ఎం.డి.ఉస్మాన్‌ఖాన్
విద్యావిజ్ఞానాలు మనిషిని ఉత్తముడిగా, విలువల పరిరక్షకుడిగా తయారుచేస్తాయి. విద్యావిహీనత అన్నది సృష్టికి మకుటాయమానమైన మానవుడికి శోభించని లక్షణం. విద్యావిజ్ఞానాలు మనిషిని ఇహపరలోకాల్లో ఉన్నతస్థానాలకు, సాఫల్య శిఖరాలకు చేరిస్తే, అజ్ఞానం, అవిద్య అతడిని అధఃపాతాళంలో కూరుకుపోయేలా చేస్తాయి. అందుకే ముహమ్మద్ ప్రవక్త (స) విద్యావిజ్ఞానాలకు పెద్దపీట వేశారు. వయోభేదం కాని, వర్గభేదం కాని, స్త్రీపురుషులన్న లింగభేదం కాని లేకుండా అన్ని వయసులవారు, అన్నివర్గాలవారు, వర్ణాలవారు, స్త్రీలు, పురుషులు అందరూ విధిగా విద్యార్జన చేయాలని నిర్దేశించారు. ‘విద్య’ అంటే కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే కాదు. విద్య విజ్ఞానాన్ని నేర్పాలి.
మంచిచెడుల విచక్షణ తెలపాలి. నైతిక, మానవీయ విలువలు పెంపొందించాలి. మనుషుల్లో అజ్ఞానం దూరం కాకపోతే, మూర్ఖత్వం సమసిపోకపోతే, విలువలు వికసించకపోతే ఒక్కమాటలో చెప్పాలంటే, పరివర్తన రాకపోతే – ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు పుచ్చుకున్నా ఫలితం శూన్యం. అందుకే నైతిక, మానవీయ విలువలు నేర్వని విద్య విద్యే కాదన్నారు ప్రవక్త మహనీయులు.
విద్య ప్రాముఖ్యతను గురించి చెబుతూ ముహమ్మద్‌ప్రవక్త(స), షైతాన్ వెయ్యి మంది భక్తులను బురిడీ కొట్టించగలడేమో కాని, ఒక్క పండితుడి(జ్ఞాని)ని బోల్తా కొట్టించడం వాడి వల్ల కాదు’ అని ప్రవచించారు. ‘విద్యార్జన కోసం ఎంత దూరమైనా వెళ్లమని, భూమి చివరివరకైనా వెళ్లమని ఉపదేశిస్తూ, విద్యార్జన కోసం ఇంటి నుండి బయలుదేరినవాడు, తిరిగి వచ్చేవరకూ దైవమార్గంలో ఉంటాడని సెలవిచ్చారు.’ (టి ర్మిజీ, ఇచ్నెమాజ) ‘రాత్రివేళ ఒక గంట సమయాన్ని విద్యా సంబంధమైన చర్చల కోసం కేటాయించడం, ఆ రాత్రంతా (తెల్లవారేవరకు) దైవారాధన చేసిన దానితో సమానం’ అన్నారాయన.
హజ్రత్ అబ్దుల్లాహ్‌బిన్ అమ్రూ (రజి) ఉల్లేఖనం ప్రకారం:- ‘ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) మస్జిదెనబవికి వెళ్లినప్పుడు, అక్కడ రెండు బృందాలు విడివిడిగా సమావేశమయ్యాయి. ఒక బృందం… దైవారాధనలో నిమగ్నమై ఉంది. రెండో బృందం నిరక్షరాస్యులకు చదువు చెప్పే పనిలో ఉంది. అది చూసి ప్రవక్త మహనీయులు, ‘ఇరు బృందాలూ మంచిపని చేస్తున్నాయి. ఒక బృందంలోని సభ్యులు దైవారాధనలో ఉన్నారు. ఇది చాలా మంచిపని. అయితే దైవం తలిస్తే వారి ఆరాధన, వేడుకోళ్లు స్వీకరించవచ్చు, స్వీకరించకపోనూవచ్చు. రెండో బృంద సభ్యులు చేస్తున్న పని మొదటివారి కంటే ఇంకా ఉత్తమమైనది. ఎందుకంటే వీరు తెలియనివారికి జ్ఞానం, వివేకం, విచక్షణ తెలియచేస్తున్నారు. కనుక ఇది ఉత్తమకార్యం. నేనూ బోధకుడిగానే పంపబడ్డాను’ అని ప్రవచిస్తూ, ప్రవక్త రెండవ బృంద సభ్యులతో కూర్చున్నారు.
ఈ విధంగా ప్రవక్త (స) విద్యా విజ్ఞానాలకు అమితమైన ప్రాముఖ్యతనిచ్చారు. కనుక సమాజంలో నైతిక, మానవీయ విలువల పెంపుదలకు దోహదపడే విద్యావ్యవస్థ కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. లోపభూఇష్టమైన విద్యావ్యవస్థ స్థానే విలువలు వికసించే వ్యవస్థ కోసం ప్రవక్త ప్రవచనాల వెలుగులో ప్రయత్నిద్దాం.