శాంతి – సంతృప్తి

దైవాన్ని బాగా స్మరిస్తూ ఉండు. అనాధలు, దీనజనులను ఆదరించు, దురాశకు దూరంగా ఉండు’ - ఈ పనుల వల్ల మనసుకు శాంతిసంతోషాలు ప్రాప్తమవుతాయి

దైవాన్ని బాగా స్మరిస్తూ ఉండు. అనాధలు, దీనజనులను ఆదరించు, దురాశకు దూరంగా ఉండు’ – ఈ పనుల వల్ల మనసుకు శాంతిసంతోషాలు ప్రాప్తమవుతాయి

పుడమిపై పుట్టిన ప్రతిఒక్కరూ సుఖశాంతులను, సంతోషం, సంతృప్తులనే కోరుకుంటారు. కష్టాలు, బాధలను ఎవరూ ఆశించరు. అయితే ఏదీ మనం అనుకున్నట్లు జరగదు. మానవ జీవితంలో అనుకూల, ప్రతికూల పరిస్థితులు వస్తూనే ఉంటాయి. జీవితంలో ఎగుడుదిగుళ్లు, ఎత్తుపల్లాలు అనివార్యం. అనుకూల పరిస్థితులలో పొంగిపోవడం, ప్రతికూల పరిస్థితిలో కుంగిపోవడం మానవుల చంచల స్వభావానికి నిదర్శనం. శాంతి సంతృప్తులకు సరైన అర్థం తెలియకపోవడమే అసలు సమస్యకు మూలం.

ఇంతకూ శాంతి, సంతోషాలంటే ఏమటి? అందమైన ఇల్లు,ఆస్తి అంతస్తులు, వాహనాలు, భార్యాపిల్లలు, కుటుంబమూ – ఇవన్నీ ఆనందానికి నిలయాలా? ఇలాంటివన్నీ సమకూరితే సుఖశాంతులు సొంతమైనట్లేనా? ఇవన్నీ ఆనందంలో చిరుభాగమే తప్ప, సంపూర్ణ సంతోషానికి సాధన, సోపానాలు కావు. ఇది మన అనుభవాలు చెబుతున్న వాస్తవం.

ఎందుకంటే అందమైన భార్య, రత్నాల్లాంటి పిల్లలు, విలాసవంతమైన భవనాలు, వాహనాలు, కావలసినంత డబ్బు, బంగారం – ఇంకా రకరకాల విలాసాలకు కావలసినంత సాధనాసంపత్తి అనునిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ, శాంతి సంతోషాల కోసం, మానసిక ప్రశాంతత కోసం వెదుకులాడటం మానవ సమాజంలో చూస్తూనే ఉన్నాం. అంటే, ఇవన్నీ పాక్షిక ఆనందాన్ని మాత్రమే అందించగలవు కాని, సంపూర్ణశాంతిని, పరిపూర్ణ ప్రశాంతతలను అందించలేవని స్పష్టంగా అర్థమవుతోంది. అది మార్కెట్‌లో దొరికే వస్తువు కూడా కాదు. మరేం చేయాలి? శాంతిసంతోషాలు దక్కేదెలా? మానసిక ప్రశాంతత ప్రాప్తమయ్యేదెలా? మానవజీవితంలోని ఈ అశాంతి, అసంతృప్తి దూరమయ్యే దారేది?

ఈ విషయమే ఒక శిష్యుడు ముహమ్మద్ ప్రవ క్త (స) వారిని అడిగాడు. దానికి ఆయనగారు… దైవాన్ని బాగా స్మరిస్తూ ఉండు. అనాధలు, దీనజనులను ఆదరించు, దురాశకు దూరంగా ఉండు’ అని ఉపదేశించాడు. ఈ పనుల వల్ల మనసుకు శాంతిసంతోషాలు ప్రాప్తమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది, అని భావం. అయితే, దైవాన్ని స్మరించడమంటే, కేవలం దైవనామాన్ని ఉచ్చరించడం మాత్రమే కాదు. అను నిత్యం ఆయన్ని గుర్తుంచుకోవడం, ఆయన భీతిని మనసులో ప్రతిష్టించుకోవడం, అన్ని వ్యవహారాల్లో ఆయన ఆజ్ఞలు, ఆదేశాలను పాటించడం, శిరసావహించడం. సర్వకాల సర్వావస్థల్లో దైవనామాన్ని మనసులో ప్రతిష్టించుకుని, ఆయన ఆదేశానుసారం జీవితం గడిపితే మనసుకు శాంతి, సంతృప్తి ప్రాప్తమవుతాయనడంలో సందేహం లేదు.

Related Post