ముహర్రమ్‌లో చేస్తున్నదేమిటి? చేయాల్సిందేమిటి?

Originally posted 2013-05-01 15:27:07.

ముహర్రమ్‌

మానవ జాతి చరిత్రలో ముహర్రమ్‌ మాసానికి గల ప్రాముఖ్యం ఎనలేనిది. హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం ఇది మొదటి నెల. అల్లాహ్‌ తరఫున నిషిద్ధ (పవిత్ర) మాసాలుగా ప్రకటించబడిన వాటిలో ఒక నెల

హాఫిజ్ ఇస్హాక్ జాహిద్
మానవ జాతి చరిత్రలో ముహర్రమ్‌ మాసానికి గల ప్రాముఖ్యం ఎనలేనిది. హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం ఇది మొదటి నెల. అల్లాహ్‌ా తరఫున నిషిద్ధ (పవిత్ర) మాసాలుగా ప్రకటించబడిన వాటిలో ఒక నెల. దీని గురించి అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:
”నిశ్చయంగా భూమ్యాకాశాలను అల్లాహ్‌ా సృష్టించినప్పటి నుండీ మాసాల సంఖ్య దైవగ్రంథంలో పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (పవిత్రమైనవి). ఇదే సరైన ధర్మం. కనుక ఈ నాలుగు మాసాలలో మీ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టకండి”.   (అత్‌తౌబా: 36)
  ఇంతకీ ఆ నిషిద్ధ (పవిత్ర) మాసలేవీ? దీనికి సమాధానం ఈ హదీసులో ఉంది:
హజ్రత్‌ అబూ బక్రా (ర) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”సంవత్సరం 12 మాసాలతో కూడుకున్నది. వాటిలో నాలుగు మాసాలు పవిత్రమైనవి (గౌరవనీయమైనవి, నిషిద్ధమైనవి). వాటిలో మూడు ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి – అంటే జుల్‌ఖఅదా, జుల్‌ హిజ్జా, ముహర్రమ్‌ (మాసాలు). నాల్గవది రజబ్‌ మాసం. అది జమాదివుస్సానీకి – షాబాన్‌కి మధ్యన ఉన్నది”.  (బుఖారీ)
  ”కాబట్టి (ఈ మాసాలలో) మీరు మీ ఆత్మలకు అన్యాయం చేసుకోకండి” అని దేవుడు తాకీదు చేసి మరీ చెప్పడం గమనార్హం. ఆ మాటకొస్తే అన్యాయం, అక్రమం, దౌర్జన్యం అనేది ఎప్పటికీ నిషిద్ధమే. కాని ఈ నాలుగు మాసాల పేర్లను ప్రస్తావించి వాటి గౌరవ మర్యాదలకు, చారిత్రక ప్రాశస్త్యానికి విఘాతం కలిగించరాదని చెప్పడం వెనుక గల ఔచిత్యాన్ని మనం తరచి చూడాలి.
 ఇంతకీ ఇక్కడ అన్యాయం (జుల్మ్‌) చేయడమంటే అర్థం; ఈ మాసాలలో కయ్యానికి కాలు దువ్వటం, హత్యలు చేయటం, రక్త పాతం సృష్టించటం. దీనికి ఆధారం క్రింది వచనంలో ఉంది:
  ‘నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటం గురించి ఈ జనులు నిన్ను అడుగుతారు. (ఓ ప్రవక్తా!) ఆ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం అని నీవు వారికి చెప్పు”. (అల్‌ బఖర: 217)
ఇస్లాంకు పూర్వం (అజ్ఞానకాలంలో) కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని యుద్ధ విరమణ చేసేవారు. హింసాదౌర్జన్యాలకు దూరంగా మసలుకునేవారు. తర్వాత ఇస్లాం కూడా ఈ ‘పవిత్రత’ను, ‘ప్రతిపత్తి’ని అక్షరాల గౌరవిస్తూ వాటిలో యుద్ధాలు చేయటాన్ని ఘోర నేరంగా ఖరారు చేసింది.
  ఈ నాలుగు మాసాలలో దేవుని అవిధేయతకు ఒడిగట్టడం, దైవాజ్ఞల పట్ల ఉల్లంఘనకు పాల్పడటం, ధర్మంలో లేనిపోని పోకడలను సృష్టించుకుని అసభ్యంగా ప్రవర్తించడం కూడా అన్యాయం (జుల్మ్‌) క్రిందికి వస్తుంది.
 హాఫిజ్‌ ఇబ్ను కసీర్‌ (రహ్మ) హజ్రత్‌ ఇబ్ను అబ్బాస్‌ (ర) గారి మహితోక్తులను ఉటంకిస్తూ ఇలా అన్నారు: అన్యాయం ఎప్పుడు చేసినా అది అన్యాయమే. కానీ ఈ నాలుగు మాసాలలో దేవుడు విధించిన హద్దుల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త పడాలి. ఈ నెలల్లో చేసిన సత్కార్యాలకు పుణ్యఫలం పెంచబడినట్లే, దుష్కార్యాలకు పాప ఫలం కూడా పెంచబడింది.
  ”ఈ మాసాలలో మీకు మీరే అన్యాయం చేసుకోకండి” అనే వాక్యంపై వ్యాఖ్యానిస్తూ ఇమాం ఖతాదా (రహ్మ) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ా తన దూతలలో సందేశహరునిగా ఒకరిని ఎన్నుకున్నాడు. తన వాక్కులలో అంతిమ గ్రంథంగా ఖుర్‌ఆన్‌ను ఎన్నుకున్నాడు. సమస్త భూమండలంలో మస్జిద్‌లను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. మాసాలలో రమజాను మాసాన్ని, నిషిద్ధ మాసాలను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. దినాలలో శుక్రవారాన్ని  ఎన్నుకున్నాడు. రాత్రులలో లైలతుల్‌ ఖద్ర్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నాడు. అల్లాహ్‌ా తాను కోరిన దానికి (కోరిన వారికి) ఉన్నతిని ప్రసాదిస్తాడు. కనుక అల్లాహ్‌ా గొప్పగా భావించిన దానిని మీరు కూడా గొప్పగా పరిగణించండి”.  (తఫ్సీర్‌ ఇబ్ను కసీర్)
సోదరులారా!
మనం సంవత్సరం పొడుగూతా దేవుని అవిధేయతకు జడుస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ నాలుగు నిషిద్ధ మాసాలలో అపరాధాలకు, అజ్ఞోల్లంఘనకు దూరంగా ఉండాలి. ఇహపరాలలో నాశనం చేసే చేష్టల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఘోర అపరాధాల, అవిధేయతా  చేష్టల మూలంగా ఆంతర్యం కలుషితమవు తుంది. హృదయానికి తుప్పు పడుతుంది. అల్లాహ్‌ా ఏమన్నాడో చూడండి:
”ఎంత మాత్రం కాదు, అసలు వారి హృదయాలకు వారి దురాగతాల కారణంగా తుప్పు పట్టింది”. (తత్ఫీప్: 14)
ప్రవక్త మహనీయులు (స) ఈ నేపథ్యంలో ఏమన్నారో చూద్దాం:
  ”విశ్వాసి (మోమిన్‌) పాపం చేసినప్పుడు అతని హృదయంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. మరి అతను గనక పశ్చాత్తాపం చెంది, ఆ తప్పిదానికి దూరంగా ఉంటే అది అతని హృదయాన్ని ప్రక్షాళనం చేస్తుంది. అలాకాకుండా అతను గనక యదేచ్ఛగా పాపకార్యాలు చేస్తూ పోతే అతని హృదయంపైని మచ్చ పెరుగుతూ పోతుంది. చివరికి అది అతని ఆంతర్యాన్ని పూర్తిగా కమ్మేస్తుంది. ‘తుప్పు అంటే ఇదే’, దీన్ని గురించే అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో ప్రస్తావించాడు”. (తిర్మిజీ, ఇబ్ను మాజా)
  జాగ్రత్త! పాపాలు చేసేవారి జీవితంలో ప్రశాంతత ఉండదు. నిత్యం వారి జీవితాల్లో వ్యాకులత, చీకు ఉంటుంది. ఈ విషయాన్ని అల్లాహ్‌ కూడా తన గ్రంథంలో ప్రస్తావించాడు:
”ఎవరైతే మా సన్మార్గం పట్ల విముఖత చూపుతాడో అతను ప్రపంచంలో లేమితో బాధపడతాడు. ప్రళయ దినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. ‘ప్రభూ! నీవు నన్ను గుడ్డివానిగా చేసి లేపావేమిటి? నాకు కంటి చూపు ఉండేది కదా!’ అని  అడుగుతాడు.
 ‘నీకు ఇలానే జరగాలి. ఎందుకంటే నీ వద్దకు మా సూచనలు వచ్చినప్పటికీ నువ్వు వాటిని విస్మరించావు. కాబట్టి ఈ రోజు నిన్ను కూడా విస్మరించటం జరిగింది” అని అల్లాహ్‌ అంటాడు.
అంటే దైవ ధర్మం పట్ల వైముఖ్యం కనబరచి, ఖుర్‌ఆన్‌ సూక్తుల పారాయణం పట్ల అనాసక్తత చూపి, వాటికనుగుణంగా అవలంబించిన వ్యక్తిని  నలువైపుల నుంచీ దరిద్రం చుట్టుకుంటుంది. అతని రోజువారి సంపాదన బాగానే ఉన్నప్పటికీ జీవితంలో శాంతి, తృప్తి కరువైపోతాయి. మరణించిన మీదట సమాధి కూడా కుంచించుకుపోతుంది. సుదీర్ఘమైన బర్జఖ్‌ అవస్థలో ఎన్నో కఠినమైన యాతనలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక పునరుత్థాన దినమున అతన్ని లేపినప్పుడు కంటి చూపుతో పాటు మనో నేత్రం కూడా లేకుండా పోతుంది. దైవం మనల్ని ఈ దుస్థితి నుండి కాపాడు గాక!
 అందుకే మనం అసంఖ్యాఖమైన దైవానుగ్రహాలకుగాను కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞతకు అత్యుత్తమ మార్గం మనం దైవాజ్ఞలకు కట్టుబడి ఉండటం, అవిధేయతకు, ఆజ్ఞోల్లంఘనకు దూరంగా ఉండటమే.
ముహర్రమ్‌ మాసంలో వింత సంతాపం
 ముహర్రమ్‌ నెలలో కొంతమంది దుస్తులు చించుకుంటూ, రొమ్ములు బాదుకుంటూ, కత్తులతో పొడుచుకుంటూ వికృత పద్ధతిలో సంతాపపం పాటిస్తారు. మా దృష్టిలో ఇది కూడా అన్యాయం (జుల్మ్‌)లో ఒక రకమే. ఇది నిషిద్ధం. ఇలాంటి వికృత పోకడల గురించి దైవ ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు.
”అజ్ఞానకాలపు చేష్టలలో నాలుగు చేష్టలు నా ఉమ్మత్‌ (అనుచర సమాజం)లో ఉంటాయి. వాటిని వదలటానికి కొంత మంది సిద్ధమవరు. జాతి (దురభిమానం) కారణంగా అహంభావం ప్రదర్శించటం, వేరొకరి వంశాన్ని గురించి చులకనగా మాట్లాడటం, నక్షత్రాల ద్వారా జాతకాలు తెలుసుకోవటం, (లేదా నక్షత్రాల ద్వారా వర్షాన్ని కోరటం), అసహ్యకరంగా రోదించి సంతాపం తెలుపటం”.
 ఆయన (స) ఇంకా ఇలా అన్నారు: ”పెడబొబ్బలతో సంతాపం తెలిపే స్త్రీ గనక మరణించక ముందే పశ్చాత్తాపం చెందకపోతే, ప్రళయ దినాన లేపబడినప్పుడు ఆమె ఒంటిపై తారు చొక్కా ఉంటుంది. వ్యాధికి సంబంధించిన దుస్తులు ఆమె శరీరానికి ఆచ్ఛాదనగా ఉంటాయి”. (ముస్లిం)
 పై హదీసు ద్వారా అవగతమయ్యేదేమిటంటే పెడబొబ్బలు పెట్టడం, రొమ్ములు బాదుకోవటం అజ్ఞానకాలపు చేష్టల్లో ఒకటి. దీనికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి చేష్టలకు పాల్పడేవారితో తనకెలాంటి సంబంధం లేదని చెబుతూ మహా ప్రవక్త (స) ఇలా అన్నారు:
”ముఖంపై అదే పనిగా లెంపలేసుకునేవాడు, చొక్కా చించుకుని రోదించేవాడు, అజ్ఞానకాలంలో మాదిరిగా పిచ్చిగా అరుస్తూ ఉండేవాడు, కష్టకాలంలో చావు కోసం కేకలు వేసేవాడు మావాడు కాడు”. (సహీహ్‌ బుఖారీ)
ప్రియమైన పాఠకులారా!
ముహర్రమ్‌ నెలలో మనవారిలో చాలా మంది మహా ప్రవక్త (స) ముద్దుల మనవడైన హజ్రత్‌ హుసైన్‌ (ర) గారి అమరగతికి సంతాప సూచకంగా ‘మాతం’ చేస్తుంటారు. హజ్రత్‌ హుసైన్‌ (ర) గారి అమరగతిని తలచుకొని దుఃఖంతో విలపించని వారెవరుంటారు చెప్పండి? నిజానికి ప్రతి ముస్లిం ఈ విషాదకర సంఘటనపై   బాధతో  కృంగిపోతాడు. అయితే    కష్టకాలంలో   సదా   ఓర్పుతో వ్యవహరించినట్లే హజ్రత్‌ ఇమాం హుసైన్‌  (ర) వీర మరణం విషయంలో కూడా నిగ్రహంతో వ్యవహరించాలి. ఏ విలువల, ఆదర్శాల కోసం ఆ వీర పురుషుడు పోరాడారో వాటిని మనమూ పునరుద్ధరించేందుకు ప్రయత్నించాలి. అవేవీ చేయకుండా ఆవేశంతో ఊగిపోవటం, రొమ్ములు బాదుకుని మాతం చేయటం, కత్తులతో పొడుచుకుని రక్తం చిందిచటం సభ్యతా కాదు, సత్సంప్రదాయమూ కాదు. ”సహనం వహించేవారికి అల్లాహ్‌ా లెక్కలేనంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు”. (జుమర్: 10)
  ఇమామ్‌ హుసైన్‌ (ర) గొప్ప సహాబీ అన్నది నిర్వివాదాంశం. ఆయన గొప్పతనం గురించి అర్థం చేసుకోవడానికి ఆయన (ర) మహా ప్రవక్త (స) గారి ముద్దుల మనవడు అన్న విషయం ఒక్కటి చాలు. తన మనవళ్ళయిన హసన్‌, హుసైన్‌ (ర)లను ప్రవక్త (స) అమితమైన అవ్యాజానురాగాలతో చూసుకునేవారు. ఒక ఉల్లేఖనం ప్రకారం మహా ప్రవక్త (స) ఒకసారి తన మనవళ్ళిద్దరినీ హృదయానికి హత్తుకుని ”ఓ అల్లాహ్‌! నేను వీరిద్దరిని ప్రేమిస్తున్నాను. కనుక నీవు కూడా వీళ్ళని ప్రేమించు” అని ప్రార్థించారు.  (ముస్నద్‌ అహ్మద్)
  హజ్రత్‌ అబూ హురైరా (ర) ఇలా తెలిపారు: ఒక రోజు దైవప్రవక్త (స) మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో హసన్‌ హుసైన్‌లిద్దరూ ఆయన (స) వెంటనే ఉన్నారు. ఒక భుజంపై హసన్‌, మరో భుజంపై హుసైన్‌ కూర్చొని ఉన్నారు.  ప్రవక్త (స) ఒకసారి ఒక మనవణ్ణి, మరోసారి రెండో మనవణ్ణి ముద్దు పెట్టుకుంటున్నారు. ఈ వైనాన్ని గమనించిన ఒక శిష్యుడు, ”ఓ దైవ ప్రవక్తా (స)! తమరు వీళ్ళని ఇంతగా ప్రేమిస్తున్నారా?” అని అడగనే అడిగేశాడు. మహాప్రవక్త (స) ఈ మాటకు సమాధానమిస్తూ ”ఎవడైతే వీళ్ళని ప్రేమించాడో  అతను నన్ను ప్రేమించాడు. ఎవడైతే వీళ్ళని ద్వేషించాడో అతను నన్ను ద్వేషించాడు” అన్నారు. (అహ్మద్)
  ఈ విధంగా చెప్పుకుంటూపోతే ప్రవక్త మనుమల గొప్పతనాన్ని సూచించే హదీసులు ఇంకా ఎన్నో వస్తాయి. ఈ హదీసుల దృష్ట్యా మనమంతా హస్‌నైన్‌లను హృదయపూర్వకంగా ఆదరించాలి. హజ్రత్‌ హుసైన్‌ (ర) అమరగతి చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనే. కాని ఏటేటా ముహర్రమ్‌ నెలలో ఆ సంఘటనను తలుచుకుని చేసే పనులు మాత్రం ధర్మసమ్మతం కావు. స్వయంగా మన ప్రవక్త (స) అలాంటి చేష్టలను అధర్మంగా ఖరారు చేశారు.
అందుకే హజ్రత్‌ హుసైన్‌ (ర) గారి వీర మరణాన్ని దేవుని విధివ్రాతగా భావించాలి. ఈయన తండ్రి హజ్రత్‌ అలీ (ర) గారి వీర మరణం కూడా విధి వ్రాత ప్రకారమే జరిగింది. హిజ్రీ శకం 40వ సంవత్సరం రమజాను నెల 17వ తేదీ ఉదయం ఫజ్ర్‌ నమాజు కోసం వెళుతూ దైవ మార్గంలో అమరగతి నొందారు అమీరుల్‌ మోమినీన్‌ హజ్రత్‌ అలీ (ర). అంతకు మునుపు తృతీయ ఖలీఫా హజ్రత్‌ ఉస్మాన్‌ (ర) దుర్మార్గుల చేతుల్లో అమానుషంగా వధించబడ్డారు. హిజ్రీ శకం 36వ ఏట జుల్‌హిజ్జా నెల తష్రీఖ్‌ దినాలలో ఈ విషాదకర సంఘటన జరిగింది. అంతకు ముందు ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ ఫారూఖ్‌ (ర) కూడా అమరగతినొందినవారే. అమరగతికి నోచుకున్న ఈ ముగ్గురు ఖలీఫాలు నిశ్చయంగా హజ్రత్‌ హుసైన్‌ (ర) కన్నా శ్రేష్ఠులే. కాని ఇలాంటి ఘటనలు సంభవించినపుడు మనం ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌ (మేము అల్లాహ్‌ాకు చెందిన వారము. నిశ్చయంగా మేము మరలిపోవలసింది ఆయన సన్నిధికే) అని అనటం తప్ప మరేమనగలం?

Related Post