అనుమాన భూతం

Doubt

దాంపత్య జీవితం   – – అది నమ్మకం అనే బీజంతో ఎదిగే మహా వృక్షం.

దాంపత్య జీవితం – అది కేవలం అనుమానం అన్న విష వైరస్‌తో పుటుక్కుమని తెగిపోయే పచ్చి దారం.  కాబట్టి ఆలుమగలు తాము, కట్టుకునే అనురాగ గోపురంలో  విష వాయువులు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే రాను రాను అవి పెనుభూతాలుగా మారి ఏకంగా ఇద్దరి జీవితాల్ని మింగేసే ప్రమాదముంది. భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే వారు షరీయతు సూచించిన హద్దులను గౌరవిస్తూ ఎవరి పరిమితుల్లో వారుండాలి. ఒకవైపు వేరుగా బ్రతకలేము అని చెబుతూనే భార్య మీద భర్త, భర్త మీద భార్య ఫిర్యాదు చేస్తూ తిరగటం నిరర్థకం, నిర్హేతుకం. ఒకరిలో ఉన్న లోపాలను ఇంకొకరు పెద్ద మనస్సుతో మన్నించాలి. ఏదేని విషయంలో మనిషి తీవ్ర సందిగ్ధానికి లోనైనప్పుడు ఖుర్‌ఆన్‌ వచనాల, ప్రవక్త (స) వారి ప్రవచనాల వెలుగులో పరిష్కారం చూపే పండితులను, వివేచనాపరులను,  స్థితప్రజ్ఞులను సంప్రదించటం ఎంతో ఉత్తమం. ఆ మేరకు ఉపయోగపడే దైవ ప్రవక్త (స) వారి రెండు ప్రవచనాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.

ఓ పల్లెటూరి వ్యక్తి దైవ పవ్రక్త (స) వారి సన్నిధికి వచ్చి – ”యా రసూలల్లాహ్‌! నేను తెల్లన, నా భార్య తెల్లన. కాని మాకిద్దరికి పుట్టిన పిల్లాడు నల్లన” అని భార్య మీద తనకున్న అనుమానాన్ని వ్యక్తపర్చాడు. అది విన్న ఆదర్శ పవ్రక్త (స) ”రెండు ఎరన్రి ఒంటెలకు బూడిద రంగు ఒంటె పుట్టడం నీవు గమనించి ఉంటావు కదా! అది ఎలా సాధ్యం అయ్యిందంటావు?” అని ఎదురు పశ్న్ర వేశారు. అందుకా వ్యక్తి ”బహుశా వాటి తాతముత్తాతలలో ఎవరి పోలికయినా వచ్చి ఉంటుంద”ని సమాధానమిచ్చాడు. ”అదే విధంగా నీ కొడుక్కి కూడా నీ వంశస్థుల్లోని ఎవరి రంగయినా వచ్చి ఉంటుంది” అని దైవ పవ్రక్త (స) సెలవిచ్చారు. (ముస్లిం)

హజత్ర్‌ ఆయిషా (ర) కథనం – ఒక రోజు దైవ పవ్రక్త (స) సంతోషాతిశయంతో నా దగ్గరకు వచ్చారు. ఆయన ముఖారవిందం పక్రాశిస్తూ ఉంది. నన్నుద్దేశ్యించి ఆయన ఇలా అన్నారు: ”నీకు తెలుసా! ముజజ్జిజ్‌ ముద్‌లజీ ఇప్పుడే జైద్‌ బిన్‌ హారిసా మరియు ఉసామా (ర)ను చూసి ”ఈ కాళ్ళు పరస్పరం పోలికలు గలవి” అని అన్నారు (బుఖారీ, ముస్లిం)

అంటే – ఆ సమయంలో వారిరువురి ముఖాలపై దుప్పటి ఉంది. పాదాలు మాత్రం కన్పిస్తున్నాయి. కేవలం పాదాలు చూసి ముఖ సాముద్రిక విద్యలో నిష్ణాతుడైన ముద్లిజ్‌ తెగకు చెందిన ముజజ్జిజ్‌ నిదురిస్తున్న వారిద్దరూ ఒకే  వంశ వృక్షానికి చెందినవారని చెప్పడం మహా ప్రవక్త (స) వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటికే ఉసామా బిన్‌ జైద్‌ (ర) నలుపు రంగుపై కొంత మంది చెవులు కోసుకుంటున్నారు. ఉసామా గారి తండ్రి జైద్‌ బిన్‌ హారిసా (ర) తెల్లగా ఉండటం వారి సంశయానికి అసలు కారణం. ప్రస్తుతం రక్త పరీక్ష  వల్ల ఈ పని సులువైపోయినప్పటికీ ఆ సౌకర్యం లేని, దాని గురించి తెలియని ప్రదేశాల్లో నివసించే ప్రజలకు ఇందులో అనేక నిదర్శనాలున్నాయి.

Related Post