పర్వదినం ఆదేశాలు, నియమాలు

302844_389931104420382_1498876567_n

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

నెల రోజుల ఉపవాసాలను విరమించిన శుభ సందర్భంగా అల్లాహ్‌ ముస్లింల కోసం ఒక ఉత్సవ దినాన్ని నిర్ధారించాడు. అదే ఈదుల్‌ ఫిత్ర్‌. రమజాను శుభాలను ఆస్వాదించే సువర్ణావకాశం లభించినందుకు దాసులు తమ ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుకోవటం, శ్రద్ధాభక్తుల నివాళిని ఘటించటం దీని అసలు ఉద్దేశం. ఈదుల్‌ ఫిత్ర్‌ హిజ్రీ 2వ సంవత్సరం నుండి షరీయత్‌ బద్ధమయింది.

ఈద్‌ అంటే….
అరబీ నిఘంటువు ప్రకారం ఈద్‌ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది, పునరావృతం అయ్యేది అని అసలు అర్థం. దీనినే మనం తెలుగులో పండగ, ఉత్సవం, పర్వదినంగా వ్యవహరిస్తాము. ఇస్లాంలో ఏడాదికి రెండే రెండు పండుగలు. ఒకటి: ఈదుల్‌ ఫిత్ర్‌ (రమజాను పండుగ). రెండు: ఈదుల్‌ అజ్హా (ఖుర్బానీ పండుగ). దైవప్రవక్త (స) మదీనా నగరానికి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు రెండు రోజలు ఆటపాటల్లో, ఆనంద ప్రహేళికల్లో గడపటం గమనించారు. ”ఇంతకీ ఈ రెండు దినాల విశేషం ఏమిటి?” అని ఆయన (స) ఆరా తీయగా, ‘అజ్ఞానకాలంలో మేము ఈ రెండు దినాలను ఆటపాటలకు, విన్యాసాలకు కేటాయించుకున్నాము’ అని అక్కడి వారు వివరించారు. ”అల్లాహ్‌ మీకు ఈ రెండు దినాలకు బదులుగా ఇంతకన్నా శ్రేష్ఠమైన రెండు దినాలను నిర్ధారించాడు. అవే ఈదుల్‌ ఫిత్ర్‌, ఈదుల్‌ అజ్హా” అని మహనీయ ముహమ్మద్‌ (స) తెలిపారు.

ఈదుల్‌ ఫిత్ర్‌ ఎప్పుడు?
రమజాన్‌ నెల ముగిసి, షవ్వాల్‌ నెలవంక దర్శనమిచ్చిన మరునాడు ఉదయం ఈదుల్‌ ఫిత్ర్‌ జరుపుకో బడుతుంది. దివ్యఖుర్‌ఆన్‌ అవతరించిన
రమజాన్‌ మాసంలో ముస్లింలు ప్రభువు ప్రసన్నత కోసం నెలంతా ఆరాధనలలో గడుపుతారు. తియ్యని నిద్రను త్యజించి రేత్రిళ్ళు జాగారం చేస్తారు. ఈ ఆరాధన లను నిరాఘాటంగా నెరవేర్చ గలిగి నందుకు వారి అంతరాళం ఆనందంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. తమ ప్రభువు సన్నిధిలో కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఆరాటపడుతుంది. సహజమైన వారి ఈ కోరికను తీర్చేందుకే దేవుని తరఫున ఈ పండుగ ఆమోదించబడింది.

అయితే శ్రేష్ఠసమాజ సభ్యులైన ముస్లింలు జరుపుకునే పండుగ వారి స్థాయికి తగ్గట్టుగానే ఉండాలి. అదెంతో సంస్కారవంతంగా ఉండాలి. ‘అతి’ ఎంత మాత్రం తగదు. అసభ్యకరమైన చేష్టలకు, ఆవేశపూరితమైన నినాదాలకు, అవాంఛ నీయమైన పోకడలకు పండుగలో ఎలాంటి చోటు లేదంటుంది ఇస్లాం. ఆనందం నిండిన క్షణాల్లో కూడా అధరాలు దేవుని స్తుతిగీతికనే ఆలాపిం చాలి. అందుకే పండుగ నమాజ్‌ కోసం ఈద్‌గాహ్‌కు బయలుదేరినపుడు ముస్లింలు ఈ విధంగా తక్బీర్లు పలుకుతూ ఉంటారు – అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ – లాఇలాహ ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌.
(ముమ్మాటికీ అల్లాహ్‌యే గొప్పవాడు. అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడు. అల్లాహ్‌యే ఘనాఘనుడు. అల్లాహ్‌యే వైభవం కలవాడు. ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభాయమానం)

పండుగ నమాజు వేళ
వివిధ నమాజుల వేళలు నిర్ధారితమై ఉన్నట్లే పండుగ నమాజు వేళ కూడా నిర్ధారితమై ఉంది. కాబట్టి నిర్ధారిత సమయంలోనే ఈ నమాజు చేయాలి. సూర్యోదయమై, సూర్యుడు రెండు గజాల ఎత్తుకు రాగానే ఈద్‌ నమాజ్‌ వేళ మొదలవుతుంది. దీనికి సంబంధించి హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ బసర్‌ (ర) గారి ప్రామాణిక హదీసు ఇలా ఉంది: ”మేము మహా ప్రవక్త (స)తో కలిసి పండుగ నమాజు చేసేవాళ్ళం. చాష్త్‌ వేళ అయ్యే సరికి ఈ నమాజు ముగిసేది”. (సహీహ్‌ అబూ దావూద్)
హజ్రత్‌ జున్దుబ్‌ (ర)చే ఉల్లేఖించబడిన హదీసు ఇలా ఉంది: ”దైవప్రవక్త (స) మమ్మల్ని పండుగ నమాజు చేయించ టానికి ఉపక్రమించేటప్పటకి రెండు ఈటెల పొడవుకు సమానంగా పొద్దెక్కి ఉండేది.

పండుగ నమాజ్‌ ఎక్కడ చేయాలి?
ఈద్‌ నమాజ్‌ ఇరుకైన జనవాసాలలో కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాలలో (మైదానాలలో) చేయటం ఉత్తమం. ప్రవక్త (స) సంప్రదాయం కూడా ఇదే. ఒకవేళ పట్టణాలలో అలాంటి అవకాశం లేనప్పుడు స్థానిక పెద్ద మస్జిదులలో ఈద్‌ నమాజ్‌ చేయాలి. తమ పేటల్లోని చిన్న చిన్న మస్జిదులలో, ముసల్లాలో అనుదినం నమాజ్‌ చేసేవారు కూడా ఈద్‌ నమాజ్‌ కోసం ఈద్‌గాహ్‌కో, పెద్ద మస్జిద్‌కో తరలి రావాలి. మహనీయ ముహమ్మద్‌ (స) పండుగ రోజు ఉదయం బహిరంగ స్థలానికి ఏతెంచి, తొలుత నమాజుకు సారథ్యం వహించేవారు. ఆ తరువాత సహచరులను ఉద్దేశించి ప్రసంగించే వారు.

మైదానాలలో పర్వదినం జరుపుకోవటం లోని పరమార్థం

”ప్రతి జాతివారు ఏటేటా కొన్ని నిర్ణీత దినాలలో బహిరంగ స్థలాలలో సమావేశమై సంఘీభావాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించటం పరిపాటి. అందుకే ఇస్లాం కూడా తన అనుయాయులకు ఏడాదిలో రెండు దినాలను ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేకించింది – తద్వారా ముస్లిం సముదాయంలోని పిన్నలు-పెద్దలు, స్త్రీలు-పురుషులు అందరూ ఈద్‌గాహ్‌కు తరలివచ్చి హృదయపూర్వకంగా దేవుని ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని, తమ ఐకమత్యాన్ని అభివ్యక్తం చేయాలని ఆశించబడుతోంది” అని విశ్వ విఖ్యాత విద్వాంసులు నాసిరుద్దీన్‌ అల్‌బానీ (ర) అభిప్రాయపడ్డారు.
(సలాతుల్‌ ఈదైన్‌ లిల్‌ అల్‌బానీ) షరీయతు పరంగా పండుగ నమాజ్‌…
షరీయతు పరంగా నమాజ్‌ పండుగ సున్నతె ముఅక్కద. ఎందుకంటే మహా ప్రవక్త (స) ఈ నమాజును ప్రతి ఏటా ఖచ్చితంగా చేశారు. ఏ ఒక్కసారీ విడిచి పెట్టలేదు. ఆయన తదనంతరం ధర్మ ఖలీఫాలు కూడా పండుగ నమాజును విడనాడలేదు. జుమా నమాజు మాదిరి గానే పండుగ నమాజు కూడా ‘ఇస్లామీయ చిహ్నాల’లో ఒక చిహ్నంగా పరిగణించబడుతుంది.
పండుగ నమాజు ప్రత్యేకత ఏమిటంటే దీని కోసం అజాన్‌ పిలుపుగానీ, ఇఖామత్‌ ప్రకటన గానీ ఉండదు. ‘అస్సలాతు జామిఅతున్‌’ అంటూ డిక్లరేషన్‌ కూడా చేయబడదు. ”నేను దైవ ప్రవక్త (స)తో కలిసి పలుమార్లు పండుగ నమాజు చేశాను. కాని ఏ ఒక్కసారి కూడా అజాన్‌, ఇఖామత్‌లు చెప్పలేదు. జుమా నమాజుకి – ఈద్‌ నమాజుకి మధ్య ఉన్న ఒక వ్యత్యాసం ఏమిటంటే జుమా సందర్భంగా మొదట ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాతే సామూహిక నమాజ్‌. అయితే పండుగ ప్రార్థనల్లో మొదట సామూహిక నమాజ్‌ చేస్తారు. ఆ తరువాత ప్రసంగం ఉంటుంది.

ఈద్‌ నమాజ్‌ విధానం
పండుగ నమాజు రెండే రెండు రకాతులు. అయితే రెండు రకాతుల్లోనూ మామూలుకు భిన్నంగా కొన్ని ‘అదనపు తక్బీర్లు’ ఉంటాయి. ఇంతకీ ఈ ‘అదనపు తక్బీర్లు’ ఎన్ని? అనే విషయంలో ధర్మవేత్తల మధ్య ద్వంద్వాభిప్రాయాలు ఉన్నప్పటికీ అదనపు తక్బీర్లు 12 అనే దానికి ఎక్కువ ఆధారాలున్నాయి. ఏ సూరాలు పఠించాలి?
పండుగ నమాజులో ఖుర్‌ఆన్‌ బిగ్గరగా పఠించాలి. దైవప్రవక్త (స ) మొదటి రకఅతులో ఫాతిహా సూరాతో పాటు అల్‌ ఆలా సూరాను, రెండవ రకాతులో ఫాతిహా సూరాతో పాటు అల్‌ ఘాషియా సూరాను పఠించేవారు. అప్పుడప్పుడూ మొదటి రకాతులో ఖాఫ్‌ సూరా, రెండవ రకాతులో ఇఖ్తరబతిస్సాఅతు సూరాను కూడా పారాయణం చేసేవారు. (జాదుల్‌ మఆద్‌ -1/431)

పండుగ ప్రసంగం
పండుగ నమాజు అనంతరం ఉపన్యాసకుడు (ఖతీబ్‌) సభికులను ఉద్దేశ్యించి ప్రసంగించటం సంప్రదాయం (సున్నత్) కొంతమంది ఇమాముల దృష్టిలో ప్రసంగం తప్పనిసరి. ఉపన్యాస కుడు స్థానిక ప్రజలు మాట్లాడే భాషలో ప్రసంగించాలి. ఈ శుభ సందర్భంగా సత్కార్యాల గురించి, దానధర్మాల గురించి ప్రేరేపించాలి. సామరస్యం, ఐకమత్యం గురించి నొక్కి వక్కాణించాలి. రమజాన్‌లో ఎంతో శ్రమతో సాధించిన సాత్వికతను కాపాడుకోవలసిందిగా విజ్ఞప్తి చేయాలి. దేశ, సమాజ పరిస్థితులను విశ్లేషిస్తూ ముస్లింల కర్తవ్యాన్ని గుర్తు చేయాలి.

ప్రసంగించవలసిన తీరు
పండుగ నమాజ్‌ సందర్భంగా మొదట నమాజ్‌ చేయబడుతుంది, ఆ తర్వాతే ప్రసంగం.
జుమాలో రెండు ఖుత్బాలుంటాయి. కాని పండుగ సందర్భంగా ఒకే ఒక ఖుత్బా ఇవ్వబడుతుంది. పండుగ నమాజు సందర్భంగా రెండు ప్రసంగాలు (ఖుత్బాలు) ఉన్నట్లు, రెండు ఖుత్బాలకు మధ్య ఉపన్యాసకుడు కొన్ని క్షణాలు కూర్చుని విశ్రాంతి తీసుకున్నట్లు ఏ ప్రామాణిక హదీసు ద్వారా కూడా రూఢీ కాలేదు.

Related Post