ఎన్ని సత్కార్యాలు చేసినా, ఎన్ని ఆరాధనలు ఆచరించినా, ఎంత ప్రసన్నమైన ధార్మిక వస్త్రధారణ చేసినా, ఎంత భక్తిని ఒలకబోసినా, ‘ప్రవర్తన’ సరిగా లేకపోతే, వాక్కు మంచిగా లేకపోతే, సాటివారిపట్ల, సమాజం పట్ల బాధ్యతను విస్మరిస్తే అంతా నిరర్థకం, నిష్ర్పయోజనం. అందుకే ఒక ప్రవచనంలో ప్రవక్త మహనీయులు ఇలా అన్నారు:‘‘ప్రళయ దినాన విశ్వాసి కర్మల త్రాసులో ఉంచబడే అత్యంత విలువైన వస్తువు అతడి సత్‌ప్రవర్తనే’’
ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ (స) సమక్షంలో కొంతమంది సహచరులు సమావేశమై తమ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ, జ్ఞానసముపార్జన చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు స్త్రీల విషయం ప్రస్తావనకొచ్చింది. ఒక మహిళ నిరంతరం దైవధ్యానంలో నిమగ్నమై ఉంటుంది. పగలంతా ఉపవాసవ్రతం పాటిస్తుంది. రాత్రులలో జాగారం చేస్తూ సఫిల్ నమాజులు చేస్తూ ఉంటుంది. పెద్ద ఎత్తున దానధర్మాలు కూడా చేస్తుంటుంది. సఫిల్ రోజాలు, నమాజులు, దైవనామస్మరణ, దానధర్మాలవంటి సత్కార్యాల కారణంగా గొప్ప దైవభక్తి పరాయణురాలిగా, దాతగా ప్రాచుర్యం పొందింది. కాని ఆమెలో ఉన్న చిన్న లోపం ఏమిటంటే, ఆమెకు నోటి దురుసు ఎక్కువ. ఆ కారణంగా ఇరుగుపొరుగువారు ఆమె వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
మరొక మహిళ విధిగా పాటించాల్సిన కార్యాలను మాత్రమే నిర్వర్తించేది. అంటే క్రమం తప్పక ఐదుపూటలు నమాజు చేయటం, రమజాన్ ఉపవాసాలు పాటించటం మాత్రమే చేసేది. సఫిల్ నమాజులు, సఫిల్ ఉపవాసాలు పాటిస్తే పాటించేది, లేకపోతే లేదు. అడప్పుడప్పుడూ చిన్న చిన్న దానధర్మాలను మాత్రమే చేసేది. రాత్రంతా మేల్కొని నిద్రలేకుండా ఆరాధనాలు చేయడం చేసేది కాదు. ఓపిక ఉంటే చేసేది, లేకపోతే లేదు. ‘విధినిర్వహణ’లో మాత్రం ఎప్పుడూ అలసత్వం చూపేది కాదు. ఇరుగుపొరుగువారితో సత్సంబంధాలు కొనసాగించేది. మృదువుగా మాట్లాడేది. చేతనైన సాయం చేసేది, లేకపోతే మౌనంగా ఉండేది. ఎట్టి పరిస్థితిలోనూ ఆమె ఎదుటి వారి మనసు గాయపరిచేది కాదు. ఈ కారణంగా అందరూ ఆమె పట్ల సంతోషంగా ఉండేవారు.
ఈ ఇద్దరు మహిళల ప్రస్తావన విని దైవప్రవక్త (స) మొదటి మహిళలో ఎలాంటి శుభం కాని, మంచితనం కాని లేదు అన్నారు. రెండవ మహిళను ప్రశంసిస్తూ, ఆమె తప్పకుండా స్వర్గానికి వెళుతుంది అని సెలవిచ్చారు. అంటే మొదటి మహిళ పగలంతా రోజావ్రతం పాటించి, రాత్రులు మేల్కొని, ఆరాధనలు చేసి, ఎన్నెన్నో దానధర్మాలు, సత్కార్యాలు చేసినప్పటికీ సాటి మనుషులను గౌరవించేది కాదు. తన ప్రవర్తనతో వారిని బాధించేది. తన నోటి దురుసుతనంతో వారి మనసులను గాయపరిచేది. ఆమె వల్ల ఇరుగుపొరుగువారు ప్రశాంతంగా ఉండలేకపోయేవారు. ఈ కారణంగా ఆమె ఎన్ని ఆరాధనలు ఆచరించినా, ఎన్ని సత్కార్యాలు చేసినా, ఎన్ని దానధర్మాలు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. సాటి మానవుల పట్ల నిర్వర్తించవలసిన బాధ్యతలను విస్మరించి వారిని బాధలకు గురి చేసి, ఎన్ని మంచి పనులు చేసినా, దైవం వాటిని పరిగణనలోకి తీసుకోడు. అలాంటి మహిళను ప్రవక్త మహనీయులు ఆమెలో ఎలాంటి శుభం లేదు. ఆమె నరకవాసి అన్నారు.
అదేవిధంగా రెండవ మహిళను స్వర్గవాసి అని ప్రశంసించారు. అంటే ఆమె తన సత్ప్రవర్తనతో ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఇరుగుపొరుగువారితో సత్సంబంధాలు కొనసాగించేది. తన నోటిద్వారాకాని, చేతల ద్వారాగాని, ఎవరినీ బాధించలేదు. సఫిల్ రోజాలు, నమాజులు చాలా అరుదుగానే పాటించినా, సామాజిక బాధ్యత పట్ల ఏనాడూ నిర్లక్ష్యం వహించేది కాదు. ఇరుగుపొరుగు కష్టసుఖాల్లో పాలు పంచుకుని, మృదువుగా సంభాషించేది. ఈ విధమైన సత్ప్రవర్తన కారణంగా ఆమె స్వర్గానికి అర్హత సాధించింది.
ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి? ఎన్ని సత్కార్యాలు చేసినా, ఎన్ని ఆరాధనలు ఆచరించినా, ఎంత ప్రసన్నమైన ధార్మిక వస్త్రధారణ చేసినా, ఎంత భక్తిని ఒలకబోసినా, ‘ప్రవర్తన’ సరిగా లేకపోతే, వాక్కు మంచిగా లేకపోతే, సాటివారిపట్ల, సమాజం పట్ల బాధ్యతను విస్మరిస్తే అంతా నిరర్థకం, నిష్ర్పయోజనం. అందుకే ఒక ప్రవచనంలో ప్రవక్త మహనీయులు ఇలా అన్నారు:‘‘ప్రళయ దినాన విశ్వాసి కర్మల త్రాసులో ఉంచబడే అత్యంత విలువైన వస్తువు అతడి సత్‌ప్రవర్తనే. (తిర్మిజి) అందుకని ప్రవర్తనను మంచిగా తీర్చిదిద్దుకుని సమాజంపట్ల, సాటి మానవులటప్ల బాధ్యతను గుర్తెరిగి, నడచుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ మన మాటల ద్వారాగానీ, చేతల ద్వారాగానీ ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడాలి. ఇలాంటి సచ్ఛీలురు, సత్యసంధుల కోసమే స్వర్గద్వారాలు తెరుచుకుని ఉంటాయి.