భక్తీ విశ్వాసాల బీజం మొలకెత్తినప్పుడు – పరమ పవిత్రుడైన అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు – “యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుం ముస్లిమూన్.” (3:102)
ఖుర్ఆన్ వచన భావానువాదం: “విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లిములుగా తప్ప మీరు మరణించకండి” పై వాక్యాలు ఖుర్ఆన్ వెలుగులో మనకేమి ఆజ్ఞాపిస్తున్నాయో చూద్దాం –
ఇక్కడ “ఓ విశ్వసించిన ప్రజలారా!” అని సంబోధించబడింది. అరబీ భాషలో ఈమాన్ (విశ్వాసం) అనే పదము ‘అమన్’ నుండి వెలువడింది. అమన్ అంటే ‘శాంతి భద్రతలు, ఎలాంటి భయాందోళన లేకుండా ప్రశాంతంగా ఉండడం’ అని అర్థం. ఈమాన్ అంటే నమ్మకం, భరోసా, హృదయ స్వీకారం మరియు ఆచరణల ద్వారా దాని ధృవీకరణ అని అర్థం. ము–మిన్ అనగా విశ్వాసి లేక శాంతి భద్రతలతో కూడిన వాడు, భయాందోళనల నుండి సురక్షితంగా ఉన్నవాడు అని కూడా అర్థం.
ఖుర్ఆన్ పరిభాషలో విశ్వాసి అంటే “తనను తాను సరిదిద్దుకునేవాడు, అల్లాహ్ ఆజ్ఞలను బాధ్యతతో పాటించేవాడు, అల్లాహ్ ఆదేశించిన గుణాలను తనలో ఇనుమడింపజేసుకునేవాడు, సర్వదా కృతజ్ఞతా భావంతో నిండి ఉండేవాడు, నిరాశా నిస్పృహలకు జీవితంలో చోటివ్వనివాడు, సదాచార సంపన్నుడు, శారీరక పరిశుద్ధతతోపాటు తన విశ్వాసాన్ని కలుషితం మరియు కల్పితం వంటి అన్ని రకాల మాలిన్యాల నుండి కాపాడుకునేవాడు” అని అర్థం.
నిజానికి శాంతి, విశ్వాసం అనగా నమ్మకం కూడాను. ఈ నమ్మకమనేది ఎవరిపై లేక ఏ అంశాలపై అనే ప్రశ్న మనసులో జనిస్తుంది. ఆ విశ్వాసాంశాలు ఆరు: (1) అల్లాహ్ పట్ల విశ్వాసం(2) దైవదూతల పట్ల విశ్వాసం (3) ప్రవక్తల పట్ల విశ్వాసం (4) ఆకాశ గ్రంథాల పట్ల విశ్వాసం (5) మరణానంతర జీవితంపై విశ్వాసం (6) అల్ ఖదర్ అంటే పూర్వ నిర్దిష్ట విధివ్రాతపట్ల విశ్వాసం.
విశ్వాసులు ఈ విషయాలను హృదయపులోతుల్లో నుంచి నమ్మడమే కాక తమ చేతల ద్వారా కూడా నిరూపించుకోవాలి. వారు – అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయులుగా ఉండేవారై, ధర్మాన్ని స్థాపించేవారై, నమాజు చేసేవారై, జకాతు చెల్లించే వారై, దౌర్జన్యంగా ఇతరుల సొమ్ము కాజేసేవారు కాకుండా, అల్లాహ్ ఇచ్చిన ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టేవారై, పిసినారితనానికి గురికానివారై అల్లాహ్ ఇచ్చిన శుభాలతో గర్వానికి లోనుకాకుండా, కృతజ్ఞతాభావంతో వినమ్రులై, మంచిని ఆజ్ఞాపించేవారై, అల్లాహ్ అభీష్టం కోసం తపించే వారై, అల్లాహ్ ఆజ్ఞలను మనసా,వాచా,కర్మా తమ జీవితంలో ప్రవేశ పెట్టేవారై ఉంటారు.
ఇంకా వారు తమ తల్లిదండ్రులతో, పొరుగువారితో, బంధువులతో, అనాథలతో, పేదసాదలతో, ప్రయాణీకులతో, బానిసలతో చక్కగా మెలిగి, వారిని ఆదుకుని ఆశ్రయం కల్పించేవారై ఉంటారు. ఈ కార్య నిర్వహణల్లో ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే, వెంటనే అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్! ఏమరుపాటులో జరిగిన మా తప్పులను మన్నించు’ అని ప్రాధేయపడతారు. ఇలాంటి వారికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ ఎలాంటి చీకూ – చింతా ఉండవు. వారికి ఎల్లప్పుడూ ఇహపరలోక సాఫల్యాలే ఇన్షా అల్లాహ్.
పరమ పవిత్రుడైన అల్లాహ్, విశ్వాసం (ఈమాన్) తరువాత తఖ్వా యొక్క ప్రాముఖ్యతను తెలియ పరుస్తున్నాడు. ‘ఇత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ,- అల్లాహ్ కు ఏ విధంగా భయపడాలో ఆవిధంగానే భయపడండి’ అని.
తఖ్వా ‘వఖా’ నుండి వెలువడింది. దీని అర్థం ఎక్కువగా జాగ్రత్త పడడం, తనను తాను సురక్షితంగా ఉంచుకోవడం, అల్లాహ్ నియమించిన హద్దులు మీరకుండడం, కలిమి – లేమిలలో కూడా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం, అల్లాహ్ అవిధేయతకు భయపడడం, అల్లాహ్ శాసనాన్ని భంగపరచుటకు భయపడడం, న్యాయానికి ప్రతీకగా ఉండటం, వాగ్దానాలను పూర్తిచేయడం, బంధుమిత్రుల సంబంధాలను బలపరచడం, తమ కోపాన్ని అణచుకోవడం, ఇతరుల తప్పులను మన్నించడం, హరాం – హలాల్ లలోని ఆంతర్యాన్ని తెలుసుకుని వాటిని మనస్పూర్తిగా పాటించడం. ఇదే తఖ్వా అంటే అల్లాహ్ యొక్క భయభీతి. తఖ్వా అనేది ఒక స్పందన, స్పృహ, సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ నాకు అతి చేరువలో ఉన్నాడు, నా ప్రాణ నాళికన్నా దగ్గరగా ఉన్నాడు, మొత్తం నా ఊహలను – నా చర్యలను గమనించే వాడు, నా మంచి చెడు కర్మలను వ్రాయటానికి ఇద్దరు దైవదూతలను నాపై నియమించి ఉంచాడనే వాస్తవ అనుభూతితో జీవతం గడపటం. ఆ దైవదూతలు ప్రతీదీ జాగ్రత్తగా వ్రాసి పెడ్తున్నారు. ప్రళయదినాన సమస్త మానవజాతి ముందు మరియు మహోన్నతుడైన ఆల్లాహ్ సమక్షంలో నా తప్పొప్పులు బహిర్గతం చేయబడతాయి అనే స్పృహలో ఉంటాడు. మన హృదయం నిరంతరం దిక్సూచి సూదిలా అల్లాహ్ వైపే ఉండాలి. ఒకవేళ కాస్సేపటికి ప్రాపంచిక ప్రలోభాలకు లోనై ఇటూ అటూ కదిలినప్పటికీ మరలా దానిని అల్లాహ్ వైపునకే మరల్చాలి. అప్పుడే ఆ హృదయం అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగిన హృదయంగా పరిగణించ బడుతుంది.
హజ్రత్ కఅబ్ (రదియల్లాహు అన్హు)ను ఒకసారి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ‘తఖ్వా అంటే ఏమిటి?’ అని ప్రశ్నించగా వారిలా జవాబిచ్చారు: “ఒక ఇరుకైన దారి ఇరువైపులా ముళ్ళ కంచెలతో నిండి ఉన్నప్పుడు, ఆ దారిన పోతున్న వ్యక్తి తన దుస్తులను వాటిలో చిక్కబడ కుండా జాగ్రత్తపడుతూ ముందుకు సాగిపోవటం”. ఆ జాగ్రత్తే ‘తఖ్వా’. ఇలాంటి ‘తఖ్వా’ కొన్ని క్షణాల పాటు లేక కొన్ని సందర్భాల్లో మాత్రమే కాక సర్వదా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి అస్థిత్వం లోకానికి లాభ దాయకం అవుతుంది . అతని వల్ల ఎవరికీ ఎలాంటి కీడు కలగదు. అతని ఉనికి చల్లని నీడను, ఆక్సిజనును ఇచ్చే మహావృక్షం లాంటిదవుతుంది. దాని నీడలో ఎల్లరూ సేద తీరుతారు. అతని జీవితం మానవత్వాన్ని పరిమళించే సుధా ఝరి అవుతుంది. దాన్ని అందరూ ఆస్వాదిస్తారు.