యమ్. డి. ఉస్మాన్ ఖాన్
ప్రకృతినే మనిషి అనాదిగా అనుసరిస్తూ వస్తున్నాడు. కాలగతిలో కేలండర్లు మారుతుంటాయి. కొత్త సంవత్సరాలు వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో రకరకాల పేర్లతో ప్రాచుర్యం పొందాయి. తెలుగునాట ఉగాదిగా, మహారాష్టల్రో గుడిపదగా అస్సాంలో బిహూగా, కేరళలో కాల వర్షగా పిలుచుకుంటారు. క్రీ.శ.జనవరి ఒకటవ తేదీ హంగామా తెలిసిందే. అయితే హి.శ మొదటి మాసంతో ప్రారంభమయ్యే ముహర్రం ముస్లింలకు కొత్త సంవత్సరంగా చెలామణిలో ఉంది. ఇస్లామియా చరిత్రలో ముహర్రం మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. మహ మ్మద్ ప్రవక్త(స) మక్కా నుండి, మదీనా నగరానికి వలసవెళ్లిన సందర్భాన్ని హిజ్రి అంటారు. నాటి నుండే ఓ నవ శకం ఆరంభమైంది.
ఓ నూతన రాజ కీయ, సాంఘిక, సామాజిక, ఆధ్మా త్మిక, నైతిక వ్యవస్థ ఉనికిలోకొచ్చింది. అందుకే హి.శ.తో ప్రారంభమయ్యే ఈ మాసానికి ఇంతటి ప్రత్యేకత. అంతే కాకుండా ఈ మా సంలోనే యౌమె ఆఘారా కూడా ఉంది. కొన్ని ప్రత్యే కతల దృష్ట్యా ముహర్రం మాసం పదవ తేదీని యౌమె ఆఘారా అంటారు.
మహ్మద్ ప్రవక్త నిర్యాణం తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో హ.అబూబక్ సిద్దిఖ్, ఖలీఫాగా ఎన్నికయ్యారు.ఆయన తరువాత వరుసగా ఉమర్, ఉస్మా న్, అలీ, ఖలీఫాలుగా ఎన్నికయ్యారు. చివరి ఖలీఫా హ.అలీ (రజి)ని ఎన్నుకున్నారు. కొన్ని అనివార్య పరిస్థితులలో ఆయన అధికారాన్ని వదులుకున్నారు. అనంతరం యజీద్ తనను రాజుగా ప్రకటించుకున్నారు. ఈ పరిణామం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడలేదు. వారంతా రాచరికానికి ఎదురు తిరిగారు. ఖిలాఫత్ ఉద్యమానికి నాయత్వం వహించే బాధ్యత హ. ఇమామె హుసైన్ (రజి )భుజస్కందాలపై పడింది.
ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం ఏ సమస్యకైనా చర్చలు సంప్రదింపులే పరి ష్కారమార్గం. అందుకే ఇమామ్ ఆ మార్గాన్నే ఎన్నుకున్నారు. మజీద్‌లో చర్చ ల కోసం రాజధాని కుఫాకు బయలుదేరారు. మార్గమధ్యంలోనే కర్బలా అనే చోట యజీద్ సైన్యం ఇమాం పరివారాన్ని అడ్డగించింది. ఇమాం మాటల్ని పట్టించుకోకుండా కయ్యానికి కాలుదువ్వింది. కర్బలా మైదానం రక్తపుటేరులతో ఎర్ర బారింది. అది ముహర్రం మాసం పదవ తేదీ. శుక్రవారం హోరా హోరీ పోరు సాగుతూనే వుంది. అటు వైపు శతృసైన్యం వందలాది మంది, ఇటు ఇమామె హుసైన్ ఒక్కరే. అయినా పోరాడుతూ అసంఖ్యాక మంది శతృ సైనికులను నేల కూల్చాడు.
శుక్రవారం నమాజు సమయం కూడా మించి పోతోంది. ఎలాంటి స్థితిలోనైనా దైవప్రార్థనను ఉపేక్షించని ఆ మహనీయు డు, ప్రార్థన చేసుకోవడానికి కొన్నినిమిషాలు అవకాశం ఇవ్వమని సైన్యాధిపతిని అభ్యర్థించారు.యుద్ధనీతిలో భాగంగా ప్రార్థనకు అవకాశమి చ్చిన శతృసైన్యం, ఇమాం సజ్‌దా నుండి లేస్తే తమకు నూకలు చెల్లినట్లేనని భావించి సజ్దాస్థితిలోనే బరిశతో పొడిచి చంపారు. పండుగ చేసుకున్నారు.ఇదే క్లుప్తంగా ఆనాడు జరిగిన కర్బలా దుర్ఘుటన. కానీ అది సత్యం కోసం, ధర్మం కోసం,మానవత్వ పరిరక్షణ కోసం సంభవించిన అనివార్య పరిణామం. అందుకని, ఇమాం హుసైన్ ఏ విలువల కోసం తన ప్రాణాలను పణంగా పె ట్టారో, ఆ విలువల పరిరక్షణ కోసం ప్రయత్నించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్య త. విలువలు మంటగలిసి పోతుంటే, పౌరుల హక్కులు కాలరాయబడుతుంటే, చూస్తూ కూర్చోవడం న్యాయ ప్రేమికుల, మానవతా ప్రియుల లక్షణం ఎంతమాత్రం కాదు.