ధర్మ సందేహాలు

మొబైల్‌ ఫోన్లలో మ్యూజికల్‌ ట్యూన్స్‌పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంగీత వాయిద్యాలు చివరకు మస్జిదులలో, ప్రార్థనల్లో కూడా మ్రోగుతున్నాయి. ప్రార్థనల్లో ఏకాగ్రత దెబ్బతింటోంది కదా!

మొబైల్‌ ఫోన్లలో మ్యూజికల్‌ ట్యూన్స్‌పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంగీత వాయిద్యాలు చివరకు మస్జిదులలో, ప్రార్థనల్లో కూడా మ్రోగుతున్నాయి. ప్రార్థనల్లో ఏకాగ్రత దెబ్బతింటోంది కదా!

– నెలవంక

మొబైల్‌ ఫోన్లో సంగీత వాయిద్యాలు

సందేహం: మొబైల్‌ ఫోన్లలో మ్యూజికల్‌ ట్యూన్స్‌పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంగీత వాయిద్యాలు చివరకు మస్జిదులలో, ప్రార్థనల్లో కూడా మ్రోగుతున్నాయి. ప్రార్థనల్లో ఏకాగ్రత దెబ్బతింటోంది కదా!

సమాధానం: మొబైల్‌ ఫోన్లలో సంగీత వాయిద్యాలు, పాటలు లోడ్‌    చేయటం అధర్మం (హరామ్‌). పై పెచ్చు అటువంటి వాయిద్యాలు మస్జిదులలో వినవస్తే  అది మరింత తీవ్రమైన, జుగుప్సాకరమైన వ్యవహారం అవుతుంది. ఎందుకంటే దైవనామస్మరణ జరిగే పవిత్ర స్థలాలలో అపసవ్యతను, రోతను పుట్టించే వికృత చేష్ట అది! కాబట్టి అటువంటి ఏహ్యకరమైన చేష్టకు పాల్పడేవాడు ఎక్కువ పాపాత్ముడు అవుతాడు.
మస్జిదులు అల్లాహ్‌ా ఆరాధనకై ప్రత్యేకించబడినవి. కాబట్టి ఆ పవిత్ర స్థలాలలో అల్లాహ్‌ానే మొరపెట్టుకోవాలి. వేరితరులను మొరపెట్టుకోవటంగానీ, వేరితర గాత్రం అక్కడ వినిపించటం గానీ ఎంతకీ తగదు. అలాంటి వెకిలిచేష్టలకు పాల్పడేవారు తమ కర్మల రికార్డులో నమోదవుతున్న దుష్కర్మను గురించి ఆలోచించాలి.
ఒకవేళ ఈ సెల్‌ ఫోన్లు సమంజసమైన సౌండ్‌లో మ్రోగేవైనాసరే మస్జిదులలో మ్రోగనివ్వటం భావ్యంకాదు. ప్రార్థనా స్థలాల్లో వాటిని సైలెంట్‌లోనయినా పెట్టాలి. లేదంటే స్విచ్‌నయినా ఆఫ్‌ చేసుకోవాలి.  (షేఖ్‌ ముహమ్మద్‌ సాలెహ్‌ా అల్‌ముంజిద్‌)

దైవ వాక్యాలు గల పేపర్లను చిత్తుపేపర్లుగా వాడటం
సందేహం: భోజన సమయంలో దస్తర్‌ఖాన్‌ మాదిరిగా అల్లాహ్‌ా పేర్లు లేదా ఖుర్‌ఆన్‌ వాక్యాలు ముద్రించబడి ఉన్న పేపర్లను పరచుకుని భోజనం చేయవచ్చునా?

సమాధానం: ఒకవేళ ఆ పేపర్లపై అల్లాహ్‌ా పేరుగానీ, దైవ వాక్యాలు గానీ వ్రాసి ఉంటే, అట్టి పేపర్లను భోజన స్థలంలో పరచుకుని, వాటిపై కూర్చోవటం, పాత్రలు పెట్టడం ధర్మ సమ్మతం కాదు. అలాగే ఆ పేపర్లను వస్తుసామగ్రి నిమిత్తం పొట్లాలుగా తయారు చేయటం, వాటిని అవమానకరమైన రీతిలో వాడుకోవటం కూడా ధర్మసమ్మతం కాదు. అలాంటి పరిస్థితి ఎదురైనపుడు ఆ పేపర్లను సముచితమైనచోట భద్రపరచాలి. లేదా వాటిని కాల్చివేయాలి. అదీ కాదనుకుంటే వాటిని పరిశుభ్రమైన స్థలంలో పూడ్చి పెట్టాలి.  (షేఖ్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ బాజ్‌ – రహ్మ.లై)

వాయిదాల పద్ధతిపై క్రయవిక్రయాలు
సందేహం: వాయిదాల ప్రాతిపదిక (00000000000) పై కార్లు, తదితర వాహనాలు విక్రయించబడుతుంటాయి. ఇటువంటి అమ్మకాల్లో ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు నగదు ఇచ్చి కొన్నప్పుడు  వాహనం ఖరీదు 15 వేలు ఉంటే, కిస్తులవారీ పద్ధతిపై అంతకన్నా ఎక్కువ ధర ఉంటుంది. ఇలాంటి అమ్మకాలు ‘వడ్డీ’ క్రిందకు రావా?

సమాధానం: అమ్మకం సమయంలో కిస్తుల సంఖ్యతో పాటు గడువు కూడా నిర్థారించబడినట్లయితే అటువంటి క్రయక విక్రయాలు     ఆక్షేపణీయం కావు- కిస్తుల ప్రాతిపదికపై ధర ఎక్కువ ఉన్నా సరే! ఎందుకంటే కొనేవాడు, అమ్మేవాడు -ఇద్దరూ ఈ పద్ధతి ద్వారా లబ్దిపొందుతున్నారు. అమ్మకం దారునికి అధిక ధర లభిస్తుంది. కొనుగోలు దారునికి చాలినంత గడువు (వెసులు బాటు) లభిస్తుంది. హజ్రత్‌ బరీరా(ర) అనే సహాబియా (సేవకురాలు) ను ఆమె యజమానులు తొమ్మిదేండ్ల వాయిదాల పద్ధతిపై విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా(ర) కు అమ్మటం జరిగింది. ఏటేటా 40 దిర్హములు చొప్పు చెల్లించాలని షరతు విదించబడింది. దీన్నిబట్టి విదితమయ్యేదేమిటంటే వాయిదాల పద్ధతిపై వస్తువుల క్రయ విక్రయాలు ధర్మ సమ్మతమే. అదీగాక ఈ వర్తకంలో మోసంగానీ, అస్పష్టత గానీ ఏమీ లేవు. కాబట్టి ఇతరత్రా కొనుగోలు – అమ్మకాలవలే ఇది కూడా ధర్మ సమ్మతమే. కాకపోతే వస్తువును అమ్మే సమయంలో ఆ వస్తువు అమ్మకం దారుని ప్రాపర్టీగా ఉండాలి.
(షేఖ్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ బాజ్‌ – రహ్మ.లై)

నమాజు స్థితిలో టిష్యు పేపర్ల వాడకం
సందేహం: నమాజు చేస్తుండగా ఒక వ్యక్తికి దగ్గు వచ్చి, నోట్లోకి వచ్చిన తెమడా (కఫం) ఊయవలసివస్తుంది. అట్టి సమయంలో అతను టిష్యూ పేపర్‌ని ఉపయోగించవచ్చునా?

సమాధానం: నమాజు చేస్తున్నపుడు ఎవరికయినా దగ్దు వచ్చి, కఫం విసర్జించినపుడు టిష్యూ పేపర్‌గానీ, రుమాలు గానీ – జేబులో నుండి తీసి-ఉపయోగించటం అభ్యంతరకరం ఏమీకాదు. సహీహ్‌ా ముస్లింలోని ఒక ఉల్లేఖనం ప్రకారం హజ్రత్‌ అబూ హురైరా(ర) ఇలా తెలిపారు: మస్జిద్‌లోని ఖిబ్లా దిశలో ఎవరో ఉమ్మివేసి ఉండగా ప్రవక్త(స) గమనించారు. ఆయన (స) జనులనుద్దేశించి, ”మీలోని ఒక వ్యక్తికి ఏమైపోయింది, అతను తన ప్రభువు ఎదుట నిలబడి కూడా, తన నోట్లోని తెమడాను తీసి బయటపడవేస్తున్నాడు? మీలో ఎవరి ముఖంపైనయినా ఉమ్మివేస్తే దాన్ని వారు సహిస్తారా? మీలో ఎవరికయినా (నమాజు స్థితిలో) దగ్గు వచ్చి, ఉమ్మి వేయవలసి వస్తే తన కాలి క్రిందవేయాలి. లేదంటే ఈ విధంగా చేయాలి (అంటూ ఆయన తన చేతి రుమాలుపై ఉమ్మి వేసి, ఆ గుడ్డను నలిపారు)
(షేఖ్‌ ముహమ్మద్‌ సాలెహ్‌ అల్‌ముంజిద్‌)

Related Post