ఉమ్రా విధానం

Originally posted 2013-04-05 20:54:02.

kaaba-old-2
 ఉమ్రాని నెరవేర్చాలన్న సంకల్పంతో మస్జిదె హరామ్‌ చేరుకున్నప్పుడు కుడి కాలు పెడుతూ ఈ దుఆ పఠిస్తూ మస్జిదె హరామ్‌లో ప్రవేశించాలి.
 ”బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మగ్‌ఫిర్‌లీ జునూబీ వఫ్‌తహ్‌లీ అబ్‌వాబ రహ్మతిక్‌.”
 ”అవూజు బిల్లాహిల్‌ అజీమ్‌ వ బివజ్‌హిహిల్‌ కరీమ్‌ వ బిసుల్తానిహిల్‌ ఖదీమ్‌ మినష్షైతానిర్రజీమ్‌”.
తవాఫ్‌: కాబాపై దృష్టి పడగానే చేసే దుఆ స్వీకరించబడుతుందని గుర్తుంచుకోండి. తరువాత తవాఫ్‌ (ప్రదక్షిణ) మొదలు పెట్టడానికి హజ్రె అస్వద్‌ వైపు సాగి పోవాలి. వీలైతే దాన్ని ముద్దాడాలి. దాన్ని ముద్దాడే ప్రయత్నంలో ఇతర యాత్రికులను తోసి వేయకూడదు. హజ్రె అస్వద్‌ని తాకేటప్పుడు ఈ దుఆ పఠించాలి:
 ”బిస్మిల్లాహి అల్లాహు అక్బర్‌.అల్లాహుమ్మ ఈమానన్‌ బిక, వ తస్‌దీఖన్‌ బికితాబిక, వ వఫాఅన్‌ బి అహ్‌ాదిక, వ ఇత్తిబాఅన్‌ లిసున్నతి నబియ్యిక (స)”.  ప్రతి ప్రదక్షిణ హజ్రె అస్వద్‌ నుండి ప్రారంభమై హజ్రె అస్వద్‌ దగ్గరే ముగుస్తుంది. రుక్నె యమానీని వీలైతే చేత్తో తాకాలి. లేదంటే సైగ చెయ్యకూడదు. ముద్దాడకూడదు. రుక్నె యామని – హజ్రె అస్వద్‌ల మధ్య ఈ దుఆ పఠించాలి: ”రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్‌ వ ఫిల్‌ ఆఖిరతి హసనతన్‌ వఖినా అజాబన్నార్‌”.
 తవాఫ్‌ కోసం పరిశుద్ధత (తహారత్‌) మరియు వుజూ అవసరం. అలాగే ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు కాబా మీకు ఎడమ వైపు ఉండాలి. మొదటి ప్రదక్షిణలో భుజాలపైనున్న ఇహ్రాం గుడ్డ  నుండి కుడి భుజాన్ని తెరచి వుంచటం మంచిది. అలాగే మొదటి మూడు ప్రదక్షిణల్లో జోరుగా నడవడం అభిలషణీయం. ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసిన పిదప, మఖామె ఇబ్రాహీం దగ్గర 2 రకాతుల నమాజ్‌ వీలైతే చెయ్యాలి. అలా కుదరని ఎడల మస్‌జిదె హరామ్‌లో ఎక్కడ చోటు లభిస్తే అక్కడ చేసుకోవాలి.
 మొదటి రకాతులో ”ఫాతిహా సూరా” తరువాత ”ఖుల్‌ యా అయ్యుహల్‌ కాఫిరూన్‌” రెండవ రకాతులో ”ఖుల్‌ హువల్లాహు అహద్‌” పారాయణం చెయ్యాలి.
 తరువాత జమ్‌జమ్‌ జలం త్రాగడం అభిలషణీయం. మళ్ళీ అక్కడి నుండి బయలు దేరి సఫా కొండ వద్దకు చేరుకోవాలి.
సయీ: ఇప్పుడు మీరు సఫా కొండను సమీపించారు. ఇప్పుడు ”ఇన్నస్సఫా వల్‌ మర్‌వత మిన్‌ షఆయిరిల్లాహ్‌ా….(బఖరా) ” అనే ఆయత్‌ పఠించాలి. తరువాత మెల్లగా కొండపై చేరుకోవాలి. కాబా వైపుకి తిరిగి ప్రవక్త (స) చదివిన ఈ దుఆని చదవాలి:
 ”లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ, లా షరీక లహూ, లహుల్‌ముల్కు, వలహుల్‌ హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్‌ ఖదీర్‌. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ, అన్‌జజ వఅదహూ, వ నసర అబ్దహూ, వ హజమల్‌ అహ్‌ాజాబ వహ్‌దహూ”.
 పై దుఆ మూడ సార్లు చదివిన తరువాత ఇష్టమైన దుఆ చెయ్యాలి. ఆ తరువాత సఫా నుండి సయీని ప్రారంభించి మర్వా వరకు, మర్వా నుండి సఫా వరకు 7 సార్లు సయీ చెయ్యాలి. పచ్చటి గుర్తు మధ్య పురుషులు మాత్రం వేగంగా నడవాలి. ఆ తరువాత బయటకెళ్ళి శిరోముండనం చేయించుకోవాలి. లేదా వెంట్రుకలను కత్తిరిం చుకోవాలి. స్త్రీలు శిరోముండనం చెయ్యకూడదు. వారు కొన్ని వెంట్రుకలు మాత్రమే కత్తిరిస్తే సరిపోతుంది. ఈ విధంగా మీ ఉమ్రా పూర్తయింది.
 ఇప్పుడు మీరు ఇహ్రామ్‌ ఆంక్షల నుంచి ముక్తి పొందారు. ఇహ్రామ్‌ సందర్భాన నిషిద్ధమై ఉన్న ధర్మసమ్మతమైన కొన్ని కార్యాలు హలాల్‌ అవుతాయి.
గమనిక: ఇది హజ్జె తమత్తుకి సంబంధించిన ఉమ్రా మరియు సంవత్సరంలో ఎప్పుడైనా చేసే ఉమ్రా విధానం.  ఇక హజ్జె ఖిరాన్‌కి సంబంధించిన ఉమ్రా గురించి తెలుసుకుందాం. మీరు హజ్జె ఖిరాన్‌ చేసినట్లయితే మక్కా వెళ్ళగానే కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసిన తరువాత రెండు రకాతులు నమాజ్‌ చేసి, సఫా మర్వాల మధ్య సయీ చెయ్యాలి. కాని హజ్‌ పూర్తి అయ్యే వరకు శిరోముండనం చెయ్యకూడదు. హజ్జె ఇఫ్రాద్‌ అయితే తవాఫె ఖుదూమ్‌ తరువాత హజ్‌ సయీ చెయ్యవచ్చు. లేదా తవాఫె ఇఫాజ అనంతరం సయీ చేయవచ్చు. అంటే తవాఫే ఖుదూమ్‌ తరువాత హజ్‌ పూర్తయ్యేవరకూ ఇహ్రాంలోనే ఉంటారు.

Related Post