ఉదయం మనం ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి మొదలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఎందరో మనకు తారస పడుతుంటారు. క్లాస్ రూమ్‌లో, ఆఫీసులో, కార్యాలయంలో, బస్సులో, ట్రైనులో, పొలంలో, తోటలో, హోటల్లో-అనేక చోట్ల నామకులు-అనామకులు, మిత్రులు-శత్రువులు, పండితులు-పామరులు, ధర్మాత్ములు-దురాత్ములు, పేదవారు-ధనికులు, ఉపాధ్యా యులు-విద్యార్థులు, అనాథలు-ఆపద్బాంధవులు, యజమానులు-కార్మికులు, బోధగురువులు-బాధగురువులు, స్వదేశీయులు -పరదేశీయులు, వర్తకులు-కొనుగోలుదారులు, వైద్యులు-రోగులు, సన్యాసులు-సామాన్యులు ఇలా ఎందరో! తీరా సాయంత్రం ఇంటికి చేరుకుంటాము. ఇంట్లో తల్లిదడ్రులు, అన్నాచెల్లెళ్ళు, భార్యాపిల్లలు, బంధువుమిత్రులు, నౌకరులు, పెంపుడు జంతువులు, మొక్కలు-ఇలా మనం ఎవరెవర్ని కలుసుకుంటామో వారిలో ప్రతి ఒక్కరూ మన సేవకు అర్హులే. కనిపించిన ప్రతి మొక్కకు నీరు పోయాలి. ప్రతి వ్యక్తిని పలుకరించాలి. ప్రతి జీవిని ప్రేమించాలి. ఎందుకంటే, మళ్ళీ ఈ దారిన ప్రయాణించే అదృష్టం మనకు లభించకపోవచ్చు.
”స్వయం కోసం దేన్నయితే ఇష్టపడతామో మన సోదరుని కోసమూ దాన్నే ఇష్టపడాలి” అని మహా ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పారు. అవును; మనల్ని మనం ప్రేమించినట్లే ఎదుటి వారిని ప్రేమించాలి. ఈ సువిశాల ప్రపంచంలో మనం తలుచుకుంటే అందరూ అయినవాళ్లే, కానివాళ్ళంటూ ఎవరూ ఉండరు. వారిని మంచి చేసేందుకు ఓ మంచి మనసు కావాలి మనకు. మన ఒక్క ఆదరణ నూరేళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. తీయని ఓ మాట నిండు హృదయాన్ని నింపుతుంది. నిత్యం మనం ఎవరో ఒకరిని చేతనైనంత సహాయం చేస్తూండాలి. మన సహాయం అందుకున్నా వ్యక్తి ముఖంపై గోచరించే ఆనందం మనకు ఆత్మానందాన్ని ఇస్తుంది. మనారోగ్యాన్ని, ఆయుష్షును పెంచుతుంది. ‘మీ రోగులకు దానధర్మాల ద్వారా స్వస్థతను చేకూర్చండి’ అని పవక్త (స) చెప్పింది ఇందుకేనేమో! సహాయం చేసే చేతులు ప్రార్థించే పెదవులకన్నా గొప్పవన్న యదార్థాన్ని గుర్తుంచుకోవాలి మనం. దైవ ప్రవక్త (స) ఇలా ఉద్బోధించారు: ”ఒక విశ్వాసి అవసరాన్ని తీర్చడం కోసం అతనితోపాటు నడవడం, మస్జిద్‌లో 2 నెలలపాటు ఏతికాఫ్ కోసం కూర్చోవడంకన్నా నాకెంతో ఇష్టమైనది” (సహీహ్ జామె సగీర్)
నిజం-, అగత్యపరుల అగచాట్లను జాలి గుండెతో అర్థం చేసుకున్నప్పుడే మనకు తృప్తి కలుగుతుందది. అప్పుడు ప్రస్తుతం మనకు ప్రాప్తమయి ఉన్న వరాలకుగాను అల్ల్లాహ్‌ాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలనిపిస్తుది. ఇంకో మంచి పని చేయాలని మన మనస్సుకు శరీరానికి ఉత్సాహం వస్తుంది. కన్నవారితో కనికరంతో మెలగకుండా, ఒక విధవరాలి కన్నీరు తుడవకుండా, ఆకలితో అలమటి స్తున్న ఒక అగత్యపరుని ఆకలి తీర్చకుండా, ఒక అనాథను అక్కున చేర్చుకోకుండా ఎంత ధర్మాన్ని పాటించినా, మరెన్ని ఆస్తిపాస్తుల తో జీవించినా ఆ బ్రతుకుకి అర్థపర్థం ఉండదనే చెప్పాలి. అందుకే ”తాను తనివితీరా భోంచేసి కనీసం పొరుగువాని ఆకలి బాధను సయితం పట్టించుకోని వ్యక్తి సంపూర్ణ విశ్వాసి కాజాలడు” అని మానవ మహోపకారి ముహమ్మద్ (స) హెచ్చరించారు. ఇది నిజం – కఠోర సత్యం! ఒక బాధాతప్త హృదిని ఓదార్చడంలో, ఒక అవసరార్థుడ్ని ఆదుకోవడంలో, ఒక బాటసారి అవసరం తీర్చడంలో, ఒక అనాథకి ఆశ్రయం ఇవ్వడంలో, ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవడంలో అల్లాహ్‌ాను, అల్లాహ్‌ా అనుగ్రహాన్ని చూసేవాడు భక్తుల్లో అగ్ర భాగంలో ఉంటాడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”తాము అమిత అవసరంల ఉన్నప్పటకీ తమపై వారికే ప్రధాన్యతనిస్తారు. వాస్తవానికి తన స్వార్థప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు”. (అల్ హష్ర్: 9) మహనీయ ముహమ్మద్ (స) వారు తమ సముదాయాన్ని జాగరూకపర్చిన విధానం కూడా కాస్త గమనించండి: ”మీరు స్వార్థప్రియత్వం, ఆత్మ లోభత్వం నుండి మిమ్మల్న్ని కాపాడుకోండి. ఈ ఆత్మ లోభత్వమే (అత్యాశే) పూర్వీకులను పొట్టన బెట్టుకుంది. ఈ మనో వ్యాధియే వారిని రక్త పిపాసులుగా మార్చింది. ఫలితంగా వారు అధర్మమైన వాటిని ధర్మసమ్మతం చేసుకునే నీచ స్థాయికి దిగజారారు”. (సహీహ్ ముస్లిం)
ఇస్లాం, మనిషికిచ్చే శిక్షణలో, చేసే బోధనలో – ‘సేవకుడే నాయకుడు’ అని ఓ చోట అంటే, ‘రథసారధి తన అనుయాయుల్ని మోసగించడు, వారితో అబద్ధమాడడు’ అని మరో చోట అంటుంది. ‘అసూయపరుడు నాయకత్వానికి అనర్హుడు’ అని ఓ చోట సెలవిస్తే, ‘క్షమ, దయ, మన్నింపుల వైఖరి గలవాడే నిజమైన నాయకుడు’ అని మరో చోట వక్కాణిస్తుంది. ‘కల్మషం, కల్లాజపటం, స్వార్థం గలవాడు రథసారధి కాలేడు’ అని ఓ చోట చెబితే, ‘మృదువు స్వభావుడు, నిర్మల హృదయుడే నికార్సయిన నాయకుడు’ అని మరో చోట చెబుతుంది. అది చేసే హితవుల్లో ప్రధమమయినది – ‘(అద్దీను అన్నసీహా) జన హితమే దైవ అభిమతమన్నది’. అది విధి చేెసే ఉపవాస దీక్ష సయితం దీన్ని ఉద్దేశించనదే. అంటే రమజాను మాసం మనిషి, మహా మనీషిగా, మహా నాయకుడిగా ఎదిగే సువర్ణావకాశం అన్న మాట. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటారని ఆశిస్తూ….. రమజాను శుభాకాంక్షలు తెలియజేస్తు న్నందుకు సంతోషిస్తున్నాము.