ఇహ్రామ్‌ దుస్తులు

Originally posted 2013-04-04 23:02:40.

hjj_16_2.jpg.crop_display
ఇహ్రామ్‌ దుస్తులు: హజ్‌-ఉమ్రాల దీక్ష  బూనక ముందు ధరించిన దుస్తులు తీసేసి, నడుముకు ఒక దుప్పటి కట్టుకుని, భుజాలపై ఒక దుప్పటి వేసుకోవాలి. ఇహ్రామ్‌ (దీక్ష) విధి- ఇహ్రామ్‌ దుస్తులు వాజిబ్‌.
మష్రూత్‌ ఇహ్రామ్‌: హజ్‌ మధ్యలో వ్యాధిగ్రస్తులవుతామేమోనన్న భయమున్న వారు ”ఓ అల్లాహ్‌! హజ్‌ నెరవేరుస్తూ ఏదైనా ఆటంకం ఎదురైతే నా ఇహ్రాంను విరమించుకుం టాను” అని దీక్ష బూనటం మంచిది. ఆ తరువాత అనుకోని పరిస్థితుల వల్ల హజ్‌ పూర్తి చెయ్యని యెడల ఎలాంటి పాపం వుండదు. ఖుర్బానీ (పరిహారం) అవసరమూ లేదు.

ఇహ్రామ్‌ (దీక్ష) బూనే విధానం

1) ప్రవక్త (స) సదాచారం ప్రకారం ఇహ్రామ్‌ బూనక ముందు  మీసాలు కత్తిరించాలి. చంకల్లోని, నాభి క్రింది వెంట్రుకలను తొలగించాలి. గోళ్ళు కత్తిరించాలి. తరువాత స్నానం చేసి సువాసన పూసుకోవాలి. తల దువ్వుకోవాలి.
2) పురుషులు స్నానం చేసిన పిదప ఒక దుప్పటిని నడుముకు కట్టుకోవాలి. మరో దుప్పటి భుజాలపై కప్పుకోవాలి. తలపై ఎలాంటి గుడ్డనూ కప్పకూడదు.
గమనిక: కొందరు భుజాలపైన కప్పుకోవాల్సిన దుప్పటిని కుడి భుజం క్రింద నుండి తీసి ఎడమ భుజంపై వేసుకుంటారు. ఇది హర్షదాయకం కాదు. ఇలా మొదటి తవాఫ్‌ (ప్రదక్షిణ)లో మాత్రమే చెయ్యాలి.
3) ఏదైనా ఫర్జ్‌ (విధి) నమాజు తరువాత ఇహ్రాం బూనటం మంచిది. సాధ్యం కాక పోతే తహియ్యతుల్‌ మస్జిద్‌ పేరుతో రెండు రకాతుల నమాజు చేసి ఇహ్రాం బూనాలి. ఇహ్రాం కోసమని ప్రత్యేక నమాజు లేదు.
4) బహిష్టు గల స్త్రీ సయితం స్నానం చెయ్యాలి. ఎందుకంటే; ఇది పరిశుభ్రత కోసం చేసే స్నానమేగాని పరిపూర్ణ శుద్ధత కోసం చేసే స్నానం కాదు. అందుకే ఈ స్నానానికి బదులు తయమ్ముమ్‌ చెల్లదు.
5) స్త్రీల కోసం వారు ధరించిన దుస్తులే ఇహ్రాం దుస్తులు. కాని ధరించిన దుస్తులపై బురఖా వేసుకుంటే మంచిది. చేతులకు గ్లౌజులు తొడగకూడదు. ముఖాన్ని సయితం తెరచి వుంచాలి. కాని పరాయి పురుషులు ఎదురైనప్పుడు అమ్మ ఆయిషా (ర) సదాచా రం ప్రకారం తలపైనున్న గుడ్డతో ముఖాన్ని కప్పుకోవాలి.
6) కేవలం ఉమ్రా చేస్తే ”అల్లాహుమ్మ లబ్బైక్‌ ఉమ్రతన్‌” అని, కేవలం హజ్‌ అయితే ”అల్లాహుమ్మ లబ్బైక్‌ హజ్జతన్‌” అని హజ్జె ఖిరాన్‌ అయితే ”అల్లాహుమ్మ లబ్బైక్‌ హజ్జతన్‌ వ ఉమ్రతన్‌” అని నోటితో చెప్పాలి.
 7) తల్బియా: హజ్‌-ఉమ్రాల ఇహ్రాం బూనిన తరువాత ఒకసారి తల్బియా పదాలను ఉచ్చరించాలి. ”ప్రవక్త (స) వాహనంపై కూర్చున్న తరువాత తల్బియా పలికారు”.  (బుఖారీ- ముస్లిం)
గమనిక: పురుషులు తల్బియా బిగ్గరగా పలకాలి. స్త్రీలు మెల్లగా చెప్పాలి. తల్బియా ప్రతి వ్యక్తి ఒంటరిగా చెప్పడం ఉత్తమం.
తల్బియా పలుకులు ఇవి: ‘లబ్బైక్‌ అల్లాహుమ్మ లబ్బైక్‌, లబ్బైక లా షరీక లక లబ్బైక్‌, ఇన్నల్‌హమ్ద, వన్నిఅమత, లక వల్‌ముల్క్‌, లా షరీక లక్‌’.
(అర్థం: హాజరయ్యాను ప్రభూ! నేను హాజరయ్యాను. సాటిలేని స్వామీ! నేను హాజర య్యాను. నిశ్చయంగా నీవు మాత్రమే స్తుతింప దగినవాడవు. ఈ వరాలన్నీ నీవు ప్రసా దించినవే. సార్వ భౌమాధికారం కూడా నీదే. నీకు ఎవరూ సాటి లేరు).

ఇహ్రాం నిబంధనలు     ఇహ్రామ్‌ స్థితిలో:

1) చీల మండాలను కప్పి వేసే చెప్పులు, బూట్లు తొడగరాదు.
2) శరీరం లేదా దుస్తులపై సువాసన పూయటం. సువాసనగల సబ్బుతో స్నానం  చెయ్యటం, చేతులు కడగటం, తలకు గడ్డానికి నూనె రాయటం నిషిద్ధం.
3) గోళ్ళు కత్తిరించటం, వెంట్రుకలు కత్తిరించటం, క్షవరం చేసుకోవటం నిషిద్ధం.
4) భూమిపై నివసించే జంతువుల్ని వేటాడటంగాని, వేటగాడికి సహాయ పడటం గాని  చేయకూడదు.
5) కామంతో నిండిన మాటలు మాట్లాడటం, పాపం చెయ్యటం, దుర్భాషలాడటం, కొట్లాటకు దిగటం, ఒకరికి హాని తల పెట్టడం నిషిద్ధం.
6) భార్యతో రమించడం, కామవాంఛతో తాకటం, ముద్దాడటం, పెళ్ళి చేసుకోవడం  పెళ్ళి సందేశం పంపడం నిషిద్ధం.
 ఇహ్రామ్‌లో అభ్యంతరకరం కానివి
1) స్నానం చెయ్యటం, ఇహ్రామ్‌ వస్త్రాన్ని ఉతకటం, లేదా మార్చడం ఉంగరం- గడియారం తొడగటం, స్త్రీలు నగలు ధరించడం.
2) చినిగిన ఇహ్రామ్‌ దుస్తుల్ని కుట్టడం, నడుముకు బెల్టు ధరించటం, దుప్పటి కప్పుకోవటం, అద్దం చూడటం, సుర్మా పూయటం, మిస్వాక్‌ చెయ్యటం.
3) కదిలే పంటిని తీసి వేయటం, బాండేజ్‌ కట్టడం, నూనె నెయ్యి తినటం.
4) ఇన్‌జక్షన్‌ వేయించడం. పరీక్షకై రక్తాన్ని తీయటం, ముక్కు, చెవి, కళ్ళల్లో మందు

చుక్కల్ని వెయ్యటం.

5) హరం బైట ఇహ్రాం ధరించని వ్యక్తి వేటాడిన జంతువు మాంసాన్ని తినటం, తలపై  గొడుగు పెట్టుకోవటం.

6) హాని కలిగించే జంతువుల్ని, విష పురుగుల్ని ఉదా: పాము, తేలు, దోమ లాంటివి  చంపటం.

Related Post