ఒకరి మనసులోని భావాన్ని మరొకరికి తెలిపేటందుకు ఉపయోద పడే సాధనం భాష, మాట. భాష ఎంత గొప్ప పనిముట్టో ఎప్పుడయినా ఆలోచించారా? ఎవరు సృష్టించిన పనిముట్టో ఎప్పుడయినా యోచిం చారా? ఖుర్‌ఆన్ ఇలా సమాధానమిస్తుంది: ”కరుణామయుడు (అల్లాహ్‌ా). ఖుర్‌ఆన్ నేర్పాడు. ఆయనే మనిషిని పుట్టించాడు. ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు”. (అర్రహ్మాన్: 1-4)
”భూమ్యాకాశాల సృష్టి, మీ భాషల్లో, రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (అల్లాహ్‌ా శక్తి) సూచనల్లోనివే. విజ్ఞులకు ఇందులో అనేక నిదర్శనాలున్నాయి”. (అర్రూమ్: 22)
అంతే కాదు, భూమ్యాకాశాల సృజనకు పూర్వమే లిపి దాని పరికరం అయిన కలం మరియు గ్రంథాన్ని (లౌహె మహ్ఫూజ్) అల్లాహ్‌ా సృష్టిం చాడని ప్రవక్త (స) వారి ప్రవచనం ద్వారా రూఢీ అవుతోంది. నీరు మరియు అర్ష్, లౌహె మహ్ఫూజ్ తర్వాత ”కలాన్ని సృష్టించాడు. ప్రాణులన్నింటి విధిరాతను వ్రాయమని అల్లాహ్‌ా దానికి ఆజ్ఞాపించాడు. అప్పుడది ఆది నుండి అంతం వరకూ జరిగే విషయాలన్నింటిని లిఖిం చింది”. (తిర్మిజీ)
భాష ఎంతో అద్భుతమయినది. మనిషి ఎవరయినా అతను మాట్లాడే భాషను బట్టి, యాసను బట్టి ఇట్టే పట్టేయచ్చు. అయితే ఎంతో కరుణా జనకంగా, కోమలంగా, ఆనందాయకంగా, గొప్పగా ఉండే ఈ బాషే ఒక్కోసారి – ఎంతో చండప్రచండంగా, ఎంతో బాధాకరంగా, ఎంతో జుగుప్సాకరంగా, ఎంతో కఠోరంగా, కర్ణపేయంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, భాష బాగా నేర్చుకోవడం , నేర్చుకున్న ఆ బాసను బాగా పలకగలగటం చాలా వ్యయప్రయాసతో కూడిన అంశం గనక. ఒక భాష, అది మాతృ భాషయినా అందులో సమాసాలు, కర్త, క్రియ, కర్మలు, యాసలు, మాండలికాలు, సామెతలు, భాషీయాలు, జాతీయాలు బాగా నేర్చుకోవడం ఎంతో శ్రమతో కూడిన అంశం అయినప్పుడు రెండు భాషలు నేర్చుకోవడం ఇంకెంత వ్యయ ప్రయాసతో కూడినదో ఆలోచించండి. మరి, అనువాదంలో ఇమిడి ఉన్న సమస్య అదే. అనువాదకునికి ఏక సమయంలో రెండు భాషల మీద పట్టుండి తీరాలి. అనువాదమనేది పర భాష నుండి మాతృ భాషలోకి జరుగుతుంది. అంటే అనువాదకుడు రాసే భాష అతనికి ఇంకా బాగా వచ్చి ఉండాలి. మాతృ భాషలో అతను దాదాపు నిష్ణాతు డయి ఉండాలి. నిష్ణాతుడు కావడం అంటే నిఘంటువులు కంఠపాఠం చేయడం కాదు. నిఘంటువులు పదాల అర్థాలను వివరిస్తాయేగానీ, ఏ విషయాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో చెప్పవు. తెలుగు సాహిత్యం అనువాదంతోనే ప్రారంభమయింది(ఆది కావ్యం). ఆ విధంగా అనువాదం మన నిత్య జీవితంలో విడదీయరాని భాగ మైంది. దానికి ధార్మిక సాహిత్యం మినహాయింపు కాదు.
బాష బాగా రావడం అంటే, పదాలకు కచ్చితమయిన అర్థాలు తెలిసుండాలి. ఉదాహరణకు, ‘చీకటి పడింది’ అంటారు కదా అని ‘వెలుతురు పడింది’ అనకూడదు. ‘వెన్నెల కాసింది, ఎండ కాసింది’ అంటారు కదా అని ‘చీకటి కాసింది’ అనకూడదు. భాష బాగా తెలియ డమంటే తెలుగు నుడికారమ కూడా తెలుసుండాలి. ‘నీకు నోట్లో నాలుక లేదు’ ‘వాని పాపం పండింది’ ఇలాంటి నుడికారాలు బాగా తెలుసుండాలి. ఇక అనువాద విషయానికొస్తే, హేర్ ఆయిల్ అనే మాటకి ‘వెంట్రుకల నూనె’ అని కాదు ‘తలనూనే’ అనాలి. ఇదే తెలుగు నుడికారం అంటే. అనువాదకునికి పదాలూ, నుడికారాలూ తెలిసి ఉండటమే కాదు, వాక్య నిర్మాణం బాగా చేతనై ఉండాలి. అయితే, కానీ, అయునప్పటికీ, పోతే-వంటి పదాలను సందర్భానుసారం ఉప యోగించే నైపుణ్యం ఉండాలి. అతను అనువాదాలు చేయడానికి ముందు తెలుగులో సొంత రచనలు చేసి ఉంటే వాక్య నిర్మాణ సాధక బాధకాలు అతనికి కూడా తెలిసి ఉంటాయి. లేకపోతే అనువాదంతో అతను ఇబ్బంది పడటమే కాక, పాఠకులను ఇబ్బంది పెడతాడు. అదే జరిగింది, జరుగుతున్నది. ముఖ్యంగా ఇస్లామీయ సాహిత్యాన్ని అరబీ, ఉర్దూ భాషల నుండి అనువాదం చేయడంలో.
ధార్మిక సాహిత్య అనువాదం వరకూ పై ఫేర్కొనబడిన విషయాలతో పాటు ఆయా బాషల్లోని మాండలికాలు, జాతీయాలు, భాషీయాలు తెలిసి ఉండటంతోపాటు ఓ పదానికి భాషా పరమయిన అర్థాలు, షరీ అతు పరిభాషలో దానికున్న అర్థాలు, ఇస్లామీయ పారభాషికాల గురించి సయితం అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఇస్లామీయ సాహిత్యం అధిక శాతం ఉర్దూ నుండి తెలుగీకరించడం జరుగుతుంది గనక, ఉర్దూ మరియు తెలుగు గురించి కొన్ని విషయాలు తెలిసుం డాలి. సాధారణంగా ఉర్దూలోగానీ, అరబీలోగానీ ఓ వాక్యం ఉందను కోండి. ఆ వాక్యమంతా మనకు అర్థమయిపోతుంది. ఆ వాక్యంలో ప్రతి పదానికి తెలుదు పదం చెప్పగలము కూడా. అయినా అన్ని పదాలు కలిపి తెలుగు వాక్యం రాయడం కష్టమవుతుంది. ఉర్దూ, అరబీ వాక్య నిర్మాణానికి, తెలుగు వాక్య నిర్మాణానికి చాలా భేదం ఉంటుంది. కర్త, క్రియ, కర్మలు తెలుగులో వేరు, అరబీలో వేరు. క్రియా విశేషణం (త్వరగా వెళ్ళు) తెలుగులో క్రియకుముందు వస్తే, అరబీలో క్రియ తర్వాత వస్తుంది (ఇజ్‌హబ్ సరీఅన్). వభక్తి ప్రత్యయం తెలుగులో విశేష్యానికి తర్వాత వస్తే (ఖైతాన్ వరకు) అరబీలో ముందు వస్తుంది (ఇలా ఖైతాన్). ఇంకో పెద్ద భేదం ఏమిటంటే, అరబీ ఉర్దూలో వాక్యం ఎంత పొడవ యినా ఉంటుంది. తెలుగులో అంత పెద్ద వాక్యం సాధారణంగా కుద దు. వాక్యం మరీ పెద్దదిగా ఉన్నప్పుడు దాన్ని చిన్న, చిన్న వాక్యాలుగా విడగొట్టడం సాధ్యమయితే, అలా చేయడమే మంచిది. కానీ, ఒక్కోసారి వాక్యమంతటా ఒకే భావం ఏకసూత్రంగా ఉంటుంది. సాధారణంగా వాక్యమంటే ఒక సంపూర్ణ భావాన్ని వ్యక్తిం చేసే యేకకం (యూనిట్) కదా. అలాంటప్పుడు వాక్యాన్ని ముక్కలు చేస్తే ఆ భావం కూడా ముక్కలు ముక్కలై సారహీనం కావడమో, విరూపం చెందడమో, సర్వ నాశనం కావడమే జరుగుతుంది. అట్టి వాక్యాన్ని అనువదించేట ప్పటికీ అనువాదకునికి సింహం జూలుతో జడేసేతంట పని అవుతుంది.
ఇంకా బాగా అర్థం కావాలంటే కొమదరు మాట్టాడే మాటల్ని గానీ, చేసే అనువాదాన్ని గానీ ఓ పది నిమిషాలు వింటే, చదివితే చాలు. అతకని మాటలూ, పొసగని సమాసాలూ, కర్తతో సంబంధం లేని క్రియలూ, క్రియతో సంబంధం లేని కర్మలూ, ఛిన్నాభిన్మయిన వాక్యాలూ, చిత్రవధకు గరైన వ్యాకరణమూ – ఒక్కటేమిటి, భాషలో ఎన్ని రకాల తప్పులు ఉండగలవో అన్నీ దర్శినమిస్తాయి. ఇస్లామీయ సాహిత్య అనువాదకులే బహు అరుదు. ఆ కొందరిలో కొందరు తప్ప తప్పులు లేకుండా రాయగల వాళ్ళు లేరని బల్ల గుద్ది మరీ చెప్పగలం. తప్పులంటే, అర్థం తెలియకుండా వాడబడిన పదాలూ, అన్య దోషాలు, అయోమయమైన వాక్యాలూ, అర్థం తెలియని పారబాషికాలు మొదల యినవి.
అనువాదమంటే మూల భాషలో ఉన్న విషయాన్ని లక్ష్యభాషలోకి మార్చడం అని ముందే చెప్పుకున్నాం. కానీ మూల భాషలో ఉన్న భావాన్ని నూటికి నూరుపాళ్లూ ఖచ్చితంగా, స్పష్టంగా లక్ష్యభాషలో చెప్పాలంటే సమస్య. అదేమంటే, ప్రపంచంలోని భాషలన్నింటికీ ఒకే స్వబావం లేదు. దేని స్వభావం దానిదే. దేని సాంప్రదాయం దానిదే. ఒక భాషకు వర్తించే విషయాలు మరొక భాషకు వర్తించవు. ఒక ప్రాంతంలోని భాయ స్వభావాన్నీ, సంప్రదాయాలనూ ఆ ప్రాంతంలోని శీతోష్ణ స్థితీ, భౌగోళిక పరిస్థితులూ, వాతావరణమూ, పరిసరాలూ, ఆ ప్రాంతపు మతమూ, ఆచారాలూ, విశ్వాసాలూ లాంటి అనేక విష యాలు ప్రభావితం చేస్తాయి. అందు వల్ల ఒక భాషలోని పదాలన్నిటి కీ కచ్చితంగా సమానమయిన అర్థం గల పదాలు మరొక భాషలో ఉం డవు. ఉదాహరణకు – ‘సారీ, ధోతి’ ఏ భాషలో వాడినా అలానే వాడాల్సి ఉంటుంది. అలాగే ‘కోట్, టై, ప్యాంటు’ వంటి పదాలు తెలుగులో లేవు. కాబట్టి ప్రతి పదానికి, ప్రతి పారభాషికాన్ని అంధ్రీక రించాలనుకోవడం శుద్ధ అవివేకం. ‘వివేకం అంటేనే ఏ వస్తువును ఎక్కడ, ఎలా పెట్టాలో అక్కడ అలా పెట్టడమే కదా!’.
ఉదాహరణకు, నుబువ్వత్. రిసాలత్‌లో నుబువ్వత్ – నబా (కబురు) అన్న ధాతువు నుంచి వచ్చిన పదం. నబీ అంటే వార్తికుఁడు, వార్తా వహుఁడు, ప్రవక్త (చక్కగా మాట్లాడువాడు), దూత అని. రసూల్ – ఇర్‌సాల్ (పంపడం) అన్న ధాతువు నుండి వచ్చిన పదం. రసూల్ అంటే సందేశహరుడు. షరీఅతు పరిభాషలో నబీ అంటే దైవదౌత్యం ప్రసాదించబడిన వ్యక్తి. రసూల్ అంటే దైవదౌత్యంతోపాటు సరికొత్త ధర్మశాస్త్రాన్ని కూడా ప్రసాదించబడిన వ్యక్తి. ఆ రకంగా అన్బియా (నబీ బహు వచనం) సంఖ్య 1లక్ష 24 వేలయితే వారిలో రుసుల్ (రసూల్ బహు వచనం) 315 మంది. ఆ విధంగా రసూల్ నబీ కాగలరు. నబీ రసూల్ కాలేరు. ఉదాహరణకు ఇబ్రాహీమ్ (అ) ఏక సమయంలో రసూల్ మరియు నబీ అయితే, అదే కాలానికి చెందిన ఇస్మాయీల్, ఇస్హాఖ్, లూత్ (అలైహిముస్సలామ్) కేవలం నబీ మాత్రమే. కొందరు నుబువ్వత్ అనే అరబీ పదానికి దైవదౌత్యం అనడానికి బదులు ప్రవక్తత్వం అని అర్థం లేని అనువాదం చేసి తామేదో కొత్త పదాన్ని కనుక్కున్నట్లు సంబర పడిపోతుంటారు. ప్రవక్తత్వం ఇట్టి పదం తెలుగులో ఉందా లేదో కూడా తెలీదు పాపం. ప్రవక్త అంటే చక్కగా మాట్లాడేవాడు అని పైన తెలుసకున్నాము. ప్రవక్తత్వం అంటే చక్కగా మాట్లాడే తత్వమా నుబ్వుత్ అంటే?
తౌహీద్ అంటే అరబీ భాషా పరంగా ఏకం, ఒక్కటిగా భావించడం అనే అర్థాలొస్తాయి. అదే షరీఅతు పరంగా – సృష్టించడంలో, పరిపా లించడంలో, పర్యవేక్షించడంలో అల్లాహ్‌ాను ఏకైక దైవంగా , సాటి లేని మేటిగా భావించడం. సకల ఉపాసనా రీతుల్ని, ఆరాధన భావంతో ఖియామ్, రుకూ, సజ్దా, దుఆ చేయడాన్ని, ఆశ మరియు భయం కలిగి ఉండటాన్ని అల్లాహ్‌ాకు మాత్రమే ప్రత్యేకించడం. ఆయన తన గురించి తన అంతిమ గ్రంథమయిన ఖుర్‌ఆన్‌లో, ఆయన ప్రవక్త ముహమ్మద్ (స) తన ప్రవచనాలలో తెలియజేసిన సమాచారాన్ని, నామాలను, గుణ గణాలను వక్రభాష్యాలు చెప్పకుండా, వంకలు పెట్టకుండా, పోలికను కల్పించకుండా, లేని వివరణలు ఇవ్వకుండా, మార్పుచేర్పులకు ఒడి గట్టకుండా విశ్వసించడం. అంటే తౌహీద్‌ను భాషా పరంగా తెలుగులో ఒకట్రెండు పదాలలో అనువదించే అవకాశం ఉన్నా షరీఅతు పరంగా ఒకట్రెండు పదాలలో కుదరదు. ఇదీ వాస్తవం అని తెలిసినా ప్రతి దానికి తెలుగు రూపం ఇవ్వాలనుకునే ఔత్సాహికులు కొందరు తౌహీద్ పారభాషికాన్ని తౌహీద్ అని వ్రాసి బ్రాకెట్‌లో వివరణ ఇవ్వడానికి బదులు తెలుగీకరించే ప్రయత్నంలో అభ్యంతరకరం కానివి కొన్నయితే మరికొన్ని చాలా భయంకరమయినవి. దేవుని ఏకత్వం, ఏకైకత్వం, ఏకదైవారాధన, ఏకత్వభావన అనే అనువాదాలు పర్వాలేదనిపిస్తే, తౌహీద్‌ను అద్వైత సిధ్ధాంతం అని అనువాదం చేయడం మరికొందరికే చెల్లింది. శాకాహారానికి బదులు శాఖాహారము రాయడం ఎలాగో అల వాటేగా అని ఊరుకుందామంటే కుదరదు. ఇది ఇస్లాం ధర్మానికి చెందిన అంశం, ఇస్లాం ధర్మానికే పునాదయిన తౌహీద్‌కు సంబంధిం చిన విషయం. ఇక్కడ సదరు అనువాదకుడు చేసిన ఘోర తప్పిదం మత సంబంధిత పారభాషికాల గురించి తెలుసుకోక పోవడం.
గాలీ, నీరు, నిప్పు, భూమీ, ఆకాశం అనే పంచ భూతాల సమ్మేళనం మనిషి కాబట్టి ఐదు అడుగుల పొడవయిన చేతికర్రను (జ్ఞానానికి సంకేతం అనబడే అశ్వద్ధ వృక్షం – రావి చెట్టు కర్ర) ధరిస్తాము అన్నది దాన్ని ధరించే వారి మాట. వారిలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అని మూడు సిద్ధాంతాలు గలవారుంటారు. ఒకే ఒక్క కర్రను ధరించిన వారు అద్వైత సిధ్దాంతాన్ని అనుసరించే వారు. అద్వైతం అంటే, జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అని. అంటే మనిషిలోనే దేవుడున్నాడని, దీన్నే సూఫీల భాషలో వహ్‌ాదతుష్ హుషూద్ అంటారు. (శ్రీ శంకరాచార్య మతం).
రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి చేత ధరించేవారు ద్వైత సిద్ధాంతం కలవారు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు మధ్యాచార్యుడయులయితే, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు రామాను జాచార్యులు. ఇలాంటి వారెందరో ఈ సిద్ధాంతానికి ఆదరువుగా నిలి చారు కాబట్టి భారత దేశంలో ఇదే ఎక్కువగా కనబడుతుంది. ఈ సిద్ధాంత బోధకుల్ని ‘జీయరు’ అని పిలుస్తారు. దీన్ని సూఫీలు వహ్‌ాదతు ల్ వుజూద్ అని నామకరణం చేస్తారు.
మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకునే వారు కూడా ఉన్నారు. దీన్ని ‘తత్వత్రయం’ అంటారుమిలా మొత్తం బారత దేశంలో దైవం గురించి విభేదించుకుని పుట్టిన సిధ్థాతాల సంఖ్య వందకు పై చిలుకే. అంతిమంగా అన్నింటిలోనూ దాగున్న అంశం షిర్క్, బహుదైవో పాసన, విగ్రహారాధనే. వీటికి ఇస్లాంతోగాని, తౌహీద్‌తోగానీ దూరపు సంబంధం కూడా లేదు. అద్వైతం అనే మాటకు అర్థమేమిటో అనువా దకునికి తెలియనప్పుడు, ఏది సకర్మమో, ఏది అకర్మమో ఎలా తెలు స్తుంది. అందువల్లే ఈ పదం మన కర్మ అయింది.
అలాగే వ్యక్తి నామాన్ని అనువదించే సంప్రదాయం మీరెక్కడయినా చూశారా? ఉదా హరణకు ఒక వ్యక్తి పేరు అహ్మద్ అనుకోండి. ఏ భాషలో వ్రాసినా అహ్మద్ అనే వ్రాస్తారుగాని ‘అత్యధికంగా దైవాన్ని స్తుతించే వాడు’ అని అనువాదం చేయరు కదండి! ఆఁ అతనిలోని ప్రతిభకు సంబంధించిన నామాలను అనువాదం చేసుకునే వీలుంటుంది. తను టైలరో, ఫార్మరో అయి ఉంటే దర్జీగా, రైతుగా అనువాదం చేసుకోవచ్చు. విషయం ఇంత చక్కగా అర్థమవుతున్నా కొందరు నిజ ఆరాధ్యుడి పేరయిన అల్లాహ్‌ాను సయితం తెలుగీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ‘కోడి గుడ్డుకి ఈకలు పీకడం అంటే ఇదే నేమో!’ పైగా ‘అల్లాహ్’ అన్న నామం ముస్లిమేతరు లకు అర్థం కాదని, వారి సౌకర్యార్థం దాన్ని దేవుడు అని అనువాదం చేయడంలో తప్పు లేదని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అలా అని ఇతర నామాల విషయంలో అలా చేస్తారా? అంటే అదీ లేదు.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా ముహమ్మదుర్రసూలుల్లాహ్‌ా’ సద్వచనాన్ని అనువాదం చేస్తూ ముహమ్మద్ (స) వారి నామాన్ని చక్కగా వాడే వీరే అల్లాహ్‌ా నామాన్ని అలానే రాయడానికి నామోషీగా ఫీలవుతారు. ముహమ్మద్ (స) నామాన్ని అర్థం చేసుకున్న పాఠకులు అల్లాహ్‌ా నామాన్ని అర్థం చేసుకో లేరు అన్నదా వీరి వాదనా? అలా ఖుర్‌ఆన్‌లో ఎక్కడెక్కడ అల్లాహ్‌ా అని వచ్చిందో దాదాపు అన్ని చోట్లా దేవుడు, దైవం, దేవ దేవుడు అన్న అనువాదాలతో అల్లాహ్‌ా నామం విషయంలో దౌర్జన్యాని కి ఒడి గడుతున్నారు. అల్లాహ్‌ా అంటే అర్థం నిజంగా దేవుడనేనా కాదా? అని కూడా తెలియని స్థితి. చివరిగా ఖుర్‌ఆన్ ఏ ఒక్క వర్గం, మతం కోసమో అవతరించిన గ్రంథం కానప్పుడు అందులోని నామాల ను ఏ కొందరి కోసమో ఖూనీ చేయడం ఎందుకు? అల్లాహ్‌ా గుణ గణాలను అనువాదం చేయడంలో తప్పు లేదుగానీ, అసలు నామాన్నే అనువాదానికి బలి చేయడం నిజంగా అమానుషం!
అచ్చు తప్పులు దాదాపు పత్రికలలో వస్తున్నవే. అది రచయిత తప్పు కాకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం రచయిత, అనువాదకుని వల్ల జరిగిన తప్పులే. అలా అని తప్పులన్నీ రచయిత అజ్ఞానం వల్ల జరిగిన తప్పులే అనుకోలేము. వారి అశ్రద్ధ, నిర్లక్ష్యం, ఏమరుపాటు, వల్ల జరి గిన తప్పులు కూడా ఉంటాయి. లేదా అర్థం సరిగా తెలియక అసం దర్భంగా వాడిన పదాలూ కావచ్చు. శబ్ద స్వరూపం తెలియక వాడిన అపశబ్దాలూ కావచ్చు.
చివరిగా ఒక మాట – ”తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు” అన్న వేమన అన్న మాట నిజమే కావచ్చు. మనం ఇతరుల తప్పులు ఎత్తి చూపుతున్నామంటే, మన తప్పులు మనకు తెలియవనే దాని అర్థం – మనం తప్పులు చేయమనీ కాదు, చేయలేదనీ కాదు. మనం చేసిన తప్పులు ఇతరుల ద్వారా తెలుసుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. కొంత కాలం తర్వాత మన తప్పుల్ని మనమే గుర్తించిన సందర్భాలూ లేకపోలేదు.అయితే మాటల తూటాలు పేల్చి, అడ్వాన్సు తిట్ల తాం బూలంతో తమ తప్పులను రక్షణ దుర్గం నిర్మించుకునే కుసంస్కారు లను లక్ష్య పెట్టకుండా సాహిత్యంలోనయినా, సత్యధర్మ విషయంలో నయినా మన కర్తవ్యాన్ని మనం సజావుగా నిర్వహించక తప్పదు. ఈ విషయంలో మహనీయ ముహమ్మద్ (స) వారి అమృత పలుకులే మనందరికి శిరోధార్యాలు!
”మీ ఎవరయినా ఓ అయిష్టకర విషయాన్ని చూస్తే దాన్ని తన చేత్తో (బలంతో) ఆపాలి. లేదా తన నోటి (మాట బలం)తో ఆపాలి. అదీ సాధ్య పడకపోతే దాన్ని కనీసం మనసులోనయినా అసహ్యించుకోవాలి. ఇది విశ్వాసపు అధమ స్థాయి అని గురర్తించాలి”. (ముస్లిం)