Main Menu
قناة الجامع لعلوم القرآن - Al-Jami' Channel for Quranic Sciences

నమ్మక ద్రోహం నష్టదాయకం

విశ్వాసులారా! (వాస్తవం తెలిసి కూడా) మీరు అల్లాహ్ కు , ఆయన ప్రవక్తకు ద్రోహం తలపెట్టకండి. మీకప్పగించబడే బాధ్యతల (అమానతుల, అప్పగింతలు) విషయంలో కూడా ద్రోహబుద్ధితో వ్యవహరించకండి. మీ సంతానం, సిరిసంపదలు మీ పాలిట పరీక్షా సాధనాలని గుర్తుంచుకోండి. మీకోసం అల్లాహ్  దగ్గర ఇంతకంటే ఎంతో గొప్పప్రతిఫలం ఉంది. (అల్-అన్ఫాల్: 27-28)  

ఖియానత్ అర్థం: ఇబ్న్ మన్‌జూర్ తన లిసాన్ అల్-అరబ్ లో ఇలా అన్నారు: “అల్-ఖవ్న్ అంటే – ఒక మనిషి  మనల్ని  నిజాయితీగా ఉండకపోవడం. అతనికి  ద్రోహం చేయడం. ఒకరికి మన మీద  విశ్వాసాన్ని వమ్ము చేయడం, నమ్మకాన్ని  నాశనం చేయడం.”

ఇమామ్ కుర్తుబీ (రహ్.) తన తఫ్సీర్‌లో అన్నారు: “ఖియానత్ అంటే ద్రోహం చేయడం, ఒక విషయాన్ని  దాచిపెట్టడం.”

ఉదాహరణకు: అల్లాహ్ కు  (మానవుల) దొంగ చూపులు, చూపుల చౌర్యాన్ని,  (వారి) హృదయాల్లో దాగిన రహస్యాలు సైతం తెలుసు. అల్లాహ్  న్యాయంగా, నిష్పక్షపాతంగా తీర్పు చేస్తాడు. (అల్-మోమిన్: 19) 

అలాగే ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా ప్రార్థించేవారు:  “అల్లాహ్! నేను ఆకలి బాధ నుండి నీ శరణు కోరుతున్నాను, అది అత్యంత చెడు తోడు. అలాగే నేను ద్రోహం నుండి నీ  శరణు కోరుతున్నాను, అది అత్యంత చెడు ఆత్మ బంధువు.” (నసాయి)

ద్రోహం  అనేది చాలా చెడ్డ  దుర్లక్షణం, అంటే మనసులో దాచుకున్న దమన నీతి. దహన ప్రీతి.  ద్రోహం మరియు ఆకలి అనే రెండు విషయాలు ఒక వ్యక్తిని బలహీనుడిగా మారుస్తాయి. అవి కలిసి వుంటే, అవి వ్యక్తిని పూర్తిగా ఆక్రమించేస్తాయి, స్నేహితుల్లా, జతలుగా ఉంటాయి. ఒకటి మనిషిని భౌతికంగా నాస్నమ్ చేస్తే ఒకటి నైతికంగా అతన్ని నాశనం చేసుతుంది. కావున వాటి నుంచి రక్షణ కోసం ప్రార్థించాలి, ఎందుకంటే అవి మనిషి మతిని, గతిని గాడి తప్పేలా చేస్తాయి.

అమానత్ మే ఖియానత్ హో రహీ హై – సలీఖే  సే తిజారత్ హో రహీ హై

నహీం మహ్‌ఫూజ్ కోయీ అప్నే ఘర్ మే – మగర్ ఘర్ కీ హిఫాజత్ హో రహీ హై

హమ్‌నే ఖూన్ సే సీంచా వతన్ కో – హమ్‌సే ఫిర్ షికాయత్ హో రహీ హై

బజాహిర్ మిల్ రహే హైం సబ్ సభీ  సే – మగర్ అందర్ బఘావత్ హో రహీ హై

ఖియానత్, అమానత్‌కు విరుద్ధం.

ఇమామ్ రాగిబ్ (రహ్మ) వ్యాఖ్యానించారు: “ఖియానత్ మరియు నిఫాక్ రెండూ దగ్గర దగ్గరగా ఉంటాయి. కానీ ఖియానత్ అనేది ఒప్పందాలు, అమానత్‌లకు సంబంధించినది. నిఫాక్ అనేది మత విషయాల్లో వాడబడుతుంది. రెండూ కలిసిపోయే సందర్భాలు ఉంటాయి. ఖియానత్ అంటే – రహస్యంగా ఒప్పందాన్ని ఉల్లంఘించడం. దీని విరుద్ధం అమానత్.”

దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారి ఉత్తమ ప్రవర్తనను మెచ్చి  జాతి జనం ఇచ్చిన బిరుదు అమీన్ – సఛ్చిలుడు, సకల సుగుణ సంపన్నుడు. మేలు మాత్రమే చేసేవాడు. కీడు అస్సలు చేయనివాడు.

ఖియానత్ అనేది అమానత్‌కు పూర్తి విరుద్ధం. ఇది మనిషిలో  విశ్వాస లోపానికి ప్రబల తార్కాణం. ఇతరుల హక్కులను  ధన, మాన  గౌరవం, రహస్యాలు విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం, నాశనం చేయడం లేదా బయట పెట్టడం.

ఇమామ్ జాహిజ్ అన్నారు: “ఖియానత్ అంటే – ఒక మనిషి తన వద్ద భద్ర పరచిన ధనం, గౌరవం, రహస్యాలను వాడేసుకోవడం, వాటిని తిరస్కరించడం, రహస్య వార్తలను దాచిపెట్టడం లేదా సందేశాలను వక్రీకరించడం.”

ఖియానత్  ఘోర పాపం (కబీరా గునాహ్)

ఇమామ్ జహబీ (రహ్.) ఖియానత్‌ను కబీరా పాపాలలో చేర్చారు. ప్రవక్త ﷺ అన్నారు: మునాఫిఖ్ (కపటి)  లక్షణాలు మూడు: మాట్లాడితే అబద్ధం చెబుతాడు, మాట ఇస్తే  నిలబెట్టుకోడు, ఏదైనా అప్పగిస్తే  ద్రోహం చేస్తాడు.” (బుఖారీ, ముస్లిం)

అలాగే మరొక హదీసులో ﷺ చెప్పారు: “ఎవరు నీకు అమానత్ ఇచ్చారో వారికి అది తిరిగి ఇవ్వు. నీకు ద్రోహం చేసినవారికి కూడా నీవు ద్రోహం చేయవద్దు.” (తిర్మిజీ)

ఇమామ్ జహబీ ఇలా  అన్నారు: “ఖియానత్ పూర్తి నష్టదాయకమైనది. కొన్ని ఖియానత్‌లు మరింత ఘోరమైనవి. చిన్న మొత్తంలో మోసం చేయడం ఒకటైతే, భార్యాభర్తల హక్కులు లేదా పెద్ద ఆస్తుల్లో ద్రోహం చేయడం ఇంకా పెద్ద నేరం.”

అబూ బక్ర్ అస్-సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అత్యంత  తెలివైనవాడు ఎవడంటే – భయభక్తితో జీవించేవాడు. అత్యంత మూర్ఖుడు ఎవడంటే – పాపాలకి బానిసైనవాడు. అత్యంత నిజాయితీపరుడు, సత్యవం తుడు ఎవరు  అంటే –  అమానత్ ని కాపాడేవాడు. అత్యంత  జుగుప్సయాకరమైన  అబద్ధం ఏమిటంటే అంటే – ద్రోహం చేయడం.”

దేశ  ద్రోహం

ఎవరైనా వ్యక్తి విదేశీ దేశ ప్రయోజనాలను కాపాడుతూ, తన దేశ ప్రయోజనాలను త్యజిస్తే, అది మహా ద్రోహం అవుతుంది. ఇది దేశ భద్రత, రాజకీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుంది. వీరి ఉద్దేశ్యం – దేశంలో విధ్వంసం, గందరగోళం, అశాంతి సృష్టించడం, శత్రువులకు అనుకూల వాతావరణం కల్పించడం.

“ఒక జాతి నుండి ద్రోహం అనుమానం కలిగితే, వారితో ఒప్పందాన్ని స్పష్టంగా రద్దు చెయ్యి. ఎందుకంటే అల్లాహ్ ద్రోహులను ప్రేమించడు.” [అల్-అన్ఫాల్: 58]

ఖియానత్ గురించి  ప్రవక్త ﷺ హెచ్చరిక

ఇమ్రాన్ బిన్ హుసైన్ (ర.అ): ప్రవక్త ఇలా అన్నారు: “ఉత్తములు నా తరం, తరువాత వారిని అనుసరించేవారు, తరువాత వారిని అనుసరించేవారు. తరువాత ఒక ఓ తరం వస్తుంది: సాక్ష్యం అడగకపోయినా ఇస్తారు, నమ్మకం  పెట్టుకుంటే  ద్రోహం చేస్తారు, మొక్కుబడి చేసుకుంటే  నెరవేర్చరు, వారిలో మాంసం, కొవ్వు  పెరుగుతుంది.” (ముత్తఫఖ్ అలైహి)

అబూ హురైరా (ర.అ): ప్రవక్త ఇలా అన్నారు:“ప్రజలపై మహా మోసపూరిత దశ ఒకటి వస్తుండి. అప్పుడు –  అబద్ధాన్ని నమ్ముతారు, నిజాన్ని తిరస్కరిస్తారు, ద్రోహిని నమ్ముతారు, నమ్మకస్థుడిని అనుమానిస్తారు. రువైబిదా మాట్లాడతాడు.” సహాబాలు అడిగారు: “రువైబిదా అంటే ఎవరు?” “సామాజిక వ్యవహారాలలో జోక్యం చేసుకునే తక్కువ విలువైన వ్యక్తి.” (ఇబ్ను మాజహ్) ప్రతోడు వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తాడు.

అబూ హురైరా (ర.అ): ప్రవక్త ఇలా అన్నారు: “ఎవరైనా నా మీద నేను చెప్పని మాటలు కల్పిస్తే, అతని స్థానం నరకంలో ఉంటుంది. ఎవరు జ్ఞానం లేకుండా ఫత్వా ఇస్తే, దాని పాపం అతనిపైనే ఉంటుంది. ఎవరు తన సోదరుడు సలహా అడిగితే, తప్పుడు  సలహా ఇస్తే, అతను అతనికి ద్రోహం చేసినట్లే.” (సహీహ్ అల్-జామిఉస్ సగీర్)

అబూ సయీద్ (ర.అ): ప్రవక్త ఇలా అన్నారు: “ప్రతి ద్రోహికి రేపు ప్రళయదినాన   ఒక జెండా ఎత్త బడుతుంది. అతని ద్రోహం ఎంత ఎక్కువ ఉంటే, జెండా అంత ఎత్తుగా ఉంటుంది. వినండి! ప్రజల నాయకుడైన వ్యక్తి చేసే  ద్రోహి కంటే పెద్ద ద్రోహం ఏదీ  లేదు.” (ముస్లిం)

నమ్మక ద్రోహం అవతలి వారికే కాదు,నమ్మక ద్రోహానికే పాల్పడే వారికి కూడా అపాయకరమే.మనం ఎదుటి వారిని ఏమి చేస్తామో అంతకు మిక్కిలి మనకు సంక్రమించి తీరుతుంది- కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేస్తే నువ్వు దొంగ కన్నా ప్రమాదకారివి.

అబూ హుమైద్ అస్సాఇది (ర.అ): ఒక సాహాబి సదఖా వసూలు చేసి వచ్చి అన్నాడు: “ఇది మీకోసం, ఇది నాకు బహుమతి.” ప్రవక్త ఇలా అన్నారు: “ఎందుకు మనం ఒకరిని పనికి పంపితే, అతను తిరిగి వచ్చి -ఇది మీ కోసం, ఇది నాకు బహుమతి అని? అతను తన తండ్రి ఇంట్లో కూర్చోమనండి, బహుమతి ఎలా వస్తుందో  చూద్దాం! ముహమ్మద్ ప్రాణం తన చేతిలో ఉన్న అల్లాహ్‌ మీద ప్రమాణం, మీలో ఎవరు ఏదైనా దాచుకుంటే, ప్రళయ దినాన   దానిని తన మెడపై కుంటూ –   అది ఒంటె అయితే దాని అరుపుతో, ఆవు అయితే దాని అరుపుతో, గొర్రె అయితే దాని మేకపోతు శబ్దం చేస్తూ వెళ్తాడు.” తర్వాత ఆయన చేతులు ఎత్తి మూడు సార్లు అన్నారు: “ఓ అల్లాహ్! నేను (సందేశాన్ని) చాటిచెప్పాను కదా?” (బుఖారీ, ముస్లిం)

అమానత్‌ – ఓ  పవిత్రమైన బాధ్యత

ఇబ్ను మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం-  ఇమామ్ అహ్మద్ (అల్-జుహ్ద్, ముస్నద్) మరియు బయ్యహఖీ వర్ణించిన హదీథులో ఆయన ప్రవక్త (స) ఇలా  అన్నారు: “అల్లాహ్ మార్గంలో పోరాడుతూ చనిపోయిన వ్యక్తి  అన్ని పాపాలు క్షమించబడతాయి. కానీ అమానత్ మాత్రం మన్నించబడదు. తరువాత ఆయన వివరించారు:“ఒక బానిసను ప్రళయ దినాన  తీసుకువస్తారు. అతను అల్లాహ్ మార్గంలో పోరాడి చనిపోయినవాడే. అప్పుడు అతనితో చెబుతారు: నీకు అప్పగించబడిన  అమానత్‌ను తిరిగి ఇవ్వు!  అతను చెబుతాడు: ఓ ప్రభూ! నేను ఎలా తిరిగి ఇస్తాను? ఇహలోకం పోయింది కదా! అప్పుడు – ఇతన్ని హావియాలో (నరకంలో) పడేయండి. అతనికి తన అమానత్, అప్పగించిన రోజు ఉన్న రూపంలో కనబడుతుంది. దాన్ని చూసి అతను గుర్తిస్తాడు, దాని వెనకపడి భుజానెత్తుకొని  తీసుకుపోతాడు. నరకాగ్ని నుండి బయట పడతానని అనుకున్నప్పుడు అది జారి పోతుంది. మళ్లీ దాని వెనక పడతాడు. ఇలా  ఆ ప్రక్రియ నిత్యం  కొనసాగుతూనే ఉంటుంది.”  తర్వాత ఆయన అన్నారు: “నమాజు ఒక అమానత్, వుజూ  ఒక అమానత్, కొలతలు ఒక అమానత్, తూకాలు    కూడా ఒక అమానత్ . ఇంకా ఆయన కొన్ని విషయాలను లెక్కపెట్టారు. వాటిలో అత్యంత భారమైనది వదాయె (అప్పగించిన వస్తువులు).”

ఇరవై ఏళ్ల  వయసులో మస్జిద్ కి  పోకుంటే దోషం…  అరవై ఏళ్ల దాటాక ప్రార్థనాలయానికి పొవాలాంటే ఆయాసం. ఆశ పేరాశల ఊగిసలాడే ఈ జీవితంలో అన్ని దశలు  దాటి దాటి ఆయాస దశ దాపురించకముందే యువత వారిలోని ఈ దోష సవరణ, దైవ  ద్రోహ నివారణ చేసుకోవాలి. అర్థం అయ్యేలా చెప్పాలంటే  ప్రతి రోజు అల్లాహ్ సమక్షంలో వెళ్లి ఉదయం సాయంత్రాలు  సాక్ష్యం ఇచ్చే దైవ దూతలు; వీడు గొప్ప నమాజీ  అనాలేగానీ మహా చెడ్డ నమ్మక ద్రోహీ, నమాజు దొంగ  అనకూడదు. 

👉 జాధాన్ (రహ్మ) అన్నారు: “నేను బరా ఇబ్ను ఆజిబ్ (ర.అ) వద్దకు వెళ్లి అన్నాను: ఇబ్ను మసూద్ చెప్పినదానిని మీరు విన్నారా? ఆయన చెప్పారు: అవును, నిజమే. మీరు అల్లాహ్ వాక్యం వినలేదా? –

“అల్లాహ్ మీకు అమానతులు వాటి యజమానులకు తిరిగి ఇవ్వమని ఆజ్ఞాపిస్తున్నాడు.” [అన్-నిసా: 58]

మరొక హదీథ్ ఖైస్ ఇబ్ను సఅద్ ఇబ్ను ఉబాదా (ర.అ) అన్నారు: ‘మక్ర్ (కుట్ర), ఖిదా (మోసం) నరకంలో ఉన్నాయి’ అని  “ప్రవక్త ﷺ వారిని చెబుతూ  నేను విని ఉండక పోయుంటే – నేను మహా మోసగాళ్లలో ఒకడినయ్యేవాడిని.” (ఇది సహీహ్ అని అల్-అల్బానీ నిర్ణయించారు).

ఖియానత్ (ద్రోహం) రూపాలు

“ఖియానత్” అనే పదం మనసులోనే భయానకమైన భావనను కలిగిస్తుంది. దానిని విన్న వెంటనే ద్రోహం, కుట్రలు, హత్యలు, గూఢచర్యం మొదలైనవి గుర్తుకు వస్తాయి. కానీ ప్రజలు చిన్నచిన్న విషయాల్లో కూడా ఖియానత్ చేస్తుంటారు. వాటిని వారు తక్కువగా భావిస్తారు. కాని వాస్తవానికి అవి అత్యంత ప్రమాదకరమైనవే.

ఖియానత్ రకాలు:

ధర్మ ద్రోహం: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ﷺ యెడల  ఖియానత్ – హద్దులను అతిక్రమించడం, ఫరాయిద్‌ను వదలిపెట్టడం,ముహర్రమాత్లను, నిషేధిత విషయాలకు తెగబడటం. 

దేశ ద్రోహం:  దేశ ద్రోహులతో,  శత్రువు సైన్యాలతో  స్నేహం చేయడం, వారిని ప్రోత్సహించడం, వారితో రహస్య సఖ్యతను కలిగి ఉండటం.

కుటుంబ ద్రోహం:  భార్యాభర్తల రహస్యాలను బయటపెట్టడం. వెనుక మార్గం గుండా ఇంటి వారికి తెలియకుండా దూరడం, లేదా గోడెక్కి దూకడం.

మిత్రద్రోహంనమ్మకస్థుడే నమ్మకద్రోహి! నమ్మించి గొంతు  కోయడం. తడి గుడ్డతో గొంతు కోయడం. తేనే పూసిన కత్తి  – తియ్యగా మాట్లాడుతూ మనకెంతో ఉపకారి అని నమ్మించి అపకారం తలపెట్టడం. తేనె పూసిన కత్తి: అంటే, ఒక వ్యక్తి బయట నుంచి తీయ్యగా, మృదువుగా మాట్లాడుతూ, లోపల కుట్రలు, మోసం లేదా దుష్ట ఆలోచనలు కలిగి ఉంటారు. వీరి మాటలు తేనెలా తీయ్యగా ఉన్నా, వారి ఉద్దేశ్యం మాత్రం ప్రామాదకరంగా ఉంటుంది.

ఏక్ హమ్ సఖావత్ మే ఘర్ కా ఘర్ లుటా బైఠే

ఏక్ వో ఖియానత్ సే అప్నా ఘర్ సజా బైఠే

దీన్నే తడి గుడ్డతో గొంతు కోయడం అంటారు.. తడి గుడ్డతో గొంతు కోయడం అసాద్యం: అలాంటి దుర్మార్గపు పనులను గుట్టు చప్పుడు కాకుండా చేసేసి ఏమి ఎరగనట్టు వుండె వారిని గురించి ఈ సామెత పుట్టింది. వీడు తడి గుడ్డతో గొంతు కోసె రకం అని అంటారు. కత్తితో గొంతు కోస్తే అందరికీ తెలుస్తుంది. కానీ తడిగుడ్డతో గొంతు కోస్తే ఎవరికి తెలియదు. అందుకే ఈ సామెత పుట్టింది.

వ్యాపారంలో ద్రోహం:  తప్పుడు లావాదేవీలు, తూకం-కొలతల్లో మోసం, హరామ్ లాభాలు.

సభా  ద్రోహం:   సమావేశాల్లో చెప్పిన విషయాలను బయటపెట్టడం.

జ్ఞాన ద్రోహం:  అల్లాహ్ వాక్యాన్ని వక్రీకరించడం, తెలియనిది చెప్పడం, లేదా అల్లాహ్ అవతరింపజేసిన జ్ఞానాన్ని దాచిపెట్టడం.

అప్పగింతాల్లో ద్రోహం:  అప్పగించిన వస్తువులను తిరిగి ఇవ్వకపోవడం, ధ్వంసం చేయడం, ఆలస్యం చేయడం.

శిక్షణలో ద్రోహం:  పిల్లలకు సుశిక్షణ ఇవ్వకపోవడం.  వారి హక్కులను రక్షించకపోవడం.

స్వామి ద్రోహం:  ఎవరైనా తమకు సేవ చేసిన లేదా అధికారం ఇచ్చిన వ్యక్తి పట్ల ద్రోహం లేదా విశ్వాసఘాతుకానికి పాల్పడటం. సాధారణంగా, తమను ఆదుకున్న, పోషించిన లేదా గురువుగా భావించిన వ్యక్తికి హాని కలిగించడం, నమ్మకద్రోహం చేయడం లేదా వారికి వ్యతిరేకంగా వెళ్లడం. ఇందులో ముఖ్యంగా భార్య భర్తను మోసగించడం.

మేరాజ్‌ సందర్భంగా ప్రవక్త (స) పలు సామాజిక రుగ్మతలు, చెడు లక్షణాలకు లభించే శిక్షల్ని కూడా వీక్షించారు. వాటిలో సమాజాన్ని, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అక్రమ సంబంధ శిక్షలూ ఉన్నాయి. అక్రమార్కులకు పడే శిక్షలూ ఉన్నాయి, వడ్డీ వ్యాపారు నడ్డీ ఎలా విరగ్గొట్టబడతుందో కూడా ఉంది. పరాయి వ్యక్తి సంతానాన్ని తన భర్తసంతానంగా నమ్మించే స్త్రీ పడే దండన వివరాలూ ఉన్నాయి. నీతులు చెబుతూ నీచంగా బ్రతికే వారి దుర్గతి దృశ్యాలూ ఉన్నాయి. ఇవి మనిషికి ఇహపరాల్లో ఎంత హాని చేస్తాయో ఈ సందర్భంగా తెలుపడం జరిగింది.

లౌక్యం పేరిట అబద్దాలు చెప్పేవారు కూడా తాము నిజాయితీ పరులం అనుకుంటారు. ఎక్కువ లంచం పుచ్చుకునే వ్యక్తితో పోల్చుకుంటూ తక్కువ లంచం తీసుకునే వ్యక్తి కూడా తాను మంచివాడినే అనుకుంటాడు. బయట చప్టా మీద కూర్చుని వీరింటి కోడలి గురించి, వారింటి అమ్మాయి గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా తాము మాత్రం సచ్చీలురమనే అనుకుంటారు.

ఇమామ్ అల్-ధహబీ  అన్నారు:“ఖియానత్ అన్నింటిలోనూ నిందనీయమే. కానీ కొన్నివి మరింత ఘోరమైనవి. ఒక పైసాలో మిమ్మల్నిద్రోహం తలపెట్టే వాడు, మీ కుటుంబంలో ద్రోహానికి పాల్పడేవాడితో  సమానంకాడు.”

ద్రోహులుగా చరిత్రలో చెడ్డపేరు తెచ్చుకున్నవారు

సుదీర్ఘ మానవ చరిత్రను తిరగేస్తే , ద్రోహం చేసినవారి ఉదాహరణలతో చరిత్ర పుటలు  నిండిపోయి ఉండటం గమనిస్తాము. ముఖ్యంగా ముస్లిం సమాజపు పూర్వాపరాల్ని  పరిశీలిస్తే – ప్రతి కోణంలోనూ ద్రోహపు మచ్చ కనిపిస్తుంది. కొన్నిసార్లు శత్రువుల నుండి, మరికొన్ని సందర్భాల్లో స్వంత వారిలో నుండే. . ఎందుకంటే శత్రువులు బయట నుండి దెబ్బతీయలేకపోతే, లోపల నుండే ద్రోహపు విత్తనాలు నాటి, ఆ శరీరాన్ని లోపల్నుంచి క్రమంగా నాశనం చేస్తారు. 

·        ప్రవక్త ముహమ్మద్ ﷺ వారిని యూదులు విష ప్రయోగంతో చంపాలని చూశారు.

·        ఉమర్  (ర) గారిని  ఒక మజూసీ (అబూ లూలూ) హత్య చేశాడు.

·        ఉస్మాన్ ర) గారిని  ద్రోహుల చేతిలో  బలి అయ్యారు.

·        బిఅర్ మవూనా వద్ద డెబ్బై మంది ఉత్తమ సహాబా ద్రోహం వల్ల హతమయ్యారు.

ప్రవక్త ﷺ ఇలా హెచ్చరించారు: “ప్రళయం రాకముందు మనిషి తన పక్కన కూర్చున్న వాడినీ నమ్మలేని స్థితి వస్తుంది…” ద్రోహం అన్నది అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల్లో జరిగింది. యుద్ధ సమయాల్లో మరింత తీవ్రతరమవుతుంది.

ప్రసిద్ధ ద్రోహులలో కొందరు

1. అబూ రిగాల్

అబూ రిగాల్ అత్యంత పెద్ద ద్రోహి. అబ్రహా కాబాను కూల్చి వేయడానికి బయలుదేరినప్పుడు అతనికి మార్గదర్శకుడిగా మారాడు. ప్రవక్త ﷺ ఆయన సమాధి పక్కగా వెళ్ళినప్పుడు దానిపై రాళ్లు వేశారు అన్నది ఓ ఉల్లేఖనం. అప్పటి నుండి అతని  సమాధిని రాళ్లతో కొట్టడం ఒక సంప్రదాయంగా కొంత కాలమా వరకూ ఉండేది.

2. అబ్దుల్లాహ్ బిన్ ఉబయ్య్ బిన్ సలూల్

ఉహుద్ యుద్ధంలో ప్రవక్త ﷺకు పెద్ద ద్రోహం చేశాడు. ప్రవక్త ﷺ వెయ్యి మంది సహాబాలతో బయలుదేరినప్పుడు, అతను మూడొంతుల సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లాడు.

3. అబ్దుల్లాహ్ బిన్ సబా (ఇబ్ను సౌదా)

చరిత్రలో అత్యంత ద్రోహుల్లో ఒకడు. జమల్ యుద్ధంలో సహాబాల మధ్య  ఫిత్నాను రగల్చాడు.  “అబ్దుల్లాహ్ బిన్ సబా తన అనుచరులతో అన్నాడు: జనాలలో కలిసిపోండి. వారు కలిసినప్పుడు యుద్ధాన్ని రగిలించండి. వారిని ఏకమవ్వనివ్వకండి.”

4. ఇబ్న్ అల్-అల్కమీ

అబ్బాసీ ఖలీఫా అల్-ముస్తఅసిమ్‌కు మంత్రి. ఇతని ద్రోహం వలన బగ్దాద్ తతారుల చేతిలోకి వెళ్ళిపోయింది, అబ్బాసీ ఖిలాఫత్ పతనం అయింది. హిలాకుకు రహస్యంగా లేఖలు రాసి, బగ్దాద్‌ను అప్పగిస్తానని వాగ్దానం చేశాడు. ఖలీఫాను మోసం చేసి, రెండు లక్షల సైనికులను రద్దు చేయించాడు. యుద్ధ సమయంలో దజ్లా నదిని ఆపివేసి, ముస్లింల సైన్యానికి నీటి కొరత కలిగించాడు.

కానీ చివరికి హిలాకు కూడా ఇతనిని నమ్మలేదు. “నీ సుల్తాన్‌కి ద్రోహం చేసిన నువ్వు మాకు ఏం నమ్మకాన్నిస్తావు?” అంటూ గద్దించి, అతనిని కూడా చంపేశాడు.

చరిత్రలో ద్రోహం చేసినవారి పేర్లు శాశ్వత మచ్చలుగా మిగిలిపోయాయి. కానీ అల్లాహ్ తాను కోరిన వారిని కాపాడుతాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. ద్రోహులు ఎప్పటికీ నిలదొక్కుకోలేరు.

నీతికి విలువ నాతికి  విలువ ఎంతో అవసరం

మహనీయ ముహమ్మద్ (స) ఏ  దేశానికీ రాజు కాదు. పోపు కాదు, సీజర్ కాదు. కనీసం ఒక మంత్రి కూడా కాదు. కానీ సత్యాన్ని, ధర్మాన్ని, నీతినియమాలను చివరి శ్వాస దాకా ఆచరణలో పెట్టడమే ఆయన చేసింది. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఎంతమంది జనం ఆయన జనాజా చదివాదానికి ఎగబడ్డారు ఒక్క సారి చరిత్ర పుటల్ని తిరగేయండి.

నేడు విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వాసుల సంఖ్య అక్షరాలా 180 కోట్ల మంది.  బ్రతికున్న వీళ్లందరి  పేర్లు ఎవరికీ తెలియవు. కానీ చనిపోయిన ఆ మహోన్నత వ్యక్తి ఎవరో వాఱందరికీ  తెలుసు. నిజాయితీకి ఆయన ఇచ్చిన విలువ అపారం అని తెలుసు. ఆయనకు మించిన అమీనా సాదిఖ్ లేదు రాబోదు అని కూడా తెలుసు. ఆయన చెప్పిన మాట: తీర్పు రోజున విశ్వాసుల త్రాసులో మంచి నైతికత కంటే బరువైనది ఏదీ లేదు. నిశ్చయంగా, అల్లాహ్ అసభ్యకరమైన మరియు నిత్యం తిట్లు, బూతులు పలికే అవమానకరమైన వ్యక్తిని అసహ్యించుకుంటాడు.  మనిషి తన జీవిత కాలంలో ఏ క్షణమూ విడవకూడనిది, మరవరానిది- సచ్ఛీలం. ఆరోగ్యం లోపించినా, సంపద తరిగినా మళ్లీ ఏదో విధంగా సంపాదించుకోవచ్చు. శీలసంపద పోతే, తిరిగి పొందడం దుర్లభం.  అల్లాహ్ కు  అత్యంత ప్రీతిపాత్రమైన సౌశీల్య సంపదను మానవుడు ఎంతగా పెంచుకుంటే అంత మంచిది. మనిషి  ఆర్జించే విద్య, నాటే విత్తం, సంపాదించే కీర్తి- అవి ఏవైనా శీలసంపద లేనిదే శోభిల్లవు. మనిషికి మంచి నడవడి ప్రధానం,సచ్ఛీలి కానివాడు కుటుంబంలో, సమాజంలో ఒంటరివాడవుతాడు. ఎంత బలగం ఉన్నా అతణ్ని ఎవ్వరూ కాపాడలేరు.

శీలవంతుడు అంటే ఎవరు?

ధార్మికుడు, సకల ప్రాణుల్ని ప్రేమించేవాడు, సాటివాడైనా అపరిచితుడైనా మేలు చేసేవాడు- సచ్ఛీలుడు. సంయమనం, క్షమ, సహనం కలిగి ఉండటంతో పాటు- తల్లిదండ్రుల్ని, గురువుల్ని, ఇతర పెద్దల్ని ఆదరించే సంస్కారం గలవాడు శీలవంతుడు. అహింస, ప్రేమ, సత్యసంధత వంటి సద్గుణాల్ని అలవరచుకున్నవాడు; క్రమశిక్షణ, సమయపాలన, చిత్తశుద్ధి కలిగినవాడే సచ్ఛీలుడు.

చివరి మాట:

చరిత్ర మొత్తం తరచి చూసిన నమ్మిన సందర్భాలలోనే.. మోసం, దగా కుట్ర లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడానికి వీలుకాదు. అది మనం అర్థం చేసుకుంటే జీవితంలో మోసపోవడం, బలి కావడం లాంటివి సహజమే తరుచుగా జరుగుతుంటాయి. వీటి బారిన పడకుండా ఉండని మనిషి అసలు భూమ్మీద ఉండడు. అని మనం నమ్మాలి. కాబట్టి అందరికి జరిగినది నాకు జరిగినదని అర్థం చేసుకుంటే అప్పటికప్పుడు తాత్కాలికి కొంత ఉపశమనం దొరుకతుంది. తర్వాత ప్రతి మనిషి కొంత వేదాంత ధోరణి అలవర్చుకోవాలి. పాముకు విషం తలలో , తేలు కు తోకలో, దుర్మార్గులకు నిలువెల్లా విషమే అని చిన్నప్పుడు చదివినది గుర్తు తెచ్చుకోవాలి…

జీవితం ఎంతో విలువైనది. మానవతా విలువలు పాటిస్తూ క్రమశిక్షణతో, జీవితంపట్ల సాటి మనుషులపట్ల సానుకూల వైఖరితో మనుగడ సాగిస్తే ఎవరికైనా జీవితం స్వర్గతుల్యమవుతుంది. లక్ష్యంలేని బతుకు లంగరు లేని నావలాంటిది. ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధి, మానవ సంబంధాల పట్ల తపన కలిగి అందరినీ అర్థం చేసుకొని నడుస్తూ పదిమంది మన్ననలకూ విశ్వాస పాత్రుడు కావడం కంటే మనిషికి ఇంకేం కావాలి? చెప్పండి!

 తమకోసం తాము బతకడం చాలామంది చేసే పని. ఆహార నిద్రా భయ మైథునాలు జీవకోటి సామాన్య లక్షణాలు. ఆ పరిమితుల్లోనే చాలామంది జీవిస్తుంటారు. నిజానికది జీవితం కాదు. బతకడం మాత్రమే. సాధారణ జీవితం కన్నా కొంత సార్థక జీవితం సాగించిన ప్రతివారూ ప్రశంసనీయులే. అర్థవంతంగా చైతన్యవంతంగా బతకాలి. జీవిత పరమార్థం గ్రహించి మనుగడ సాగించాలి. కీర్తిశేషులు, వంటి మాటలు గతించిన వారిని గురించి వాడుతుంటాం. ఎవరైతే ఈ లోకం నుంచి నిష్క్రమించిన తరవాతా తమ జీవితకాలంలో చేసిన పనుల ద్వారా లోకుల స్మృతిపథంలో మెదులుతుంటారో, ఎవరి శీలసంపద కర్తవ్యనిష్ఠ నిస్వార్ధ సేవల్ని జనం గుర్తుంచుకొని చిరకాలం వారి గురించి గొప్పగా మాట్లాడుకుంటారో వారి జన్మ చరితార్ధం.

‘‘ప్రశ్నించాల్సిన చోట, ప్రశ్నించే స్థోమత ఉన్నచోట… ఒక తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించకుండా నిశ్శబ్దంగా ఉండిపోవడం… ఒక తప్పుకు రహస్య సమ్మతి తెలిపినట్టే… అంటే ధర్మానికి ద్రోహం చేసినట్టే… ద్రోహం అంటే తప్పు… తప్పు అంటే నేరం… మరి నేరానికి శిక్ష తప్పదు కదా…!

Related Post