Main Menu
قناة الجامع لعلوم القرآن - Al-Jami' Channel for Quranic Sciences

ధన పిపాసి ఖారూన్‌

ఖురాన్ కథా మాలిక పుస్తకం నుంచి

ఖురాన్ కథా మాలిక పుస్తకం నుంచి
(పూర్వ కాలంలో కథకులు, గొప్ప సంపద అని చెప్పడానికి ‘ఖారూన్‌ ఖజానా’ అని పోల్చి చెప్పేవారు. అంటే సాటిలేని మహా సంపద అన్న భావంతో అలా చెప్పేవారు)”చివరికి మేము ఖారూన్‌ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్‌ బారి నుండి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు”. (ఖుర్‌ఆన్‌ – 28: 81)
ఖారూన్‌, ప్రవక్త మూసా (అ) వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో తులతూగేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖ విలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహం కారంతో విర్రవీగాడు. ఖారూన్‌ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిందని మిడిసిపడేవాడు.

జకాత్‌ చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అ)అతడికి చెప్పారు. జకాత్‌ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాటా. విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్‌ చెల్లించాలని అల్లాహ్‌ా ఆదేశిం చాడు. కాని ఈ సలహా విన్న ఖారూన్‌ కోపంతో మండిపడ్డాడు. తనపై దేవుని అనుగ్రహం వర్షిస్తుందని, తన సిరి సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూసా (అ)తో చెప్పాడు. తన జీవిత విధానాన్ని ఆమోదించినందు వల్లనే దేవుడు తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అ) అతడికి నచ్చజెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్ట దాయకంగా ఉంటాయని హెచ్చరించారు.

చివరకు ఖారూన్‌ తన సంపదపై జకాత్‌ లెక్కించాడు. (జకాత్‌ అంటే పేదల కోసం, సమాజ శ్రేయస్సు కోసం అల్లాహ్‌ మార్గంలో ఖర్చు పెట్టవలసిన సొమ్ము). జకాత్‌ లెక్కిస్తే తాను చెల్లించ వలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది. అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లనిపించింది. జకాత్‌ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు, ప్రవక్త మూసా (అ) తన స్వార్థ ప్రయో జనాల కోసం జకాత్‌ చట్టం తీసుకొచ్చా రని ప్రచారం మొదలు పెట్టాడు. ప్రవక్త మూసా (తి)కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంత మందికి లంచాలు కూడా ఇచ్చాడు. ప్రవక్త మూసా (అ) గురించి నానా విధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.
ఖారూన్‌ కుట్ర గురించి అల్లాహ్‌, ప్రవక్త మూసా(అ)కు సావధానపర్చాడు. ఖరూన్‌ పిసినారి తనానికి, అల్లాహ్‌ చట్టాల పట్ల అతని తిరస్కారానికిగాను అతడిని శిక్షించాలని ప్రవక్త మూసా (అ) దేవుణ్ణి ప్రార్థించారు. అల్లాహ్‌ ఆగ్రహం ఖారూన్‌పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులుబారి ఖారూన్‌తో సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదను తనలో కలిపేసు కుంది. ఖారూన్‌ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచి పెట్టుకుపోయాడు. ఖారూన్‌ సంఘటన మూసా (అ)జాతి ప్రజలకు ఒక గుణ పాఠంగా మిగిలిపోయింది.
ఈ విషయమై దివ్య ఖుర్‌ఆన్‌లో ఇంకా ఏముందంటే, ఖరూన్‌ సంపదను చూసి ఈర్ష్య పడినవారు, అప్పటివరకు ఖారూన్‌ను కీర్తించడమే ఘనకార్యంగా భావించినవారు ఈ సంఘటన తర్వాత, ”అల్లాహ్‌ ఎవరికి తలచుకుంటే వారికి సంపద ఇస్తాడు. ఎవరికి తలచుకుంటే వారికి నిరాకరిస్తాడు. మనపై అల్లాహ్‌ అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మ్రింగేసి ఉండేది. అల్లాహ్‌ను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించ లేరు. ఈ ప్రపంచంలో బడాయిని కోరుకోని వారికి, దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి” అనడం ప్రారంభించారు.
ఖారూన్‌ వంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంత మంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను, కష్టాలను మరచిపోతారు. తాము కష్టపడి, శ్రమించి తమ తెలివి తేటలతో సంపాదించిందే ఇదంతా అనుకుంటారు. అందులో దేవుని కారుణ్యం లేదని భావిస్తారు. అల్లాహ్‌ పట్ల ఎలాంటి కృతజ్ఞత చూపించరు. అల్లాహ్‌ ఆదేశాలను విస్మరిస్తారు. బీదసాదలకు ఎలాంటి సహాయం అందించడం వారికి ఇష్టం ఉండదు. పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా, సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా, అనవసరమైన ఆడంబరాల ద్వారా, ఖరీదైన దుస్తులు, వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ విర్రవీగుతుంటారు. మరి కొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు. స్వంతం కోసం, తమ కుటుంబం కోసం ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడుతారు. సంపద పోగు చేయడంలోనే మునిగిపోతారు. కాని ఇలాంటివారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మరచి పోతుంటారు.

అల్లాహ్‌ నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు. లేనట్లయితే సంపద కలుషితమైపోతుంది. సంపద ఒక శాపంగా మారిపోతుంది. తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లాహ్‌ా వాగ్దానం చేస్తున్నాడు. దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లాహ్‌ అభివర్ణిస్తున్నాడు. అల్లాహ్‌కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందడం అన్నది మనిషికి ఎంత గౌరవప్రదం! ఎంత శుభప్రదం!!

అల్లాహ్‌ మనిషికి ధన సంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు (అమానత్‌- అంటే ఏదన్నా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించడం). ధనసంపదలు కూడా అల్లాహ్‌ మనిషికి అప్పగించిన అమానత్‌ (అప్పగింతే). తాను ఇచ్చిన ధనసంపదలతో ఎవరు ఏం చేస్తారోనని పరీక్షిస్తాడు.

Related Post