Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

రమజాను మాసమా! స్వాగతం!

Ramadan - telugu
 జాసిం సాలెహ్

ఓ రమజాను మాసమా! నీకు స్వాగతం!

  ఏటేటా నీవు ఏతెంచుతావు. నీ కారుణ్య రూపాన్ని చూపించి వెళ్ళిపోతావు… మలయ మారుతంలా కదలి వస్తావు. సుగంధ పరిమళాలు గుభాళించి మైమరిపిస్తావు… నెలంతా తక్బీర్‌ నినాదాలతో, దైవ స్తోత్ర వచనాలతో నలుదిశలా దైవ దాసుల అంతరాళాలు భక్తితో పరవశించి పారుతాయి. అలసి సొలసిన మానవాళిని ఓదార్చి, ఆత్మలకు నెమ్మదనిచ్చే ఓ ఆదరణీయ మాసమా! నీ రాక శుభదాయకం! నీకు స్వాగతం!
  నీవు శుభాల సరోవరానివి. నీకిది వసంత కాలం. నీవు దైవ దాసులపై బహు వరాలతో తేజరిల్లావు. జనులను వారి నిర్లిప్తత నుండి, పరధ్యానం నుండి జాగరూక పరచి, వారిలో చైతన్యం నింపడానికి, వారి జీవితాలను తీర్చిదిద్దటానికి ఏతెంచావు…
  రమజాను మాసమా! స్వాగతం!! ఖుర్‌ఆన్‌ మాసమా! నీ మొదటి థకం కారుణ్య ప్రదం, రెండవ థకం మన్నింపుల థకం, చివరి థకం నరకాగ్ని నుంచి విముక్తినిచ్చేది. నీ రాకతో స్వర్గ ద్వారాలు తెరవబడుతాయి. నరక ద్వారాలు మూసివేయబడతాయి. షైతానులను సంకెళ్ళతో బంధించడం జరుగుతుంది.
  నీలో పగలంతా ఉపవాసాలుంటూ, రాత్రంతా దైవారాధనలో జాగారం చేస్తూ, దైవ సమక్షంలో మోకరిల్లి మొరపెట్టుకునే దాసుల మొరలు ఆలకించబడతాయి. ఆంతర్యాలు మనో కాలుష్యాల నుండి ప్రక్షాళనం గావించబడతాయి. అల్లాహ్‌ా నామ సంస్మరణ కోసం సంసిద్ధమవుతాయి. రేయింబవళ్ళు ఖుర్‌ఆన్‌ పారాయణాలతో, తరావీహ్‌ా నమాజులతో తాదాత్మ్యం చెందుతాయి. అన్నపానీయాల నుండి శరీరావయవాలను ఆపి ఉంచటం, అధర్మ కార్యకలాపాల నుండి ఇంద్రియాలను కాపాడటం, బంధుత్వాలను బలపర్చటం, పొరుగువారి స్థితిగతులను తెలుసుకోవడం, ఆప్తుల బాగోగులను విచారించటం, అభాగ్యులు, అగత్యపరులు, అనాథలు, నిరుపేదల అవసరాలు తీర్చడం – ఈ బృహత్కార్యాలన్నీ నీలోనే జరుగుతాయి.
  మన పూర్వీకుల్లోని పుణ్యపురుషులు రమజాను మాసం పట్ల ప్రత్యేక శ్రద్ధాభక్తులను కనబర్చేవారు. ఈ మధు మాసం రాకతో ఆనందభరితులయ్యేవారు. ఈ వరాల వసంతానికై కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. ఈ సువర్ణ మాసాన్ని పొందేందుకు పరితపించిపోయేవారు. ”ఓ అల్లాహ్‌ా! రమజాను మాసాన్ని పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించు స్వామీ!!” అని ప్రాధేయపడేవారు. ఈ శుభ మాసాన్ని వారు పశ్చాత్తాప కన్నీటితో, తుది శ్వాస వరకూ ధర్మానికే కట్టుబడి ఉంటామన్న వజ్ర సంకల్పంతో, విలువైన సమయాన్ని ఆధ్యాత్మిక మనో వికాసానికై వినియోగిస్తామన్న దృఢ నిశ్చయంతో, సత్కార్యాలతో దానధర్మాలతో స్వాగతించేవారు. తదుపరి తమ కర్మల్ని స్వీకరించమని ఆ దయాకరుడ్ని ఎంతో దీనంగా వేడుకునేవారు. ఇంతటి శుభప్రదమైన మాసాన్ని తమకు ప్రసాదించినందుకు దైవానికి నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకునేవారు.
పాపభూయిష్టమైన మన జీవితాల్ని పునీతం చేసుకునేందుకు, మనలోని లోపాలను సరిదిద్దుకునేందుకు దేవుడు మనకు బహూకరించిన అమూల్య వరప్రసాదం రమజాను మాసం.  మీ అందరికి రమజాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే సోదరులందరికి అల్లాహ్‌ా గొప్పగా సన్మానించాలని కోరుకుంటున్నాము.

Related Post