చెడు దృష్టి అనే నమ్మకం బారత దేశంతోపాటు దాదాపు అన్ని దేశాల్లోనూ మనకు కనబడుతుంది. ”నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది” అంటారు కొందరు. నరుని దృష్షి వల్ల నల్ల రాయి కాదు కదా నల్లి, బల్లి, పిల్లికి కూడా ఏమీ జరగదు అని వాది స్తారు మరికొందరు. చెడు దృష్టికి సంబంధించి భారత సమాజంలో ఉన్న ఆచారాలకు కొదువ లేదు. అసలు చెడు దృష్టి ఉందా? ఉంటే అందులో నిజం ఎంత? దాని నివారణా పద్ధతులేమిటి? తదితర విష యాలు తెలుసకుందాం!
”అల్ ఐను హఖ్ఖున్” దృష్టి-దిష్టి సత్యం అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (ముస్లిం హథీసు గ్రంథం) అరబీలో అల్ ఐన్ అంటే దృష్టి,దిష్షి, చెలమ అన్న అర్థాలొస్తాయి. దిష్టి అనేది కంటి చూపు వల్ల కలుగు తుంది. అది ప్రేమాభిమానాలతో కావచ్చు. ఈర్ష్యాద్వేషాల వల్లయినా కావచ్చు. దిష్టి-దృష్టి దోషం కేవలం మనయషులకే కాదు వస్తువుకు, వ్యాపారానికి, వ్యసాయానికి, సంసారానికి కూడా తగిలే అవకాశం ఉంది.ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి, ఇంట్లోవాళ్ళ దిష్టి, ఊరి వాళ్ళ దిష్టి ఇలా ఎవరి దిష్టి అయినా తగలవచ్చు,
దిష్టి ప్రస్తావన ఖుర్‌ఆన్‌లో:
”వ మిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్” – అసూయ పరుడు అసూయ చెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు శరణు కోరుతున్నాను)”. (అల్ ఫలఖ్: 5)
”అవిశ్వాసులు ఖుర్‌ఆన్‌ను విన్నప్పుడల్లా తమ వాడి చూపులతో నిన్ను జారించి పడవేసినట్లే ఉంటారు”. (దివ్యఖుర్‌ఆన్-68:51) ఈ వచనంలో చూపులతో అనగా, ఈర్ష్యాద్వేషం కారణంగా వారు నీపై అసూయాగ్నితో రగిలిపోతారు. వారి చెడు దృష్టి నుండి అల్లాహ్ శరణు వేడుకో, లేకుంటే వారి దిష్టి నీకు హాని కలిగించే అవకాశం ఉందని పై ఆయతులో సెలవియ్యడం జరిగింది. పై వచనాల ద్వారా రూడీ అయ్యే మరో విషయం చెడు చూపు నిజం అన్నది.
దిష్టి హథీసు వెలుగులో:
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”దృష్టి-దిష్టి నిజమయినది. ఒకవేళ విధిరాతను దాటే శక్తి దేనికయినా ఉంటే అది చెడు దృష్టికి ఉం టుంది” అని చెప్పడమే కాక, చెడు దృష్టికి నివారణోపాయాన్ని సయి తం ఆయన సూచించారు: ”చెడు దృష్టి ప్రభావం నుండి రక్షణ పొందడానికి స్నానం చేయ మంటే చేయాలి”. (ముస్లిం)
విశ్వాసుల మాత హజ్రత్ ఆయిషా (ర.అ) గారి కథనం ప్రకారం – ”చెడు దృష్టి వాతన పడిన వ్యక్తికి చికిత్స చేయడానికి రుఖ్యా (విరు గుడు దుఆ) చదవండి” అని దైవప్రవక్త (స) ఆదేశించారు. (భుఖారీ)
అస్మా బిన్తె ఉమైస్ (ర.అ) గారి కథనం – ‘ఓ దైవప్రవక్తా! బనీ జాఫర్ చెడు దృష్టి బారిన పడ్డారు. రుఖ్యా చదవచ్చా?’ అని ప్రశ్నించడం జరిగింది, దానికి దైవప్రవక్త (స) – ”ఔను, చదవచ్చు. ఒకవేళ విధిరాతను దాటే శక్తి దేనికయినా ఉంటే అది చెడు దృష్టికి ఉంటుంది” అన్నారు. (తిర్మిజీ- సహీహ్)
దిష్టి పండితుల దృష్లిలో:
అసూయపరుడు ఎదుటివారిలో గల మేలిమి గుణాలను, ఉత్తమ లక్షణాలను కప్పి పుచ్చి, వారి గురించి చెడుగా ప్రచారం చేయడానికి ఇష్ట పడతాడు. ఒకవేళ ఎవరయినా ఎవరి గురించయినా మంచిగా మాట్లాడినా తను వినదలచుకోడు. దీనికి భిన్నంగా ఒక శ్రేయోభిలాషి ఎదుటివారలోని మంచిని మెచ్చుకుం టాడు. వారికి ప్రాప్తించిన వరానుగ్రహాలను చూసి ఈర్ష్య చెందడు. పైగా అది అల్లాహ్‌ా మెచ్చి వారిపై వరాలను కురిపించాడని సంతోషి స్తాడు. వారు మరింత సంతోషంగా, ఆనందంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటాడు. (అల్లామా ఇబ్నుల్ ఉథైమీన్)
దైవప్రవక్త (స) చేసిన హితవు ఏమిటంటే, మీరు మీ సోదరుణ్ణి నవ్వుతూ గనక చూస్తే ఇలా దీవించండి! ”అజ్హకల్లాహు సిన్నక” – అల్లాహ్ మీ పెదాలపై ఈ చిరునవ్వును కలకాలం ఇలా ఉంచుగాక! (బుఖారీ)
”అసూయతోపాటే ద్వేషం ఉంటుంది. ముందు మనిషిలో ఇతరుల యెడల అసూయ జనిస్తుంది.తర్వాత అతను వారిపట్ల ద్వేషం పెంచు కుంటాడు” అన్నారు అల్లామా ఇబ్ను తైమియా (ర).
చూడటానికి చెడు దృష్షి మరియు అసూయకి మధ్య పెద్ద తేడా ఏమి కనబడదు కానీ, అసూయ కారణంగానే మనిషిలో చెడు దృష్టి చోటు చేసుకుంటుంది. ఇతరులకు హాని తలపెడుతుంది.
దిష్టి ప్రభావం:
సహల్ బిన్ హనీప్ కథనం-‘ఓసారి ఆయన (సహల్) మహనీయ ముహమ్మద్(స)వారితో కలిసి మక్కాకు బయలు దేరారు. అల్ జహ్ఫాలోని అల్ ఖరార్ పర్వతం దగ్గరకు చేరుకున్నాక సహల్ ఇబ్ను హనీఫా (ర) అక్కడ స్నానమాచరించారు. ఆయన చాలా సుకు మారంగా, సుందరంగా ఉండేవారు. ఆమిర్ బిన్ రబీఆ (ర) అనబడే సహాబీ ఆయన స్నానం చేస్తుండగా చూసి – ”ఇంతటి అందమయిన దేహాన్ని నేను ఇప్పటి వరకూ ఎక్కడా చూడలేదు. కన్యల్లో కూడా ఇంత అందమయిన దేహం గలవారు ఉండరేమో!” అని అన్నారు. అలా తను అనడమే ఆలస్యం సహల్ స్పృహ కోల్పోయి క్రింద పడిపో యారు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఆయన్ను దైవప్రవక్త (స) వారి సన్నిధికి తీసుకెళ్ళి – ‘తమరే సహల్ కోసం ఏదయినా చేయాలి. తను అకస్మాత్తుగా స్పృహ తప్పి పడి పోయారు’ అని విన్న వించుకు న్నారు. ”మీలో ఎవరయినా అతన్ని ఉద్దేశించి ఏమయనా అన్నారా?” అని ఆరా తీయగా – ‘ఆమిర్ బిన్ రబీఆ (ర) ఆయన్ను (స్నానం చేస్తూ చూసి) చెప్పిన వషయాన్ని తెలియజేశారు. అప్పుడాయన (స) ”ఎందుకు మీరు మీ సోదరుణ్ని పొట్టబెట్టుకుంటారు. మీరు చూసింది ఏదయినా మీకు నచ్చితే ‘మాషా అల్లాహ్’ అనండి అని చెప్పడమే
కాక, దృష్టి తగిలించిన సహచరుణ్ణి స్నానం చేయించి అ నీళ్ళను సహల్ తల మరియు వీపుపై వేయించగా వెంటనే సహల్ (ర) లేచి కూర్చిన్నారు. (ముస్నద్ అహ్మాద్)
హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”నా అనుచర సమాజంలో చనిపోయే చాలా మంది, అల్లాహ్‌ా విధిరాత తరువాత చెడు దృష్టి మూలంగా చని పోతారు”. (సహిహల్ జామె-అల్బానీ (ర). వెరోక ఉల్లేఖనంలో ”దిష్ట విధిరాతలో అంతర్భాగమే” అని ఉంది.
చెడు దృష్టి నుండి రక్షణ:
1) పూర్తి భారం అల్లాహ్‌ాపై వేసి, ‘అనుమానం పెనుభూతం’ అన్నట్టు ఈ విషయాల పట్ల మరీ ఎక్కువగా అలోచించడం మానేయాలి.
2) ప్రవక్త (స) సూచించినట్లు రాత్రి పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ చదివి నిద్రకు ఉపక్రమిస్తే ఉదయం అతను నిద్ర నుండి మేల్కొనే వరకూ షైతాన్ అతని దరిదాపులకు కూడా రాడు.
3) ప్రవక్త (స) వారు దిష్టి విరుగుడికి నేెర్పిన దుఆలు చదవాలి.
అ) ”అవూజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” – అల్లాహ్‌ా సృష్టించిన ప్రతి దాని కీడు నుంచి నేను అల్లాహ్‌ా సంపూర్ణ వచనాల శరణు వేడుకుంటున్నాను.
ఆ) ”అవూజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ గజబిహి వ యిఖాబి హి వ మిన్ షర్రి ఇబాదిహి వ మిన్ హమజాతిష్ షైతాని అన్ యహ్‌ాజురూన్” – నేను అల్లాహ్‌ా ఆగ్రహం మరియు ఆయన శిక్ష నుండి, ఆయన దాసుల కీడు నుండి, షైతానుల రేకెత్తించే కలతల నుండి, అవి నా వద్దకు రావడం నుండి నీ సంపూర్ణ వచనాల శరణు వేడుకుంటున్నాను. (ముస్నద్ అహ్మాద్)
ఇ) ”హస్బియల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్” – నాకు అల్లాహ్‌ా చాలు. ఆయన తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడు.నేను ఆయనపైనే భరోసా ఉంచాను. ఆయన మహోన్నత అర్ష్‌కి అధిపతి. (తౌబా: 129)
ఈ) ప్రజల్లోగానీ, వస్తువుల్లోగానీ ఏదయినా నచ్చితే ”మాషా అల్లాహ్‌ా లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌ా” అని చెప్పడం ఉత్తమం.
ఉ) అల్లాహ్‌ా శరణు కోరడంలో ఖుర్‌ఆన్‌లోని సూరయె ఫలఖ్, సూరయె నాస్ మరియు సూరయె ఫాతిహా, ఆయతుల్ కుర్సీ ఎంతో ప్రభావవంతమయినవి.
దిష్టి విషయమయి ముస్లింలలో చోటు చేసుకున్న దురాచారాలు:
1) ఎవరయినా ప్రయాణం చేసి వచ్చినా, బైటికెళ్ళి (ఈద్ నమాజుకు వెళ్ళి) వచ్చినా గుమ్మం బయట నుంచోబెట్టి సున్నం మరియు పసుపు కలపబడిన ఎర్ర నీరు మూడు సార్లు గుడ్రంగా త్రిప్పి చేతులు కాళ్ళ బొటన వేళ్ళ మీద దాన్ని రాసి మిగతాది ప్రక్కన పారేడమో, లేదా చౌరాస్తాలో పోయడమో చేస్తుంటారు. అలా దిష్టి దిగిపోతుందన్నది అరువుకి తెచ్చుకున్న అపనమ్మకం. ఇది సరిపోదన్నట్టు,ఆ పారపోసిన నీరుని మొదట దాటిన, లేదా త్రొక్కిన వ్యక్తికి కీడు జరుగుతుందన్న పైశాచికానందం ఒకటి. వీరు మాత్రం బతికి బట్ట కట్టాలి. దారిన పోయే దానయ్య దరిద్రం చుట్టుకు చావాలన్నది దీని అసలు ద్దేశం!
2) నీళ్ళతోనే మరో విధంగా కూడా దిష్టి తీస్తుంటారు. ఒక పెద్ద పళ్ళెంలో నీరు పోసి దానిపై ఒక బిందెను బోర్లిస్తారు. బోర్లించక ముందు ఆ బిందెలో మిరపకాయలు, గుడ్డముక్కలు, బొగ్గు వేసి పొగ బెట్టి తర్వాత బోర్లిస్తారు. కాసేపటికి నీళ్ళన్నీ బిందెలోనికి వెళ్ళి పోగా దిష్టి పోయిందని భావిస్తారు. అసలు కారణం గురించి ఆలోచించే తీరిక వారికుండదు. బిందెలో అంతకు ముందు మంట వేయడం వలన అందులోని ఆక్సిజన్ అయిపోయి నీరు బిందెలోకి వెళుతుందే తప్ప దిష్టి దూరమయి ఎంత మాత్రం కాదు. ఈ ప్రక్రియను ఎవర యినా ఎప్పుడయినా చేసి చూడొచ్చు.
3) కొందరు దిష్టి తగిలిన వ్యక్తిని కూర్చో బెట్టి, ఉప్పుతో, ఎండు మిరపకాయలతో, చీపురు పుల్లలతో, రోకలితో, బండరాయితో, కోడి గుడ్డుతో నోటితో అర్థం పర్థం లేని పదాలు వల్లిస్తూ దిష్టి తీస్తారు.
4) పశువులకు, పిల్లలకు వెంట్రుకలతో పేనిన త్రాడు దిష్టి నివారణ కోసమని కడుతుంటారు.
5) ఇల్లు కట్టుకునేటప్పుడు వాటికి దిష్టి తగలకుండా పెద్ద పెద్ద దిష్టి బొమ్మలు మనిషి ఆకారంలో (దారుణ ఆకారంలో) పెడుతుంటారు. కొందరు ఇంటి వరండాలో, చూరులో బూడిద గుమ్మడి కాయ గానీ, వెంట్రుకలు పేనిన త్రాడులో తెల్లటి పదార్థం పెట్టి వ్రేలాడదీస్తారు. అలాగే కొత్త బండి నడిపేటప్పుడు నిమ్మకాయ తొక్కించడం, వెంట్రు కల త్రాడుతోపాటు నిమ్మకాయ, మిరపకాయలు వేలాడదీయడం చేస్తుంటారు.
6) దిష్టి నివారణ కోసం వేపాకులతో మంత్రించడం.
7) పిల్లల మెడలో లేదా చేతికో తాయెత్తులు కట్టడం. ఇవే కాక ఇంకా చాలా పద్ధతులను పాటిస్తుంటారు.
8) కొత్త బట్టలు ధరించేటప్పుడు అందులోంచి ఒక దారం తీసి నిప్పుల్లో పడేయటం లేదా ఆ వస్త్ర మూల కాటుకతో చుక్క పెట్టడం.
9) ఉదయం సాయంత్రాలు ఆగరబత్తులు వెలిగించి సాంభ్రాణి ధూపం వెయడం వల్ల దిష్టి నివారణ జరుగుతుందని భావించడం. కొందరు నెమలి ఈకలు పట్టుకుని దుకాణాల దగ్గర తిరుగుతూ ఉండటం మీరు చూసే ఉంటారు.
దైవప్రవక్త (స) ఇలా హెచ్చరించారు: ”ఎవరయితే తాయెత్తులు వేసు కుంటారో అల్లాహ్‌ా వారి అవసరాలను తీర్చకుండా ఉండుగాక! ఎవరయితే సముద్ర గవ్వలు (చెడు చూపు నుండి రక్షణ కోసమని) వేసుకుంటారో అల్లాహ్‌ా వారిని రక్షించకుండా ఉండుగాక!” (ముస్నద్ అహ్మద్)
అలాగే ”తాయెత్తును వ్రేలాడదీసుకున్న వ్యక్తి షిర్క్ (అస్గర్)కి పాల్పడి నట్లే” అని వేరోక ఉల్లేఖనం ఆయన సెలవిచ్చారు. (ముస్నద్ అహ్మద్)
ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి అస్వస్థత ఉంది, పిల్లాడు చురుగ్గా లేడు అంటే ప్రతిసారీ దిష్టి తగిలిందన్న అనమానంతో ఉండక తగిన తక్షణ చర్యలు తీసుకోవాలి. వైద్యుల్ని సంప్రదించాలి, మానసిక నిపుణుల్ని కలిసి వారి సలహాలు తీసుకోవాలి. లేదంటే మన వల్ల జరిగే చిన్న అజాగ్రత వల్ల ఒక్కోసారి నిండు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త!