్రవాహంతో ప్రమా దం, మరీ సీజన్‌లో స్వల్ప ప్రవాహంతో దాహం దాహం!! ఏతా వాతా ఇది మొత్తం 31 దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఆ దేశాల జాబితాలో భారత దేశం కూడా ఉండటం గమనార్హం!!!
పశువు చెడ్డదయితే పశువుల కాపరిది తప్పు. ప్రజలు దారి తప్పితే పాలకుడిది తప్పు. కొడుకు దుర్మార్గుడయితే తండ్రిది తప్పు. సైన్యం వెన్ను చూపితే సేనాధిపతిది తప్పు. ఇలా తమ కళ్ళ ఎదుటే జరుగుతున్న తప్పుల ను తెలుసుకోకుండా, తెలిసినా ‘కళ్ళు మూసు కొని పిల్లి పాలు త్రాగినట్టు’ పట్టించుకోకుం డా ప్రజలు ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరించడం మరింత తప్పు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి తోడు పడవోయ్ అన్న పెద్దవారి మాటలను స్ఫూర్తిగా తీసుకొని ‘తిలా పాపం తలా పిడికెడు’ పంచు కునే నీచ ప్రవృత్తికి ఎంత తొందరగా స్వస్తి పలికితే అంతే మంచిది.