ఏప్రిల్ ఫూల్ ఒక వెకిలి చేష్ట

ఏప్రిల్ ఫూల్ ఒక వెకిలి చేష్ట

అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్

అల్హందులిల్లాహ్ (సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కే చెందును), మేము అల్లాహ్ నే స్తుతిస్తాము, సహాయం కోసం అర్థిస్తాము మరియు క్షమించమని పశ్చాత్తాప పడతాము. మాలోని దుష్టత్వం నుండి మరియు మా చెడుపనుల నుండి కాపాడమని అల్లాహ్ ను వేడుకుంటున్నాము. ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం వహిస్తాడో, సన్మార్గం చూపుతాడో, అతనిని ఇంకెవ్వరూ దారి తప్పించలేరు మరియు ఎవరినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వానికి వదిలి వేస్తాడో, అతనికి ఇంకెవ్వరూ సన్మార్గం చూపలేరు.

అబద్ధాలాడటం లేదా అసత్యం పలకటం అనేది ఒక చెడు పని మరియు దుష్ట లక్షణం. దీనికి వ్యతిరేకంగా ప్రపంచ మతాలన్నీ మరియు సిద్ధాంతాలన్నీ హెచ్చరించాయి. అంతేకాక అది ఒక తప్పు పనని మానవుడి సహజత్వం (ఫిత్రా) కూడా అంగీకరిస్తుంది. ధార్మిక, నైతిక, సాంఘిక నియమాలు కలిగిన వారు మరియు వివేకవంతులు కూడా ఇదే మాట అంటారు.

ప్రపంచ నీతినియాల మనుగడ ఆధారపడి ఉన్న మూలస్థంభాలలో సత్యత కూడా ఒక మూలస్థంభము. ప్రశంసార్హమైన, మెచ్చదగిన ప్రత్యేక లక్షణాలకిది పునాది వంటిది. అంతేకాక ప్రవక్త పదవికిది పునాది రాయి వంటిది. దీని ప్రతిఫలం తఖ్వా (అల్లాహ్ యొక్క అయిష్టానికి మరియు ఆగ్రహానికి మనస్పూర్తిగా భయపడేటట్లు చేసే అచంచల దైవభక్తి). సత్యత్వపు మూలాధారంపై లేని దివ్యశాసనాలన్నీ కుప్పకూలిపోతాయి. మాట్లాడటమేది మానవుడి యొక్క విశిష్ఠ లక్షణం కావటం వలన  అబద్ధాలు చెప్పే లక్షణానికి మరియు ఒకరి మానవత్వాన్నే ఖూనీ చేసే గుణానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. (బరీఖహ్ ముహమ్మదియ్యహ్, ముహమ్మద్ అల్ ఖాదిమి, 3/183)

ఖుర్ఆన్ మరియు సున్నహ్ లలోని (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలలోని) స్వచ్ఛమైన ఏకదైవత్వ షరిఅహ్ (జీవన విధానం) అబద్ధానికి, అసత్యానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తున్నది. ఇది హరాం అని (నిషేధింపబడినదని) పండితుందరూ ఏకీభవించారు. అసత్యవంతుడు ఇహపరలోకాలలో బాధాకరమైన పర్యవసనాలను ఎదుర్కొంటాడు.

జీవితాలను కాపాడే, ప్రజల మధ్య రాజీ కుదిర్చే లేక భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెంపొందించే ఉద్దేశ్యంతో ఇతరుల హక్కులకు భంగం కలిగించని, రక్తపాతం చిందించని లేక ప్రజల మానమర్యాదలపై అపనిందలు వ్యాపింపజేయని కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్పితే అసత్యం పలకటమనేది షరిఅహ్ లో అస్సలు అనుమతింపబడలేదు.

ఏ వ్యక్తికైనా అసత్యాల ఆధారంగా మాట్లాడటానికి లేక తనకు ఇష్టం వచ్చినట్లు పలకటానికి ఏనాడూ మరియు ఏ సందర్భంలోనూ షరిఅహ్ అనుమతించలేదు. “ఏప్రిల్ ఫూల్స్ దినం” అనేది సాధారణ ప్రజలలో బాగా వ్యాపించి ఉన్నటువంటి ఒక దురలవాటు. నాలుగవ సౌర్యమాసం యొక్క మొదటి రోజున అసత్యం పలకటానికి అనుమతింపబడినదని వారి వాదన. వీరి వాదనకు షరిఅహ్ జీవన విధానం నుండి ఏ ఆధారమూ లేదు.దీని వలన అనేక చెడు విషయాలు సంభవించవచ్చు. వాటిని వివరంగా చర్చించుదాము. అసత్యమాడటంపై ఉన్న నిషేధాజ్ఞలు.

1. అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం): “అల్లాహ్ యొక్క ఆయాత్ లను (ఋజువులు, సాక్ష్యాలు, వచనాలు, సూక్తులు, చిహ్నాలు, దివ్యాతరణలు మొదలైన వాటిని) విశ్వసించని వారే అబద్ధాలు పలుకేవారు. వారే అసలైన అసత్యవాదులు.” [అన్నహల్ 16:105]

ఇబ్నె కథీర్ ఇలా వివరించెను:“తన రసూల్ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) అబద్ధాల కోరు, మాటకారి కాడని అల్లాహ్ ఇక్కడ మనకు తెలుపుతున్నాడు. ఎందుకంటే అల్లాహ్ యొక్క ఆయాత్ లను అంటే చిహ్నాలను విశ్వసించని  సత్యతిరస్కారులు (కాఫిర్ లు) మరియు కపటులే నీచాతినీచమైన దుష్టులు. వారు తమ ప్రజలలో అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అబద్ధాలు చెప్పే అసత్యవంతులుగా ప్రఖ్యాతి గడించి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం ప్రజలలో కెల్లా అత్యంత సత్యవంతుడు, పుణ్యపురుషుడు మరియు జ్ఞానంలో, ఆచరణలో, దృఢనమ్మకంలో, అచంచల విశ్వాసంలో పరిపూర్ణుడు. తన ప్రజలలో ఆయన సత్యవంతుడిగా ప్రసిద్ధి చెందెను; వారిలో ఎవరూ ఆయనను అనుమానించేవారు కాదు. అందువలన ప్రజలు ఆయనకు ‘ముహమ్మదుల్ అమీన్ అంటే నిజాయితీపరుడైన ముహమ్మద్’ అనే మారు పేరును ఇచ్చారు. దీనిని ఆయన వ్యతిరేకులు సయీతం ఒప్పుకున్నారు. ఉదాహరణకు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మప్రచారాన్ని వ్యతిరేకించిన అబు సుఫ్యాన్ ను ప్రవక్త లక్షణాల గురించి రోమ్ చక్రవర్తి హిరాక్యులస్ అడిగిన ప్రశ్నలలో ‘ఈ ధర్మప్రచారం ఆరంభం చేయక ముందు ఆయనపై అసత్యం పలికాడని మీరెప్పడైనా ఆరోపించారా?’ అనే ప్రశ్న కూడా ఉన్నది. దానికి అబుసుఫ్యాన్ ‘లేదు.’ అని బదులు పిలికెను. అప్పుడు హిరాక్యులస్ ఇలా ప్రకటించెను: ‘ప్రజల గురించి ఆయన అబద్ధాలు చెప్పనప్పుడు, అల్లాహ్ గురించి అస్సలు అబద్ధం చెప్పడు.’  (తఫ్సీర్ ఇబ్నె కథీర్)

2. అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “కపటుల చిహ్నాలు మూడు: అతను పలికినప్పుడు అసత్యం పలుకుతాడు; అతను వాగ్దానం చేసినప్పుడు దానిని భంగపరుస్తాడు; మరియ అతనిపై నమ్మకం ఉంచినప్పుడు దానిని వమ్ము చేస్తాడు (మోసగిస్తాడు).” సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథాలు.

అన్నవావీ ఇలా వివరించారు: “వ్యాఖ్యానకర్తలు మరియు అనేక పండితులు సరైన పద్ధతిని అనుసరిస్తూ ఇలా వివరించారు – ఇవి కపటుల లక్షణాలు, అంటే ఎవరిలోనైతే ఈ లక్షణాలు ఉన్నాయో, వారు కపటులను పోలి ఉంటారని అర్థం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ వాడిన ‘అతను శుద్ధ కపటుడు’ అనే పదాల భావం ఏమిటంటే ఈ లక్షణాల వలన అతను ఎక్కువగా కపటులను పోలి ఉంటాడు అని అర్థం. ‘ఎవరిలోనైతే ఈ లక్షణాలు ప్రబలంగా ఉంటాయో ఈ పదాలు వారి గురించి ఉద్దేశించినవేనని’ కొందరు పండితుల అభిప్రాయం; కాని అప్పుడప్పుడు ఇటువంటి లక్షణాలు ప్రదర్శించేవారు ఈ కపటుల కోవలోనికి రారు. ఈ హదీథ్ భావం గురించిన ఉత్తమ అభిప్రాయం ఇదే. ఇమాం అబూ ఈసా అత్తిర్మథీ (రహిమహుల్లాహ్) దీని గురించిన పండితుల అభిప్రాయాన్ని ఇలా తెలిపారు ‘ఒకరి ఆచరణలలోని కపటత్వమే వీటి భావం అని పండితుల అభిప్రాయం.’”  (సహీహ్ ముస్లిం)

అసత్యాలలో ఘోరాతిఘోరమైన రకాలు:1. అల్లాహ్ గురించి మరియు రసూలుల్లాహ్ (అల్లాహ్ యొక్క ప్రవక్త) సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెప్పబడే అసత్యాలు, అబద్ధాలు. ఇది అన్నింటికంటే అత్యంత గంభీరమైన అబద్ధం. ఇలాంటి వారిని తీవ్రంగా హెచ్చరించ వలసి ఉంటుంది. ఇటువంటి వారికి కాఫిర్ అంటే సత్యతిరస్కారులని బహిరంగంగా ప్రకటించవచ్చని కొందరు పండితుల అభిప్రాయం.అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచనపు భావం యొక్క అనువాదం): “చెప్పండి: నిశ్చయంగా, అల్లాహ్ గురించి అసత్యాలు పలికే వారు ఎన్నటికీ సాఫల్యవంతులు కాలేరు” [10:69]

అలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ‘నా గురించి అసత్యాలు పలకకండి. ఎవరైతే నా గురించి అసత్యాలు పలుకుతారో వారు నరకాగ్నిలో ప్రవేశిస్తారు.’ (సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం) అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “నా గురించి అబద్ధాలు చెప్పేవారెవరైనా సరే, అతని స్థానం నరకంలో ఉంటుంది.” (సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం మరియు సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథం.)

ఇబ్నె అల్ ఖయ్యూమ్ ఇలా వివరించెను: “… ‘నా గురించి అబద్ధాలు చెప్పేవారెవరైనా సరే, అతని స్థానం నరకంలో ఉంటుంది.’, i.e., అతని స్థానం నరకంలో కేటాయించబడుతుంది, అక్కడే అతను శాశ్వతంగా నివాసముంటాడు; అంతేకాని అది ప్రయాణంలో కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని ముందుకు సాగిపోయే ఒక విడిది వంటిది లేదా క్యాంపు వంటిది కాదు.” (తరీఖ్ అల్ హిజ్రాతైన్, p. 169) అసత్యంలో ఇతరుల గురించి అసత్యం, అబద్ధం పలకటం కూడా ఉంది. ఉదాహరణకు –

2. వ్యాపార లావాదేవీలలో, వాణిజ్యంలో, వర్తకంలో అబద్ధాలాడటం. అబూ ధర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ప్రతిఫల దినమున మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ మాట్లాడడు, వారి వైపునకు చూడడు లేదా వారిని ప్రశంసించడు. మరియు వారి కోసం బాధాకరమైన శిక్ష ఉన్నది.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనినే మూడు సార్లు రిపీట్ చేసారు. అది విని అబూ ధర్ రదియల్లాహు అన్హు ఇలా ప్రశ్నించారు: “అటువంటి వారు సర్వనాశనమైపోవుగాక, ఓ రసూలుల్లాహ్ (అల్లాహ్ యొక్క ప్రవక్తా)! వారెవరు?” ఆయన బదులు పలికారు, “తమ దుస్తులను చీలమండలాల కంటే క్రిందకు వ్రేలాడేటట్లు వదిలేసేవారు, ఇతరులకు చేసిన మంచిని గురించి వారికి జ్ఞాపకం చేస్తుండేవారు మరియు తమ సరుకులను అసత్యపు ప్రమాణాలు చేస్తూ అమ్మేవారు.”  ముస్లిం హదీథ్ గ్రంథం.

హాకిమ్ ఇబ్నె హిజామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “‘లావాదేవీలు జరుపుతున్న రెండు పార్టీలు వారు విడిపోక ముందే తమ ఒప్పందం గురించి (రద్దు చేసుకునే) నిర్ణయం తీసుకోవచ్చును. వారు గనుక నిజాయితీపరులు మరియు సత్యవంతులైతే వారి ఆ వ్యాపారం వారి కొరకు శుభాల సంపాదించి పెట్టును. ఒకవేళ వారు ఏ విషయాన్నైనా దాచి, అబద్ధాలు పలికినట్లయితే వారి ఆ వ్యాపారంలోని శుభాలు, దీవెనలు పూర్తిగా తుడిచి వేయబడును.’” సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం మరియు ముస్లిం హదీథ్ గ్రంథం.

షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియహ్ ఇలా వ్యాఖ్యానించారు:“సత్యతను మరియు నిజాయితీని అల్లాహ్ ఆదేశించెను. అసత్యాలను మరియు బయట పెట్ట వలసిన, ప్రజలకు తెలియవలసిన విషయాలు దాచిపెట్టడాన్నిఅల్లాహ్ నిషేధించెను. ఈ విషయమై ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లం బోధించిన హదీథ్ లో(దీని ప్రామాణికత గురించి అందరూ అంగీకరించారు) ఇలా ఉన్నది: ‘లావాదేవీలు జరుపుతున్న రెండు పార్టీలు వారు విడిపోక ముందే తమ ఒప్పందం గురించి (రద్దు చేసుకునే) నిర్ణయం తీసుకోవచ్చును. వారు గనుక నిజాయితీపరులు మరియు సత్యవంతులైతే వారి ఆ వ్యాపారం వారి కొరకు శుభాల సంపాదించి పెట్టును. ఒకవేళ వారు ఏ విషయాన్నైనా దాచి, అబద్ధాలు పలికినట్లయితే వారి ఆ వ్యాపారంలోని శుభాలు, దీవెనలు పూర్తిగా తుడిచి వేయబడును.’” మరియు అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం):

‘ఓ విశ్వాసులారా! న్యాయవంతులైన సాక్షులుగా అల్లాహ్ కోసం స్థిరంగా నిలువండి; మరియు ఇతరులపైన ఉండే శత్రత్వం మరియు అసహ్యం మిమ్మల్ని న్యాయం నుండి తప్పించనివ్వకండి. న్యాయంగా ఉండండి: అదే అల్లాహ్ యొక్క భయభక్తుల దగ్గరకు చేరవేస్తుంది.’ [ఖుర్ఆన్ 5:8].” (మిన్హాజుల్ సున్నహ్, 1/16)

3. కలల మరియు స్వప్నాల గురించి అబద్ధాలు చెప్పటం పై నిషేధం ఆ యా విషయాలను తాము స్వప్నంలో చూసామని వాదించే అతని గురించి ఇక్కడ తెలియజేయ బడుతున్నది. కాని అతను నిజం చెప్పటం లేదు. తర్వాతి ఉదయం అతను కలలో తాను చూడని విషయాల గురించి ప్రజల దగ్గర గొప్పగా చెప్పటం ప్రారంభించును.

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఎవరైతే తాము చూడని కల గురించి అబద్ధం చెబుతాడో, (ప్రతిఫల దినాన) రెండు బార్లీ గింజలను ఒకదానితో ఒకటి బంధించమని అతనికి ఆజ్ఞాపించబడును. కాని అతను ఎప్పటికీ అలా చెయ్యలేడు. ఎవరైతే ఇతరులు అయిష్టపడుతున్నా లేదా అతని నుండి దూరంగా పోవాలని ప్రయత్నిస్తున్నా వారి మాటలను దొంగతనంగా వింటానికి ప్రయత్నిస్తాడో, ప్రతిఫల దినాన అటువంటి వాని చెవులలో కరిగించబడిన ఇత్తడి పోయబడును. మరియు ఎవరైతే చిత్రపటాన్ని తయారు చేస్తారో అతను కూడా శిక్షింపబడును. మరియు దానిలో ప్రాణం పోయమని అతనికి చెప్పబడును. మరియు అతను అలా చేయలేక పోవును.”  సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం.

అల్ మనావీ ఇలా వ్యాఖ్యానించెను: ‘రెండు బార్లీ గింజలను ఒకదానితో ఒకటి బంధించమని అతనికి ఆజ్ఞాపించబడును. కాని అతను ఎప్పటికీ అలా చెయ్యలేడు’ – మామూలుగా ఒక గింజను రెండో దానితో కట్టడమనేది సాధ్యం కాదు. అతను చేయలేక పోయేంత వరకు శిక్షింపబడుతూనే ఉండును. మరియు అతను అలా ఎప్పటికీ కట్టలేడు మరియు శిక్ష నుండి తప్పించుకోనూ లేడు. అంతరాయం లేని శిక్షను ఇది సూచిస్తున్నది. ఇక్కడ బార్లీ గింజలే (షఈర్) ఎందుకు ప్రత్యేకంగా పేర్కొనబడి నాయంటే వాటికీ, భావాలకూ (షఊర్) సంబంధం ఉన్నది; షఈర్ మరియు షఊర్ అనే అరబీ పదాలు ఒకే మూలం నుండి వచ్చాయి.

కలలో చూడని విషయాల గురించి చెప్పే అబద్ధాలే అంత కఠిన శిక్షకు గురిచేస్తే, మేల్కొన్న స్థితిలో చెప్పే అబద్ధాలు ఇంకా ఎక్కువ నష్టాన్ని కలుగ జేస్తాయి, ఎందుకంటే అది మరణశిక్ష లేదా భయంకర హద్ శిక్షలకు దారితీసే ప్రధాన సాక్ష్యమై ఉండ వచ్చు – అంతేకాక సత్యస్వప్నాలు ప్రవక్తల లక్షణాలలోని భాగంమవటం మరియు అవి అల్లాహ్ నుండే వస్తాయి. కాబట్టి వాటి గురించి అబద్ధం పలకటమంటే అల్లాహ్ గురించి అబద్ధం పలకటమే అవుతుంది. సృష్టికర్త గురించి అబద్ధం ఆడటమనేది సృష్టిలోని విషయాల గురించి అబద్ధమాడటం కంటే ఎంతో నీచమైనది. (ఫైద్ అల్ ఖదీర్)

4. విన్న ప్రతి విషయామూ అందరి ముందు చెప్పటమనేది నిషేధింపబడినది. హఫ్సా ఇబ్నె ఆశిమ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ‘తను విన్న విషయాలన్నింటి గురించి ఇతరుల ముందు చర్చించడమనేది కూడా అబద్ధానికి సరిపోతుంది.’”  (ముస్లిం హదీథ్ గ్రంథం)

దీని హదీథ్ మరియు దీనిపై వచ్చిన నివేదనల ఆధారంగా విన్న ప్రతి విషయం గురించి చర్చించడాన్ని నిరుత్సాహపరచబడినది. సాధారణంగా ఒక వ్యక్తి విన్నవాటిలో నిజనిజాలు రెండూ ఉంటాయి. కాబట్టి, తను విన్న ప్రతి విషయం గురించి మాట్లడటమంటే, అసలు జరగని దానిని జరిగినట్లుగా తను విని అదే అతను చెబుతుండటం వలన, తనకు తెలియకుండానే అబద్ధమాడుతున్నాడన్నమాట. కాబట్టి సత్యవంతుల పై అభిప్రాయం ప్రకారం: అబద్ధం, అసత్యం అంటే ఏదైనా విషయాన్ని జరిగినది జరిగినట్లు కాకుండా వేరే విధంగా చెప్పటం. అది కావాలని చేసినదై ఉండాలనే షరతు లేదు. కాని అలా కావాలని చేయటమన్నది అంటే కావాలని అబద్ధమాడటమన్నది పాపకార్యంగా గుర్తింప బడటానికి అవసరమైన షరతులు పూర్తి చేసినట్లగును. అల్లాహ్ మాత్రమే అన్నీ తెలిసినవాడు.”  (షరహ్ ముస్లిం)

5. పరిహాసంలో అబద్ధం చెప్పటం – పరిహాసంలో అబద్ధం చెప్పవచ్చని కొందరి అభిప్రాయం. వారు ఏప్రిల్ మొదటి తేదీ లేదా అటువంటి ఇతర దినాలలో అబద్ధాలాడటానికి దీనిని ఒక సాకుగా చెబుతారు. ఇది తప్పు. స్వచ్ఛమైన షరిఅహ్ లో (ఇస్లామీయ జీవన విధానంలో) ఈ కారణానికి ఏ ఆధారమూ లేదు. అసత్యం – అబద్ధం చెప్పటమనేది ఇస్లాం నిషేధించబడినది, అది పరిహాసానికి అయినా లేక సీరియస్ గా అయినా సరే. ఇతర పద్ధతులలో అబద్ధాలాడటం నిషేధింపబడిన విధంగానే, పరిహాసానికి అబద్ధాలాడటం హరాం (నిషేధం)  చేయబడినది.

ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “‘నేను కూడా పరిహాసమాడతాను, కాని సత్యం తప్ప ఇంకేమీ పలకను’” (అత్తబ్రానీ, అల్ ముజమ్మల్ కబీర్)  మజ్మఅల్ జవాయిద్ లో అల్ హైథామి ఈ హదీథ్ ను హసన్ గా మరియు సహీహ్ అల్ జామీ లో షేఖ్ అల్ బానీ దీనిని సహీహ్ గా వర్గీకరించారు.)

అబూ హురైరా రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వారిలా అన్నారు, ‘ఓ రసూలుల్లాహ్ (అల్లాహ్ యొక్క ప్రవక్తా)! మీరు మాతో పరిహాసమాడతారా (జోక్ చేస్తారా).’ ఆయన ఇలా జవాబిచ్చారు, ‘కాని, నేను సత్యం మాత్రమే పలుకుతాను.’” (అత్తిర్మిథీ హదీథ్ గ్రంథం)  అబూ ఈసా ఇలా పలికెను: ఇది సహీహ్ హసన్ వర్గీకరణలోని హదీథ్. ఇలాంటి హదీథ్ నే అల్ ఔసత్ గ్రంథంలో అత్తబ్రానీ ఉల్లేఖించెను మరియు మజ్మ అల్ జవాయిద్ గ్రంథంలో అల్ హైథామి హసన్ గా వర్గీకరించెను.

‘అబ్దుర్రహ్మాన్ ఇబ్నె అబి లైలా ఇలా తెలిపెను: రసూలుల్లాహ్ (అల్లాహ్ యొక్క ప్రవక్త) సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు మాకు ఇలా తెలిపారు – వారు ఒకసారి రసూలుల్లాహ్ తో ప్రయాణం చేస్తుండగా, వారిలోని ఒకతను నిద్రపోయాడు. కొందరు అతని దగ్గరకు పోయి, అతని వద్ద నున్న బాణాలు తీసుకున్నారు. ఆ వ్యక్తి నిద్ర నుండి మేల్కొన్నప్పుడు, తన బాణాలు కనబడకపోవటం గమనించి, ఆందోళన చెందాడు. అతని స్థితి చూసి అక్కడి మిగిలినవారు నవ్వారు. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో “ఏ విషయం గురించి మీరు నవ్వుతున్నారు?” అని ప్రశ్నించగా, వారు “ఏమీలేదు, కేవలం మేము అతని బాణాలు తీసుకున్నాము మరియు అతను ఆందోళనకు గురైనాడు.” అని జవాబిచ్చినారు.  అది విని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఒక ముస్లిం తన తోటి ముస్లింను ఆందోళనకు గురి చేయడం తగదు” (అబూ దావూద్ మరియు అహ్మద్ హదీథ్ గ్రంథాలు). సహీహ్ అల్ జామీ లో షేఖ్ అల్ బానీ ఈ హదీథ్ ను సహీహ్ గా వర్గీకరించారు.

అబ్దుల్లాహ్ ఇబ్నె అల్ సాయిబ్ ఇబ్నె యజీద్ తన తండ్రి , తన తాత నుండి విన్న ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని తెలిపారు: “మీలో ఎవరూ తమ సోదరునికి  చెందిన వస్తువులను పరిహాసానికైనా లేక వేరే కారణాల వలనైనా తీసుకోకూడదు. తన సోదరుని కర్రముక్కనైనా సరే ఎవరైనా తీసుకుని ఉంటే, దానిని వాపసు చేయ వలెను.” (అబూ దావుద్ మరియు అత్తిర్మిథీ హదీథ్ గ్రంథా)లు సహీహ్ అల్ జామీలో షేఖ్ అల్ బానీ ఈ హదీథ్ ను హసన్ గా వర్గీకరించారు.

6. పిల్లలతో ఆటలాడేటప్పుడు అబద్ధాలాడటం – పిల్లలతో ఆటలాడేటప్పుడు చెప్పే చిన్న చిన్న అబద్ధాల గురించి మనం చాలా జాగ్రత్త వహించవలెను. ఎందుకంటే అవి కూడా ఎవరైతే చేసారో వారి ఆచరణల లెక్కలో వ్రాయబడును. అటువంటి తప్పుల గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక హదీథ్ లో ఇలా ఉల్లేఖించారు: “ఒకరోజు మా ఇంటిలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆశీనులై ఉండగా నా తల్లి నన్ను ఇలా పిలిచినది –  ‘ఇక్కడకు రా, నేను నీకిది (ఒక వస్తువు) ఇస్తాను.’ అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రశ్నించారు, ‘అతనికి నీవేమి ఇవ్వాలనుకున్నావు?’ ఆవిడ ఇలా జవాబిచ్చారు, ‘నేను అతనికి ఒక ఖర్జురపు పండు ఇస్తాను’ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వస్లం ఇలా పలికారు: ‘ఒకవేళ అతనికి ఏదైనా ఇవ్వక పోయినట్లయితే, నీవు అబద్ధమాడినట్లయ్యేది’”

అబూ హురైరా రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ‘ఎవరైనా చిన్న పిలల్లతో, ‘ఇక్కడకు వచ్చి ఇది తీసుకో,’ అని చెప్పి, ఆ తర్వాత ఆ పిల్లవానికి ఏమీ ఇవ్వకపోతే, అది అబద్ధం చెప్పినట్లుగా లెక్కించబడును.’”(అబూ దావూద్ హదీథ్ గ్రంథం)  సహీహ్ అల్ జామీ లో షేఖ్ అల్బానీ ఈ హదీథ్ను హసన్ గా వర్గీకరించారు.

7. ప్రజలను నవ్వించటానికి అబద్ధాలాడటం – మావియా ఇబ్నె హైదహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ‘అబద్ధాలు చెబుతూ, ప్రజలను నవ్వించటానికి మాట్లాడేవారిని (అల్లాహ్) శపించుగాక, శపించుగాక, శపించుగాక.’”  (అత్తిర్మిథీ)  హదీథ్ గ్రంథంలో హసన్ గా వర్గీకరించబడినది. (అబూ దావూద్ హదీథ్ గ్రంథం).

అబద్ధాలాడినందుకు – అసత్యాలు పలికినందుకు పడే శిక్ష: అబద్ధాలకోరు, అసత్యపరుడి  ఇహలోకంలోని వినాశకరమైన శిక్ష మరియు పరలోకంలోని బాధాకరమైన శిక్ష గురించి హెచ్చరించబడినది. అవి: 1. మనస్సులోని కపటత్వం.

అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం): “వారు అల్లాహ్ ఎడల చేసిన ప్రమాణభంగం కారణంగా, వారు చెబుతూ వచ్చిన అబద్ధం కారణంగా, అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని నాటాడు. అది ఆయన సమక్షంలో వారు హాజరయ్యే రోజు వరకూ వారిని వెంటాడటం మానదు.” [అత్తౌబహ్  9:77]

‘అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: “కపటులను మీరు మూడు విషయాల ద్వారా కనిపెట్టవచ్చు: అతను మాట్లాడి నప్పుడు అసత్యం పలుకును; వాగ్దానం చేసినప్పుడు అతను దానిని భంగపరచును; మరియు అతనిపై నమ్మకం ఉంచినప్పుడు నమ్మకద్రోహం చేయును.”. ఇంకా ఆయన ఇలా పలికారు: క్రింది ఆయహ్ ను పఠించండి (ఖుర్ఆన్ వచన భావానికి అనువాదం):

‘ఆయన గనక తన అనుగ్రహం నుండి మాకు ప్రసాదిస్తే మేము దానం చేస్తాము, సజ్జనులమై ఉంటాము అని అల్లాహ్ కు ప్రమాణం చేసినవారు కూడా కొందరు వారిలో ఉన్నారు. కాని, అల్లాహ్ తన అనుగ్రహం వల్ల వారిని సంపన్నులుగా చేసినప్పుడు, వారు పిసినారితనానికి దిగారు. తమ ప్రమాణం నుండి మరలిపోయారు. దానిని ఏ మాత్రం లెక్కచేయటం లేదు. ఫలితం ఏమయిందంటే, వారు అల్లాహ్ ఎడల చేసిన ఈ ప్రమాణభంగం కారణంగా, వారు చెబుతూ వచ్చిన అబద్ధం కారణంగా, అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని నాటాడు. అది ఆయన సమక్షంలో వారు హాజరయ్యే రోజు వరకూ వారిని వెంటాడటం మానదు. [అత్తౌబహ్  9:75-77].” (ముస్నఫ్ ఇబ్ని అబీ షైబాహ్ 6/125)

2. అపమార్గానికి మరియు నరకాగ్నికి దారి చూపును – అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ‘సత్యత అనేది సన్మార్గానికి, సన్మార్గం స్వర్గానికి దారి చూపును. సత్యవంతుడు అల్లాహ్ వద్ద తన పేరు సత్యవంతుడిగా లిఖింపబడే వరకూ నిజం పలుకుతూనే ఉంటాడు. అబద్ధం అనేది అపమార్గానికి, అపమార్గం నరకానికి దారి చూపును. అబద్ధాలకోరు (అసత్యవంతుడు) అల్లాహ్ వద్ద తన పేరు అసత్యవంతుడిగా లిఖింపబడే వరకూ అబద్ధాలు చెబుతూనే ఉంటాడు.’”(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథాలు)

అల్ సనాని ఇలా వ్యాఖ్యానించారు:  ఈ హదీథ్ ఏమి తెలియజేస్తున్నదంటే, ఎవరైనా ఎల్లప్పుడూ సత్యమే పలుకుతూ ఉన్నట్లయితే, అది అతని లక్షణంగా మారిపోవును. అలాగే, ఎవరైనా కావాలని ఎప్పుడూ అబద్ధాలు పలుకుతూ ఆ దారిని వదల్లేక పోతున్నట్లయితే, అది అతని లక్షణంగా మారిపోవును. అది వేరే ఇతర మంచి లక్షణం లేక చెడు లక్షణం వంటిదే అవుతుంది. ఒకవేళ ఏదైనా అలవాటును గట్టిగా పట్టుకుని వేలాడుతున్నట్లయితే, అది అతని లక్షణాలలో ఒకటై పోవును.

సత్యం పలకటమనేది ఎంత గంభీరమైనదో ఈ హదీథ్ సూచిస్తున్నది. అది అంతిమంగా స్వర్గానికి చేరవేస్తుంది. అలాగే అసత్యం పలకటమనేది ఎంత నీచమైనదో ఈ హదీథ్ సూచిస్తున్నది. అది అంతిమంగా నరకానికి చేరవేస్తున్నది. ఇది ఈ ప్రపంచంలో అతను ఎదుర్కొనే పర్యవసనాలకు అదనం. సత్యం పలికే అతని పలుకులను ప్రజలు స్వీకరిస్తారు మరియు న్యాయమూర్తుల వద్ద అతని సాక్ష్యం స్వీకరించబడును. అంతేకాక అతని సత్యమైన పలుకుల వలన ప్రజలు అతనిని ఇష్టపడతారు. అయితే అసత్యవంతుడు, అబద్ధాల కోరు దీనికి విరుద్ధమైన స్థితిని ఎదుర్కొంటాడు. (సుబుల్ అల్ సలామ్)

3. అతని సాక్ష్యం తిరస్కరించబడును – ఇబ్నె అల్ ఖయ్యిమ్ ఇలా వ్యాఖ్యానించారు:  [అబద్ధాలకోరు సాక్ష్యం తిరస్కరించబడటానికి గల కారణాలు] సాక్ష్యాలు, ఫత్వాలు, రిపోర్టులు తిరస్కరింపబడటానికి గల శక్తివంతమైన ముఖ్యకారణం ఏమిటంటే – సాక్ష్యప్రకటనల, ఫత్వాల మరియు రిపోర్టుల యొక్క అసలు సారాన్నే అది కలుషితం చేస్తున్నది. అది నెలవంక చూసానని సాక్ష్యమిచ్చిన అంధుని వలే లేక తాను అడుగుల శబ్ధం విన్నానని ఇతరుల ప్రవేశం గురించి సాక్ష్యమిచ్చిన చెవిటివాని వలే ఉంటుంది. అబద్ధాలు చెప్పే నాలుక ఇక పనిచేయటం మాని వేసిన నాలుక లాంటిది, ఇంకా దాని కంటే అధ్వాన్నమైనదని కూడా చెప్పవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి కలిగి ఉండగలిగే నీచాతినీచమైన అవయవమే అబద్ధాలు చెప్పేనాలుక. (అలామ్ అల్ మువాఖ్ఖిఈన్ )

4. ఇహపరలోకాలలో ముఖం నల్లగా మారిపోవటం – అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం): “మరియు ఈనాడు అల్లాహ్ కు అసత్యాన్ని ఆపాదించిన వారి ముఖాలు, ప్రళయం నాడు నల్లగా మారి పోవటాన్ని నీవు చూస్తావు.”[అజ్జుమర్ 39:60]

ఇబ్నె అల్ ఖయ్యిమ్ ఇలా వ్యాఖ్యానించారు:కాబట్టి తన గురించి మరియు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అబద్ధాలు చెప్పేవారనే సూచనగా పునరుథ్థాన దినమున  వారి ముఖములను అల్లాహ్ నల్లగా చేసివేయును. అబద్ధాల తీవ్రప్రభావం వలన వారి ముఖాలు నల్లగా మాడిపోయి, సిగ్గుతో తలదించుకునేటట్లు చేయును. వారి ఈ పరిస్థితిని ప్రతి సత్యవంతుడు చూడగలుగుతాడు. అబద్ధాలు చెప్పేవారి లక్షణాలు స్పష్టంగా వారి ముఖాన కనబడును. కళ్ళున్న ప్రతి ఒక్కరూ వాటిని చూడగలరు. కాని అల్లాహ్ సత్యవంతులను గౌరవాభిమానాలతో దీవించును, అసత్యవంతులను అవమానానికి మరియు సిగ్గుకు గురిచేయును. కాబట్టి అటువంటి వారిని ఎవరైనా చూస్తే అసహ్యించుకుంటారు మరియు ఈసడించుకుంటారు. అల్లాహ్ యే శక్తిసామర్ద్యాలకు మూలం. (అలామ్ అల్ మువాఖ్ఖిఈన్)

5. అసత్యవంతుల బుగ్గలు తల చివరి భాగం వరకు చీల్చబడును.- సమూరహ్ ఇబ్నె జుందుబ్ రదియల్లాహు అన్హు ఒక హదీథ్ ను ఇలా ఉల్లేఖించారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా తన సహచరులతో ఇలా ప్రశ్నించేవారు, ‘మీలో ఎవరైనా ఏదైనా స్వప్నం చూసారా?’ అప్పుడు అల్లాహ్ తలచిన వ్యక్తి తన స్వప్నం గురించి ఆయనకు తెలిపేవాడు. ఒకరోజు ఆయన మాతో ఇలా పలికారు, ‘క్రితం రాత్రి ఇద్దరు (దైవదూతలు) నా వద్దకు వచ్చి, నన్ను నిద్ర నుండి లేపారు. ఆ తర్వాత నాతో, ‘వెళదాం పదండి!’… అన్నారు. మేము ప్రయాణించటం మొదలు పెట్టి, ఒకవ్యక్తి వద్దకు చేరుకున్నాము. అతను తన వీపు ఆన్చి పడుకుని ఉన్నాడు. మరొకతను ఇనుప కొక్కెం చేతిలో పట్టుకుని అతని తల దగ్గర నిలుచుని ఉన్నాడు. అతను ఆ ఇనుప కొక్కెన్ని పడుకుని ఉన్న మనిషి నోటిలో పెట్టి, ఒకవైపు బుగ్గను చీల్చుతూ, తల వెనుక భాగం వరకు లాగాడు. అలాగే అతని ముక్కును మరియు కళ్ళను ముఖం నుండి తల వెనుక భాగం వరకు చీర్చాడు. ఆ తర్వాత ఆ మనిషి యొక్క రెండో ప్రక్కకు వెళ్ళి, ముందు చేసిన దానినే మరల చేసినాడు. రెండో వైపు చీల్చటం పూర్తిచేసే లోపలే, మొదటి వైపు యధాస్థితికి వచ్చేసినది. అతను మరల మొదటి వైపునకు వెళ్ళి అంతకు ముందు చేసినట్లుగానే మరల రిపీట్ చేసెను. నా ఇద్దరు సహచరులను నేనిలా ప్రశ్నించాను, ‘సుభహానల్లాహ్! ఎవరీ ఇద్దరు వ్యక్తులు?’ వారు నాతో, ‘ముందుకు పదండి, ముందుకు పదండి!’ అన్నారు. (ఆ తర్వాత ఆయన ఆ ఇద్దరు దైవదూతలు వివరించిన ఆ దృశ్యాన్ని మాకు ఇలా వివరించెను.): ‘ముందు నుండి తల వెనుక వరకు నోరు, ముక్కు, కళ్ళు చీల్చబడటాన్ని నీవు చూసిన ఆ వ్యక్తి – ఉదయం ఇంటి నుండి బయటకు వచ్చి అనేక అబద్ధాలు చెబుతాడు. అవి ప్రపంచమంతా వ్యాపిస్తాయి.’” (అల్ బుఖారీ హదీథ్ గ్రంథం)

అబద్ధం పలకటం పై సహాబాల వ్యాఖ్యానం: 1. ‘అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: “ఒక వ్యక్తి నిజం పలుకుతూ, తన హృదయంలో చెడుకు సూది మొనంత స్థానం కూడా లేనంత వరకు దానినే (సత్యం పలకటాన్ని) పొడిగిస్తూ పోతుంటాడు. లేదా, ఎవరైనా వ్యక్తి అబద్ధం మాట్లాడుతూ, తన హృదయంలో సత్యం కోసం సూది మొనంత స్థానం కూడా లేనంత వరకు దానినే (అసత్యం పలకటాన్ని) పొడిగిస్తూ పోతుంటాడు.

2. మరియు ఆయన ఇలా తెలిపారని ఉల్లేఖించబడినది: “సీరియస్ గాగాని లేక జోకు కోసం గాని అబద్ధాలాడటం తగదు,” ఆ తర్వాత అబ్దుల్లాహ్ ఈ క్రింది ఆయహ్ ను పఠించారు. (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం): “ఈ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి, సత్యవంతులతోనే ఉండండి (మాటలలో మరియు ఆచరణలలో)” [అత్తౌబహ్ 9:119]

3. అబు బకర్ సిద్దిఖ్ రదియల్లాహ్ అన్హు ఇలా పలికారు: “అసత్య పలకటం నుండి జాగ్రత్త వహించండి, దానికి (అసత్యానికి) ఈమాన్ (విశ్వాసం) తో సంబంధం లేదు.”

4. సాద్ ఇబ్నె అబి వఖాస్ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: “విశ్వాసిలో మోసగించటం మరియు అసత్యం పలకటం తప్ప మిగిలిన అన్ని లక్షణాలు ఉండవచ్చును.”

5. ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: “పరిహాసాలలో అసత్యం పలకటాన్ని వదలనంత వరకు నిజమైన ఈమాన్ (విశ్వాసం) పొందలేడు.” (ముసన్నఫ్ అబి షైబహ్)

అనుమతింపబడిన అసత్యపు రకాలు – మూడు సందర్భాలలో అసత్యం పలకటం అనుమతింపబడినది: యుద్ధం; తగాదా పడిన ఇద్దరు పార్టీల మధ్య రాజీ కుదర్చటానికి, సమన్వయించటానికి; మరియు భార్యాభర్తలు తమ మధ్య ప్రేమాభిమానాల కోసం మరియు సామరస్యం కోసం.

ఉమ్మె కుల్థుమ్ బిన్తె ఉఖ్బహ్ రదియల్లాహు అన్హా తను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  నుండి విన్నానని ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ఇలా తెలిపారు: “ఇద్దరి మధ్య రాజీ కుదర్చటానికి అబద్ధం చెప్పినతను అసత్యవంతుడు కాదు మరియు అతను మంచి పని చేసినవాడుగా లేదా మంచి మాటలు పలికిన వాడు గా పరిగణింపబడును.”  (అల్ బుఖారి హదీథ్ గ్రంథం; ముస్లం హదీథ్ గ్రంథం)

అస్మా బిన్తె యజీద్ రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ‘మూడు సందర్భాలలో తప్పితే అబద్ధం పలకటానికి అనుమతి లేదు: ఒక వ్యక్తి తన భార్యను సముదాయిస్తున్నప్పుడు; యుద్ధరంగంలో; మరియు ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ కుదర్చటం కోసం.’”  (అత్తిర్మిథీ) సహీహ్ అల్ జామీ లో షేక్ అల్బానీ ఈ హదీథ్ ను హసన్ గా వర్గీకరించారు.

ఏప్రిల్ ఫూల్ – April fool – కాని “ఏప్రిల్ ఫూల్” (అరబీ భాషలో, కిద్దబత్ నీసాన్ లేక ఏప్రిల్ లోని అబద్ధాలు) గురించి, అసలు దీని మూలం అంటే ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రారంభమయ్యిందనే విషయం గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు. దీని గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి: ఇది ఈఖ్వినోక్స్ (సూర్యుడు భూమధ్యరేఖను దాటే రెండు స్థలాల) ప్రాంతంలో మార్చి 21వ తేదిన జరిగే వసంతకాలపు ఉత్సవాల నుండి అభివృద్ధి చెందినదని కొందరి అభిప్రాయం.

క్రొత్త క్యాలెండరు వాడుకలోనికి వచ్చినప్పుడు దానిని తిరస్కరించిన ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతూ కొందరు ప్రజలు అతనిని ఎగతాళి చేయటం ద్వారా అందరూ కలిసి అతనిని జోకులకు గురిచేయటంతో ఈ నూతన కల్పితం క్రీ.శ.1564లో ఫ్రాన్సులో దర్శనమిచ్చినదని మరికొందరి అభిప్రాయం. వసంత కాలారంభంలో ఒక ప్రత్యేక తేదీన జరిగే ప్రాచీన, అనాగరిక కాలపు ఉత్సవాలతో దీనికి సంబంధం ఉండటం వలన ఇది ఒక అనాగరిక పండుగల మరియు మూఢాచారాల అవశేషమని మరికొందరి అభిప్రాయం. కొన్ని దేశాలలో వేటారంభ దినాలలో విజయవంతంగా వేటాడలేక పోయేవారని చెప్పబడింది. ఏప్రిల్ మొదటి తేదీన చెప్పబడే అబద్ధాలకు ఇది మూలం.  Le poisson d’avril –

యూరోపియన్లు “ఏప్రిల్ ఫూల్” దినాన్ని le poisson d’avril (అంటే “ఏప్రిల్ చేప”) అని పిలుస్తారు. దీనికి కారణం సూర్యుడు రాశిచక్రంలోని మీనరాశి నుండి దాని తర్వాతి  నక్షత్రకూటమిలోనికి ప్రవేశిస్తాడు., లేదా poisson (అంటే చేప) అనే పదం, passion (అంటే బాధను అనుభవించటం) అనే పదం నుండి విరూపం చెందటం వలన “అది జీసస్ (ఈసా అలైహిస్సలాం) అనుభవించిన బాధలకు చిహ్నంగా క్రైస్తవులు వాదిస్తున్నారు. అది ఏప్రిల్ మొదటి వారంలో జరిగినదని క్రైస్తవుల వాదన.

కొందరు సత్యతిరస్కారులు ఈ దినాన్ని ఇంగ్లీషులో ప్రసిద్ధి చెందినట్లుగా All Fools’ Day (అంటే మూర్ఖులందరి దినం) అని పిలుస్తారు. దీనికి కారణం వారు ఆ దినమున చెప్పే అబద్దాలు. వాటిని విన్నవారు అవి నిజమేనని నమ్మి వంచింప బడే అవకాశం ఉన్నది.  ఆ విధంగా వారు తమను ఆటపట్టిస్తున్న వారి హేళనలకు గురవుతారు.

ఇంగ్లీషు భాషలో ఏప్రిల్ ఫూల్ అనే పదం మొట్టమొదటి సారి డ్రెక్ మాగజైన్ (Dreck Magazine) అనే పత్రికలో పేర్కొనబడింది. క్రీ.శ. 1698 ఏప్రిల్ రెండవ తేదీన ఈ పత్రికలో ‘ఏప్రిల్ మొదటి తేదీ ఉదయం లండన్ టవర్ లో నల్లజాతి ప్రజలను కడగటానికి అనేక మంది ప్రజలు ఆహ్వానించబడినారు’ అని తెలుపబడినది.

యూరోపులో ఏప్రిల్ మొదటి తేదీన జరిగిన సంఘటనలలో ప్రసిధ్ధ చెందిన సంఘటన క్రీ.శ. 1746 మార్చి నెలలో ఈవెనింగ్ స్టార్ అనే వార్తాపత్రికలో ‘తర్వాతి రోజున అంటే ఏప్రిల్ మొదటి తేదీన ఇంగ్లండ్ లోని ఇస్లింగటన్ ప్రాంతంలో గాడిదల ఊరేగింపు జరుగును’ అనే ప్రకటన వెలువడినది. ఆ గాడిదలను చూడటానికి ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. పెద్ద జనసమూహం ఏర్పడినది. నిరీక్షించి, నిరీక్షించి అలసిపోయి ఊరేగింపు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించటం మొదలు పెట్టినారు. వారికేమీ సమాధానం లభించలేదు. ఒక విధంగా గాడిదల వలే తమను తాము అక్కడ ప్రదర్శించుకోవటానికి తామే స్వయంగా వచ్చినట్లు వారికి తెలియవచ్చింది!

‘ఆశిమ్ ఇబ్నె అబ్దుల్లాహ్ అల్ ఖురవైతి  అబద్ధాల దినం యొక్క మూలం గురించి ఒకతను ఇలా పలికినాడు:

మనలో చాలా మంది ఏప్రిల్ ఫూల్, భాషాపరంగా అనువదిస్తే ఏప్రిల్ యొక్క కపటోపాయం, తంత్రం, యుక్తి అనే దానిని సరదాగా జరుపుకుంటున్నారు. కాని దాని వెనుక నున్న క్రూరమైన, చేదైన, బాధాకరమైన రహస్యం ఎంత మందికి తెలుసు?

దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం, స్పెయిన్ దేశాన్ని ముస్లింలు పరిపాలిస్తున్నప్పుడు, ఓడించనలవికాని అత్యంత బలమైన శక్తిగా ఉండేవారు. పాశ్చాత్య క్రైస్తవులు భూమిపై నుండి ఇస్లాం ను తుడిచివేయాలని తలిచారు, కొంత వరకు దానిలో సఫలురయ్యారు కూడా.  ఇస్లాం ధర్మప్రచారాన్ని స్పెయిన్ వరకే పరిమితం చేసి, అది ఇంకా వ్యాపించకుండా ఆపివేయాలని అనేక విధాలుగా ప్రయత్నించారు. కాని ఏనాడూ దానిలో పూర్తి సాఫల్యాన్ని సాధించలేక పోయారు.

ఆ తర్వాత సత్యతిరస్కారులు తన గూఢాచారులను స్పెయిన్ లోపలికి పంపి, ఓడించలేక పోతున్న ముస్లిం ప్రజల శక్తిసామర్ధ్యాల వెనుక నున్న అసలు రహస్యం ఏమిటో కనిపెట్టటానికి ప్రయత్నించారు. చివరికి ముస్లింలలోని తఖ్వా (అల్లాహ్ యొక్క అయిష్టానికి, ఆగ్రహానికి భయపడే భక్తి) యే వారి శక్తిసామర్ధ్యాలకు ముఖ్య కారణమనే విషయాన్ని వారు కనుగొన్నారు.

క్రైస్తవులు ముస్లిం బలం వెనుక నున్న కారణాన్ని కనుగొన్న తర్వాత, దానిని బద్దలుకొట్టి, వారిని ఎలా బలహీన పరచాలా అనే ప్రణాళికలు తయారుచేయటంలో మునిగి పోయారు. దీనిలో భాగంగా, స్పెయిన్ లోనికి మద్యం (సారా) మరియు సిగరెట్లను ఉచితంగా పంపటం ప్రారంభించారు.

పాశ్చాత్యుల ఈ పన్నాగం ఫలించినది. స్పెయిన్ ముస్లింల ముఖ్యంగా యువతరపు ఈమాన్ (విశ్వాసం) బలహీనపడటం ప్రారంభమైనది. ఫలితంగా, కాథలిక్ క్రైస్తవులు మొత్తం స్పెయిన్ ను చేజిక్కించుకుని, దాదాపు 800 సంవత్సరాలు నిరాటంకంగా సాగిన అక్కడి ముస్లిం పరిపాలనను అంతమొందించారు. గ్రెనడాలోని ముస్లింల చిట్టచివరి దృఢమైన కోట ఏప్రిల్ ఒకటవ తేదీన వారి వశమైనది, కాబట్టి ఏప్రిల్ ఒకటవ తేదీని వారు ఏప్రిల్ పన్నాగంగా పరిగణిస్తారు.

ఆ సంవత్సరం నుండి నేటి వరకు వారు ముస్లింలను ఫూల్సు(మూర్ఖులు) గా భావిస్తూ, ఈ దినమును పండుగగా జరుపుకుంటున్నారు. గ్రెనాడాలో సులభంగా మోసపోయిన, వంచింపబడిన ముస్లిం సైన్యాన్ని మాత్రమే ఫూల్సుగా కాకుండా మొత్తం ముస్లిం సమాజాన్నే వారు ఫూల్సుగా భావిస్తారు. వారి ఇటువంటి పండుగలలో చేరటమనేది మన అజ్ఞానమవుతుంది. కళ్ళు మూసుకుని, వారి ఈ దుష్టాలోచనను అనుసరించటమనేది ఒక విధమైన దూరదృష్టిలేని, వివేచనాశక్తి లేని, అంధత్వంతో మనలో కొందరు అనుసరిస్తున్న పద్ధతి వారి మూర్ఖత్వాన్ని (foolishness) ను బయటపెడుతున్నది. ఒకసారి మనకీ కారణం తెలిసిన తర్వాత, మనం మన ఓటమిని పండుగగా ఎలా జరుపుకోగలం?

ఈ వాస్తవం తెలిసిన తర్వాత, ఇక ముందు ఈ పండుగను జరుపుకోమని మనకు మనంగా ప్రమాణం చేసుకుందాము. మనం స్పెయిన్ సంఘటనల నుండి ఎంతో నేర్చుకోవలసి ఉన్నది. ఇస్లాం ధర్మాన్ని దృఢంగా పట్టుకోవలసి ఉన్నది. మరల మన ఈమాన్ (దైవవిశ్వాసం) బలహీనపడకుండా చూసుకోవలసి ఉన్నది.

నా అభిప్రాయం: ఏప్రిల్ ఫూల్ మూలాలు ఏమిటనే దానిని  మనం అంతగా పట్టించుకోకపోయినా,  ఈ దినంనాడు పలికే అసత్యం గురించి జాగ్రత్త పడటమనేది మనకు చాలా ముఖ్యం. జోక్ గా నైనా అసత్యం పలికే అలాంటి చెడు అలవాట్లు అత్యుత్తమమైన మొదటి తరంలోని ముస్లింలలో అస్సలు ఉండేవి కావని మనకు ఖచ్ఛితంగా తెలుసు. ఇవి ముస్లింలలోనుండి రాలేదు, కాని వారి శత్రువులలో నుండి వచ్చినవి.

ఏప్రిల్ ఫూల్స్ రోజున జరిగే సంఘటనలు అనేకం. పిల్లలు, భార్య / భర్త లేక వారి ఆప్తులలో ఎవరో ఒకరు చనిపోయారనే తప్పుడు వార్తను అందుకోవటం వలన కొందరు ఆ హఠాత్సంఘటనను భరించలేక, ఆ వార్త విన్నవారే చనిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొందరికి వారి ఉద్యోగం పోయినదని, అగ్ని అంటుకుందని, ఏక్సిడెంటులో వారి కుటుంబం హతమై పోయిందని తప్పుడు సమాచారం అందజేయటం వలన వారికి పక్షపాతం లేక హార్ట్ ఎటాక్ వంటి ఇతర వ్యాధులకు గురవుతారు.

కొందరికి వారి భార్యలు ఇతర మగవారితో కనబడినట్లు అబద్ధం చెప్పటం జరుగుతుంది. దీని ఫలితంగా వారు తమ భార్యలను హతమార్చే లేక విడాకులు ఇచ్చే అవకాశం ఉన్నది. మనం తరచుగా ఇస్లాం ధర్మం నిషేధించిన, నైతికత మరియు నిజాయితీ ఒప్పుకోని ఇలాంటి అసత్యపు సంఘటనలు మరియు అంతకాని కథలు ఎన్నో వింటూ ఉంటాము.

Related Post