అదృష్టం పండాలంటే…

adrushtam-pandalante

అబ్బాసీ ఖలీఫా హారూన్‌ రషీద్‌ ‘దజ్లా’ నది ఒడ్డున ఓ బ్రహ్మాండమ యిన కోట ఒకటి నిర్మించాల్సిందిగా ఫర్మానా జారీ చేసాడు. కోట పనులు పూర్తయి సందర్భంగా అనేక కవుల్ని పిలిపించి ఆ కోటను గురించి వర్ణించ వలసిందిగా కోరాడు. వచ్చిన ఆ కవుల్లో ‘అబూ అతాహియా’ అనే కవి తన కవిత్వాన్ని విన్పిస్తూ –
”మీకు నచ్చినట్లు విలాసవంతమయిన కోటల్లో జీవిత మకరందాల్ని ఆస్వాదించండి. మీ మనసుకు నచ్చే, మీరు మెచ్చే ప్రతి వస్తువు ఉదయం సాయంత్రం మీ ముందర హాజరు పరచ బడుతుండాలి”.
ఇది విన్న హారూన్‌ రషీద్‌ ఎంతో సంతోషించాడు. ఇంకా చెప్పా ల్సిందిగా కోరాడు. అప్పుడా కవి అన్నాడు:
”గుండెలోని ప్రాణం గొంతు దాటే ఘడియ సమీపించినప్పుడు, మనసులోని లావా పెల్లుబికినప్పుడు..అప్పుడు తెలుస్తుంది…నీవు కూడబెట్టుకున్నదంతా ఒఠ్ఠి మాయా వస్తువు తప్ప మరేమీ కాదని”. (సర్వం వదలి కాటి మట్టిలో కలవాలని).
ఈ పలుకులు హారూన్‌ రషీద్‌పై పిడుగులై పడ్డాయి. బోరున విలపించసాగాడు…మొత్తం ఆ కోటను కూలదోయించేశాడు..పూర్వం ఎలా ఓ సాధారణ బంగళాలో ఉండేవాడో అందులోనే నివాసముండ సాగాడు. ఎందుకో తెలుసా?
సంతోషం, సంతృప్తి, అదృష్టం, మనశ్శాంతి మనిషి ప్రేమతో పెంచుకున్న తోటల్లో లేదు, మక్కువతో కట్టుకున్న ఎత్తయిన కోటల్లో లేదు, ఇష్టంగా తొడుక్కున్న కొత్త బట్టల్లో లేదు, కూడబెట్టుకున్న అపార ధనగారాల్లో లేదు, అంతస్థుల్లో లేదు, అధికారంలో లేదు… మరెక్కడ ఉంది? వాటన్నింటినీ మనిషికి ప్రసాదించిన ఆ వరప్రదాత అధీనంలో మాత్రమే ఉంది.
అదృష్టం పండాలని, సంతోషంగా ఉండాలని, మది నిండా సంతృప్తి నిండాలని మనలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏ కోటల్లోనూ, మరే సూపర్‌ మార్కెట్లల్లోనూ దొరకని ఈ అదృష్టాన్ని అందరూ కోరుకోవడం ఆశ్చర్యం కదూ! అది మనకు దక్కాలంటే, దాన్ని మనం సొంతం చేసుకోవాలంటే-దాని నిజ నిర్మాతను గురించి తెలుసుకొని, ఆయన్ను రాజీ పర్చుకుంటే చాలు, దాన్నెలా పొందాలో, ఎందులో అది లభించగలదో ఆయనే సెలవిస్తాడు. మరి ఆ అదృష్టకర్త ఎవరం టారా? ఆయనే మనందరి నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌. మనం పురిటిలో ప్రాణం పోసుకోక ముందే మన రాతల్ని వ్రాసిన ఆయన మాత్రమే మనకు ఆదృష్టాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వగలడు. సంతోషం, సంతృప్తి, ప్రశాంతత అనేవి మానసికమయినవి. అవి దేనీ వల్ల ప్రాప్తిస్తాయో స్వయంగా అల్లాహ్‌ తెలియజేస్తున్నాడు: ”గుర్తుంచుకోండి! అల్లాహ్‌ా నామ స్మరణ వల్లనే హృదయాలు నెమ్మదిస్తాయి”. (అర్రాద్‌:28)
అంటే, మనం అల్లాహ్‌ాకు ఎంతగానయితే దగ్గరవుతామో అంతే మనం అదృష్టాన్ని, మనశ్శాంతిని, నెమ్మదిని, సంతృప్తిన పొంద గలము. మనల్ని అల్లాహ్‌కు దగ్గర చేసే ఆ అమల సాధనం ఏమిటో తెలుసా? ”దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండే స్థితి-అతను సజ్దా చేసే స్థితి” అన్నారు ప్రవక్త (స). (అహ్మద్‌, ముస్లిం)
ఎలాగయితే పాలు త్రాగె పసికందు తల్లి ఒడికి చేరాక ప్రశాంతత ను పొందుతుందో, ఇక తను సేప్‌ అని భావిస్తుందో, అలాగే అల్లాహ్‌ దాసులమయిన మనం అల్లాహ్‌ా సన్నిధిలో సజ్దా చేసి మనశ్శాంతిని పొందుతాము.
మనిషి ఏదయినా రంగంలో అభివృద్ధిని సాధించాడంటే, ఆర్థికంగా ఎదిగాడంటే అతనికి సంతోషం కలుగుతుంది. ఇది సహజమే. మరి మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళే అత్యద్భుత అస్త్రం ఏమిటో తెలుసా?”అల్లాహ్‌ ప్రసన్నత కోరుతూ ఎవరు ఎంత వినయాన్ని కలిగి ఉంటారో అల్లాహ్‌ వారిని అంతే ఎత్తుకు తీసుకెళతాడు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
అంటే, అతను ఎదుగుతూ, ఎదుగుతూ స్వర్గానికి, అక్కడి నుండి స్వర్గ శిఖర అగ్ర భాగమయి ఫిర్‌దౌస్‌కి చేరుకుంటాడు. ఇక స్వర్గానికి మించిన అదృష్ట స్థలం, సంతోష ఆలయం, శాంతి నిలయం, నెమ్మది నెలవు మరొకటి ఉందా? లేదు. స్వర్గం గురించి తెలియజేస్తూ – ”స్వర్గంలో ఒక్క బాణం పెట్టుకుణేంతటి చోటు లభించినా అది ప్రపంచ సకల సంపదలకంటే ఎంతో మేలయినది” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)అల్లాహ్‌ తన స్వహస్తాలతో తయారు చేసిన ఆ స్వర్గ ధామంలో, ఫిర్‌ దౌసుల్‌ ఆలాలో ప్రవక్త (స) వారి సహచర్యం లభించ డం ఎంత భాగ్యంతో కూడుకున్న విషయం!

హజ్రత్‌ రబీ బిన్‌ కఅబ్‌ (ర) గారు ప్రవక్త (స) వారి సేవ చేసుకునే వారు. ఓ రోజు ప్రవక్త (స) ఆయన్ను ఉద్దేశించి- ”నువ్వు నా నుండి ఏం ఆశిస్తున్నావో అడుగు” అన్నారు. అందుకాయన – ‘నేను స్వర్గం లో మీ తోడును కోరుకుంటున్నాను’ అని సవినయంగా సమాధాన మిచ్చారు. అది విన్న ప్రవక్త (స) – ‘అది మినహాయించి ఇంకేదయినా కోరుకుంటున్నావా?’ అని ఆరా తీశారు. ‘నాకు అదొక్కటే చాలు, ఇంకేమీ వద్దు’ అన్నారు ఆ సహాబీ. అప్పుడు ప్రవక్త (స) – ”అయితే నువ్వు నీ విషయంలో నాకు అత్యధికంగా సజ్దాలు చేసి సహకరించు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
స్వయంగా ప్రవక్త (స) వారు కలత చెందినప్పుడల్లా బిలాల్‌ (ర) గారిని ఉద్దేశించి – ”ఓ బిలాల్‌ నమాజు ద్వారా మమ్మల్ని సంతృప్త పరచు” అని అంటుండేవారు. అలాగే- ”నా కంటి చలువ నమాజులో ఉంచబడింది” అంటుండేవారు. స్వయంగా అల్లాహ్‌ ప్రవక్త (స) వారినుద్దేశించి -”నీ ప్రార్థన వారి కోసం ప్రాశాంత సాధన” (తౌబహ్‌ా: 103) అని కితాబు ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే – ”మన నమాజు మన అదృష్టానికి ఆనవాలు”.
ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) కథనం- నేను షేఖుల్‌ ఇస్లాం ఇబ్ను తైమియా (ర) గారిని చెబుతూ విన్నాను: ”నిశ్చయంగా భూలోకంలో ఓ స్వర్గం ఉంది. అందులో ఇక్కడుండి ప్రవేశించలేని వ్యక్తి పరలోకపు ఆ సిసల యిన స్వర్గంలో ప్రవేశించ లేడు”.

మరో సందర్భంలో ఆయన అన్న మాట -”నా శత్రువులు నన్నేం చేసుకుంటారు. నా స్వర్గం, నా బృందావనం నా మదిలోనే ఉంది. నేనెక్కడికెళ్ళినా అది నాతోనే ఉంటుంది….నన్ను ఖైదు చేస్తే అది నా ఏకాంతం…నన్ను హత్య చేస్తే అది నా వీర మరణం-షహాదత్‌. నన్ను నా దేశం నుండి వెలివేస్తే అది నా విహారం”.

Related Post