Originally posted 2013-05-01 09:49:02.
మానవ సమాజాభ్యుదయానికి ‘శ్రమ’ మూలాధారం. శ్రామిక శక్తితోనే మానవ సంస్కృతి వికసిస్తోంది. శ్రామిక వర్గ శ్రేయస్సు దేశ ఆయుష్షును పెంచే ఉషస్సు. ఈ కారణంగానే ‘మనిషి చేతి సంపాదనకన్నా మించిన సంపాదన లేద’న్నారు కార్మిక సోదరుని కాయలు కాసిన చేతిని ముద్దాడిన మానవ మహోపకారి ముహమ్మద్ (స).
కార్మికులంటే శ్రమజీవులు. శ్రామికుల శ్రమతోనే పరిశ్రమలు నడుస్తాయి. పరిశ్రమలు నడుస్తేనే పారిశ్రామికవేత్తలు ఉనికిలోకి వస్తారు. శ్రామికులు శ్రమించడం మానుకుంటే పరిశ్రమలు మూత బడతాయి. పారశ్రామిక వేత్తలూ దీవాలా తీస్తారు. కాబట్టి పారశ్రామికవేత్తలు శ్రామికుల శ్రమకు తగ్గట్టు వేతనం చెల్లించాలి. అప్పుడే సర్వతోముఖ విశ్వ మానవ ప్రగతి సాధ్యమవుతుందని భావించగలం.
”కూలివాని చెమట తడి అరక ముందే అతని కూలీ చెల్లించి వేయండి” అని బోధించారు శ్రామిక శ్రేయోభిలాషి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స). ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో పుట్టికొచ్చిన ప్రత్యేక ఆర్థిక మండలి చట్టంతో నూరేళ్ళ క్రితం రూపొందించిన కార్మిక చట్టాలన్నీ మసకబారి పోయాయి. వెరసి కార్మికుల జీవన ప్రమాణాలు అడుగంటి పోయాయి. ఈ దుస్థితి పోవాలంటే శ్రామిక శ్రేయోభిలాషులయిన వారందరూ పూర్తి చిత్తశుద్ధితో సమాజంలో మార్పుకై పూనుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ మేరకు మానవత్వం కలిగిన ప్రతి ఒక్క స్పందిస్తారని ఆశిస్తున్నాము!