విజన్‌…!

Originally posted 2013-06-03 07:03:15.

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
మనో నేత్రం
విజన్‌.! !1
దార్శనికత…!!
కల…!!! ….
రూయత్‌…!!!!
  మానవుడు పుడమిపై పాదం మోపిన నాటి నుంచి నేటి వరకూ – సర్వకాల సర్వావస్థల్లో- తన భవిష్యత్తుపై ‘కలలు’ కంటూనే ఉన్నాడు. నేటి గ్లోబలైజేషన్‌ యుగంలో ఈ విజన్‌ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక సగటు మనిషి మొదలుకుని సూపర్‌మాన్‌ వరకు, చిట్టిపొట్టి ప్రాంతీయ సంస్థల నుండి జాతీయ అంతర్జాతీయ సంస్థల వరకూ – ప్రతి ఒక్కరూ అందమైన, ఉజ్వలమైన భవిష్యత్తును దర్శిస్తున్నారు. బ్లాక్‌ బోర్డు నుండి పవర్‌ పాయింటుల వరకూ అందుబాటులో ఉన్న ప్రతి ప్రచార, ప్రసార సాధనం ద్వారా తమ కలల ప్రపంచాన్ని చూపించి, అనుచర గణాన్ని తన్మయుల్ని చేస్తున్నారు.
  విజన్‌ విద్యా విషయకమైనా, ఆర్థికమైనదైనా, వైజ్ఞానికమైనదైనా, ఆధ్యాత్మికమైనదైనా – మనిషి కలలు కనటం తప్పు కాదు. పైగా కల గనటం అతని జన్మ హక్కు. కాని అది కేవలం తియ్యని కల కారాదు. మనిషికి తన విజన్‌పై నిబద్ధత ఉండాలి. దృఢ నమ్మకం ఉండాలి. వజ్ర సంకల్పం ఉండాలి. విజన్‌ (కల)ని కేవలం చర్మ చక్షువులతో వీక్షిస్తే సరిపోదు. దానికి మనో నేత్రం కూడా కావాలి. తాను వల్లించే నీతి సూత్రాలు, తాను రచించే భవిష్యత్ప్రణాళికలు తన విజన్‌ (దార్శనికతా) చట్రంలో సరిగ్గా ఇమిడిపోతాయో లేదో ఆలోచించి అర్థం చేసుకునే మనోమస్తిష్కాలు కూడా ఉండాలి. దాంతోపాటు అందమైన తన స్వప్నాన్ని సాకారం చేసుకోవటానికి సకారాత్మకమైన వైఖరిని అవలంబించాలి. అన్యులకు హానికరం కాని మార్గాన్ని ఎంచుకోవాలి. సవ్యమైన, సత్యబద్ధమైన దిశలో సాగిపోయేలా దిశా నిర్దేశం చేెసుకోవాలి.
  ప్రవక్తలు, మునులు, మహాత్ముల నుండి నియంతలు నిరంకుశ చక్రవర్తుల వరకు – అందరూ కలలుగన్నవారే! కాని తమ కలలను నిజం చేసుకోవటానికి వారు అవలంబించిన విధానాలు మాత్రం విభిన్న రీతుల్లో ఫలించాయి. జర్మనీలో పుట్టిన నాజిజంకైనా, ఇటలీలో ఉద్భవించిన ఫాసిజంకైనా విజన్‌ లేకపోలేదు. హిట్లర్‌, ముస్సోలినీ దొరలు కూడా కలలు గన్నవారే. వారిలోనూ దార్శనికత ఉండేది. కాని ప్రపంచంలోని ఇతర మానవ జాతులన్నింటినీ తుదముట్టించి తమ జాతికి మాత్రమే పట్టం కట్టాలన్న వారి జాత్యాహంకార బుద్ధి బెడిసి కొట్టింది,  చివరికి పరాభవాన్నే మిగిల్చింది.
  అయితే దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ నిమిత్తం నడుం బిగించిన మహాత్ముల, లోక కళ్యాణార్థం ప్రభవించిన ప్రవక్తల దార్శనికత (విజన్‌) తద్భిన్నంగా ఉంటుంది. ఈ మహనీయులు తరం తరం….. నిరంతరం తమ విజన్‌ (ఖీరిరీరీరిళిదీ) ని సత్య నిబద్ధతతో దర్శిస్తారు. వారు ఓటమిలోనూ విజయాన్ని వీక్షిస్తారు. దాన్ని చేరుకోవటానికి అహరహం శ్రమిస్తారు. దాని కోసం తమ మూల విరాట్టునే ఆశ్రయిస్తారు. మౌలిక విలువలనే అవలంబిస్తారు.
  మక్కా సర్దారులు ప్రకటించిన పారితోషికానికి ఆశపడి – మదీనాకు మహా ప్రస్థానం చేస్తున్న ముహమ్మద్‌ (స)ను వెంబడించిన వారిలో సురాఖా బిన్‌ మాలిక్‌ ముఖ్యుడు. నేలలో కూరుకుపోతున్న తన గుర్రాన్ని చూసి అతను భయకంపితుడైపోయి, తనను క్షమించమని ప్రవక్తను ప్రాధేయపడినపుడు  ఆ కారుణ్యమూర్తి (స) ఏమన్నారో తెలుసా!? ”ఓ సురాఖా! కిస్రా (ఈరాన్‌) సింహాసనాధిపతి తొడిగే మణిఖచిత) కంకణాలు నీ చేతికి తొడిగించబడిన నాడు నీ వైభవం ఎలా ఉంటుందో ఊహించుకో!” – ఇదీ విజన్‌ అంటే!
  సామాన్యుల విజన్‌కి – మహనీయుల విజన్‌కి మధ్య గల వ్యత్యాసం ఇదే మరి! కిస్రా వజ్ర వైఢూర్యాలు దేశ దిమ్మరులయిన అరబ్బుల పాదాక్రాంతమవటానికి, సురాఖా చేతికి కిస్రా కంకణం తొడగటానికి అట్టే కాలం పట్ట లేదు.
 హుదైబియా ఒడంబడిక జరిగినపుడు ప్రవక్త ప్రియ సహచరులు ఒకవైపు అవమానభావంతో, ఉక్రోషంతో ఊగిపోతుంటే, మరో వైపు మహాప్రవక్త (స) నిశ్చింతగా, నిక్షేపంగా ఉండటం కూడా ఒక వింతగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్షణాల్లో ఆ మహనీయుని ముందున్న విజన్‌ని సామాన్యులు దర్శించలేరు. ఎందుకంటే – లఖద్‌ సదఖల్లాహు రసూలహుర్రూయా బిల్‌ హఖ్ఖి (ఖచ్చితంగా అల్లాహ్‌ తన ప్రవక్తకు సత్యంతో కూడిన విజన్‌ని చూపించాడు).
  వర్గ తెగల విష కోరల్లో నలిగిపోతున్న అరేబియా ద్వీపం భవిష్యత్తుపై అదీ బిన్‌ హాతిమ్‌ ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు ఆ మహా మనీషి (స) చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో చెప్పిన సమాధానాల్లో ఒకటి ఇలా ఉంటుంది – ”ఓ అదీ! నువ్వే చూద్దువుగాని! ఒక రోజు రానున్నది – అప్పుడు హజర్‌మౌత్‌ (యమన్‌)))))000 నుండి ఒంటరిగా బయలుదేరిన ఒక స్త్రీమూర్తి మక్కా వరకు నిక్షేపంగా వచ్చి కాబా తవాఫ్‌ చేసి వెళుతుంది. ఆమెకు తన ధన, మాన ప్రాణాల గురించి ఎలాంటి భయం ఉండదు”. ఈ విధంగా ఆ మహోపకారి చెప్పిన ప్రతిదీ అక్షరాలా నెరవేరినది. ప్రపంచంలో మానవత్వం పరిఢవిల్లింది.
అవును. మనిషికి దార్శనికత (విజన్‌) అవసరమే. అయితే దాన్ని సాకారం చేసుకోగోరేవారు మనసున్న మనుషులుగా మారాలి. విజన్‌ని నిశ్చిత జ్ఞానంతో చూడగలిగే నిబద్ధత కూడా ఉండాలి. విజన్‌ కోసం కేవలం రెండు నేత్రాలు సరిపోవు, దాన్ని వీక్షించడానికి మనిషికి ‘మూడో కన్ను’ కూడా కావాలి. అదే మనో నేత్రం (బసీరత్)!

Related Post