సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

''మంచి - చెడు రెండూ సమానం కావు. (ఓ ప్రవక్తా!) నీవు చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తర్వాత నీ బద్ధ శత్రువే నీకు స్నేహితుడవటం నీవు చూస్తావు''. (దివ్య ఖుర్‌ఆన్‌- 41;34)

”మంచి – చెడు రెండూ సమానం కావు. (ఓ ప్రవక్తా!) నీవు చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తర్వాత నీ బద్ధ శత్రువే నీకు స్నేహితుడవటం నీవు చూస్తావు”.
(దివ్య ఖుర్‌ఆన్‌- 41;34)

– ముజాహిద్ ఖాన్ ఉమ్రీ

తౌసీఫ్‌, తస్నీమ్‌ ఇద్దరూ మంచి ప్రొగ్రా మర్లు. ఆల్‌టెక్‌ సొల్యూషన్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపనీలో జేరారు. తమ టీమ్‌ మేనేజర్‌ వీరిద్దరికి ఒక అంశమిచ్చి ‘దీనిని పరిష్కరించండి, చాలా రోజుల నుంచి ఇది పెండింగ్‌లో ఉంది. సీనియర్స్‌ కూడా చేయలేకపోయారు. మీరు ప్రయత్నించి చూడండి’ అన్నాడు.
తస్నీమ్‌ కొన్ని గంటలు ప్రయత్నించినా ఫలించలేదు. సీనియర్సే సాధించలేని పనిని నేనెక్కడ సాధించగలనని, అయినా ఇది చేయకపోతే ఉద్యోగం ఊడిపోదు కదా అనుకుని ఆ ప్రయత్నాన్ని ఆపివేశాడు.

తౌసీఫ్‌  దీనిని ఒక మంచి ఆపర్చునిటీ (సదవకాశం) గా భావించాడు. ఎంత కష్టమైనా సాధించాలని ఛాలెంజీగా తీసుకున్నాడు. సీనియర్స్‌ చేయలేకపోతే ఇక ఈ పెండింగ్‌ ఇలా పడి ఉండాల్సిందేనా, నేను ఎందుకు పరిష్కరించకూడదు అని మొదలుపెట్టి రాత్రింబవళ్ళు కష్టపడి మొత్తానికి సాధించాడు. కంపెనీ మీటింగ్‌లో స్టాఫ్‌ అందరి ముందు దీనిని ప్రజెంట్‌ చేసాడు. అందరూ తప్పట్ల వర్షం కురిపించారు. సీనియర్స్‌ అందరూ వచ్చి భుజాన్ని తట్టుతూ ప్రోత్సహించారు. ఆ కంపెనీ బాస్‌ దృష్టిలో తౌసీఫ్‌ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కొన్ని రోజుల్లోనే ఒక క్రొత్త బ్రాంచ్‌కు మేనేజర్‌గా వెళ్ళాడు. తస్నీమ్‌ ఒక సాధారణ ఉద్యోగిలాగే అక్కడ మిగిలిపోయాడు.

తౌసీఫ్‌ లాంటి ఉద్యోగులు కంపెనీలకు, సంస్థలకు ప్రగతికి కారణమవుతే తస్నీమ్‌ లాంటి ఉద్యోగులు భారంగా మిగిలిపోతున్నారు. నెలనెలా జీతం పుచ్చుకోవడం, కామ్‌ చలావ్‌ పనులు చేసుకుంటూ ఉద్యోగాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
కువైట్‌లో మన తెలుగు సోదరులు 40 శాతం మంది డ్రైవర్లుగా సేల్స్‌మన్‌లుగా చిన్నచిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. దాదాపు ఎక్కువ మంది తమ ఉద్యోగం పట్ల అయోమయం, అనాసక్తతతో ఉంటారు. అదేమంటే పసలేని కారణాలు చూపిస్తారు. నిజానికి అది తస్నీమ్‌ లాంటి స్వభావం. తౌసీఫ్‌ లాగా భయపడకుండా, కష్టపడి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సత్తా నిరూపించుకోవాలి. కష్టపడేవారి వెనుక అల్లాహ్‌ా సహకారం తప్పక ఉంటుంది.
జీవితంలో సాధన  అనేది ఎంతో ముఖ్యం. ఈ సాధన- కష్టం, సమయం, పట్టుదలను కోరుతుంది. వెయ్యి మందిలో ఒక్కడే సాధిస్తాడు. ఎందుకంటే సాధించాలి అనే పట్టుదల, ప్రయత్నం ఉంటుంది కాబట్టి. మిగతా 999 మంది ప్రయత్నిస్తారు కాని పట్టుదల ఉండదు. సహనం అసలు ఉండదు.
ప్రవక్త ముహమ్మద్‌ (స) జీవితంలో తాయిఫ్‌ సంఘటన అన్నింటికన్నా బాధాకరమైన విషయం. ధర్మ ప్రచారానికై తాయెఫు వెళితే వాళ్ళు రాళ్ళతో కొట్టి కొట్టి కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) ను రక్తంలో ముంచేసారు. స్పృహ తప్పి పడిపోతే, నీళ్ళు కొట్టి మళ్ళీ లేపారు. లేపి మరలా కొట్టడం మొదలెట్టారు.
ఈ సంఘటనను ఊహిస్తేనే మనిషి భయంతో అల్లాడిపోతాడు. కాని ప్రవక్త (స) భయపడలేదు. ఈ ప్రయత్నాన్ని మాను కోలేదు. ”ఈ భూమిపై శాంతిని స్థాపించాల”నే సాధనాన్ని అసలు వదల దలుచుకోలేదు.

విశేషం ఏమిటంటే, ఈ తాయిఫు సంఘటన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు, ప్రయత్నాలు క్రితంకన్నా ఎన్నో రెట్లు పెరిగిపోయాయి.
ప్రవక్త ముహమ్మద్‌ (స)కు విజయం దక్కిందంటే అది తాయెఫ్‌ మరియు హిజ్రత్‌ మధ్య కాలంలో చేపట్టిన ప్రయత్నాలే కారణమని చెప్పాలి.
తాయెఫ్‌ సంఘటన తర్వాత ప్రవక్త (స) నిరుత్సాహపడలేదు. అదే ఉత్సాహంతో తమ ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నులయి పోయారు. లక్ష్యం ఉన్నతమైతే మనిషి నిరుత్సాహ పడడు? అల్లాహ్‌ా తప్పక సహకారం అందిస్తాడనే నమ్మకం ఉండాలి.
సాధన, పట్టుదల మంచి విషయాల్లో ఉండాలి. అంతేకాని శత్రుత్వం, ఇతరులను కించపర్చడంలో, కూపీలు లాగటంలో, వారిని నష్టపర్చడంలో మన శక్తి సామర్ధ్యాల ను వ్యర్థం చేసుకోకూడదు. దానివల్ల సాధించేది తక్కువ మన నష్టమే ఎక్కువ ఉంటుంది.
ప్రవక్త ముహమ్మద్‌ (స) జీవిత చరిత్ర ఉన్నతమైన ఆదర్శం. తాయెఫ్‌ వారిని ప్రవక్త ముహమ్మద్‌ (స)  క్షమించడం మాత్రమే కాదు, దయ కరుణ కూడా చూపారు. మంచి లక్ష్యంతో ఎదురయ్యే చెడును, శత్రుత్వాన్ని మంచితో తొలగించారు మహా ప్రవక్త ముహమ్మద్‌ (స). అందుకే దివ్య ఖుర్‌ఆన్‌ ఇలా బోధించింది:

”మంచి – చెడు రెండూ సమానం కావు. (ఓ ప్రవక్తా!) నీవు చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తర్వాత నీ బద్ధ శత్రువే నీకు స్నేహితుడవటం నీవు చూస్తావు”.
(దివ్య ఖుర్‌ఆన్‌- 41;34)

Related Post