ముస్లిం మదిపై ఇస్రా – మేరాజ్ స్మృతులు – ”తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభ వంతం చేశాము. ఎందుకంటే, మేమతనికి మా (శక్తికి సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలచాము. నిశ్చయంగా అల్లాహ్‌ా మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు”. (బనీ ఇస్రాయీల్: 1)
గగన విహారం:
రాత్రి వేళ మస్జిదె హరామ్ నుంచి మస్జిదె అఖ్సా వరకు దివి దూతలతో భువి ప్రవక్త ముహమ్మద్ (స) చేసిన ప్రయా ణాన్ని ఇస్రా అంటారు. అక్కడి నుండి ఏడు ఆకాశాల అధిరోహణను, అక్కడ తిలకించిన సంగతులను మేరాజ్ అంటారు. ఈ అద్భుత సంఘటన హిజ్రత్కు ముందు జరిగిందన్న విషయంలో పండితులందరి మధ్య ఏకాభిప్రా యం ఉంది. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం రాత్రిలోని అతి స్వల్ప భాగంలో జరిగిపోవడం ఒక అద్భుతమే. ఈ యాత్ర కొందరు పొరబడినట్టు ‘స్వప్నావస్థ’లో జరిగింది ఎంత మాత్రం కాదు. ఆయన (స) సశరీరంగా పూర్తి మెలకువలో ఈ యాత్ర చేసి వచ్చారు. ఇస్రా-మేరాజ్ మాట వినగానే గత తాలూకు జ్ఞాపకాలు మన మనో తెరలపై కదలాడుతాయి. మనలో అంతరించిన భావ చైతన్యం చిగుళ్లు పోసుకుని నవశక్తిగా ఉద్భవి స్తుంది. అవును, మనం సదా మేల్కొని ఉండాలన్నదే మేరాజ్ మధుర ఘట్ట సందేశం.
మేరాజ్ సందర్భంగా మానవ సమాజాన్ని పట్టి పీడించే అనేక రుగ్మతలను అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారికి చూపించి వాటికి విరుగుడును బోధించడం జరిగింది.
మనిషి ఉపాసనారీతులన్నీ, పూజా పద్ధతులన్నీ ఏకైక దైవమయిన అల్లాహ్‌ాకు మాత్రమే ప్రత్యే కించాలని, ఆయనతోపాటు ఇతరులను సాటి కల్పించి ఆరాధించ వలదని, తల్లిదండ్రుల యెడల అత్యుత్తమంగా మసలుకోవాలని, వారి తో చీదరించుకుంటూ మాట్లాడటం తగదని, బంధుమిత్రుల పట్ల సద్వ్యవహారం కలిగి ఉం డమని, దుబారా ఖర్చుకు దూరంగా మసలుకో వాలని, సరదారాయుళ్లు షైతాన్ సోదరులని, అనవసరమయిన విషయాల జోలికి వెళ్ళకండ ని,దానం చెయ్యడంలో సయితం మధ్యేమార్గం మంచిదని, పిసినారితనం పరమ జుగుప్సాకర మైన గుణమని, మనిషి చెప్పే ప్రతిమాట, చేెసే ప్రతి పని లెక్కించబడుతుందని, కలిమి లేములు ఆ కరుణామయుని ఇష్టానుసారమే లభిస్తాయని, లేమి గురయితే కృంగి పోకూడ దని, కలిమి కలిగితే పొంగి పోకూడదని, అశ్లీ చేష్టలకు ఆమడ దూరంలో ఉండాలని, వ్యభి చార దరిదాపులకు సయితం వెళ్ళకూడదని, అనాథల ఆస్తులను స్వాహా చెయ్యడం పరమ నీచం అనీ, ఒండొకరి ధన, మానాలు దోచు కోవడం అన్యాయమని, వడ్డీ, చక్రవడ్డీల పేరు తో జలగల్లా పేదలరక్తం త్రాగొద్దని, సారాయి, జూదం, పాచికల జోస్యం, దైవేతరాల జోలికి పోవద్దని, మంచిని పెంచమని, చెడును తుంచమని ప్రబోధించడం జరిగింది.
మేరాజ్ కానుకలు:
మేరాజ్ శుభ సందర్భం గా ప్రవక్త (స) అనేక అద్భుత దృశ్యాలను చూశారు. వాటిలో దైవదూతల ఆరాధనా విధానం కూడా ఒకటి. దైవదూతల ప్రార్థనా రీతులన్నింటిని కలగలిపి ప్రసాదించినదే నమాజు. దైవదూతలు వేర్వేరు భంగిమల్లో దైవాన్ని కొలిస్తే, ఒక ముస్లిం ఒకే సమయం లో సర్వ భంగిమల్లో అల్లాహ్‌ాను ఆరాధిస్తాడు. మన పాలిట ఎంతటి గొప్ప కానుక నమాజు! సర్వ శ్రేష్ఠుడయిన అల్లాహ్ ఆ మహిమాన్విత విధానం నమాజు ప్రాశస్త్యాన్ని, ఈ మహా రాధన పట్ల ఏమరుపాటుకి లోనై జీవిస్తున్న తన దాసులకు ఎరుక పరుస్తున్నాడు: ”నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిస్సందేహంగా నమాజు చెడుల, అశ్లీల చేష్టల, మితిమీరిన ప్రవర్తన జోలికి పోకుండా నిరోధిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్ సంస్మరణ ఎంతో గొప్ప విషయం”.(ద్వియఖుర్‌ఆన్-29;45)
అలాగే ఈ సందర్భంగా సూరతుల్ బఖరా లోని చివరి రెండు ఆయతులు ప్రసాదించ బడ్డాయి. షిర్క్ మహాపరాధానికి పాల్పడని విశ్వాసి పెద్ద పాపాలు మన్నించబడతాయి అని మాటా ఇవ్వబడింది. (ముస్లిం)
దహకాండ ఇటు – ధీరకాంత అటు
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) గారి కథనం-దైవప్రవక్త ముహమ్మద్ (స) ఇలా సెలవిచ్చారు: అది ఇస్రా-మేరాజ్ నిమిత్తం దైవ దూత జిబ్రయీల్ నన్ను తీసుకెళ్ళిన రాత్రి. ఓ మలయ సౌరభం నన్ను తాకింది. అప్పుడు నేను: ‘ఓ జిబ్రీల్! ఈ సుగంధ పరిమళ సంగ తేమి?’ అని అడిగాను. అందుకు ”ఈ మలయ సౌరభం ఫిర్ఔన్ కుమార్తె యొక్క కేశాలంకరణి అయిన విశ్వాస మహిళ మరియు ఆమె బిడ్డలది” అని బదులిచ్చారు జిబ్రీల్ (అ). అది విని నేను ‘ఆమెకేమ య్యింది?’ అని వివరణ కోరగా – జిబ్రీల్ (అ) చెప్పనారంభించారు: (తర్వాతి కథనాన్ని కాస్త వివరణతో ఇక్కడ ఇస్తున్నాము).
అది ఈజప్టు రాజ్యం. స్థలం నియంత ఫిర్ఔన్ రాజకోట. బృందావనం లో కూర్చుని ఉంది ఓ విశ్వాస మహిళ.ఏమి వర్చస్సు ఆమె వదనంలో! మూర్తీ భవించిన సత్యంలా ఉంది. ఆవిడే ధీరకాంత ఫిర్ఔన్ కూతురి కేశాలం కరిణి. ఆమె కేశాలను అలంకరిస్తూ ఆలోచిస్తూ ఉంది. సర్వ లోక ప్రభువు అల్లాహ్ ఉండగా ఓ పరిమి ప్రాంతానికి రాజైన ఫిర్ఔన్ ”నేనే మీ సర్వోన్నత ప్రభువుని” అనడం ఎంత దుర్మార్గం. జాతి వివక్ష జాఢ్యానికి గురై 70 వేల మంది పసికందుల్ని బలిగొన్న అతని నైచ్యం ఎంత దారుణం. ఇక ఈ పాప పరిపాలన భరించలేం. ఈ దాస్య శృ ఖలాలను ఇంకా సహించలేం. ‘దేవుడొక్కడే’ నినాదం ప్రాణాధికం. అదే కదా మహాత్ములందరూ అందించిన సందేశం. దాసి అయిన నాకు అర్థ మవుతున్న ఈ యాదార్థం, రాజయిన అతని బుర్రకెందుకు ఎక్కడం లేదు? ఇతని నిషేదాజ్ఞలు ప్రజా వాహిని ఆంతర్యంలోని వేళ్ళూనుకొని ఉన్న తౌహీద్ విప్లవాన్ని అరికట్టగలవా? ఇతని హింసా చర్యలు సత్య ధర్మ ద్వజవాహకులను ప్రతిఘటించగలవా? ఇలా అలోచిస్తుండగా-పర ధ్యానంలో ఆమె చేతి నుండి దువ్వెన (కేశాలంకరణ పరికరం) జారి పడింది.దాన్ని ఎత్తుకోబోతూ ఆమె ‘బిస్మిల్లాహ్‌ా’-అల్లాహ్ పేరుతో అంది. అది విన్న ఫిర్ఔన్ కూతురు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతూ –
ఫిర్ఔన్ కుమార్తె: అంటే, ‘నా తండ్రా?’.
ధీరకాంత: ‘కాదు, నా ప్రభువు, నీ తండ్రి ప్రభువయిన అల్లాహ్‌ా’.
ఫిర్ఔన్ కుమార్తె: ఇది మరీ అన్యాయం, (ఇటీజ్ టూ మచ్)
ధీరకాంత: ఇదే న్యాయం (దిసీజ్ ట్రూ మెసెజ్)
ఫిర్ఔన్ కుమార్తె: మా నాన్నకు ఈ విషయం చేరవేయనా?
ధీరకాంత: అవును, అది నా ప్రభువు నీ ప్రభువయిన అల్లాహ్‌ా నామమే. ‘సరే తెలియజయ్యి’. (తక్షణమే ఆగమేఘాల మీద వెళ్ళి ఆ వార్తను తన తండ్రి చెవిన పడేస్తుంది ఫిర్ఔన్ కూతురు).
కోపంతో రగిలిపోతూ ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ? నన్ను దైవం కాదన్న ఆ అబల? అంటూ ఆమెను దర్బారులో హాజరు పర్చ వలసిందిగా ఫర్మానా జారీ చేశాడు ఫిర్ఔన్.
ఫిర్ఔన్: ‘ఏమిటి? మేము కాక నీకు ఇంకో ప్రభువున్నాడా?’ అని నిప్పులు చెరిగాడు.
ధీరకాంత: అవును; నా ప్రభువు, నీ ప్రభువు అల్లాహ్‌ా ఒక్కడే.
ఫిర్ఔన్: నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలియదా?
ధీరకాంత: బాగా తెలుసు.
అధికారి: చట్టాన్ని ధిక్కరిస్తే పర్యవసానం ఏమవుతుందో తెలుసా?
ధీరకాంత: బాగా తెలుసు. పశుబలం విజృంభిస్తుందని తెలుసు. ఇనుప లాఠీలు తాండవిస్తాయని తెలుసు. మృగ మనుషులు మంటలు గక్కుతారని తెలుసు. అమాయకులయినా సత్యప్రియుల రక్త ధారలతో పుడమి ఒడి తడిసి ముద్దవుతుందనీ తెలుసు.
అధికారి: ఆఁ…అయితే తెలిసి తెలిసి ఎందుకు ధిక్కరిస్తున్నావు మహా రాజ దైవత్వాన్ని?
ధీరకాంత: అదే మా లక్ష్యం. అదే సత్య సస్య విప్లవ నినాదానికి మూల సూత్రం.
అధికారి: చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఉపన్యాసాలు కట్టబెట్టి బేషరతుగా లొంగిపో.
ధీరకాంత: చాలించను, మీ బెదిరింపులకు చలించను.
అధికారి: అందాక వచ్చిందా నీ అహంకృతి?
ధీరకాంత: అక్కడే మొదలవుతుంది సత్యవాదుల సంస్కృతి.
అధికారి: ఏ ప్రలోభం మాయ చేసింది నిన్ను.
ధీరకాంత: ఇప్పుడిప్పుడే తెరుచుకుంది వెలుతురు కన్ను.
అధికారి: శాసన ధిక్కారానికి ఫలితం అనుక్షణం మృత్యు భయం!?
ధీరకాంత: ఆ మృత్యు కోరలతో ఆడుకోవడం మాకు ప్రియం.
(సాంతం అప్రశాంతంగా వింటున్న ఫిర్‌వన్ కోపం కట్టలు తెంచు కుంది. రెచ్చిపోయి తెగ ఉరిమాడు. పిచ్చి కుక్కలా అరిచాడు. పచ్చి విషం కక్కాడు).
బెదిరిపడ్డ ప్రభుత్వం ఏం చేస్తుంది? సత్య వీర నారీమణుల్ని బంధిస్తుంది. ఇరుకు చెరశాలలో చిత్రహింసలు పెడుతుంది. అప్పటికీ కక్ష తీరకపోతే ఉరి శిక్ష వేస్తుంది. అగ్నిగుండంలో నెట్టేస్తుంది. కాగే నూనె లో పడేసి వేంచేస్తుంది. అదే జరిగింది.
ఉన్మాదిగా మారిన ఫిర్ఔన్ తక్షణమే ఓ తొట్టెలో నూనె కాగి ఆమెను, ఆమె బిడ్డలను అందులో పడేయవలసిందిగా ఆ జ్ఞాపించాడు. ఈ వార్త క్షణాల్లో ప్రజల కర్ణపుటాలకు తాకింది. ప్రజలు ఆ ధీరకాంత గురించే మాట్లాడుకుంటున్నారు.
ఒకడు: దిక్కు దిక్కుల ఉక్కు కరవాలాలు త్రిప్పుకుంటూ కంట పడిన క్రాంతి శక్తులను కటకటాల పాలు చేస్తున్నారు ఫిర్ఔన్ సేనలు.
మరొకడు: కాగే నూనెలో పడేసి వేంచేస్తారట. ధీరకాంతను ఆమె సంతాన సమేతంగా కాల్చేస్తారట. ఏమిటీ దురంతం?
(అప్పటి సామాన్య ప్రజా హృదయ ఘోష, ధీరకాంత ప్రాణ రక్షణ అభిలాష).
ఇంకొకడు: అహింసాసూత్రం ఏమయిపోయింది? ఈ హింసా విజృం భణకు అంతమెప్పుడో? పట్టుదప్పిపోతున్నదా? సత్య సస్య విప్లవం చెదిరి పోనున్నదా?(సత్యప్రియుల అంతరంగాల్లో తెలియని కలవరం). చివరికి ఆ హృదయ విదారక ఘడియ రానే వచ్చింది. పెద్ద తొట్టెల్లో నూనె సలసలా కాగుతున్నది.
ఆకాశమెప్పుడూ నీలంగా ఉంటుందనే అల్లాహ్ చెప్పాడు. కానీ; వానలేనీ ఎండ ఉంటుందని మాత్రం అనలేదే! వేదన లేని సంతోషముంటుందనిగానీ లేదా బాధారహిత ప్రశాంతత సాధ్యమనిగాని అనలేదే. అందుకే మనం నిరంత కఠోర పరిశ్రమలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలి. సత్యమార్గం మీద నిలకడ కలిగి జీవించాలను కున్నప్పుడు ఇటువంటి హృదయ విదారక సంఘటలు చోటు చేసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
ఫిర్ఔన్: ఓ భీతిల్లిన హరిణీ! ఇప్పటికయినా మించిపోయింది లేదు. తప్పుకో. ‘నేనే నీ సర్వోన్నత ప్రభువు’నని ఒప్పుకో!
ధీరకాంత: తొలగను. అంగుళం కూడా కదలను. మీ పశుబలానికి లొంగను. నేను సత్యకాంతను, నేను దైవప్రవక్త మూసా ప్రబోధించిన అహింసలో పెరిగిన ఆవేశాన్ని.
అధికారి: మహారాజా! నింద! నింద!
ధీరకాంత: ఛీ! నోర్ముయ్ పిరికిపంద.
అధికారి: ఓహ్ చింత చచ్చినా పులుపు చావలేదన్న మాట. నీ పిల్లల్ని పెనుములో పడేసి వేంచేస్తామన్నా ఉద్రేకం తగ్గలేదన్న మాట.
ధీరకాంత: ఉద్రేకం మీలాంటి మిథ్యావాదులకుండదూ! అది మా సత్య శక్తుల సొత్తు.
ఫిర్ఔన్: ఏమిటీ నీ చివరి కోరికా?
ధీరకాంత: రాజా! నాదో విన్నపం.
ఫిర్ఔన్: ఏమిటా నీ అవసరం?
ధీరకాంత: నా మరణానంతరం నా ఎముకల్ని, నా బిడ్డల ఎముకల్ని ఓ గుడ్డలో చుట్టి ఒకే చోట సమాధి చేస్తే నాకు మేలు చేసిన వారవు తారు. (పుండు మీద కారం జల్లినట్టు ఆ ధీరకాంత మాటలు తూటాల్లా పేలాయి).
తలపెట్టిన కుతంత్రాలు తలక్రిందులవుతుంటే, పన్ని పన్నాగాలన్నీ మన్ను గరిచిపోతుంటే, నిరంకుశ నీచత్వం నివ్వెరబోయి చూసింది. కుళ్లిన కుహనాతత్వం కుక్క గొడుగులు తొడిగింది. తెగిపోతున్న దగా దైవత్వాన్ని జిగురు పెట్టి అతికించాలని, పాతబడిన చట్టాలకు పై పూతలు పూయాలని, ప్రబలుతున్న పరిపూర్ణ సత్య సంరంభాన్ని ప్రక్క దారులు పట్టించాలని కుట్రలు పన్నింది.
ఫిర్ఔన్: కోపాన్ని ప్రదర్శిస్తూ-‘అలా చెయ్యడం మా ధర్మం’.
తొట్టెలో నూనె సలసలా కాగుతోంది. కర్కశ సైనికులు ఆ మాతృ మూర్తి చూస్తుండగానే ఆమె కళ్ల ఎదుటే ఒక్కో బాలుడ్ని తీసుకెళ్ళి ఆ నూనెకి ఆహుతి చేసేశారు. చివరికి అంతిమ పరీక్షా సమయం ఆసన్న మయింది. పిల్లలందరూ ఆమె కళ్ళ ముందరే నూనెకి ఆహుతి అయ్యారు. నలుగురికి తర్వాత ఇక ఆమె వద్ద మిగిలింది పాలు త్రాగే ఓ పసికందు మాత్రమే. ఆ పసికందు విషయంలో ఆమె సహనం నశిం చింది. ఆ పసి బాలుడ్ని వారికి అప్పగించే సాహసం చెయ్యలేక పోయింది పాపం! సంధిగ్దావస్థలో కొట్టుమిట్టాడుతున్న తన తల్లినుద్దేశించి ఆ పసికందు నోరు విప్పింది: ”ఓ నా ప్రియమైన అమ్మా! దేని కోసం ఎదురు చూస్తున్నావు. నన్ను బాగా ఒడిసి పట్టుకుని ఆ నూనెలో దూకెయ్యి! ఇహలోకపు ఈ యాతన పరలోకపు నరక యాతన ముందర ఏపాటిది?” అంతే, ఆ ధీరకాంత తన పసికందునితోపాటు తన దేహాన్ని ఆ నూనెకు ఆహుతి చేసుకోంది….!!!
ప్రకృతి: దుష్టులు కాల్చింది విశ్వాసుల దేహాల్ని మాత్రమే. వారి సత్య శ్వాసను కాదు. ఆ ఊపిరే ఉప్పెనగా మారుతుంది. హింసావాదులు సత్యప్రియుల శాంతాన్ని అశక్తత అనుకుంటున్నారు. వారి సహనాన్ని చేతకానితనంగా తలపోస్తున్నారు.
అదుగో! ఏమిటా జనప్రవాహం? అమ్మో! ఎన్నెన్ని ఉత్సాహ తరం గాలో! ఈ ప్రవాహానికి స్ఫూర్తి ఓ దళిత విశ్వాస మహిళయా? మిథ్యా వాది కాదు; అక్షర సత్యవాది. ముష్కర పాలకుల రాక్షస కృత్యాలను అక్ష్షీణ బలంతో ఎదుర్కొన్న అపూర్వ సాహసమూర్తి. విశ్వాస బలమే ఆమె ఆయుధం. సహనమే ఆమె కవచం. సత్యమే ఆమె శస్త్రం.
నేడు చిందిన ప్రతి నెత్తుటి బొట్టూ సరికొత్త విప్లవ శక్తులకు పురుడు పోస్తుంది. వారి ఉచ్ఛ్వాసనిశ్వాసలే సత్యా ప్రభంజనాలయి మిథ్యా వాదుల సువర్ణ సౌధాలను, నెత్తిన పెట్టుకున్న మకుటాలను తుత్తుని యలు చేెసి, దూది పింజల్లా ఊదేసి, వారి ముష్కర బర్బర ప్రభుత్వా న్ని తుదముట్టించే రోజొకటి తప్పక వస్తుంది.
(ఇది జరిగిన కొన్నాళ్ళకే ఫిర్ఔన్ ప్రభుత్వం కుప్పకూలింది. ఈజిప్టు ధాత్రిపై సత్య కేతనం సంపూర్ణ శోభతో రెపరెపలాడింది).
ఇస్రా సందర్భంగా దైవదూతల నాయకుల యిన జబ్రీల్ (అ) నోట ప్రవక్తలందరి నాయకులయిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారికి విన్పించిన ఈ సజీవగాధ మనకు చెప్పకనే ఎన్నో విషయాలు చెబుతోంది. మహాప్రవక్త ముహమ్మద్ (స) వారి ఇస్రా ప్రయాణ సందర్భంగా స్వయంగా దైవదూత జిబ్రీల్ (అ) ఈ గాధని విన్పించడం వెనకున్న పరమార్థాన్ని అర్థ చేసుకుంటే ముస్లింల పట్ల నేటి అగ్రదేశాల వైఖరి వింతగా తోచదు. తన అంతిమ గ్రంథం ఖుర్ఆన్లో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:
”మేము ఏదో ఒక విధంగా తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము- భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. వారికెప్పుడ యినా ఏ ఆపద వచ్చి పడినా, ‘మేము ఖుద్దుగా అల్లాహ్‌ాకు చెందిన వారము, మేము మరలి పోవలసింది కూడా ఆయన వద్దకే కదా!’ అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గం పొందినవారు కూడా వీరే”.(బఖర: 155-157)
”మీలో ధీరోదాత్తులు ఎవరో, సహనమూర్తులెవరో నిగ్గు తేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము. మీ స్థితిగతులను కూడా పరికిస్తాము”. (ముహమ్మద్; 31)
ప్రతి ఏటా ఇస్రా – మేరాజ్ ఇచ్చే సందేశం:
”మీలో ఎవరు విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారికి అల్లాహ్, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వొసగుతానని,తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళనల స్థానే శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. (అయితే అల్లాహ్ ఈ వాగ్దానం షరతులతో కూడుకున్నది) వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకూడదు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరయినా విశ్వాస ఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికి వారు దుర్మార్గులవుతారు”. (అన్ నూర్: 55)
దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”అల్లాహ్‌ా భూమిని నా కోసం కుంచింపజేశాడు. నేను తూర్పు పశ్చిమ భూభాగాలను చూశాను. అతి త్వరలోనే నాకు చూపించబడిన భూభాగం వరకు నా అనుచర సమాజం రాజ్య విస్తరణ చేరుకుంటుంది”. (ముస్లిం)
నేటి మన స్థితి ప్రసవ వేదన వంటిది. ఆ వేదన ఎంత తీవ్రతర మవుతుందో సహాయం కూడా అంతే సమీపంలో ఉంటుందన్న ఆశా భావంతో మనం సత్యధర్మ ధ్వజవాహకులుగా శాంతి స్థాపనకై కంక ణం కట్టాల్సి ఉంది.