గురుతర బాధ్యత

బాధ్యత
 by: fatima
ఈ లోకంలో అందరూ ఏదో విధంగా బాధ్యులే. అందులో బాధ్యతనెరిగినవారే శ్రేష్ఠులు, ధన్యులు. అసలు బాధ్యత అన్నది. మనకు తెలియకనే మనతో ముడిపడి ఉన్నది. ఎలాగంటే మనిషికి పుట్టుకతో లభ్యమైన శ్రేష్ఠమైన గుణం మంచీ చెడులను గుర్తించగలిగే విచక్షణాజ్ఞానం. ఒక మానవుడు జీవితాంతం; తనలోనూ, ఇతరులలోనూ చెడును దూరం చేస్తూ, మంచిని పాటించే ప్రయత్నాన్ని తన బాధ్యతగా స్వీకరించినప్పుడే తను ఒక మంచి మనిషిగా సమాజంలో గుర్తించబడే అవకాశం ఉంది. ఏంటీ, ఇతరుల గురించి కూడా పట్టించుకోవాలా? అంటే అవును మరి, అది మన మంచికేనని మరచిపోకూడదు.
  మానవ సముదాయంలో మనం అవలంబించే మంచి, ఇతరుల్లో కూడా ఉన్నప్పుడే సత్ఫలితాలొస్తాయి. అలా కాకుండా మనం నివసించే బస్తీల్లోనే చెడు ప్రబలిపోయి, మనం నిర్లిప్తంగా ఉండిపోతే ఆ చెడుగు చెడ్డ వాళ్ళతో పాటు మంచివాళ్ళను కూడా చుట్టుముట్టేస్తుంది. ఈ విషయాన్ని అంతిమ దైవప్రవక్త (సఅసం) వారు నీళ్ళలో పయనించే అంతస్తుల నౌకతో పోల్చారు-
  నౌక క్రింది భాగంలో ఉన్న ప్రయాణీకులు నీళ్ల కోసం పదే పదే పైకి వచ్చేవారు. పైభాగంలో ఉండే పెద్దలు దీన్ని ‘అసౌకర్యం’గా భావించారు. క్రిందివాళ్లను కసురుకోసాగారు. చివరకు జరిగిందేమిటి? క్రింది భాగాన ఉన్నవారు తమ మూర్ఖత్వం కొద్దీ నౌకకే రంధ్రం వేసి నీళ్లు తీసు కుందామని తీర్మానించుకున్నారు. మరోవైపు ఎగువ భాగంలోని పెద్దలు కుడా ఈ చర్యను అడ్డుకోలేదు. దాని పర్యవసానం సుస్పష్టమే.
  ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ఎవరైతే మీలో చెడును చూచెదరో వీలైతే చేతితో ఆపే ప్రయత్నం చెయ్యాలి. ఇది వీలుకానున్నచో నోటితో ఆపే ప్రయత్నం చేయాలి. దానికీ వీలు పడకపోతే మనసులోనైనా దానిని చెడుగా తలచాలి. ఇది తక్కువ స్థాయికి చెందిన విశ్వాసం (ఈమాన్‌) అవుతుంది”. (ముస్లిం)
  కాబట్టే మనం మన బాధ్యతగా మంచిని పాటిస్తూ, చెడు నుండి వారిస్తూ ఉండాలి- తనలోనూ, ఇతరులలోనూ.
  ఇక్కడే ఉంది కిటుకు. ఒకరు చెప్పే మంచి ఇతరులకు చెడు అన్పించవచ్చు. ఇతరులు చెప్పే చెడు ఇంకొందరికి మంచి కావచ్చు. ఏ దెబ్బలాటకీ తావు లేకుండా ఉన్నది ఓ పరిష్కారం.
  శ్రేష్ఠమైన, న్యాయమైన నిర్ణయం ఆ     పైవాడిది. కావున దేవుడు చేయమన్న ప్రతి పని మంచి పని, నివారించిన ప్రతి పని చెడు పని అవుతుంది. అందుకే అందరూ తమ సొంత ఆలోచనల్ని మాని ఆ పైవాడు దేనిని మంచిగా, మరి దేనిని చెడుగా పేర్కొన్నాడో చూడాలి. ఈ జ్ఞానార్జన కోసం మొదటి బాధ్యతగా చదవడం, తెల్సుకోవడం అవసరం. అందుకే ప్రవక్త (స) గారు 1400 ఏండ్ల క్రితమే అన్నారు –
 ”తలబుల్‌ ఇల్మి ఫరీజతున్‌ అలా కుల్లి ముస్లిం” అంటే- జ్ఞానార్జన ప్రతి ముస్లింపై ఫర్జ్‌ (తప్పనిసరి) (బుఖారీ). దీనిని బట్టి ప్రతి ముస్లింకి స్త్రీ పురుష భేదం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా జ్ఞానార్జన ప్రతి ఒక్కరికి అవసరం  అని  తెలుస్తుంది.
 జ్ఞానార్జనలో అన్నింటికంటే ముఖ్యంగా ఆ దేవుని విషయానికి మొదటి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇక జ్ఞానం సంపాదించిన పిదప మన తర్వాతి బాధ్యత ఏమిటంటే; ప్రవక్త (స) ”బల్లిగూ అన్నీ వలౌ ఆయహ్‌” అన్నారు (బుఖారీ). అంటే, నా నుంచి ఒక్క వాక్యమైనా (ఇతరులకు) అందజేయండి అని. కాబట్టి ఒక్క వాక్యమైనాసరే దాని సరైన అవగాహన పొంది, ఇతరులకు అందజేయటం మన తర్వాతి బాధ్యతన్న మాట. ఇలా అందజేసే వారిని అల్లాహ్‌ ఎలా శ్లాఘించాడో చూడండి:
 ”అల్లాహ్‌ వైపునకు పిలిచి, మంచి పనులు చేసి, నేను ముస్లింను అని ప్రకటించే వ్యక్తి మాటకంటే మంచి మాట మరెవరిది కాగలదు.?” (దివ్య ఖుర్‌ఆన్- 41:33)
  ఇంకా ఇలా అంటున్నాడు- ”మీరు (ప్రపంచపు) ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఉత్తమ సమాజం. మీరు మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు.”.     (దివ్య ఖుర్‌ఆన్‌ 3:110)
ఇక్కడ ముస్లింలను ఉత్తమ సమాజంగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే వారికి ఓ గొప్ప బాధ్యత అప్పగించబడింది గనుక. అదే మంచిని ఆజ్ఞాపించటం, చెడు నుండి వారించటం.
గమనిక: తన అభీష్టాన్ని సర్వానికి సృష్టికర్త అయినటువంటి ఆ ఒకే దేవుని ఇచ్ఛకు లొంగపరచి నడిచే ప్రతి మనిషి ముస్లిం అనబడతాడు.
ఈ బాధ్యతను స్వీకరించడం ఇంకనూ సులభతరం  గావించాడు   ఆ   కరుణామయుడు. ఎందుకంటే? ఉదాహరణకు: ఉపాధ్యాయులు పిల్లల శ్రమను తగ్గించ డానికి, మోడల్‌ ప్రశ్నా పత్రాన్ని ఇచ్చి, తగిన సూచనలు కూడా చేసి, ఎక్కువ మార్కులు పొందేందుకు తోడ్పడతారు. అదే ఒకవేళ మార్కులిచ్చే అధికారి గనక నూటికి నూరు శాతం మార్కులు తెచ్చిన విద్యార్థి జవాబు పత్రాన్నే మోడల్‌గా చేసి, అందరికి పంచి, ఇకమీదట దీని ప్రకారమే మార్కులు ఇవ్వబడతాయి అని చెబితే  చాలా మంది అందులో నూరు శాతానికి దగ్గర తెచ్చుకునే అవకాశం మెండుగా ఉంటుంది. అవునా!
 ఇలాగే కరుణామయుడు మన బాధ్యతను మరింత సులభతరం గావించడానికి   నూరు శాతం మార్కులు సంపాదించిన ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి జీవితాన్నే మన ముందు ఆదర్శప్రాయంగా ఉంచాడు. ఇక మనం మార్కులు సంపాదించడమే ఆలస్యం.
ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ప్రవక్తల గురించి ఏమంటున్నాడో చూడండి- ”నీవు నిస్సందేహంగా మహోన్నతమైన గుణ సంపత్తి గల వాడవు”. (68: 4)
”వాస్తవంగానే అల్లాహ్‌ ప్రవక్తలో మీకు ఉత్తమ ఆదర్శం ఉన్నది”. (33: 21)
ఒకసారి అమ్మ ఆయిషా (ర.అ) గారిని ప్రవక్త (స) నడవడిక గురించి అడిగినప్పుడు ”ఆయన (స) ఒక సంచార ఖుర్‌ఆన్‌” అని ఆమె అన్నారు (అహ్మద్‌). అందుకే ఖుర్‌ఆన్‌ సైద్ధాంతిక గ్రంథం అయితే ప్రవక్త (స) గారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. అల్లాహ్‌ మనల్ని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, ”ఓ ప్రవక్తా! చెప్పు: మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే మీరు నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్‌ కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ తప్పులను మన్నించివేస్తాడు”. (3: 31)
కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం ప్రవక్తను అనుసరించి తీరాలన్న మాట. అనుసరించాలంటే ప్రవక్త (స) గారు ఏం చేశారో తెల్సుకోవడం అవసరం కదా!
  మంచిని పెంపొందించే దిశలో ప్రవక్త (స) చేసిన  శ్రేష్ఠమైన  పనులెన్నో ఉండగా అందులో ముఖ్యమైనది ”దేవుడొక్కడు అని, ముహమ్మద్‌  (స) ఆ దేవుని చివరి ప్రవక్త” అని చాటి చెప్పడం. చెడుని వారించుటలో చేసిన గొప్ప పని విగ్రహారాధనను మాన్పించడం. మరి మనం ప్రవక్త (స) ను అనుసరించాలంటే ఈ బాధ్యతను చేపట్టి మన చుట్టు ప్రక్కల వారిలో, సంఘంలో…. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పే కృషి చేయాలి. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో దీనికి సంబంధించి ఇలా అంటున్నాడు: ”ప్రవక్తా! నీ ప్రభువు మార్గం వైపు ఆహ్వానించు; వివేకంతో, చక్కని హితబోధతో. ప్రజలతో ఉత్తమోత్తమ రీతిలో వాదించు.” (16: 125)
 ఒకవేళ ఈ బాధ్యతను విస్మరిస్తే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. హజ్రత్‌ హుజైఫా (ర.జి) ఉల్లేఖనం ప్రకారం, దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉన్నదో ఆ దేవుని సాక్షి! మీరు మంచిని ఆజ్ఞాపించాలి; చెడును నిరోధించ నైనా  నిరోధించాలి.   లేకపోతే    అల్లాహ్‌  తప్పకుండా తన శిక్షను మీపై పంపుతాడు. అటు తర్వాత మీరు దువా చేసినా అది ఆమోదించబడదు”. (తిర్మిజీ)
 కాబట్టి ఒక ముస్లిం అనేవాడు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా మెలగాలని మరచి పోకూడదు. దాంతోపాటు అతను ప్రవక్తను అనుసరిస్తూ మరీ బాధ్యతను నిర్వర్తించాలి. అలాగే మనలోని ప్రతి ఒక్కరు (స్త్రీ పురుష భేదం లేకుండా) తమ బాధ్యతగా తమ నడవడికను ఎల్లప్పుడూ ఖురానుకు అను గుణంగా ఉండేటట్లు జాగ్రత్త పడినట్లయితే ఇస్లాం యొక్క జ్యోతి ఈ లోకంలోని చీకటిని పారద్రోలుతుంది. అల్లాహ్‌ మనందరిలో ఈ బాధ్యతా భావాన్ని కలిగించి, సదాచరణకు ఉపక్రమించే సద్బుద్ధిని వొసగుగాక! (ఆమీన్)

 

Related Post