– అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ
విశ్వసించిన జనులారా! నేను రమజాను మాసాన్ని. మీ క్షేమాన్ని, సౌఖ్యాన్ని, వృద్ధిని, ఇహపరలోకాల సాఫల్యాన్ని కోరి, మీ వ్యక్తిగత, సామూహిక శీల నిర్మాణం కోసం విశ్వప్రభువైన అల్లాహ్‌ా తరఫు నుండి వచ్చాను. నెలరోజులపాటు మీతోనే ఉన్నాను. మీరు నన్ను ఎంతగానో గౌరవించారు, ఆదరించారు. మీరు ఎంతో ఆసక్తితో, భక్తీ శ్రద్ధలతో అల్లాహ్‌ా ప్రసన్నతను, పరలోక సాఫల్యాన్ని కాంక్షిస్తూ ఉపవాసాలు పాటించారు. నమాజులను స్థాపించారు. ఖుర్‌ఆన్ పారాయణం చేశారు. రాత్రి వేళల్లో తరావీహ్‌ా నమాజులలో పూర్తి ఖుర్‌ఆన్ పఠనం విన్నారు. జకాత్ చెల్లించారు, లైంగిక కోర్కెలకు కళ్ళెం వేశారు. అల్లాహ్‌ా మీ సదాచరణను, సత్కార్యాలను, ధర్మ పరాయణతను అంగీకరించుగాక! (ఆమీన్)
ఈ సందర్భాన నేను మీకు కొన్ని హిత బోధనలు చేస్తున్నాను. చిత్తశుద్ధితో ఆచరిస్తారని ఆశిస్తున్నాను-
మీరు విశ్వప్రభువైన అల్లాహ్‌కు సృష్టితాలలో ఎవరినీ భాగస్వాములుగా చేర్చకండి. అల్లాహ్‌ను కాదని ఎవరినీ ఆరాధించకండి. మీకు లాభనష్టాలు కలిగించే అధికారం సృష్టిలో ఏ ఒక్క శక్తికీ లేదని గట్టిగా నమ్మండి. అల్లాహ్ దాస్యంలోనే జీవించండి. జీవితపు చివరి ఘడియ వరకు ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉండండి. ప్రతి కీడు నుండి రక్షణ పొందుతారు.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) జీవితంలో మీకు అత్యుత్తమ ఆదర్శం ఉందని తెలుసుకోండి. మీరు జీవితంలోని సమస్త రంగాల్లో ఆయన్నే అనుసరించండి. తత్ఫలితంగా మీ కర్మలు ఆమోదించ బడతాయి.
నమాజు పట్ల శ్రద్ధ వహించండి. నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల నుండి, సిగ్గుమాలిన పనుల నుండి మిమ్మల్ని వారిస్తుంది. మీ ఆత్మలకు నెమ్మది, శాంతి, తృప్తి ప్రాప్తమవుతుంది. నమాజు పట్ల విముఖత చూపినవాడు ఎన్నటికీ మన శ్శాంతికి నోచుకోడని తెలుసుకోండి.
తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మసలు కోండి. వారిని గౌరవించండి. వారికి విధేయులై ఉండండి. మీ మాటలతో వారి మనస్సును గాయపర్చకండి. వారి కొరకు ఎల్లప్పుడూ అల్లాహ్‌ను ఇలా ప్రార్ధిస్తూ ఉండండి: ”ఓ ప్రభూ! నా తల్లిదండ్రులపై కరుణ జూపు. పసితనంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు”.
బంధువుల పట్ల మీ విధులను నిర్వర్తించండి. పెద్దలను గౌరవించండి, పిల్లలను ప్రేమించండి. చిన్న చిన్న విషయాలపై రచ్చకు దిగి, కసిని పెంచుకని వారితో సంబంధాలు తెంచుకోకండి. ”స్వల్ప ప్రయోజనాల కోసం బంధువులతో సంబంధాలను తెంచుకునేవారు స్వర్గంలో ప్రవేశించరు”.
పొరుగువారి పట్ల ఉత్తమంగా వ్యవహ రించండి. వారు ఏ మతస్తులైనా, ఏ వర్గానికి చెందినవారైనా సరే. చీటికీ మాటికి పొరుగువారితో పోట్లాటకు దిగేవారు, వారిని తమ చేతలతో, మాటలతో బాధించేవారు, వారిపై అపనిందలు మోపేవారు, వారి మహిళల శీలాన్ని హరించేవారు విశ్వాసులు (ముస్లింలు) కానే కారు. అంతేకాదు ”మీ పొరుగువారు ఆకలితో అలమటిస్తూ ఉండగా మీరు కడుపు నిండా భుజిస్తే మీరు విశ్వాసులు కారు” అని కూడా తెలుసుకోండి.
సమాజంలో అనాథలను ఆదరించండి, వారికి ఆశ్రయాన్ని కల్పించండి. వితంతువుల యోగక్షేమాల గురించి శ్రద్ధ చూపండి. నిరుపేదల, అభాగ్యజీవులను అర్థం చేసుకొని వారిని ఆదుకోండి. వారి పట్ల దయా, జాలి, కరుణ, సానుభూతి చూపండి. ”మీరు నేలపై ఉన్న నిరాధారులు, అభాగ్య జీవులపై కనికరిస్తే, నింగిపై ఉన్నవాడు (కారుణ్య ప్రభువైన అల్ల్లాహ్) మిమ్మల్ని కరుణిస్తాడు”.
నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి జీవించండి. సంపాదన విషయంలో కొలతలలో, తూనికలలో ఎవరినీ మోసం చేయకండి. వడ్డీ వ్యవహారాలను మాను కోండి. దోపిడీ, దొంగతనాలకు పాల్పడ కండి. లంచం పుచ్చుకోకండి. ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసే, వారి బ్రతుకుల్ని బజారు పాలుజేసే, బంగారు కుటుంబాల్ని కుప్పకూల్చే జూదం, మద్యపానం, మాదక ద్రవ్యాల వ్యాపారాలు చేయకండి.
వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి. నీతి బాహ్యమైన, సిగ్గుమాలిన మాటలు అనకండి, వినకండి. లైంగిక కోర్కెలను రెచ్చగొట్టే దృశ్యాలను కనకండి. యువతీ యువకుల స్వేచ్ఛా కలయికను ఖండించండి.
అల్పబుద్ధి, అంటరానితనం, వర్గ దురభి మానం, జాత్యాహంకారం, మతోన్మాదం, ఉగ్రవాదం మానవతకే ఒక కళంకం. ఇవి మారణ హోమానికి, రక్తపాతాలకు దారి తీస్తాయి. వీటిని ఎన్నడూ సమర్ధించకండి. సమాజంలో అరాచకాన్ని రేకెత్తించే దుష్ట శక్తుల ఆగడాలను అరికట్టండి.
విశ్వ ప్రభువు మిమ్మల్ని ”ముస్లింలు” గా అభివర్ణించాడు. ముస్లింలు అంటే ఎవరు? ముస్లిం అంటే దైవ విధేయుడు. దైవదాసుల యోగక్షేమాల్ని కాంక్షించేవాడు. శాంతిని కోరేవాడు, జనుల ధన మాన ప్రాణాలను కాపాడేవాడు. కనుక మీరు జీవించినంత కాలం ముస్లింలుగానే జీవించండి. ముస్లింలు గానే మరణించండి. ఇదే నేను మీ నుండి కోరే దక్షిణ.
ఇక నేను మీ నుండి సెలవు తీసు కుంటున్నాను. దైవచిత్తమయితే వచ్చే ఏడాదికి తిరిగి వస్తాను. మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. నా రాకకు ముందే మీలో ఎవరైనా దైవ సన్నిధికి చేరుకుంటే, స్వర్గ ద్వారాలలో ఒకటైన రయ్యాన్ ద్వారం (ఇది ఉపవాసుల కొరకు ప్రత్యేక ద్వారం) వద్ద వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాను.