జాలి, దయ, కరుణ, త్యాగంలాంటి సుగుణాలు మానవుల్లో తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు. ఎవరి మనసులో ఏ మేరకు ఈ గుణ ప్రభావం ఉంటుందో ఆ మేరకు వారు శుభకరులు, దేవుని కారుణ్యానికి అర్హులు. ఈ సుగుణాలు లేనివారు కఠిన హృదయులు. అలాంటివారిని దైవం తన కరుణకు దూరంగా ఉంచుతాడు. ఈ విషయాన్ని దైవప్రవక్త ముహమ్మద్(స) ఇలా తెలిపారు ‘ఎవరి హృదయంలోనైతే సాటి మనుషుల పట్ల, ఇతర ప్రాణులపట్ల కారుణ్యం, జాలి, సానుభూతి ఉండదో, అలాంటివారిని అల్లాహ్ తన ప్రత్యేక కరుణకు దూరంగా ఉంచుతాడు. కరుణ చూపేవారు, జాలిపడే వారిపై అనంత కరుణామయుడైన అల్లాహ్ కరుణ చూపుతాడు. కనుక భూలోకంలో నివసించే ప్రాణికోటిపై మీరు కరుణ చూపండి. పైవాడు (దైవం) మిమ్మల్ని కరుణిస్తాడు’ అని ప్రవక్తమహనీయులు ఉపదేశించారు.
మండు వేసవి. ఒక వ్యక్తి కాలినడకన ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో అతనికి తీవ్రమైన దాహం వేసింది. వెంట నీళ్లు లేవు. నాలుక పిడచకట్టుకుపోతోంది. కాళ్లలోని సత్తువనంతా ఉపయోగించి భారంగా అడుగులు వేస్తున్నాడు. అలా కొంతదూరం నడిచిన తరువాత శక్తి సన్నగిల్లింది. అదృష్టవశాత్తూ దారి పక్కనే ఒక బావి కనిపించింది. కాని తోడుకోవడానికి ఎలాంటి సాధనం లేదు. ఏదోవిధంగా ప్రాణం దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో ధైర్యం చేసి బావిలోకి దిగాడు. కడుపారా నీళ్లు తాగి పైకి ఎక్కి వచ్చాడు. పైకి రాగానే భయంకరంగా వగరుస్తూ, తీవ్రదాహంతో నాలుక బయటికి చాచి, దీనంగా చూస్తోంది ఒక కుక్క. దాహానికి తాళలేక ఎండిన బురద నాకడానికి ప్రయత్నిస్తోంది. కుక్క దీనస్థితిని చూసిన ఆ వ్యక్తికి దానిపై అమితమైన జాలి కలిగింది. పాపం ఈ కుక్క కూడా తనలాగే తీవ్రమైన దాహంతో బాధపడుతోందని మనసులో అనుకున్నాడు.
కాళ్లలో శకి ్తసన్నగిల్లినా, శునకంపై సానుభూతితో మళ్లీ బావిలోకి దిగాడు. తన మేజోళ్లలో నీళ్లు నింపుకుని వాటిని నోట కరచి పట్టుకుని పైకి ఎక్కాడు. ఆ నీటిని కుక్కకు తాగించాడు. ఈ కార్యం దైవానికి ఎంతగానో నచ్చింది. అతని జీవకారుణ్యగుణాన్ని, అతను పడిన శ్రమను మెచ్చుకున్న దేవుడు అతడికి ఇహపరమైన సంపదలను, శాంతిసౌఖ్యాలను ప్రసాదించాడు.
జాలి, దయ, సానుభూతి లేని కఠినాత్ములు కొందరు ఉంటారు. అలాంటి కఠిన హృదయులనుండి ఎలాంటి శుభాన్నీ, మంచినీ ఆశించలేము.
తమకేదైనా కష్టమొస్తే లబోదిబోమని గుండెలు బాదుకుని బాధపడే వీరు, ఇతరులు కష్టాల్లో ఉంటే మాత్రం పట్టించుకోరు. సహాయానికి ముందుకు రారు. పైగా సంతోషిస్తారు. అదొక పైశాచికానందం. ఇలాంటి కఠినాత్ములను దైవం ఏమాత్రం కనికరించడు. ఇహలోకంలోనూ వారికి పరాభవం ఎదురవుతుంది. పరలోకంలో ఎలాగూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
అందుకే కారుణ్యమనే సుగుణం దౌర్భాగ్యుని హృదయంలోనుండి తప్ప, మరెవరి హృదయం నుండీ తీసివేయబడదని ముహమ్మద్ ప్రవక్త (స) సెలవిచ్చారు