Originally posted 2013-04-05 21:07:43.
1) హజ్ క్రియలు: జుల్‌హిజ్జ 8 వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఈ రోజుని యౌముత్-తర్‌వియా అని కూడా అంటారు. ఈ రోజు హాజీలు స్నానం చేసి హజ్ దీక్ష బూనాలి. జుహర్ నమాజుకు ముందు మినా మైదానానికి బయలు దేరి వెళ్ళాలి. అక్కడ జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజులు విడివిడిగా వాటి సమయాలలో ఖసర్ చేసి చదవాలి. మినా మైదానంలో 9వ తేదీ రాత్రి గడిపి, ఫజ్ర్ నమాజ్ మినా మైదానంలోనే చేసి, సూర్యోదయం తరువాత అరఫాత్ మైదానం వైపు బయలు దేరాలి. మినా మైదానంలో రాత్రి బస చెయ్యడం ప్రవక్త (స) సంప్రదాయం.
2) అరఫాత్‌లో విడిది: అరఫాత్‌లో ‘నమిర’ అనే స్థలంలో దిగటం మంచిది. అలా కుదరకపోతే అరఫా మైదానంలో ఎక్కడైనా దిగవచ్చు. అరఫాలో ప్రవక్త (స) సంప్రదా యాన్ని అనుసరిస్తూ జుహ్ర్– -అస్ర్ నమాజులు ఒక అజాన్ రెండు ఇఖామత్‌లతో కలిపి ఖసర్ (రెండేసి రకాతుల చొప్పున) చేసి చదవాలి. నమాజ్ తరువాత అల్లాహ్ నామ స్మరణలో, అల్లాహ్‌ను వేడుకోవడంలో నిమగ్నమైపోవాలి. ప్రవక్త (స) ఈ రోజు ప్రత్యే కంగా ఈ దుఆ పఠించేవారు:
”లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ లా షరీక లాహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్”.
ఇలా దుఆ చేస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ సూర్యాస్తమయం వరకు అరఫాలో వేచి ఉండాలి. సూర్యాస్తమయానికి ముందు బయలుదేరకూడదు. ఒకవేళ బయలు దేరినా తిరిగి మరలా అరఫా మైదానంలో చేరుకోవాలి. అలా తిరిగి రాని ఎడల అతని పై పరిహారం తప్పనిసరి అవుతుంది. అలాగే ఎవరైనా 9వ తేది అంటే అరఫా రోజున సూర్యాస్తమయానికి ముందే అరఫాత్ మైదానంలోకి ప్రవేశించకపోతే వారి హజ్ నెరవేరదు. వారు వచ్చే ఏడాది దాన్ని పూర్తి చెయ్యాలి.
3) ముజ్‌దలిఫా: హాజీ, ముజ్‌దలిఫా చేరుకోగానే ఒక అజాన్ రెండు ఇఖామత్‌లతో మగ్రిబ్ నమాజు పూర్తిగా ఇషా నమాజును ఖసర్ చేసి చదవాలి. తరువాత ముజ్‌దలిఫాలో రాత్రి బస చేయాలి. అర్థరాత్రి గడచిన పిదప బలహీనులైన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వారి సేవ చేసేవారు ‘మినా’ వైపు వెళ్ళవచ్చు. కాని బలవంతులు మాత్రం రాత్రంగా అక్కడే గడిపి ఫజ్ర్ నమాజ్ చేసిన పిదప బాగా తెల్లారే వరకు దుఆ చేస్తూ ఉండాలి.
4) సూర్యోదయానికి ముందు మినా వైపు పయనించాలి. అర్ధరాత్రికి ముందు బలహీ నులైనా, బలవంతులైనా బయలు దేరకూడదు. ఎందుకంటే ముజ్‌దలిఫాలో రాత్రి గడపడం తప్పనిసరి.
5) పండగ రోజున అంటే జుల్ హిజ్జ 10వ తేదీన జరగవలసిన హజ్ క్రియలు:
అ) రమీ-కంకర్రాళ్ళు రువ్వడం. ఆ) హదీ- ఖుర్బానీ.
ఇ) హల్ఖ్-శిరోముండనం. ఈ) తవాఫ్, సయీ.
అ) రమీ: హాజీ ముజ్‌దలిఫా నుండి బయలుదేరి మినా వచ్చేటప్పుడు ముజ్‌దలిఫా నుండి లేదా దారిలో ఎక్కడనుండైనా చిన్న చిన్న 7 కంకర్రాళ్ళు తీసుకోవాలి. జమ్ర తుల్ ఉఖ్బా దగ్గరకు వెళ్ళి అక్కడ వున్న స్థంభానికి తగిలేటట్టు కంకర్రాళ్ళని విసరాలి. రమీ సమయం చంద్రమానం జిల్‌హిజ్జా 10వ తేదీ అర్థ రాత్రి నుండి మొదలై 10వ తేదీ సూర్యాస్తమయం వరకు ఉంటుంది. బలవంతులు సూర్యోదయం తరువాత రమీ చెయ్యటం ఉత్తమం.
ఆ) హదీ: ఖుర్బానీ పశువును తెచ్చుకున్న వారు జిబహ్ చెయ్యాలి. జిబహ్ సమయం 10వ తేది సూర్యుడు ఉదయించినప్పటి నుండి 13వ తేది సూర్యాస్తమయం వరకు ఉంటుంది. అంటే పండుగ రోజు తరువాత మరో మూడు రోజులన్న మాట. హదీని స్వయంగా భుజించవచ్చు. ఇతరులకు బహుమానంగా ఇవ్వ వచ్చు. పేదలకూ పంచి పెట్ట వచ్చు. ముఫ్రిద్ (హజ్జె ఇఫ్రాద్ చేసే వ్యక్తి)కి ఖుర్బానీ లేదు. ఖిరాన్, తమత్తు హజ్ చేసే వారికే హదీ ఉంది.
ఇ) హలఖ్ – (శిరోముండనం లేదా జుత్తు కత్తిరించటం): ఖుర్బానీ తరువాత తల వెంట్రుకలను పూర్తిగా తీసి వెయ్యాలి. లేదా కత్తిరించాలి. స్త్రీలు మాత్రం కొన్ని శిరోజాలను కత్తిరిస్తే సరి పోతుంది. పండుగ రోజున హాజి, రమీ-హల్ఖ్ రెండూ పూర్తి చేశాక అతనికి – స్త్రీలు తప్ప ఇహ్రాం సందర్భాన ఉన్న నిషేధాలన్నీ తొలిగి పోతాయి. అంటే తన భార్యతో రమించకూడదు. ఆమె వైపు కామంతో నిండిన చూపు తవాఫే ఇఫాజ చేసేంత వరకూ చూడకూడదు.
ఈ) తవాఫ్-సయీ: అంటే హల్ఖ్ తరువాత మస్‌జిదే హరామ్ వైపు వీలైతే ఆ రోజే వెళ్ళాలి. వెళ్ళి తవాఫే ఇఫాజ చేయాలి. ముతమత్తి లేదా ముఖ్రిన్ అయితే సయీ కూడా చెయ్యాలి. ముఫ్రిద్ మాత్రం తవాఫే ఖుదూమ్ తరువాత సయీ చెయ్యని ఎడల ఇప్పుడు చెయ్యాలి. తవాఫ్ అన్నది ఈ రోజు అంటే 10వ తేది చెయ్యటం చాలా మంచిది. దీన్నే 13వ తేదీ వరకు ఆలస్యం కూడా చెయ్యవచ్చు. కాని అంతకు మించి ఆలస్యం చేయకూడదు.
10వ తేది చేసే పనులు ఒక చూపులో: 1) రమీ 2) జిబహ్‌ా 3) హల్ఖ్-తఖ్‌సీర్ 4) తవాఫె ఇఫాజ 5) సయీ.
గమనిక: వీటిలో ఏది ముంది ఏది వెనుకా అయినా పరవాలేదు. ఒక వేళ హదీ జంతువు లభించకపోతే అరఫా రోజు, పండుగ రోజు తప్ప హజ్‌లో మూడు రోజులు ఉపవాసం ఉండాలి. ఇంటికెళ్ళిన పిదప 7 ఉపవాసాలుండాలి. అంటే దీనికి పరిహారం 10 రోజుల ఉపవాసాలన్న మాట.
ఉ) అయ్యామే తష్రీఖ్ (తష్రీఖ్ రోజులు): జుల్‌హిజ్జ 11, 12, 13 తేదీలని అయ్యామె తష్రీఖ్ అంటారు. ఈ మూడు రోజులు హాజీలు రాత్రి ఎక్కువ సమయం మినాలో గడపాలి. ఇది వాజిబ్ (తప్పనిసరి). ఈ మూడు రోజుల్లో సూర్యుడు కాస్త పైకి ఎగ బ్రాకిన తరువాత రమీ చెయ్యాలి. 4 రకాతుల నమాజులని ఖస్ర్ చేసి విడివిడిగా ఆయా సమయాల్లోనే చదవాలి.
ఊ) రమీ విధానం: జవాల్ తరువాత ఎక్కడ నుండి అయినా సరే 21 కంకర రాళ్ళు తీసుకోవాలి. తరువాత జమ్రతుస్ సుగ్రా (చిన్న స్థంభం)ను సమీపించి 7 కంకరర్రాళ్ళ ను ఒక్కొక్కటిగా ‘అల్లాహు అక్బర్’ అంటూ ఎదుట వున్న స్థంభానికి తగిలేటట్లు విసరాలి. తరువాత కాబా వైపు ముఖం త్రిప్పి దుఆ చెయ్యాలి. తరువాత జమ్రతుల్ ఉస్తా దగ్గరకు రావాలి. ఇక్కడ కూడా 7 కంకరర్రాళ్ళను మొదట విసిరించినట్లే విస రాలి. తరువాత అక్కడా దుఆ చెయ్యాలి. ఆ తరువాత జమ్రతుల్ ఉఖ్బా దగ్గరకు వచ్చి అక్కడ కూడా 7 కంకర రాళ్ళు అల్లాహు అక్బర్ అంటూ రువ్వాలి. తరువాత దుఆ చెయ్యకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలి. 12 వ తేదీన కూడా అలాగే చెయ్యాలి. తరువాత వెళ్ళ దలచుకుంటే 12వ తేదీ సూర్యాస్తమయానకి ముందు బయలుదేరి పోవాలి. సూర్యుడు అస్తమించాడనుకోండి మళ్ళీ 13 తేది కూడా రమీ తప్పకుండా చెయ్యాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఆలస్యం చెయ్యడం తొందరగా వెళ్ళడంకన్నా మంచిది.
గమనిక: రమీ చెయ్యలేని స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తమ తరపున మరొకరికి ఆ బాధ్యత ను అప్పగించవచ్చు. ఎ) తవాఫుల్ విదా: హాజీ, మక్కా వదలి వెళ్ళే సంకల్పం చేసుకుంటే వీడ్కోలు ప్రదక్షిణ (తవాఫ్ విదా) చెయ్యకుండా వెళ్ళకూడదు. బహిష్టు స్త్రీకి తవాఫె విదా లేదు. (మరి ఎవరైతే తవాఫె ఇఫాజాని అలస్యం చేస్తాడో అతనికి తవాఫె విదాకి బదులు తవాఫె ఇఫాజ సరిపోతుంది).
ఫిదియా (పరిహారం)
అ) ఇహ్రామ్ నియమాలకు ఖచ్చితంగా కట్టుబడలేకపోయిన వ్యక్తి పరిహారంగా 3 రోజులు ఉపవాసాన్ని పాటించాలి. లేదా 6 మంది పేదలకి అన్నం పెట్టాలి లేక ఖుర్బానీ ఇవ్వాలి.
ఆ) ఉపవాసాలు ఎక్కడైనా ఉండవచ్చు. హరమ్‌లోనే ఉండాలన్న నిబంధన లేదు.
ఇ) హరమ్‌లో నివసించే పేదలకు అన్నం పెట్టడం మంచిది. హరమ్ బైట ఉన్న వారికి కూడా పెట్టవచ్చు.
ఈ) ఖుర్బానీ పశువుని హరమ్‌లో జిబహ్‌ా చెయ్యడం ఉత్తమం. పరిహారంగా జిబహ్‌ా చేసే జంతువు మాంసం స్వయంగా హాజీ తినకూడదు. ధనవంతులకు పెట్టకూడదు. ఇది కేవలం నిరుపేదల హక్కు.
ఉ) జుల్‌హిజ్జ 10వ తేదీ జమ్రతుల్ ఉఖ్బాలో రమీ మరియు శిరోముండనానికి ముందు ఎవరైనా తన భార్యతో రమిస్తే – 1) వారి హజ్ భంగమవుతుంది. 2) పరిహారంగా ఒక ఒంటెని లేదా ఆవుని జిబహ్‌ా చెయ్యాల్సి ఉంటుంది. 3) భంగమైన హజ్‌ని పూర్తి చెయ్యాలి. 4) వచ్చే సంవత్సరం ఈ హజ్‌కి బదులు మరలా హజ్ చెయ్యాలి. 5) అదే జమ్రతుల్ ఉఖ్బా రమీ మరియు హల్ఖ్ (శిరోముండనం)ల తరువాత తవాఫె ఇఫాజ (జియార)కి ముందు తన భార్యతో సంభోగిస్తే హజ్ భంగం కాదు. కాకపోతే ఒక మేకను పరిహారంగా జిబహ్‌ా చేయాల్సి ఉంటుంది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ‘ముహ్రిం నికాహ్ చెయ్యకూడదు. నికాహ్‌ా సందేశం పంపకూడదు’. (ముస్లిం – అహ్మద్)