అడుగు -ముందడుగు

   సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
 అడుగు అనే సరికి అనేక అర్థాలు స్పృశిస్తాయి. అడిగినకొద్దీ అర్థాలు పుట్టుకొస్తాయి. అందుకే ‘అడుగు తెలియని ప్రతీదాన్ని’ అంటు న్నాడు ఆ పరమ ప్రభువు. తనకు ప్రాప్తమయి ఉన్న అసాధారణ తెలివి తేటలతో, అనుపమ ప్రతిభతో, అవిరళ కృషితో, అనూహ్య  ఫలితాలతో అధ్బుతాల్ని, మహాత్భుతాల్ని ఆవిష్కరించి తన తర్వాతి తరంకోసం అడుగుజాడల ముద్రని వదిలి దృశ్యంగా కను మరుగై ఆదర్శంగా సుజనులై, సుగతులై సజీవంగా సమాజంలో అగ్రజులంటూ నీరాజనాలందుకొనేవారు కొందరుంటుంటే, మరి కొంద రేమో  ఆదర్శశూన్యులుగా చెలామణి అవుతూ, అలగాజనాల అడుగులకు మడుగులొత్తుతూ ‘అడుగు గులాములు’గా బ్రతుకుతూ, అడుగు లేని పాత్రలా తడబడు అడుగులతో తంటాలు పడుతూ, మోక్షసాధన అడుగు దూరంలో ఉన్నా అడుగెత్తలేక, ఎత్తినా  ముందడుగు వేయలేక అడుగు తప్పి, అట్టడుగున పడి అష్ట అప్రతిష్టలకు గురై గుణపరంగా  అడుగు పుట్టులుగా, అస్పృశ్యులుగా, అడుగంటిన సిద్దాంతాలతో, తేలిపోయిన తత్వాలతో తొక్క మనుషులుగా తస్కారం పొందుతున్నారు.
    కలికి (స్త్రీ) తీపి, కలిమి (సంపద) తీపి, కడుపు తీపి (సంతానం) కలగలిసి ఆడే నాటకంలో నలిగిపోతుంటాడు నరుడు, నరరూప రాక్షసునిగా మారిపోతుంటాడు ప్రవఁరుడు. ఏ అడుగు తన ప్రక్కను తాకినా ఎంత విషం కక్కుతాడు? ఏ చెయ్యి తన తల జట్టును తడిమినా ఎన్ని పొగలు చిమ్ముతాడు? తన చేని గట్టు కాస్త తరిగితే తలలు పుచ్చకాయల్లా పగులుతాయి. తన ఆటపట్టు కాస్త చెదిరితే అంకురించిన అనుబంధాలు ఎండుటాకుల్లా రాలుతాయి.  త్యాగమెరుగని ఈ అడుగు ఎందాక? ఎన్నాళ్ళు సాగుతుంది మమతెరుగని ఈ నుడుగు?  ఈ హింస గెలుపౌతుందా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలను నూరిపోసే ఈ దూకుడు మేలుకొలుపౌ తుందా? మనుషుల్ని చంపితే కాదు; మనసుల్ని కలిపితే గెలుపు. చెడూ మంచీ తెలిస్తేనే కదా చెడుకు మనసు లొంగకుండా ఉండేది.
   నీతి బాటన, నిజ ధర్మ రీతిన నడవాలి మన అడుగు. అది అవినీతి పాలిట అవ్వాలి చిచ్చర పిడుగు. అయితే ఇక్కడో అడ్డంకి గండంలా పొంచి ఉంది, అడుగంటని మడుగు మనసుతో. అయినవారిలానే ఎదురౌతుంది అరువు తెచ్చుకున్న చిరునవ్వులతో.  కుశల ప్రశ్నలు కురిపిస్తుంది కొనితెచ్చుకున్న పన్నీటి జల్లులతో. అదమరచి అడుగేసామంటే ఆ నవ్వులే అడుగెత్తనీయకుండా నిలువ రిస్తాయి. పసిగట్టి మసలుకోకుంటే ఆ కుశల ప్రశ్నలే కొంపలు కూలుస్తాయి. మన కంటి మిసిమిని కబళించాలని, మన ఇంటి పరువుని పెకళించాలని, మన వంటిని మింటికి సాగనంపాలని ఇరులు (చీకట్లు) పొంచి ఉన్నాయి. ఉరులు (స్వార్థ చింతన) పన్నుతు న్నాయి. సంకల్పం పదునుదేరేదాకా, సముజ్వల గమ్యం చేరేదాకా స్తుతులకూ-కుత్సిత మతులకూ చలించక, తీతువుల అరుపులనూ – పీతల నడకలనూ  గణించక ముందడుగెయ్యాలి జాగ్రత్తగా!
  పేరాశ దిక్కులు చూస్తున్నా, అగ్రరాజ్యాలు గోళ్ళు గిల్లుకుంటున్నా, ప్రజోధ్యమాలకు బాసటగా ఉంటామని ప్రగల్భాలు పలికే ప్రబు ద్ధుల పైశాచిక శక్తుల అడుగులకు మడుగులొత్తుతూ తిరుగుతున్నా, వెనుకడుగెయ్యక ఒక అడుగు ముందుంటూ కరాలే (తలలే) కర వాలాలుగా, గుండెలే తుపాకీ  గుండ్లుగా, కదను తొక్కుతూ, కరుణామృతాల్ని పంచుతూ, ప్రేమానురాగాల్ని పెంచుతూ, కంకాళాల (డొక్కల)లో క్రాంతి శంఖమొత్తుతూ కాంతి వేగంతో పురోగమించే మహా ప్రభంజనం అవ్వాలి మనం. హంసపాదు అలగాజనాలకు అదమాయిస్తూ నిలుచుంటే, ఎదురయ్యే గుంటనక్కలకు సముదాయిస్తూ కూర్చుంటే, కాలం ఖరాబౌతుంది. క్రాంతి కుంటుపడు తుంది. రంగులు మార్చే ఊసరవెల్లులు రంగం మీద చిందులు తొక్కినా, తడికి ఆవల తోడేళ్లు శిశిర శాస్త్రాలు వల్లించినా అదరక బెదరక అడుగెయ్యాలి, కడిగెయ్యాలి. అడుగు ముందుకేసి అనంత కాలవాహినిలో మన అడుగుజాడలెన్నని ఆలోచించాలి. మనం వేసే ప్రతి అడుగు జడీభవించిన చైతన్యానికి మరో మలుపవ్వాలి. అది అడుసులో నక్కిన ముళ్ళను తొక్కేస్తూ సాగాలి.
   అట్టి సాహసం మనం చెయ్యాలంటే అడుగు నిలకడ అవసరం. ఎందుకంటే, అడుగు తప్పిన మనిషిని అడుగడుగునా అనేక శక్తులు లోబర్చుకోవడానికి యత్నిస్తుంటాయి. కాబట్టి నరులు చేసిన నియమాలకు లోబడి జీవించడానికి బదులు మనందరి నిజ ప్రభువు శాసనాలకు విధేయులై జీవిస్తే ఆ ఒక్క విధేయత మనల్ని ముక్కోటిన్నర విధేయతల సంకెళ్ల బారి నుండి విముక్తిని కలిగి స్తుంది. అడిగితే ఆ ఆపద్బాంధవుడినే అడగాలి అన్న జిజ్ఞాస మనలో మొగ్గతొడుగుతుంది. అప్పుడు ఆ మార్గంలో ఆద్యులు, ఆదర్శ ప్రాయులైన ప్రవక్తల నీతి నడవడికల నుడుగుల నీడలు మన పాలిట నిత్య, నిర్మల అడుగుజాడలవుతాయి. అదే అసలు మానవా భ్యుదయానికి, లోకోద్ధరణకు, లోకాభ్యున్నతికి సిసలైన అడుగులు (మెట్లు). సమరసం, సుహృద్భావం, శాంతి, స్వర్గ సాధనకు సోపానాలు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”ఆయన వారికి సన్మార్గం చూపుతాడు. వారి పరిస్థితిని చక్కదిద్దుతాడు. వారికి (ముందుగా) తెలిపివున్న స్వర్గంలో ప్రవేశం కల్పి స్తాడు. విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక అల్లాహ్‌కు సహాయం చేస్తే (ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మోన్నతి కోసం పాటుపడితే) ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ అడుగులకు నిలకడను ఇస్తాడు”. (దివ్యఖుర్‌ఆన్-47: 5-7)

Related Post