అతిశయిల్లడం అన్ని రంగాల్లోనూ అనర్థానికి దారి తీస్తుంది. విద్యా రంగమయినా, వైజ్ఞానిక రంగమయినా, ఆర్థిక రంగ మయినా, ఆధ్యాత్మిక రంగమయినా, రాజకీయమయినా, రాజరికమయినా ఏదీ దీనికి అతీతం కాదు. సమతౌల్యత, సౌజన్యత, మధ్యేమార్గం అన్ని విధాలా శ్రేయస్కరం. సత్యాన్వేషణా దృష్టి, సత్యావిష్కరణ కృషి నేటి ముఖ్యావసరం. ఇవే సమాజాభ్యుదయానికి, దేశాభ్యున్నతికి ప్రాణం. యజమానులు వ్యక్తి శ్రమశక్తిని వస్తువుగా మార్చి కార్మికుల హక్కులను కొల్లగొట్టడం ఒక విపరీతం. సంతానం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, తల్లిదండ్రులు సంతాన సేవల్ని గుర్తించకపోవడం రెండూ విపరీతాలే. గురువు శిష్యుల శ్రేయాన్ని కోరకపోవడం, శిష్యులు గురువును గౌరవించకపోవడం రెండూ ప్రమాదకర విషయాలే. ధనం దైవ ప్రసాదితం కాదు, అది మా స్వయంకృషి ఫలితం అని శ్రీమంతులు అనుకోవడం, శ్రమను తమ నొసట వ్రాసిన శాపంగా పేదలు భావించ డం రెండూ విపరీత ధోరణులే. దీనికి భిన్నంగా ఉన్నవారు లేనివారి అవసరాల్ని గుర్తించి మానవత్వంతో వ్యవహరించగలిగితే సర్వత్రా సంతోషాలు సప్త రంగుల హరివిల్లై వెల్లివిరుస్తాయి. శ్రేయ సామరస్యాల పూలు విరబూస్తాయి. పరిశుద్ధ పోషకాహారాలు దేహపోషణకు ఎంత అవసరమో ఆరోగ్యకరమైన సాహిత్యం మేధో వికాసానికి అంతే అవసరం. అది మానవ మేధకు పదును పెట్టాలి. అయితే నేడు మార్కెట్‌లో లభించే చౌకబారు సాహిత్యం పాఠకులను పెడత్రోవ పట్టిస్తూ, ఊహాలోకాల్లో విహరింపజేస్తూ, క్రైం, సస్పెన్స్, సెక్స్, థ్రిల్లర్, హింస, విధ్వంసాలతో ఉత్కంఠ కలిగిస్తూ, క్షుద్ర విద్య, చేత బడులతో భయపెట్టుతూ పసలేని సమాచారాన్ని అందిస్తూ, తద్వారా పాఠకుల బలహీనతను సొమ్ము చేసుకోవడం అత్యంత విచారకరం! సాహిత్యం – అది ఎలక్ట్రానిక్ మీడియాకు చెందినదయినా, ప్రింటింగ్ మీడియాకు సంబంధించినదయినా, సినిమా రంగానికి సంబంధించినదయినా దాని మాధ్యమంతో డబ్బు కూడబెట్టుకోవాలనుకోవడంలో ఎవరి కారణాలు ఎలా ఉన్నా, తన స్వార్థం కోసం విష భావాలను విరజిమ్మడం, ధనార్జానార్థం ప్రజలను మరింత అజ్ఞానాంధకారాల్లోకి నెట్టడం ముమ్మాటికీ ఖండించదగిన విషయమే. మంచిని చేయడం సాధ్యం కాదనుకునే కుమతులు చెడు చేసే హక్కు కూడా తమకు లేదన్న విషయాన్ని గ్రహించాలి. కోరికలు మానవ సహజాంశాల్లోని ఓ భాగమే కావచ్చు. అయితే అవి శ్రుతి మించకుండా ఉండేటట్లు చూసుకోవడం నేటి అవసరం. దక్షిణాఫ్రికా గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యాచారానికి గురువుతున్న మహిళల సంఖ్య అక్కడ ఎక్కువ. ఎయిడ్స్ మహమ్మారి విజృంభణ కూడా అక్కడే అధికం. దక్షిణాఫ్రికా తర్వాత స్థానం భారత దేశానిదేనన్నది విశ్లేషకుల అంచనా. అంటే ఇక్కడ కూడా ‘సెక్సువల్ హెరాస్మెంట్’, మరియు లైంగిక అత్యాచార బాధితుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లే కదా! ఈ విపరీత ధోరణి వెరసి భవిష్యత్తులో ఎయిడ్స్ రోగుల సంఖ్యను గణనీయంగా పెంచే ప్రమాదం లేకపోలేదు. అలాగే ఈనాడు విదేశాల్లో నివసించడం, విదేశాల్లోనే విద్యనార్జించడం ఉన్నతమైన నాగరికతగా పరిగణించబడుతోంది. ఆంగ్ల భాషాభ్యసనాన్ని నవనాగరికతకు చిహ్నంగా భావించబడుతోంది. ఆంగ్లంలో మాట్లాడితే ‘గౌరవం’ అన్న వెర్రి ప్రబలు తోంది. కొందరయితే మాతృభాషలో కాకుండా ఆంగ్లంలోనే ఆలోచించే స్థాయికి ఎదిగి (?) పోయారు. అలా అని ఆంగ్ల భాషను తక్కువ చేసి చూపడం మా ఉద్దేశం కానేకాదు. భాషలన్నీ దైవం ప్రసాదించినవే. ఏ భాష ప్రాముఖ్యత ఆ భాషకుంటుంది. కానీ మాతృభాషను విస్మరించటం విపరీతం. ఇవి, ఇటువంటి అనేక రుగ్మతలు నాగరికతగా, మనిషి స్వేచ్ఛకు సంపూర్ణ రూపాలుగా ఎంచబడుతున్నప్పుడు, ప్రకృతి వైద్యం తప్పనిసరి అవుతుంది. అనాదిగా ఆ ప్రకృతి వైద్యాన్ని అందిస్తూ, మానవాళిని సకల రుగ్మతల నుండి కాపాడుతూ వస్తున్న వైద్యుల్లో అంతిమ వైద్యుడు మహా ప్రవక్త ముహమ్మద్ (స). ఆయన రాకతో అనంత మానవ ప్రపంచంలో ఝంఝా మారు తాలు ప్రవేశించాయి. ఆయన తన సునిశిత, సౌజన్య, సుశీల ప్రవర్తనతో, శక్తివంతమైన ప్రబోధనంతో మానవ సమాజంలో మహా గొప్ప నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని తెచ్చారు. నేటి మానవ సమాజపు సకల రుగ్మతల నివారణోపాయం ఆయన ఆదర్శ జీవితంలోనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది వినా మార్గాంతరం కూడా లేదు. ఆ మాటకొస్తే ఆయన ప్రభవనానికి గల కారణం కూడా అదే- ”ఆ ప్రవక్త (ముహమ్మద్ (స)) మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు. చెడుల నుండి వారిని వారిస్తాడు. పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం (హలాల్)గా ప్రకటిస్తాడు. అశుద్ధమయిన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారిపై ఉన్న (అనవసర ఆంక్షల) బరువును దించుతాడు. వారికి వేయబడిన ఉన్న సంకెళ్ళను త్రెంచుతాడు (ఇదే ఆయన ప్రభవనానికి కారణం). కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, ఆయనకు ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా అతనితోపాటు పంపబడిన జ్యోతి (ఖుర్‌ఆన్)ని అనుసరిస్తారో వారే నిజ సాఫల్యవంతులు”. (అల్ ఆరాఫ్: 157)